సిద్ధార్థ-2

సిద్ధార్థ-2

2. శ్రమణులతో సాధన

ఆనాడు సాయంత్రానికి వారు శ్రమణులను కలుసుకున్నారు. తమతో చేర్చుకొమ్మని వారిని ప్రార్థించారు. అందుకు శ్రమణులు అంగీకరించారు.

సిద్ధార్థుడు ఒక పేదబ్రాహ్మణునికి తన వస్త్రాలను దానం చేశాడు. తన కొల్లాయిని, కావిరంగు పైపంచను మాత్రం దగ్గర ఉంచుకున్నాడు. ఒంటిపూట భోజనం ప్రారంభించాడు. సొంతంగా అన్నం వండుకోడు. ముందు ఒక పక్షము, తరువాత ఒక మాసము ఉపవాసం చేశాడు. దేహంలో కండలు కరిగిపోయినవి. గడ్డం పెరిగింది. గోళ్లు పెరిగినవి. అతని విస్ఫార నేత్రాలలో ఏవో విచిత్ర స్వప్నాలు తారాడుతున్నట్టుగా ఉండేవి. స్త్రీలముందు అతని చూపు మొద్దుపారింది. నగరవీధులలో నడుస్తూ మంచి దుస్తులను ధరించిన వారిని చూచి ఏవగించుకునేవాడు. వ్యాపారాలు చేసుకునే వర్తకులను, వేటలకు వెళ్లే రాజకుమారులను, మృతులకోసం దుఃఖించే బందుగులను, దేహాలను అర్పించే వేశ్యలను, రోగులకు చికిత్సలు చేసే వైద్యులను, కర్షకులకు ముహూర్తాలు పెట్టే పురోహితులను, ప్రేమికులైన యువతీ యువకులను, బిడ్డలను సముదాయించుకునే తల్లులను, ఎవరినీ కన్నెత్తి చూచేవాడు కాదు. వారు లెక్కపెట్టతగినవారు కారని అతని భావం. సుఖము, సౌందర్యము అంతా అసత్యం. అంతా ఇంద్రియ భ్రాంతి. అతనికి ప్రపంచం మీద పూర్తిగా వెగట కలిగింది. జీవితం దుఃఖమయంగా తోచింది.

సిద్ధార్థునికి ఒకటే లక్ష్యం. తృష్ణలు, వాంఛలు, సుఖదుఃఖాలు అన్నింటినీ సమూలంగా తుడిచి వేయాలి. అహంకారాన్ని చంపివేయాలి. అహం అన్నది లేకుండా శూన్య హృదయంలో శాంతిని చవిచూడాలి. అదే అతని లక్ష్యం. అహంత నశించిన తరువాత, అన్ని వాంఛలు మాటుమణగిన తరువాత, అహంత కానిది లోపల ఎక్కడో ఉండేది ఆ చరమవస్తువు మేలుకోవాలి. అదే పరమగుహ్య పదార్థం.

సిద్ధార్థుడు మౌనంగా మండుటెండలలో నిల్చునేవాడు. బాధవేస్తున్నా నాలుక పిడచకట్టినా ఆ బాధ ఆ దాహం అణిగిపోయే వరకు అలాగే నిల్చునే వాడు. మౌనంగా వానలో నిల్చునేవాడు. దేహం కొయ్యబారేటంత వరకు అలాగే నిల్చునేవాడు. మళ్లకంపలమీద పండుకునేవాడు. ఒళ్లంతా నెత్తురు, పుండ్లు. ఆ బాధ తెలియకుండా పోయేటంతవరకు అలాగే పండుకునేవాడు.

సిద్ధార్థుడు ఆసనంలో కూర్చొని, ప్రాణాయామం అభ్యసించాడు. కుంభకాన్ని సాధించాడు. హృదయ స్పందాన్ని నిగ్రహించగలిగాడు.

శ్రమణగురువు శిక్షణక్రింద సిద్ధార్థుడు యమనియమాలను సాధన చేశాడు. నారాయణపక్షి ఒకటి చెట్టుమీద వ్రాలింది. సిద్ధార్థుడు ఆ పక్షి శరీరంలో ప్రవేశించాడు. అనగా దానితో తాదాత్మ్యం పొందాడు. పక్షిగా అడవులలో పర్వతాలపైన సంచరించాడు. దాని ఆహారం తిన్నాడు. దాని బ్రతుకు బ్రతికాడు. పక్షితో మరణించాడు. ఒక నక్క శవంలో ప్రవేశించాడు. ఆ శవాన్ని శివంగులు, రాంబందులు పీక్కొని తిన్నవి. సిద్ధార్థుడు మళ్లా తన కళేబరంలో చేరాడు.

సిద్ధార్థుడు తన ఇంద్రియాలను స్మృతిని చంపుకున్నాడు. రాయి, చెట్టు, జంతువు ఒకటేమి? వేయి రూపాలతో తాదాత్మ్యం పొందాడు. కాని ప్రతి పర్యాయం తన కట్టుకంబానికి తిరిగి వచ్చేవాడు. తిరిగి తన అహంత సిద్ధంగా ఉండేది. ప్రతి అనుభవంలోనూ తృష్ణ ఉండేది. ఒక తృష్ణ తరువాత వేరొక తృష్ణ. ఒక దానిని జయిస్తే వేరొకటి సిద్ధం.

ఈ జననమరణ చక్రంలో నుంచి తప్పించుకొని దుఃఖ రహితమైన శాశ్వత స్థితిని పొందడం ఏలాగు? ఈ చక్రభ్రమణం ముగియడం ఏలాగు? దీనికి కారణమైన కర్మ శృంఖల విచ్ఛిన్నం కావడం ఏలాగు? ఆ పరమోపాయం కోసమే సిద్ధార్థుని అన్వేషణ.

అహంతను నాశనం చేయగల ఉపాయాలను సిద్ధార్థుడు తెలుసుకున్నాడు. ఆకలిని దప్పిని అలసటను అన్ని బాధలను అనుభవించాడు. సహించాడు. జయించాడు. ధ్యాన మార్గంలో మనస్సును నిర్విషయంగా చేసుకున్నాడు. ఒక వేయిమారులు అతని అహంత అస్తమించింది. దినాల తరబడి జడావస్థలో ఉన్నాడు. కాని ఏ సాధనచేసినా అది తిరిగి అహంత వద్దకే తీసుకొని వచ్చేది. అహంతావరణ సహస్రపర్యాయాలు తొలిగించుకున్నా తిరిగి తిరిగి సిద్ధమయ్యేది. తాను ఆ సిద్ధార్థుడుగానే మిగిలేవాడు.

సిద్ధార్థుని వెంటనే వున్నాడు గోవిందుడు. ఆ సాధనలన్నీ గోవిందుడు కూడా అభ్యసించాడు. తమ సాధనల విషయం తప్ప వేరొక విషయాన్ని వారు సంభాషించేవారు కారు. పరిసర గ్రామాలకు వెళ్లి తమకు తమ గురువులకు భిక్షాన్నం తెచ్చుకునేవారు.

ఒకనాడు సిద్ధార్థుడు ”గోవిందా! మనము లక్ష్యాన్ని చేరుతున్నట్టా? ఇంకా దూరంలో ఉన్నట్టా?” అని అడిగాడు.

”మన సాధన కొంతవరకు సాగింది. ఇంకా శ్రమపడాలి. సిద్ధార్థా! నీవు గొప్ప శ్రమణుడవు కాగలవు. ప్రతి సాధనలోను నీకు త్వరగా సిద్ధి కలుగుతున్నది. గురువులు నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు. నీవు సిద్ధుడవయ్యే కాలం తప్పక వస్తుంది” అన్నాడు గోవిందుడు.

సిద్ధార్థుడు : ”నాకు ఆ విధంగా తోచడం లేదు. ఇంతవరకు శ్రమణుల వద్ద నాకు కలిగిన జ్ఞానం ఒక వేశ్య వద్ద, ఒక శవవాహకుని వద్ద, ఒక జూదరి వద్ద ఇంకా సులభంగా త్వరగా లభించి ఉండేది”.

గోవిందుడు : ”నీవు పరిహాసం కోసం అలా అంటున్నావు. ఈ యమ నియమ ప్రాణాయామ ధ్యానములు ఆ దుష్టుల సంపర్కంతో నేర్చుకొనివుందువా?”

సిద్ధార్థుడు : ”ఏమి ప్రాణాయామము? ఏమి ధ్యానము? ఇవన్నీ తాత్కాలికంగా అహంత నుంచి తప్పించుకోడానికే ఉపకరిస్తవి. బ్రతుకులో దుఃఖాన్ని, దోషాన్ని పరిహరించడానికి ఇవన్నీ తాత్కాలిక చిక్సితలు. కర్షకుడు ప్రొద్దున తరవాణి త్రాగుతాడు. కొంతకాలం వరకు అతనికి శ్రమ అనిపించదు. అతనికి తరవాణి ఏలాగో, నీకు నాకు అలాగే ఈ సాధనల ఫలితం తాత్కాలికం.”

గోవిందుడు : ”సిద్ధార్థా! నీవు కర్షకుడవు కావు. శ్రమణుడు త్రాగుబోతు కాడు. త్రాగుబోతుకు ఆ నిషా ఉన్నంత వరకు కష్టం కనుపించక పోయినా, మైకం వదలిన తరువాత అంతా యథాపూర్వకంగానే ఉంటుంది. అతనికి వివేకం కలిగినట్టా? జ్ఞానం లభించి నట్టా? ఉన్నత స్థితికి పోయినట్టా? ముందెంతో తరువాత కూడా అంతే!”

సిద్ధార్థుడు : ”మిత్రమా! ఎప్పుడూ నేను త్రాగిన వాడనుకాను. కర్షకుని అనుభవం నాకు తెలియదు. కాని నా మట్టుకు నాకు ఆ ధ్యానంలో ఉన్నప్పుడు క్షణకాల విరామం తప్ప తరువాత ఆ సిద్ధావస్థకు గర్భస్థశిశువు ఎంతదూరంలో ఉంటాడో నేనూ అంతేనని మాత్రం నాకు తెలుసును.”

తరువాత ఒకనాడు సిద్ధార్థుడు గోవిందుడు భిక్షాటనకు ప్రక్క గ్రామానికి వెళ్లుతున్నారు. సిద్ధార్థుడు అన్నాడు : ”గోవిందా! మన సాధన క్రమమైనదేనా? మనకు జ్ఞానసిద్ధి కలుగుతున్నదా? మనం ముక్తికి సమీపిస్తున్నామా? లేక ఈ చక్రభ్రమణంలో నుంచి తప్పించుకోవాలనుకుంటూనే ప్రదక్షిణాలు చేస్తున్నామా?”

గోవిందుడు : ”సిద్ధార్థా! మనం ఎంతో నేర్చుకున్నాము. ఇంకా ఎంతో నేర్చుకోవాలి. మనము ప్రదక్షిణాలు చేయడం లేదు. ముందుకే పోతున్నాము. సోపానక్రమమైనది మన సాధన. ఇదివరకే మనం ఎన్నో మెట్లు ఎక్కాము.”

సిద్ధార్థుడు : ”మన వృద్ధాచార్యుల వయస్సు ఎంత ఉండవచ్చు?”

గోవిందుడు : ”దాదాపు అరవై ఉండవచ్చు”

సిద్ధార్థుడు : ”ఆయనకు సష్ఠిపూర్తి అయినా నిర్వాణ స్థితి లభించలేదు. డెబ్భయి వచ్చినా ఎనభై వచ్చినా అంతే. నీకు నాకు ఒకనాటికి అంత వయసు వస్తుంది. ఈ సాధనలతో కాలహరణం కావడమే కాని నిర్వాణస్థితి ఆయనకు మనకు కూడా లభించదు. ఈ శ్రమణులలో ఒక్కడైనా నిర్వాణస్థితిని పొందగలడని నాకు నమ్మకం లేదు. వీటివల్ల మనస్సుకు కొంత ఓదార్పు – కొంత గారడివిద్య కూడా అలవడుతుంది. ఇదంతా ఆత్మవంచన. పరమలక్ష్యం, దానికి మార్గం – మనకు గోచరించదు.”

గోవిందుడు : ”సిద్ధార్థా! అంత ఘోరంగా చెప్పబోకు. ఇందరు పండితులు, బ్రాహ్మణులు, శ్రమణులు, సాధకులు, సత్పురుషులు ఉన్నారే! వీరిలో ఒక్కరికీ ఆ మార్గం గోచరించదా?”

సిద్ధార్థుడు : ”గోవిందా! నీవూ నేనూ ఈ శ్రమణులనాశ్రయించి దీర్ఘకాలం గడిపాము. ఇక త్వరలో వీరి మార్గాన్ని నేను విసర్జించబోతున్నాను. వీరి సాధనా మార్గంలో నా తృష్ణ లవలేశంకూడా తీరలేదు. ఈ జ్ఞాన తృష్ణ నన్ను నిత్యంగా వెంటాడుతున్నది. నా జిజ్ఞాసను బ్రాహ్మణులు తీర్చలేదు, వేదాలు తీర్చలేదు. నా సంశయాలకు, నా ప్రశ్నలకు ఎక్కడనుంచి సరియైన జవాబు రాలేదు. వీరిని అడిగినదానికంటే అడవిమృగాలను అడిగింది మేలనుకుంటాను. ఒక్క విషయం తెలుసుకోడానికి- ఇంకా బాగా తెలుసుకోలేదు- నేను చాలాకాలం గడిపాను. తెలుసుకోగలిగింది ఏమీ లేదన్నదే ఆ విషయం. సర్వత్రా సారభూతంగా ఒకటి ఉన్నది. దానిని తెలుసుకోవడమంటూ లేదు. అదే జ్ఞానం. అది ప్రతిచోట ఉన్నది. అదే ఆత్మ. నీలో – నాలో – ప్రతిజీవిలోనూ ఉన్నది. ఈ జ్ఞానానికి జ్ఞాని ననుకునేవారు పరమవిరోధి – జ్ఞానసాధన కూడా అంతే! ఈ రహస్యం నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.”

గోవిందుడు : ”సిద్ధార్థా! నీ సంభాషణ నా మనస్సుకు వ్యథాకరంగా ఉన్నది. నీవు చెప్పినట్టు జ్ఞానార్జన అన్నదే లేకపోతే – మన ప్రార్థనలకు అర్థమేమి? పరమపావనులైన బ్రాహ్మణులు – శ్రమణులు వీరి సాధనల వల్ల ప్రయోజనమేమి? భూమి మీద పవిత్రత అంటూ ఎక్కడ ఉంటుంది?”

గోవిందుడు ఒక ఉపనిషత్తులోని మంత్రాన్ని చదివాడు. దాని భావమిది: ”ఎవని విచారాత్మమైన నిర్మల బుద్ధి పరమాత్మలో లీనం కాగలదో – వాడు వాక్కులతో వర్ణించరాని ఆనందాన్ని గ్రహిస్తాడు.”

సిద్ధార్థుడు మౌనంగా ఆ మంత్రార్థాన్ని దీర్ఘకాలం మననం చేస్తూ కూర్చున్నాడు. ”నిజమే – అప్పుడు మనం పవిత్రంగా భావిస్తున్న పదార్థాలలో మిగిలేది ఏముంటుంది? దేనిని మిగిలించుకోవాలి?” అని తనలో తాననుకున్నాడు.

ఈ యువకులిద్దరూ, శ్రమణులవద్ద దాదాపు మూడు సంవత్సరాలు శిక్షణ పొందారు. ఆ కాలంలో పెక్కుమంది ద్వారా వారు ఒక వార్త వింటూ వచ్చారు. గౌతమబుద్ధుడనే ఒక మహాత్ముడు కలడనీ; అతడు ప్రపంచ దుఃఖాలను జయించాడనీ, జననమరణ చక్రాన్ని స్తంభింపజేశాడనీ; సంసారాన్ని వదిలిపెట్టి, దేనినీ స్వీకరించక; ఇల్లూ వాకిలి లేనివాడై కాషాయ గుడ్డలు ధరించి శిష్యసమేతంగా దేశం వెంట తిరిగి ప్రబోధం చేస్తున్నాడనీ, బ్రాహ్మణులు రాజులు అతనికి పాదాక్రాంతులై శిష్యవర్గంలో చేరుతున్నారనీ వారు విన్నారు.

ఈ వార్త కర్ణాకర్ణిగా ప్రాకి నలుమూలలకు వ్యాపించింది. పట్టణంలో బ్రాహ్మణులు, అరణ్యంలో శ్రమణులు బుద్ధుని విషయమే మాట్లాడుతున్నారు. కొందరు పొగుడుతున్నారు. కొందరు నిందిస్తున్నారు. ఈ వార్త సిద్ధార్థ గోవిందుల చెవుల పడింది.

ఒక దేశంలో ఏదైనా అంటువ్యాధి వ్యాపించి నప్పుడు ఎవరో మహాత్ముడు మాటలతోనూ, చూపులతోనూ రోగ నివారణ చేయగలుగుతున్నాడని లోకవార్త విస్తరిస్తే ప్రతిమనిషి దానిని గురించి నమ్మికాని నమ్మకగాని ప్రసంగించడం సహజం. అయితే, ఆర్తులైన వారు మాత్రం వెంటనే ఆ మహాత్ముని వెదుక్కుంటూ పరుగెత్తుతారు.

ఈ విధంగా శాక్యవంశజుడైన గౌతమబుద్ధుని శుభవార్త దేశమంతటా విస్తరించింది. అతడు మహాజ్ఞాని అనీ, తన పూర్వజన్మలు తెలుసుననీ, నిర్వాణం పొందాడనీ, ఆయనకు జననమరణ చక్రంతో సంబంధం విడిపోయిందనీ, తిరిగి ఈ కల్లోల సంసారంలో అడుగుపెట్టడనీ నమ్మకం కలవారు చెప్పుకుంటున్నారు. ఆయన విచిత్ర మహిమలను ప్రదర్శించాడనీ, కామాసుర విజయం చేశాడనీ, దేవతలతో ప్రసంగించాడనీ, విస్మయకర మైన, విశ్వసించరాని వదంతులు ప్రబలినవి. అంతా వట్టి బూటకమనీ, అన్ని భోగాలు అనుభవిస్తాడనీ, యజ్ఞ యాగాదికర్మలను తృణీకరించాడనీ, ఆధ్యాత్మిక సాధన కాని, ఇంద్రియ నిగ్రహం కాని లేదనీ, అపండితుడనీ గిట్టనివారు తెగతిడుతున్నారు.

ఆయన గూర్చి ప్రతి వదంతి ఆకర్షకంగా వినిపిస్తున్నది. వాటిలో ఏదోమహత్తు ఉన్నది. భారతవర్షమంతా ఆయనపేరుతో మారుమ్రోగు తున్నది. దుఃఖమయమైన ప్రపంచానికి ఆయన సాధు సందేశం క్రొత్త ఆశను, ఓదార్పును కల్పించిందని చెప్పుకుంటున్నారు. నగరాలలోనూ, గ్రామాలలోనూ ఆయన వార్తలు తెచ్చిన వారికి సుస్వాగతం ఇస్తున్నారు. అప్పుడప్పుడు వస్తూ వున్న ఈ వదంతులను మన యువకులు వింటున్నారు. అవి తీవ్రమైన ఆశను సందేహాన్ని కూడా కలిగిస్తూ ఉన్నవి. వృద్ధ శ్రమణునికి వీటిపైన విశ్వాసం లేదు. బుద్ధుడు కొన్నాళ్లు సన్యాసిగా అడవులలో తిరిగి, మళ్లా ప్రపంచ సుఖాలలో మునిగి తేలుతున్నట్టు వృద్ధ శ్రమణునికి ఎవరో చెప్పారు.

ఒకనాడు గోవిందుడు ఒంటరిగా భిక్షాటనకు వెళ్లి వచ్చాడు. రాగానే సిద్ధార్థునితో ఇలా చెప్పాడు : ”మిత్రమా! గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నన్ను తన ఇంటికి పిలుచుకొని వెళ్లాడు. ఆయన కుమారుడు మగధ నుంచి వచ్చాడు. ఆ యువకుడు బుద్ధుని స్వయంగా చూచాడట. ఆయన బోధలను విన్నాడట. ఆ విషయాలన్నీ అతడు చెపుతూ వుంటే నా మనస్సు కెంతో ఉబలాటం కలిగింది. బుద్ధుని బోధామృతాన్ని క్రోలగల శుభదినం మనకు ఏనాటికి కలుగుతుందో అనిపించింది. సిద్ధార్థా! మనం కూడా వెళ్లి ఆ బుద్ధుని దర్శించి ఆయన దివ్యోపదేశాన్ని వినగూడదూ?”

సిద్ధార్థుడు : ”అదేమిటి? గోవిందుడు బ్రతుంతా ఈ శ్రమణులతోనే గడపుతాడనుకున్నానే! వీరి బోధలు, వీరి సాధనలు ఇవే గోవిందునికి పరమ లక్ష్యాలనుకున్నాను సుమా! ఈలాంటి వూహలు మా గోవిందుని మనస్సులో కలవని నాకు తెలియనే తెలియదు. అయితే, బుద్ధ బోధలు వినవలెననీ, క్రొత్తదారి త్రొక్కవలెననీ కోరిక ఉన్నదన్న మాట నీకు!”

గోవిందుడు : ”సిద్ధార్థా! నన్ను అపహాస్యం చేయడానికి అలా అంటున్నావు కాని నీకుమాత్రం ఆ కోరిక లేదా? అనతికాలంలో ఈ శ్రమణుల సాంగత్యం వదిలిపెట్టుతానని నీవే చెప్పితివి కదా!”

సిద్ధార్థుడు నవ్వుతూ ఇలా అన్నాడు : ”గోవిందా! నీకు మంచికోరిక కలిగింది. ఈ శ్రమణుల బోధలపైన విశ్వాసం నాకు తొలిగిపోయిందని కూడా నీతో చెప్పాను. ఆనాడే నా మనసు బుద్ధునిమీదికి మళ్లింది. బుద్ధదర్శనానికి నేను సర్వసిద్ధంగా ఉన్నాను. ఇదివరకే బుద్ధుని ప్రభావం మనమీద ప్రసరించిందని నా నమ్మకం.”

గోవిందుడు : ”నీవు అంగీకరించి నందులకు సంతోషం. కాని బుద్ధుని దర్శించి ఆయనబోధ వినకముందే ఆయన ప్రభావం మనమీద ఏలాగూ ప్రసరించినట్టు?”

సిద్ధార్థుడు : ”మిత్రమా! ఆయన ప్రభావం ప్రసరించబట్టే మనకు ఈ శ్రమణుల యెడల విముఖత్వం కలిగింది. ఇంకా ఎట్టి మహాఫలం కలగనున్నదీ ఆయనను దర్శించి అనుభవ పూర్వకంగా తెలుసుకుందాము.”

ఆనాడే సిద్ధార్థుడు తన నిర్ణయాన్ని వృద్ధశ్రమణు నితో చెప్పాడు. వినయవిధేయతలతోనే చెప్పాడు. వృద్ధ శ్రమణుడు ఆ మాట వినగానే ఆగ్రహావేశంతో దుర్భాషలాడనారంభించాడు.

సిద్ధార్థుడు గోవిందునికి మిన్నకుండుమని కనుసన్న చేసి వృద్ధశ్రమణుని ముందు నిలబడి ఆయనవైపు ఏకాగ్ర దృష్టితో చూచాడు. ఆయన నోరు మొద్దుపారింది. సిద్ధార్థుడు లెమ్మనగానే లేచి నిల్చున్నాడు. కూచోమనగానే కూచున్నాడు. ”మేము వెళ్లుతున్నాము. ఏలాగైనా మీరు పెద్దలు. ఆశీర్వదించి మాకు అనుజ్ఞ నీయండి” అని సిద్ధార్థుడు అనగానే ”మంచిది; మీకు శుభం కలుగుతుంది. మీ సంకల్పం సిద్ధిస్తుంది” అన్నాడు.

మార్గమధ్యంలో ఉండగా గోవిందుడు అడిగాడు: ”మిత్రమా! ఆ శ్రమణునికన్నా నీ ప్రభావమే మిన్నగా ఉన్నదే! ఆయనను మంత్రంతో కట్టివేసి, ఇచ్చవచ్చి నట్టు ఆడించావే! ఇంకా కొద్దికాలం సాధన చేసి నీవు నీళ్లమీద నడవగల వనుకుంటాను.”

సిద్ధార్థుడు : ”నేను ఆసించే పరమార్థం నీళ్లమీద నడవడం కాదు. ఈ గారడీపనులను శ్రమణులకు వదిలి పెట్టుదాము.”

(ఇంకా ఉంది)

మూలం : హర్శన్‌ హెస్‌

తెలుగు అనువాదం : బెల్లంకొండ రాఘవరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *