సిద్ధార్థ-9

సిద్ధార్థ-9

4. నది వొడ్డున

సిద్ధార్థుడు అడవిలో ప్రవేశించాడు. నగరం నుంచి చాలా దూరం నడిచాడు. ఇంతకాలం తాను బ్రతికిన బ్రతుకును తలుచుకున్నప్పుడు అతనికి ఎంతో రోత వేసింది. తన కలలో చచ్చిపోయినట్టు కనిపించిన పిట్ట కమల పంజరంలోది కాదనీ, తన హృయపంజరంలో వున్నదేననీ అనుకున్నాడు. సంసారకూపంలో దిగి ఎంత కుళ్లును పోగుచేశాడు! అంత కాలం తాను బ్రతికి కూడా చచ్చినట్టేననుకున్నాడు. ఈ లోకంలో అతనికి సంతోషాన్ని, ఊరటను కల్పించ గలిగింది ఏమున్నది?

”అబ్బ! మూర్ఛవస్తే – చచ్చిపోతే- పిడుగు మీద పడితే – ఏ పులో వచ్చి వేసుకుపోతే – ఏదైనా విషం దొరికి తాగితే ఎంత బాగుండును!” అనుకున్నాడు. ”నాకు తలవంపు కలిగించే ఏ పాపకార్యం చేయలేదు ? ఏ పాపం చేసినా ఆ బాధ్యత పూర్తిగా నాదే కాదూ ? ఇంకా బ్రతకడం ఏలాగు? ఇంతటితోనైనా ఈ బురదలో నుంచి బైటపడినట్టేనా?” ఇవి అతని ఆలోచనలు.

అడవిలో నదివద్దకు వచ్చాడు. అప్పుడు పల్లెకారి తనను దాటించిన నదే అది. ఆ నదివొడ్డున నిల్చున్నాడు. అలసట, ఆకలి, నిస్సత్తువ. ఇంకా ఎక్కడికో పోవడం ఎందుకు? ఎక్కడికి పోవడం ? ఏమి ప్రయోజనం? ఈ కలతకలను విదిలించుకొని, ఈ పాపాన్ని కక్కి వేసి, ఈ బ్రతుకును తుదముట్టించడం ఏలాగు?

ఆ నదివొడ్డున ఒక కొబ్బరి చెట్టు ఉంది. దానికి ఆనుకుని నిల్చున్నాడు. నీళ్లలో తొంగిచూచాడు. ఆ నదిలో దూకుదామనుకున్నాడు. పనికిమాలిన ఈ కళేబరాన్ని తుదముట్టించడం తప్ప గత్యంతరం కనిపించలేదు. అందులో పడిచస్తే ఆ చేపలు, మొసళ్లు, అవైనా పీక్కొనితింటవి. అంటూ నీళ్లలో తన ముఖంనీడను చూచుకున్నాడు. ఆ నీడమీద ఉమ్మి వేశాడు. కళ్లు గట్టిగా మూసుకుని నదిలో దూకడానికి ముందుకు వంగాడు.

ఆకస్మికంగా అతని ఆత్మలో ఏ మూలనుంచో ఒక శబ్దం వినబడింది. ఆ శబ్దం ఒక్కటే అక్షరం. అది వేదాలకు శిఖరమైన ఓంకారం. పరమ పవిత్రమైన ఓంకారాన్ని బ్రాహ్మణులు తమ ప్రార్థనలలో మొదటను చివరను ఉచ్చరిస్తారు. ఓంకారం అంటే ”పరిపూర్ణం” అన్నమాట. ఆ శబ్దం వినిపించగానే మైకంలో ఉండిన అతని ఆత్మ హఠాత్తుగా మేలుకున్నది. తాను చేయదలచిన పని దోషమని గ్రహించాడు.

అతనికి వణుకు పుట్టింది. ఇందుకా తాను బయలు దేరి వచ్చింది ! మనస్సు వికలమై, వివేకాన్ని కోల్పోయి, అన్ని విధాలా భ్రష్టుడై చివరకు చావుకు ఆత్మహత్యకు, సిద్ధపడ్డాడు. ఈ దేహాన్ని వదిలించుకుంటే శాంతి దొరుకుతుందని భ్రమపడ్డాడు. ఆ భ్రమను చీల్చుకొని వినిపించింది ఓంకార ధ్వని. ఇంతవరకు అతడు అనుభవించిన మానసిక వ్యథ కాని నిస్పృహ కాని అతని చైతన్యాన్ని ఆ ధ్వని కదిలించినంతగా కదిలించలేదు.

లోలోపల ఓంకారాన్ని ఉచ్చరించాడు. బ్రహ్మస్పందం కలిగింది. దేహాన్ని వదలుకున్నా జీవం నశించేది కాదని స్ఫురించింది. మరుపు తగిలిన తత్వజ్ఞానం తిరిగి స్మృతికి వచ్చింది. కాని ఆ స్మృతి మెరుపులాగా ఒక్క క్షణకాలం మాత్రమే నిలిచింది. అలసిపోయి ఆ చెట్టు క్రింద కూలబడ్డాడు. ఓంకారాన్ని ఉచ్చరిస్తూనే నడుము వాల్చి గాఢ నిద్ర పోయినాడు.

అతనికి చాలా దినాలుగా ఎన్నడూ అంత గాఢనిద్ర పట్టలేదు. కొన్ని గంటలు గడచిన తరువాత మెలకువ వచ్చింది. అతనికి పదిసంవత్సరాల వెనక మేలుకున్నట్టు తోచింది. ప్రక్కన నీళ్ళ చప్పుడు వినిపిస్తున్నది. తానెక్కడ ఉన్నదీ అక్కడికి ఎలా వచ్చిందీ అతనికి తోచలేదు. తల యెత్తి చూస్తే పైన ఆకాశం, ప్రక్కన టెంకాయ చెట్టు. గతమంతా మెల్లగా స్మృతికి వచ్చింది. పూర్వానుభవం యావత్తూ కరిగిపోయిన కలలాగా ఉన్నది. మెలకువ వచ్చిన మొదటి క్షణంలో అతనికి గడిచిపోయిన బ్రతుకంతా ఏదో పూర్వజన్మానుభవంగా స్ఫురించింది. అప్పుడే పుట్టి కళ్ళువిచ్చి చూస్తున్నట్టుగా చూచాడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని. పెదవులు ఓంకారాన్ని మెల్లగా ఉచ్చరిస్తూ ఉన్నవి. నిద్రలో ఉండినంత కాలమూ తనలో ఓంకారం మోగుతూ ఉన్నట్టు తోచింది. ఓంకారంలోనే మునిగి నిద్రించినట్టుగా అనిపించింది.

ఎంత సుఖమైన నిద్ర ! నిజంగా చచ్చిపోయి మళ్ళా పుట్టానేమో అనుకున్నాడు. తన దేహం వైపు చూచుకున్నాడు. అవే చేతులు ! అవే కాళ్ళు ! లోపల చూచుకున్నాడు. అదే అహంత ! ఆ సిద్ధార్థుడే! కాని కొంత మారాడు. ఆ నిద్ర తరువాత ఈ మెలకువ అతనికి ఏదో కొత్తగా వింతగా సుఖంగా కనిపించింది.

సిద్ధార్థుడు లేచి కూర్చున్నాడు. ముందు ఎవరో భిక్షుకుడు కూర్చొని ఉన్నాడు. ఒక క్షణ కాలం పరికించి చూచాడు. గోవిందుడు ! ఆ గోవిందుడే! కావిగుడ్డలు, బోడితల, కొంతవయసు మీరింది, అంతేభేదం, అదే ముఖవైఖరి. గోవిందుడు అతనివైపు చూచాడు. తనను గుర్తుపట్టలేదని తెలుసుకున్నాడు సిద్ధార్థుడు.

”నాకు చాలాసేపు నిద్రపట్టింది. నీవిక్కడికి ఏలా వచ్చావు ?” అన్నాడు.

”నీవు నిద్రపోతున్నావు. ఈలాంటిచోట నిద్రపోవడం మంచిది కాదు. పురుగుపుట్ర ఉంటవి. నేను బుద్ధ భగవానుని అనుచరులలో ఒకడను. భిక్షుకులతో కలిసి నేను యాత్రపోతున్నాను. ఇక్కడ నిన్ను చూచాను. లేపవలెననుకున్నాను. కాని, మంచినిద్రలో ఉన్నావు. వాళ్ళను ముందు పొమ్మని నిన్ను చూస్తూ ఇక్కడ కూర్చున్నాను. నీవు మేలు కున్నావు. ఇక నేను వెళ్ళి వాళ్ళను కలుసుకుంటాను” అన్నాడు గోవిందుడు.

”శ్రమణుడా ! నీకు కృతజ్ఞుడను నమస్కారం. బుద్ధ భగవానుని శిష్యులు కరుణాస్వరూపులు. ఇక నీవు వెళ్ళవచ్చును.”

”సరే! నీకు శుభం కలుగును గాక. శలవు.”

”ఇదే నా నమస్కారం గోవిందా ! శలవు.”

గోవిందుడు నివ్వెరపోయి చూచాడు : ”అయ్యా ! నా పేరు మీకు ఎలా తెలుసు” అని అడిగాడు.

నవ్వుతూ సిద్ధార్థుడు అన్నాడు : ”గోవిందా ! నిన్ను చిన్నప్పటినుంచి ఎరుగుదును. మనం కలిసి చదువుకున్నాము. కలిసి శ్రమణులతో సాంగత్యం చేశాము. జేతవనంలో విడిపోయినాము.”

”సిద్ధార్థుడవా నీవు ! ఇప్పుడు గుర్తుపట్టుతున్నాను. సిద్ధార్థా! ఇన్నాళ్ళకు నిన్ను చూడడం ఎంత సంతోషంగా ఉన్నది !”

”నిన్ను తిరిగి కలుసుకోవడం నాకూ సంతోషంగానే ఉన్నది. కాని, గోవిందా! నీవు ఎక్కడికి వెళుతున్నావు?”

”ఒక చోటికని నేను వెళ్ళడం లేదు. ఒక్క వర్షాకాలంతప్ప తక్కినరోజులు ఈలాగే ఒకచోటి నుంచి ఇంకొక చోటికి పోతూ, ధర్మప్రచారం చేస్తూ ఉంటాము. ఇది భిక్షుకుల విధి. సిద్ధార్థా ! నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావు?”

”నేనుగూడా నీ వలెనే ఒక చోటికని వెళ్ళడం లేదు. నేను మార్గంలో ఉన్నాను. ఒక యాత్ర చేస్తున్నాను.”

”మిత్రమా ! నీ దుస్తులు నీ తలకట్టు చూస్తే శ్రీమంతునిలాగా వున్నావు. యాత్రికుని వలె కనిపించడం లేదు. ఇది శ్రమణుల వేషం కాదే!”

”నిజమే నేను శ్రమణుడనని చెప్పలేదు. నేను ఒక యాత్ర చేస్తున్నానని చెప్పాను. ఆ మాట నిజం.”

”నిజమే కావచ్చు. కాని ఈలాంటి వేషంతో యాత్ర చేసే మనిషిని ఎన్నడూ చూడలేదు.”

”గోవిందా ! అలాంటి యాత్రికుని నా లోనే చూస్తున్నావు. కాని ఈ దృశ్య ప్రపంచమంతా క్షణభంగురమైనదే కదా! ఈ వేషం కూడా అంతే. ఈ దేహం కూడా అంతే. నీవన్నట్టుగా నిన్న నేను శ్రీమంతుడను. అందుకే ఈ వేషం. నిన్న నేను లోకులతోపాటు మనిషిని. అందుకే ఈ తలకట్టు.”

”అయితే, సిద్ధార్థా! ఇప్పుడు నీవెవరు ?”

”నాకే తెలియదు. నేను మార్గంలో ఉన్నాను. ఇదివరకు ధనికుడను. ఇప్పుడు కాను. రేపటి సంగతి తెలియదు.”

”నీ ఆస్తి పోయిందా ?”

”నాకు ఆస్తి పోయిందో ఆస్తికి నేను పోయినానో చెప్పజాలను. ఈ దృశ్యచక్రం వడిగా తిరుగుతూ వుంటుంది. బ్రాహ్మణ సిద్ధార్థుడు, శ్రమణ సిద్ధార్థుడు, ధనిక సిద్ధార్థుడు ఈనాడు ఎక్కడ వున్నారు ? అంతా క్షణభంగురం. గోవిందా ! నీకు తెలుసును.”

గోవిందుడు అతని వైపు సందేహంగా చూస్తూ కొంత సేపు కూర్చొని తరువాత శలవు తీసుకొని వెళ్ళాడు.

గోవిందుని చూచినప్పుడు సిద్ధార్థునికి ప్రేమ పొంగి వచ్చింది. ఒక్క గోవిందుని చూచినప్పుడే కాదు-నిద్ర లేచిన తరువాత దేనిని చూచినా అతనికి ప్రేమ, ఆనందం కలుగుతూ ఉన్నది. ఇదివరకు దేనిని చూచినా, ఎవరిని చూచినా అతనికి అట్టి భావం కలిగేది కాదు. అలాంటి ప్రేమభావం లేకపోవడం వల్లనే తన బ్రతుకులో అంత దోషం ఏర్పడిందను కున్నాడు. అది అతనికి నిద్రలో కలిగిన మార్పు. అంతసేపూ అతనిలోపల మోగుతూ ఉండిన ఓంకారం మహత్తు.

నిద్రవల్ల అతనికి అలసట తగ్గి కొంత బలం వచ్చింది. కాని ఆకలి ఎక్కువగా ఉన్నది. అన్నం తిని రెండురోజులైంది. ఆకలిని సహించగల శక్తి ఎన్నడో పోయింది. ఇదివరకు కమలతో తనకు ఆలోచించడం, వేచి ఉండడం, పస్తు చేయడం- ఈ మూడు కళలలో ప్రజ్ఞ ఉన్నట్టు గర్వంగా చెప్పు కున్నాడు. ఆ మాటలు జ్ఞప్తికి వచ్చి నవ్వుకున్నాడు. నిజమే. అతడు యౌవనంలో ఆ మూడు కళలను అభ్యసించి స్వాధీనం చేసుకున్నాడు. వాటిని మధ్య వచ్చిన భోగాలమూలంగా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మామూలు మనిషిగానే నిలిచాడు.

సిద్ధార్థుడు తన స్థితిని గూర్చి ఆలోచించనా రంభించాడు. ఆలోచించడం కూడా అతనికి కష్టమనిపించింది.

”ఈ క్షణభంగురాలైన అన్ని విషయాలు నన్ను విడిచిపోయినవి. నేను ఒంటరిగా మిగిలాను. నాది అన్నది ఒకటీ లేదు. నాకు తెలిసింది ఏమీ లేదు. నేను నేర్చుకొన్నది కూడా ఏమీ లేదు. నాకు వయసు మళ్ళింది, తల నెరిసింది, బలం తగ్గింది. ఈనాడు నాకు బాల్యదశ తిరిగి వచ్చింది. ఏమీచిత్రం ! ఏమికర్మ!” అతనికి విచారం కలగడం లేదు. నవ్వవలెనని, తన్ను చూచుకొని ఈ పిచ్చి ప్రపంచాన్ని చూచి నవ్వవలెనని గాఢ వాంఛ కలిగింది.

తన బ్రతుకు వెనక్కు పోతూ వుందనుకున్నాడు. నవ్వుకున్నాడు. నది వైపు చూచాడు. ఆ నది పాడుతూ వెనక్కు ప్రవహిస్తూ ఉన్నట్లు కనిపించింది. అతనికి చాలా సంతోషం కలిగింది. నదిని చూచి ఉత్సాహంగా నవ్వుకున్నాడు. తాను దూకి చచ్చిపోదామనుకొన్న నది అదే కదూ! ఎప్పుడు ? ఎంత కాలమైంది ? అది నిజమా ? కలా ?

”పసితనం దేవుళ్ళతోనూ, యజ్ఞాలతోనూ గడించింది. యౌవనం, వైౖరాగ్యంతోనూ, తత్వ విచారంతోనూ ధ్యానంతోనూ గడించింది. బ్రహ్మను సంపాదించవలెననుకున్నాను. అడవిలో వున్నాను. చలినీ యెండనూ సహించాను. పస్తులుండడం అలవాటు చేసుకున్నాను. ఇంద్రియా లను జయించడం నేర్చుకొన్నాను. అప్పుడు బుద్ధ భగవానుని సంగతి తెలిసింది. ఆయన దగ్గరకు వెళ్ళాను. ఆయన బోధలను గ్రహించి, ఆశ్చర్య పడ్డాను. జ్ఞానమూ ప్రపంచం యొక్క ఏకత్వమూ నాలో రక్తంతోపాటు ప్రవహిస్తూన్నట్టు అనిపించింది. ఆయనను కూడా వదిలాను. కామస్వామి వద్ద వ్యాపారాన్ని, కమలవద్ద కామ కళను నేర్చుకొన్నాను. ధనం పోగు చేసాను – వెదజల్లాను. రుచులను మరిగాను. ఇంద్రియ వాంఛలను పెంచుకున్నాను. నా తెలివిని, ఆలోచనాశక్తిని పోగొట్టుకోడానికి ఎంతో కాలం పట్టింది. ప్రపంచంలో ఏకత్వం కలదన్న సంగతి మరచాను. ఆ జ్ఞానమే నశించింది. ఇన్ని మార్పులు గలిగిన వెనక ఈనాడు నాకు పసితనం వచ్చింది.”

”కాని, ఈ మార్గం మంచిదే- నా హృదయ పంజరంలోని పిట్ట చచ్చిపోలేదు. అబ్బ ? ఎంత అవివేకం ! ఎంత పాపం ! ఎన్ని దోషాలు ! ఎంత అసహ్యం, ఈ పసితనం రావడానికి, బతుకు మళ్ళా పారంభించడానికి ! కాని అది అలాగే జరగవలెనని నా హృదయం చాటుతూ వున్నది. నైతికంగా ఇంత పతనం కలిగి, నిరాశ ప్రబలి, ఆత్మహత్యకు సిద్ధపడినప్పుడే అనుగ్రహం ప్రాప్తించింది. ఓంకారం వినిపించింది. నాలో ఆత్మను తెలుకోడానికి అంత మూఢుడను కావలసివచ్చింది. తిరిగి బ్రతకడానికి అంత పాపం చేయవలసి వచ్చింది. ఈ మార్గం నన్ను ఎక్కడికి లాక్కొని పోతుందో?”

తనలో ఏదో మహాసుఖం ఉబికివస్తూ వున్నట్టు తెలుసుకున్నాడు.

”ఇది ఎక్కడనుంచి వస్తూ ఉన్నట్టు ? ఈ సుఖ వేదనకు కారణమేమిటి? నేను పొందిన గాఢనిద్ర వల్లనా ? ఓంకారాన్ని ఉచ్చరించడం వల్లనా? సంసారాన్ని వదిలించుకుని, పరుగెత్తి రావడంవల్లనా ? నేను తప్పించుకుని వచ్చిన ఆ వాతావరణంలో ఆ సుగంధాలు, ఆ రుచులు, ఆ జడత్వం, ఆ మత్తు వాటిమీద నాకు ఎంత వెగటు పుట్టింది! ఆ కాలంలో ఆ సిద్ధార్థుడే తెలివిగలవాడనుకున్నాను. – ఆ దురూహ నాకు మళ్ళా కలగదు. ఒక్కటి మంచిపని చేశాను. అందుకు నాకు సంతోషం. అందుకు నన్ను నేనే అభినందించుకుంటాను. ఆ తుచ్ఛపు బ్రతుక్కు స్వస్తి చెప్పాను. సిద్ధార్థా ! నిన్ను అభినందిస్తున్నాను. ఇన్నాళ్ళు ఆ పాడుబ్రతుకు బ్రతికినా చివరకు నీకు మంచి ఆలోచన కలిగింది. ఒక పని సాధించావు. నీ హృదయ పంజరంలో పిట్టపాటను విన్నావు. ఆ పాట వెంట బయలుదేరి వచ్చావు.”

ఆ బ్రతుకుమీద అంతరోత పుట్టక పోయినట్టయితే ఆత్మను అలక్ష్యం చేసి దేహసుఖం కోసం కామస్వామిని, కమలను వదలకుండా ఆ నరకంలో ఇంకా ఎంత కాలం దొర్లాడుతూ ఉండేవాడో! అయితే ఆ నిర్వేదం, ఆ జుగుప్స అతనిని అణిచివేయలేకపోయినవి. అతని హృదయ పంజరంలో పిట్ట పాడుతూనే ఉన్నది. అతని లోపల ధ్వని మోగుతూనే ఉన్నది. అందుకే అతడు సంతోషిస్తున్నాడు. అందుకే అతడు నవ్వగలుగు తున్నాడు. అతని తల నెరిసినా ముఖంలో వెలుగు మాసిపోలేదు.

”మంచిగాని చెడుగాని సొంతంగా అనుభవించడం మేలు. లౌకిక సుఖాలు, ధనం, మంచివి కావని పసితనంలో నేర్చుకున్నాను. కాని, ఈనాడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా కళ్లతో, నా మనస్సుతో, నా దేహంతో తెలుసు కున్నాను. ఈ విధంగా తెలుసుకోవడమే మంచిది” అనుకున్నాడు.

తనలో కలిగిన మార్పును గూర్చి చాలాదూరం ఆలోచించాడు. హృదయపంజరంలో పిట్ట పాడుతూ వున్న పాటను విన్నాడు. ఆ పిట్ట చచ్చిపోలేదు. చచ్చిపోయింది ఇంకొకటి.

చిరకాలంగా దేనిచావును తాను వాంఛిస్తున్నాడో అది చచ్చిపోయింది. దానిని చంపడానికే ఒకప్పుడు సాధన చేశాడు. అది అతనిలోని అహంత. చిరకాలం దానితో కుస్తీలు పట్టాడు. చిట్టచివరకు అదే గెలుస్తూ వచ్చింది. అదే అతని ఆనందాన్ని దోచి వేసింది. అదే అతనిలో భయాన్ని పురికొల్పింది. అదే ఆనాడు ఆ నదివొడ్డున చచ్చింది. దాని చావు వల్లనే అతనికి మళ్ళా పసితనం వచ్చింది. ఆత్మవిశ్వాసము, సుఖము, నిర్భీతి కలిగినవి.

తాను బ్రాహ్మణుడై శ్రమణుడై అహంతతో అంతగా ఎందుకు పోరాడిందీ సిద్ధార్థుడు ఆనాడు గ్రహించాడు. విజ్ఞానము, మంత్రతంత్రాలు, యజ్ఞాదికర్మలు, దేహశోషణ సాధనలు ఇవన్నీ మితిమీరి అతనికి ప్రతిబంధకాలైనవి. అందరికన్నా తెలివిగలవాడననీ, పండితుడననీ, ప్రజ్ఞావంతుడననీ ఒక గర్వం పెచ్చు పెరిగింది. ఆ గర్వంలోకి ప్రవే శించింది, అతని అహంత. అక్కడ పీట పెట్టుకుని కూర్చున్నది. ఒక వైపు అది పెరుగుతూ వుంటే, తన ఉపవాసాలతోనూ, తపస్సులతోనూ దానిని చంపి వేస్తున్నానని భ్రమపడ్డాడు. తన అంతర్వాణీ సత్యమైందనీ, ఏ గురువు గాని తనకు ముక్తిని సంపాదించి పెట్టజాలడనీ నేటికతడు గ్రహించాడు.

అందుకే అతడు ప్రపంచంలోకి వెళ్ళాడు. స్త్రీకి, ధనానికి, అధికారానికి వశుడైనాడు. వర్తకం చేశాడు, జూదం ఆడాడు, తాగాడు. అతనిలో శిష్టుడు, శ్రమణుడు మాయమైనారు. పట్టరాని నిర్వేదం కలిగేటంత వరకు ఆ బ్రతుకు గడిపాడు. ఆ నిర్వేదం కలగగానే సుఖాసక్తుడైన సిద్ధార్థుడు, ధనికుడైన సిద్ధార్థుడు పోయినారు. ఆ స్థానంలో ఒక క్రొత్త సిద్ధార్థుడు నిద్రలో నుంచి మేలుకున్నట్టు లేచాడు. ఈ సిద్ధార్థుడు కూడా ఒక నాటికి చావక తప్పదు. కాబట్టి సిద్ధార్థుడు క్షణిక వస్తువు. అన్ని వస్తువులు అంతే కాని ఈ కొత్త సిద్ధార్థుడు ఈ నాటికి సుఖిగా ఉన్నాడు.

సిద్ధార్థుడు ఈ విధంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ముందు ప్రవహిస్తూ వున్న నదిని చూచాడు. అతనిని ఒక నది ఎన్నడూ ఇంతగా ఆకర్షించలేదు. నీళ్ల చప్పుడులో ఇంత మాధుర్యం ఎన్నడూ వినిపించలేదు. ఆ నది తనతో ప్రత్యేకంగా తనకు తెలియని విషయం, జరగనున్న విషయం, చెప్పదలచినట్టుగా కనిపించింది. అంతకుముందు సిద్ధార్థుడు, ఆ నదిలో దూకడానికి సిద్ధపడ్డాడు. నిర్వేదంతో క్రుంగిపోయిన ఆ సిద్ధార్థుడు ఆనాడు నదిలో పడి మునిగి పోయినాడు. ఈ క్రొత్త సిద్ధార్థునికి ప్రవహిస్తూ వున్న నదిమీద గాఢమైన ప్రేమభావం కలిగింది. తొందరపడి ఆ నదిని విడిచి పోగూడదు అనుకున్నాడు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *