బ్రతకడానికి ఎన్నో దారులు

బ్రతకడానికి ఎన్నో దారులు

సింహం తనకు నచ్చిన కొద్దిమాంసం మాత్రమే తిని మిగిలిన ఏనుగు మొత్తాన్ని అలా వదిలేస్తుంది. దానిని మిగిలిన జంతువులు తిని తమ ఆకలి తీర్చుకుంటాయి. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు. ‘నేను సింహాన్ని. నేను ఏనుగును చంపగలను కాబట్టి చంపాను, అందుకని ఇదంతా నాకే కావాలనేం లేదు. అడవిలో ఉండే జంతువులన్నీ బతకాలి’ అనుకుంటుంది. మనిషి సింహంలా బతకాలి.

ఇవ్వాళ ముఖ్యంగా మన విద్యార్థులు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్య వైఫల్యం. ఏదో ఒకదానిలో విఫలం కావడం వల్ల అంతస్తులు లెక్కపెట్టకుండా దూకి చనిపోతున్నవాళ్లను ఎంతో మందిని చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటంటే, ఏదైనా పనిచేస్తే దానికి సంబంధించిన ఫలితం వెంటనే రావాలనేది వాళ్ల మనసుల్లో పడిపోవడమే. ఇవ్వాళ రెసిడెన్షియల్‌, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలలో ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమిటంటే ప్రతిరోజూ పొద్దున పరీక్ష పెట్టడం, మధ్యాహ్నం దాని ఫలితం ప్రకటిం చడం. డైలీ టెస్ట్‌ – డైలీ రిజల్ట్‌. దీనికి అలవాటు పడిన విద్యార్థి సరిగ్గా తన చదువు అయిపోగానే వెంటనే ఉద్యోగం వచ్చేయాలని కోరుకుంటున్నాడు. అంటే ఫలితం వెంటనే రావాలని అనుకోవటం అన్నమాట. పదేళ్లపాటు వరుసగా ‘పరీక్ష – వెంటనే ఫలితం’ పద్ధతికి అలవాటు పడిన విద్యార్థి జీవితంలో కూడా ‘వెంటనే ఫలితం’ ఆశించ కుండా ఉంటాడా..? ఆగడు. విత్తనం నాటిన తరువాత చెట్టు అవ్వాలంటే ఎలా కుదురుతుంది ? ఇటువంటి మనస్తత్వం నేటి విద్యార్థుల్లో పెరుగు తున్నది. అందుకే హోమియో వైద్యం లాగా ఈ మూల సమస్యకు వైద్యం చేయాలి.

ఇదే విషయానికి విరుగుడు వివరిస్తూ మన ప్రాచీన శాస్త్రాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ప్రతి దానికి రెండు నుండి 30 దారులు ఉంటాయి. మనం వెతుక్కోవడంలోనే ఉంది. ఉదాహరణకు కలెక్టర్‌ అవ్వాలనే కోరిక ఉంది. నేరుగా ఐఎఎస్‌ రాసి అవ్వచ్చు. లేదా గ్రూప్స్‌ రాసి ఉద్యోగం తెచ్చుకుని, అనుభవం మీద మెల్లగా కలెక్టర్‌ స్థాయికి చేరుకో వచ్చు. అలా అయినవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఐఎఎస్‌ రాసి కలెక్టర్లు అయినవాళ్లకన్నా ఇలా అనుభవం మీద కలెక్టరు అయి బాగా పనిచేసిన వాళ్ల సంఖ్యే ఎక్కువ. ఆ సమయంలో మన కుటుంబ అవసరం దృష్ట్యా వెంటనే ఏదో ఒక ఉద్యోగంలో చేరాల్చి వచ్చింది. ఉద్యోగంలో చేరి, తరువాత అనుభవం మీద పెద్ద స్థాయికి వెళ్లొచ్చు. ఈ విషయాన్ని నేడు మన విద్యార్థులకు చెప్పగలగాలి. ఇది ఒక్క ఉద్యోగం విషయంలోనే కాదు, ప్రేమ, పెళ్లి, ఇల్లు, ఇంకా అనేక సమస్యల విషయంలో కూడా వర్తిస్తుంది. ప్రతి సమస్యకు రెండు దారులు ఉంటాయి. ఒకే దారిపై నమ్మకం పెట్టుకుని నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

ఈ విషయాన్ని కుమార సంభవంలోని ఒక శ్లోకం చక్కగా చెపుతుంది. ఇది ఒక వర్ణన మాత్రమే. వర్ణన ద్వారానే మన కవులు ప్రజలలో ఉత్సాహం, స్ఫూర్తి నింపేవారు. ఈ శ్లోకం భావం ఏమిటంటే ‘అనంతకోటి బ్రహ్మాండాలలో ఈ బ్రహ్మాండం ఎంత? ఈ బ్రహ్మాండంలో ఈ సౌరమండలం ఎంత ? ఈ సౌరమండలంలో ఈ భూమి ఎంత ? ఈ భూమిలో నా ఖండం, దేశం ఎంత ? దేశంలో నా రాష్ట్రం ఎంత ? రాష్ట్రంలో నా ఊరెంత ? ఊరిలో నేనెంత ? నా సమస్య ఎంత ?’ అని. కాబట్టి ‘ఈ అనంత కాలగమనంలో నా సమస్య ఏమంత పెద్దది కాదు, ఏం పర్వాలేదు’ అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇటువంటి స్థితిని విద్యార్థులకు మనం యవ్వనంలోనే కల్పించాలి. పోటీ పడొద్దని కాదు. కానీ పోటీలో ఓడిపోయినంత మాత్రాన నీరసపడొద్దు. పోటీలో గెలిచితీరాలి అనుకోవద్దు. మరి గెలవకపోతే పోటీ ఎందుకు ? లాభం లేకపోతే వ్యాపారం ఎందుకు ? అని కూడా అనేవాళ్లుంటారు. మొదటి సంవత్సరమే లాభం రాదు, తరువాత అదే వస్తుంది. దానిని ఈ కథ ద్వారా తెలుసుకుందాం.

హిమాలయాలకు దగ్గరగా ఉన్న కొండల్లోని అడవుల్లో సింహాన్ని వేటాడటానికి ఇద్దరు కిరాతులు (వేటగాళ్లు) వెళ్లారు. సింహం పరిస్థితి ఏమిటి ? అది రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకుంటుంది. నాలుగు గంటలు మాత్రమే బయట తిరుగుతుంది. ఆ సమయంలో వేటాడుతుంది. సింహం ముఖ్యంగా ఏనుగును మాత్రమే చంపుతుంది. ఎందుకంటే సింహానికి ప్రధానంగా ఇష్టమైన ఆహారం ఏనుగు మాంసం. సింహం ఏనుగును చూడగానే నేరుగా దాని కుంభస్థలం మీదికి దూకి అక్కడ వాడిగా ఉన్న తన గోళ్లతో చర్మం చీలుస్తుంది. అక్కడ వచ్చే మెత్తటి మాంసం సింహానికి చాలా ఇష్టం. ఆ మాంసాన్ని అక్కడే తినేస్తుంది. సింహం గోళ్లకు అంటిన నెత్తురు అలాగే ఉంటుంది. అలాగే కిందికి దూకుతుంది. హుందాగా పెళ్లి నడక నడుచుకుంటూ గుహలోకి వెళ్లిపోతుంది. పెదవులు నాక్కుని విశ్రాంతి తీసుకుంటుంది. ఈ ప్రక్రియ రోజుకోసారి జరుగు తుంది. పైగా సింహం తనకు నచ్చిన కొద్దిమాంసం మాత్రమే తిని మిగిలిన ఏనుగు మొత్తాన్ని అలా వదిలేస్తుంది. దానిని మిగిలిన జంతువులు తిని తమ ఆకలి తీర్చుకుంటాయి. అందుకే సింహాన్ని అడవికి రాజు అంటారు. ‘నేను సింహాన్ని. నేను ఏనుగును చంపగలను కాబట్టి చంపాను, అందుకని ఇదంతా నాకే కావాలనేం లేదు. అడవిలో ఉండే జంతువులన్నీ బతకాలి’ అనుకుంటుంది. మనిషి సింహంలా బతకాలి. కోట్లు సంపాదించాలి. దానిని సమాజానికి ఇవ్వాలి. సంపాదించే అదృష్టం భగవంతుడు అందరికీ ఇవ్వడు. కొంతమంది ఎంత కష్టపడినా ధనం రాదు. కొంతమంది తక్కువ శ్రమతోనే ఎక్కువ సంపాదిస్తారు. అటువంటి వారు తమను తాము సింహంలా భావించాలి. సింహంలా త్యాగం చేయటం కోసమే పుట్టాను (‘త్యాగాయ సంవృతా ర్థానాం’ అని రఘువంశంలో కాళిదాసు చెప్పాడు) అని భావించాలి. రఘువంశ రాజులు త్యాగం చేయడం కోసమే సంపాదించేవారుట. అందుకే వాళ్ల జెండాల మీద సింహాలు ఉండేవి. ఇప్పటి సమాజంలో కోటీశ్వరులు అలా సింహంలా ఉండాలి, తిననియ్‌, బతకనియ్‌ అని భావించాలి. కాబట్టి కిరాతులు ఎక్కడ సింహపు కాలిగుర్తులు రక్తంతో సహా కనబడతాయో, ఆ దారి గుండా గుహలోకి వెళ్లి సింహాన్ని వేటాడేవారు. లేదా అది బయటకొచ్చిన సమయంలో ఆదమరిచి ఉన్నప్పుడు చూసి వేటాడే వారు. అయితే ఆ రోజున కొండల్లో విపరీతమైన మంచు కురిసింది. మంచు కురవడంతో సింహపు నెత్తుటి మరకల కాలిగుర్తులు చెరిగిపోయాయి. కిరాతులు వెంటనే మన విద్యార్థుల వలె కుంగి పోలేదు. వేరే మార్గం ఆలోచించారు. సహజంగా ఒక పనికి ఒక మార్గం మూసుకుపోయినప్పుడు ఖచ్చితంగా ఇంకేదో మార్గం ఉంటుంది. మనం వెతకాలి. మనకు తెలిసిన మార్గం మూసుకుపోవడం మన మంచికే జరిగిందేమో. ఇంకో గొప్ప మార్గం మనకోసం వేచి ఉందేమో అనుకోవాలి. ఈ మార్గంలో ప్రయాణిస్తే గుమాస్తా గానే ఉండిపోతా మేమో.., మరో మార్గంలో ప్రయాణిస్తే కలెక్టరు అవుతామేమో. ఎలాగూ ఉన్న మార్గం మూసుకు పోయింది కాబట్టి తప్పకుండా కొత్తమార్గం వెతకాల్సిందే. అలాగే కిరాతుల్లో ఒకడు ముత్యాలు రాలి పడి ఉన్న మార్గం కోసం వెతికాడు. కొండ దారుల్లో ముత్యాలు ఎందుకుంటాయి ? అని వేరేవాడు సందేహం వ్యక్తం చేశాడు. కొండల్లో కాదు, ఏనుగు కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయిరా అని చెప్పాడు మొదటి కిరాతుడు. ముత్యాలు రకరకాలు ఉంటాయి. అవి ఈ ప్రకృతిలో ఏడు, ఎనిమిది స్థలాల్లో లభిస్తాయి. వాటిలో ఒకటి ఏనుగు కుంభ స్థలం. సింహం కుంభస్థలం చీల్చినప్పుడు అక్కడ ఉండే ముత్యాలు దాని గోళ్లలో ఇరుక్కుంటాయి. సింహం కిందికి దూకినప్పుడు ఆ ముత్యాలు అక్కడ రాలిపడ్డాయి. ఎందుకు రాలాయి అంటే గోళ్లల్లోకి మంచు వెళ్లింది కాబట్టి. ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవలసింది ఏమిటంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరలు మూసుకుపోయాయో ఆ మంచు కారణంగానే ముత్యాల మార్గం తెరుచుకుంది. అంటే ఉన్న ఉద్యోగం పోవడం వల్ల అతనికి ఇంకో గొప్ప ఉద్యోగానికి దారి కనబడుతోంది అన్నమాట. ఒక అమ్మాయితో పెళ్లి చెడిపోయిందని బాధపడే వ్యక్తికి మరో అమ్మాయి వల్ల పెళ్లి జరిగి అద్భుతంగా జీవించే అదృష్టం పడుతుందేమో. ఇలా ఎందుకు ఆలోచించకూడదు ? జరిగినవి లేవా ? ఇదే పాజిటివ్‌ ధింకింగ్‌. అనుకూలాత్మక దృక్పథం లేదా సకారాత్మక దృక్పథం. ఒక్కమాటలో చెప్పాలంటే అంతా మన మంచికే అని అర్థం. కాబట్టి కిరాతులు ముత్యాల మార్గంలో ముత్యాలు ఏరుకుంటూ వెళ్లి సింహాన్ని వేటాడారు. నెత్తుటి మరకల దారి మూసుకు పోయినందువల్ల కిరాతులకి సింహంతో పాటు ముత్యాలు కూడా దొరికాయి. అంటే ఒక దెబ్బకే రెండింతల ఆదాయం అన్నమాట.

ఈ మొత్తం విషయం కుమార సంభవం మొదటి సర్గ 15వ శ్లోకంలో ఉంటుంది.

పదం తుషార స్రుతి ధౌత రక్తం

యస్మిన్‌ అదృష్ట్వాపి హత ద్విపానాం

విదంతి మార్గం నఖరంధ్ర ముక్తైః

ముక్తాఫలైః కేసరిణాం కిరాతాః

దీని భావం ఏమిటంటే ‘మంచు కురవడంతో రక్తపు మరకల మార్గం చెరిగిపోయింది. ఏనుగుని చంపిన సింహం గోళ్లలో ముత్యాలు ఇరుక్కున్నాయి. మంచు వలన గోళ్ల రంధ్రం నుండి ముత్యాలు రాలిపడి ముత్యాల మార్గం ఏర్పడింది. అలా రాలిన ముత్యాల వలన వారు (కిరాతులు) కొత్త మార్గం పట్టుకోగలిగారు’.

అలా మన విద్యార్థులు కూడా నెత్తుటి మరకల మార్గం వదిలి ముత్యాల మార్గం పట్టుకోలేరా ? ఒక మార్గం మూసుకుపోతే ఆత్మహత్యలే చేసుకోవాలా ? జీవితంలో ప్రతి సందర్భంలో ఇలా ఆలోచించ గలిగితే ప్రతి విద్యార్థి జీవితం సుఖంగా ఉంటుంది, కన్న తల్లితండ్రులకు గర్భశోకం తప్పుతుంది.

ఇదీ మన పురాణ సాహిత్యం వ్యక్తిత్వ వికాసం కోసం చూపిస్తున్న గొప్ప మార్గం.

– మహా సహస్రావధాని డా.గరికిపాటి నరసింహారావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *