సిద్ధార్థ -10

సిద్ధార్థ -10

5. పల్లెకారి

”ఈ నదికి సమీపంగానే ఉంటాను. ఆనాడు- ఈ నదినే దాటి నగరానికి వెళ్ళాను. అప్పుడు నన్ను పడవ మీద దాటించిన పల్లెకారి కుటీరానికే వెళ్లుతాను. ఆనాడు ఆ కుటీరాన్ని వదిలిన తరువాత ఒక రకం బ్రతుకు బ్రతికాను. ఆ బ్రతుకు ముగిసింది, మళ్ళా నా క్రొత్త బ్రతుకు ఆ కుటీరం దగ్గరనే ఆరంభం కావలెను” అనుకున్నాడు సిద్ధార్థుడు.

నదిలో పారుతూ ఉన్న నీళ్ళవైపు చూచాడు. పచ్చగా స్వచ్ఛంగా వున్నది. నీళ్ళ మీద గీరలు వెండి తీగెలు లాగా మిలమిల మెరుస్తూ వున్నవి. ముత్యాలు లాగా లోపలినుంచి బుడగలు లేస్తున్నవి. ఆ నీళ్లలో ఆకాశం ప్రతిఫలిస్తున్నది. పచ్చగా, తెల్లగా, నీలంగా వేయికళ్ళతో తన వైపు చూస్తున్నట్టుగా ఉన్నది ఆ నది. అతనికి ఆ నదిమీద ఎంత ప్రేమ ? అతనిని అంతగా ఆకర్షించింది ఆ నది. దానియెడల అతడు అంత కృతజ్ఞుడు. అతని హృదయంలో క్రొత్తగా ఒక ధ్వని వినిపించింది: ”ఈ నదిని ప్రేమించు; దీని దగ్గరే వుండు. దీని వల్ల నేర్చుకో?” అని. అలాగే ఆ నది ఉపదేశాలను విని దానివల్ల నేర్చుకోవలెనను కున్నాడు. ఆ నదిని అర్థం చేసుకోగలవానికి ఎన్నో రహస్యాలు-అన్ని రహస్యాలు తెలియగలవని పించింది అతనికి.

ఈనాడు ఆ నది వల్ల అతనికి ఒక్క రహస్యం మాత్రం తెలిసింది: ఆ నదిలో నీళ్లు తెంపు లేకుండా పారుతున్నవి. కాని ఆ నది అక్కడే, ఆ విధంగానే, ఎప్పటికప్పుడు కొత్తగా నిలిచి వున్నది. ఈ రహస్యాన్ని ఎవరు గ్రహించగలరు? ఎవరు ఊహించగలరు? అతనికీ అర్థం కాలేదు. మసక మసకగా ఏదో సందేహం, ఏదో స్మృతి, ఏవో దివ్య ధ్వనులు. అంతే అతనికి గోచరించినవి.

సిద్ధార్థుడు లేచాడు. లోపల ఆకలి మండిపోతూ వున్నది. కష్టంగా నది వొడ్డున తిరిగాడు, బైట నీళ్ళ గలగల, కడుపులో ఆకలి కరకర, వొడ్డున పల్లెకారి పడవను పెట్టుకుని వున్నాడు. అతనిని గుర్తుపట్టాడు సిద్ధార్థుడు. అతడు కూడా పెద్దవాడయినాడు.

”నన్ను దాటిస్తావా?” అని అడిగాడు.

పల్లెకారి అతని పెద్దమనిషి తరహాను చూచి వీస్తుపోతూ:

”అలాగే, పడవమీదికి రండి” అన్నాడు. సిద్ధార్థుడు పడవ ఎక్కాడు. ”నీ వత్తి బాగున్నది. ఈ నది దగ్గర వుంటూ రోజూ పడవను నడపడం ఎంత హాయి!?” అన్నాడు.

పల్లెకారి నవ్వుతూ అన్నాడు:

”అయ్యా! ఏ వృత్తి మంచిది కాదు ?”

”కావచ్చు, కాని నీ వృత్తి నాకు నచ్చింది.”

”అయితే మీలాగా అందమైన దుస్తులు వేసుకునే పెద్దలకు తగింది కాదు.”

సిద్ధార్థుడు ఆ మాటకు నవ్వుతూ ”ఈ దుస్తులమీద నాకు మోజుపోయింది. వీటిని నీవు తీసుకో. నదిని దాటించినందుకు నీకివ్వడానికి నా దగ్గర పైసా లేదు.” అన్నాడు.

”నా మాటకు ఎగతాళి చేస్తున్నారా?” అన్నాడు పల్లెకారి.

”మిత్రమా! ఎగతాళి కాదు. ఇదివరకు నన్ను ఊరికే దాటించావు. ఈ తడవైనా కేవుక్రింద ఈ బట్టలు తీసుకో ?”

”మరి మీకో ?”

”ఏవైనా మాసిన బట్టలిస్తే చాలు నాకు. నన్ను నీ దగ్గర వుంచుకో, పడవ నడపడం నేర్చుకుని నీకు తోడుగా వుంటాను.”

”ఓ¬! ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ రాత్రి నా గుడిసెలో పండుకున్నారు కదూ ! మీరు? చాల కాలమైంది. ఇరవై యేళ్ళకు పూర్వం. అప్పుడు మీరు శ్రమణకుడుగా వుంటిరే ! మీ పేరు జ్ఞాపకం లేదు.”

”నా పేరు సిద్ధార్థుడు. నీవు చూచినప్పుడు శ్రమణుడనే.”

”సిద్ధార్థా! మీకు స్వాగతం. నా పేరు వాసు దేవుడు. ఈనాడు నా అతిథిగా వుండండి. నా గుడిసెలో పండుకోవచ్చు. మీరు ఎక్కడనుంచి వస్తున్నారు? అంత చక్కని దుస్తుల మీద ఎందుకు అసహ్యం ?”

పడవ అవతలి వొడ్డుకు చేరింది. ఇద్దరూ కలిసి గుడిసె వద్దకు వెళ్ళారు. వాసుదేవుడు సిద్ధార్థునికి అన్నం వడ్డించాడు. సిద్ధార్థుడు తృప్తికరంగా భోజనం చేశాడు. వాసుదేవుడిచ్చిన మామిడిపండు కూడా తిన్నాడు.

అస్తమయం అవుతున్నది. వాసుదేవుడు సిద్ధార్థుడు నది వొడ్డున చెట్టుక్రింద కూర్చున్నారు. సిద్ధార్థుడు తన పుట్టు పూర్వోత్తరాలు అన్నీ వివరంగా చెప్పాడు. వాసుదేవుడు సావధానంగా విన్నాడు. వాసుదేవుని ఉత్తమగుణాలలో అదొకటి. అతనికి వినడం ఏలాగో తెలుసును. వినడం నేర్చినవారు కొద్దిమందే. ఒకసారైనా పెదవి విప్పకుండా తాను చెప్పే ప్రతి మాటను నెమ్మదిగా ఆసక్తితో వాసుదేవుడు వింటూ ఉన్నట్టు సిద్ధార్థుడు గ్రహించాడు. అంతసేపు చెపుతూ వుంటే అతనికి విసుగుదల కాని, ‘అవును, ‘కాదు’ అనడం కాని లేదు. శ్రద్ధగా వింటూ వున్నాడు. తన బ్రతుకుమీద, తన కష్టసుఖాల మీద, అంత ఆసక్తిని చూపుతూ వినడం సిద్ధార్థునికి ఆశ్చర్యకరంగా వున్నది.

కథ చివరిఘట్టంలో తనకు తీవ్రంగా నిరాశ కలగడం. ఓంకారం వినిపించడం – గాఢనిద్ర పట్టడం – నిద్ర లేవగానే నదిమీద ప్రేమకలగడం – ఈ సంగతులన్నీ చెపుతూ వుండగా వాసుదేవుడు సావధానంగా ఏకాగ్రచిత్తంతో కళ్ళు మూసుకొని విన్నాడు.

సిద్ధార్థుడు ముగించిన తరువాత వాసుదేవుడు చాలా సేపు మౌనంగా ఉండి చనువుగా ఇలా అన్నాడు : ”మిత్రమా ! నేను అనుకొన్నట్టే జరిగింది. అయితే నది నీతో మాట్లాడిందన్న మాట. నదికి నీ మీద ప్రేమ వున్నది. నీతో మాట్లాడుతుంది. ఇదంతా నీ మంచికే ! నీవు నాతో వుండు. నా భార్య చాలా కాలం క్రిందపోయింది. నాటి నుంచి ఒంటరిగానే వున్నాను. నీకూ, నాకూ తగినంత జాగా వున్నది. అన్నానికి లోటు లేదు.”

”వాసుదేవా ! అలాగే వుంటాను. నీ దయకు కతజ్ఞుడను. నీవు నా జీవిత గాథనంతా శ్రద్ధతో విన్నావు. వినడం ఏలాగో తెలిసినవారు కొద్దిమంది. నీ వలె వినగల మనిషిని ఎక్కడా చూడలేదు. ఈ నేర్పును నేను నీ వల్ల గ్రహిస్తాను.”

”మిత్రమా! నీవు నేర్చుకుంటావు. కాని నా వల్ల కాదు, వినడం ఏలాగో నాకు ఆ నది నేర్పింది. ఆ నదివల్లనే నీవూ నేర్చుకుంటావు. నదికి అన్నీ తెలుసును. దానివల్ల అన్నీ తెలుసుకోవచ్చును. అడుగుకుపోయి పాటుపడవలెనన్న సంగతి ఇదివరకే నీవు నదివల్ల నేర్చుకొన్నావు. శ్రీమంతుడైన, బాహ్మణు డైన సిద్ధార్థుడు పడవ నడిపేవాడు కాబోతున్నాడు. ఈ తెలివి కూడా నీకు నదివల్లనే కలిగింది. ఇంకొక సంగతి కూడా నీవు తెలుసుకుంటావు.”

”వాసుదేవా! ఇంకొక సంగతి ఏమిటి?”

”మిత్రమా! ప్రొద్దుపోయింది – ఇంక పండు కుందాము. ఆ సంగతి ఏమిటో నేను చెప్పలేను. నీవే తెలుసుకుంటావు. బహుశా నీకు ఇదివరకే తెలిసి వుంటుంది. నేను పండితుడను కాను. ఏలా మాట్లాడ వలెనో ఏలా ఆలోచించవలెనో నాకు తెలియదు. వినడం ఏలాగో, శ్రద్ధచూపడం ఏలాగో నాకు తెలుసును. అంతే. ఇంకేమీ నేను నేర్చుకోలేదు. మాటలు చెప్పడం, బోధలు చేయడం తెలిసి వుంటే బహుశా నేను కూడా ఒక గురువునై ఉందును. కాని ప్రస్తుతం నేను పడవ నడిపేవాడను. మనుష్యులను ఈ నదిమీద దాటించడమే నా పని. నేను వేలకొలది జనాన్ని ఈ నదిమీద దాటించాను. వారందరికీ నది తమ ప్రయాణంలో ఒక అడ్డంకిగా మాత్రమే కనిపించింది. అంతకంటే వారికి అర్థం కాలేదు, వారు ధనంకోసం, వ్యాపారాలకోసం, వివాహాల కోసం, యాత్రలకోసం వెళ్ళేవారు. నది వారికి దారిలో వున్నది. ఈ అడ్డంకిని త్వరగా దాటించడానికి పల్లెకారి వున్నాడు. ఆ వేలమందిలో ఈ నది అడ్డంకి కాని వారు ఏ నలుగురో అయిదుగురో కొద్దిమంది మాత్రమే. వారు ఈ నది చెప్పేమాటలు విన్నారు. వాటిని చెవినిపెట్టారు. నాకు అయినట్లే వారికిన్నీ ఈ నది పుణ్యతీర్థం అయింది సిద్ధార్థా! ఇంక పండుకుందాము.”

సిద్ధార్థుడు పల్లెకారి వద్ద వున్నాడు. పడవ నడపడం ఏలాగో నేర్చుకున్నాడు. పడవ పని లేనప్పుడు వరిపొలంలో పని చూచేవాడు. కట్టెలు కొట్టేవాడు. బుట్టలు అల్లేవాడు. అరటి గెలలను మాగ పెట్టేవాడు. ప్రతిపని అతనికి ఆనందంగా వుండేది. ఈ విధంగా రోజులూ నెలలూ గడచినవి. అతనికి వాసుదేవుడు నేర్పినదానికంటే నదివల్ల ఎక్కువ నేర్చు కున్నాడు. నదివల్ల తెంపు లేకుండా నేర్చుకుంటూ ఉండేవాడు. అన్నిటికంటే వినడం ఏలాగో నది వల్ల నేర్చుకున్నాడు. నిశ్చలమైన హదయంతో, నగ్నమైన ఆత్మతో, ప్రతీక్షతో, మనోవికారం లేకుండా, వాంఛ లేకుండా, తర్కబుద్ధి లేకుండా, అభిప్రాయాలు లేకుండా వినడం నేర్చుకున్నాడు.

ఆ ఇద్దరూ అప్పుడప్పుడు స్వల్పంగా మాట్లాడు కునేవారు. బాగా ఆలోచించుకున్న మీదట మాట్లాడు కునేవారు. వాసుదేవుడు అంత మాటకారి కాడు. సిద్ధార్థుడు కదలించినా అరుదుగా మాట్లాడేవాడు.

”నది వల్ల ఆ రహస్యంకూడా తెలుసుకున్నావా! కాలం అంటూ ఒక వస్తువు లేదని ?” అని అడిగాడు సిద్ధార్థుడు ఒకసారి. వాసుదేవుడు నవ్వుముఖంతో ఇలా అన్నాడు ! ”సిద్ధార్థా! ఇదేకదూ నీ భావం ! పుట్టిన చోటను, ఆరంభంలోను, పై నుంచి దూకే చోటను, పారేచోటను, పడవరేవులోను, పర్వతాల లోను, సముద్రంవద్దను అన్ని చోట్లను నది ఒక్కసమయంలోనే వుంటున్నది. భూత భవిష్యత్తుల ఛాయలు లేకుండా ఆ నదికి ఒక్క వర్తమానమే వుంటుంది. ఇదే కదూ నీ భావం?”

”ఆ ! అదే! దానిని నేర్చుకున్న తరువాత నా జీవితాన్ని గూర్చి ఆలోచించాను. అదికూడా ఒక నదిగానే వున్నది. బాల్యంలోనూ, యౌవనంలోనూ, ముసలితనంలోనూ, సిద్ధార్థుని వేరు చేసినవి నీడలే. వాస్తవాలు కావు. సిద్ధార్థుని పూర్వజన్మలుకూడా గతంలో వుండినవి కావు. అతడు చావడమూ బ్రహ్మలో కలిసిపోవడమూ ముందు జరిగేవీ కావు. ఏదికూడా ఇదివరకు వుండినది, ముందు వుండ బోయేది కాదు. ప్రతిదీ వుండనే వున్నది. సత్యంగానే వున్నది.”

ఈ రహస్యం తెలిసిన తరువాత సిద్ధార్థునికి తృప్తిగా వున్నది. వాసుదేవునితో ఈలా అన్నాడు : ”అయితే, దుఃఖము, ఆత్మశోషణ, భయము ఇవన్నీ కాలంలో ఉన్నవే కదూ? కాలాన్ని త్రోసివేసిన తరువాత, కాలాన్ని జయించిన తరువాత అన్ని కష్టాలను, అన్ని దోషాలను జయించినట్టేకదూ?” వాసుదేవుడు చిరునవ్వుతో ‘ఔ’నన్నట్టు తల వూపి సిద్ధార్థుని వీపు తట్టాడు.

వర్షాకాలంలో నది పొంగి పెద్దగా మోగుతూ వున్నది. సిద్ధార్థుడు అన్నాడు: ”వాసుదేవా ! ఈ నదిలో ఎన్ని గొంతుకలు వినిపిస్తూ వున్నవి ! రాజులాగా, సైనికుని లాగా, వృషభంలాగా, పిట్టలాగా, గర్భిణీ స్త్రీలాగా, మూలిగే మనిషిలాగా, ఇంకా వేల గొంతుకలతో వినిపిస్తూ వున్నవి.”

”నిజమే ! అన్ని జీవుల గొంతుకలు ఆ నదిగొంతుకలో వున్నవి.”

”ఒక్కసారిగా అన్ని వేల గొంతుకలు వినగలిగిన మనిషికి ఈ నది చిట్టచివరకు ఏ శబ్దాన్ని వినిపించేదీ నీకు తెలుసునా?” వాసుదేవుడు సంతోషంతో నవ్వి, సిద్ధార్థుని చెవిలో రహస్యంగా ”ఓం” అన్నాడు. సిద్ధార్థుడు విన్నది కూడా అదే.

కాలం గడిచేకొద్దీ వాసుదేవుని ముఖంలోని చిరునవ్వు, కాంతి, సుఖం, పసితనం, ముసలితనం అన్నీ అలాగే కనిపిస్తూ వున్నవి సిద్ధార్థుని ముఖంలో కూడా. చాలామంది యాత్రికులు ఇద్దరూ అన్నదమ్ములు అనుకునేవారు. సంజపాటున ఇద్దరూ నదివొడ్డున చెట్టుక్రింద కూర్చునేవారు. ఇద్దరూ మౌనంగా నదిభాషను వినేవారు. ఆ నది వారికి వట్టినీళ్ళు కావు. అది జీవశబ్దం. నిత్యంగా వుంటూ, తెంపు లేకుండా మారుతూ వుండే శబ్దం ఆ నది. ఒక్కొక్క సమయంలో ఆ నదిభాషను వింటూ కూర్చున్నప్పుడు ఇద్దరికీ ఒక్కరకం భావాలే కలిగేవి. గత దినం తాము చేసిన చర్చలను గూర్చో; ఎవరో యాత్రికుడు చెప్పుకున్న సొంత గోడును గూర్చో; ఏదోచావును గూర్చో; తమ చిన్న నాటి అనుభవాలను గూర్చో ఏభావం వచ్చినా, ఒక రకంగానే వచ్చేది. ఏ మంచివిషయాన్ని చెప్పినా ఆ నది ఇద్దరికీ ఒకే సమయంలో చెప్పేది. ఇద్దరూ మనసులో ఒకటే ప్రశ్నను ఊహించేవారు. ఆ నది ఇద్దరికీ ఒకటే జవాబు చెప్పేది. ఇద్దరూ సంతోషంతో ఒకరివైపు ఒకరు చూచుకునేవారు.

ఆ పల్లెకారులను, పడవను చూచి యాత్రికులకు ఏవేవో భావాలు కలిగేవి. ఒక యాత్రికుడు తన జీవితాన్ని గూర్చి, తన కష్టాలను గూర్చి తాను చేసిన పాపాలను వారితో చెప్పుకునేవాడు. ఒక యాత్రికుడు ఆ నదిలో ఏవో మాటలు వినిపించగా ఆరోజు అక్కడే నిలిచేవాడు. ఎవరో ఇద్దరు సిద్ధపురుషులు పడవను నడుపుకుంటూ వున్నట్టు ఆనోట ఈనోట విని కొందరు చూడవలెనన్న ఆసక్తితో వచ్చేవారు. ఏవేవో ప్రశ్నలు వేస్తూ వుండేవారు. దేనికీ జవాబు లేకపోవడం చేత ఇద్దరినీ పిచ్చివాళ్ళ క్రింద కట్టి వెళ్ళిపోయేవారు.

ఈ విధంగా ఎవ్వరూ లెక్క పెట్టకుండానే సంవత్సరాలు దొర్లి పోయినవి. ఒకనాడు కొంత మంది భిక్షుకులు ఆ నదివద్దకు వచ్చారు. నదిని దాటించమని అడిగారు. వారి వల్ల మన పల్లె కారులకు ఒక వార్త తెలిసింది. బుద్ధభగవానునికి అనారోగ్యంగా వున్నదనీ, త్వరలో ఆయన పరినిర్వాణం పొందవచ్చుననీ, ఆయనను చివరిసారి దర్శించడానికి తాము వెళ్ళుతున్నామనీ భిక్షుకులు చెప్పారు. భిక్షుకులు తండోపతండాలుగా వెళ్ళుతున్నారు.

ఆ వార్త సిద్ధార్థుని మనస్సును ఎంతో కలత పెట్టింది. అతడు బుద్ధభగవానుని దర్శించాడు. ఆయనతో సంభాషించాడు. ఆయన మార్గాన్ని అనుసరించకపోయినా వ్యతిరేకి కాడు. ఒక పరమార్థాన్ని తెలుసుకోవలెనన్న తీవ్రకాంక్ష గల జిజ్ఞాసువు ఒకరి బోధలను అనుసరించడం సాధ్యం కాదని సిద్ధార్థుని విశ్వాసం. పరమార్థాన్ని తెలుసుకున్న తరువాత అన్ని మార్గాలను, అన్ని లక్ష్యాలను ఆమోదించగలడని కూడా అతని విశ్వాసం. అనంత కాలంలో దివ్యానుభూతిని పొందిన వేలకొలది సిద్ధులకు తనకు భేదముండనేరదు.

* * *
కమల తన పూర్వజీవితాన్ని వదులుకున్నది. తోటను బౌద్ధ భిక్షుకుల ఆశ్రమం క్రింద మార్చింది. బౌద్ధ ధర్మాన్ని అవలంబించింది. బుద్ధభగవానుని గూర్చిన వార్త విని ఆయన దర్శనం కోసం బయలు దేరింది. ఆమె వెంట పసివాడు పదేళ్ళ కొడుకు వున్నాడు. బట్టలమూట నెత్తిన పెట్టుకుని ప్రక్కన పిల్లవాని నడిపించుకుంటూ కమల నది వద్దకు వచ్చింది. పిల్లవాడు అలిసిపోయినాడు. అంతవరకూ సుఖంగా బ్రతికినవాడు. కష్టాలు తెలిసినవాడు కాడు. ఒకవైపున ఆకలి, ఒకవైపున బడలిక, అన్నం పెట్టమంటాడు. ఇంటికి పోదా మంటాడు. పోరుపెట్టి ఏడుస్తున్నాడు. ”ఎవరో చస్తూ వుంటే మనం పోవడమెందుకు? చావనీ” అంటూ మొండిగా నేలమీద చతికిలపడ్డాడు. కమల ఏమి చేయగలదు! తానూ అలిసిపోయింది. పిల్లవాని చేతిలో ఒక అరటిపండు పెట్టింది. నేలమీద బట్ట పరుచుకున్నది. పండుకున్నది. పిల్లవాడు అరటిపండు వొలుచుకొని తింటున్నాడు. అంతలో కమల కెవ్వున కేక పెట్టింది. పిల్లవాడు ఉలికిపడి తల్లి వద్దకు వచ్చాడు. కమల ముఖం కళ తప్పుతున్నది. మైకం వేస్తున్నది. ఆమె పక్కక్రింద నుంచి నల్లనిపాము జరజరా పాకి పోయింది.

ఏలాగో ఆయాసపడుతూ కమల పడవ సమీపానికి వచ్చి కూలబడింది. పిల్లవాడు తల్లిని చుట్టుకొని పెద్ద పెట్టున ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు వాసుదేవునికి వినవచ్చింది. పరుగెత్తుకొని వచ్చాడు. ”మా అమ్మను పాము కరిచింది” అని పిల్లవాడు వెక్కి వెక్కి ఏడ్చాడు. వాసుదేవుడు ఆమెను చేతులలోకి తీసుకున్నాడు. తన గుడిసె దాకా మోసికొని వచ్చాడు. పిల్లవాడు కూడా పరుగెత్తుకుంటూ వచ్చాడు.

సిద్ధార్థుడు గుడిసె వాకిట నిలబడి వున్నాడు. పిల్లవానివైపు చూచాడు. ఏదో జ్ఞప్తికి తగిలింది. కమలను చూచాడు. వెంటనే గుర్తు పట్టాడు. కమలను సిద్ధార్థుని పక్కమీదనే పండుకోపెట్టారు. గాయాన్ని కడిగి ఏదో మందు వేశారు. కొంచెం తెలివి వచ్చింది. కళ్లు తెరిచి చూచింది. సిద్ధార్థుడు తనమీద వంగి చూస్తున్నాడు. కమలకు అదేదో కలగా తోచింది. అంతలో కొడుకు జ్ఞాపకం వచ్చి ”నా బిడ్డ ఎక్కడ ?” అన్నది. ”ఇక్కడే వున్నాడు ఆయాసపడకు” అన్నాడు సిద్ధార్థుడు మెల్లగా.

కమల అతని కళ్లలోకి చూచింది. ”సిద్ధార్థుడవా నీవు? ప్రియా! నీకు ముసలితనం వచ్చినా, ఆనాడు తోట ముందు నిల్చున్న శ్రమణ యువకునిలాగానే కనిపిస్తున్నావు నా కళ్లకు. నాకూ వయసు మళ్ళింది. నన్ను గుర్తుపట్టావా?” అన్నది.

”ప్రియా! కమలా! నిన్ను చూడడంతోనే గుర్తు పట్టాను.”

”సిద్ధార్థా! అడుగో పిల్లవాడు. వాడు నీ కొడుకు.”

సిద్ధార్థుడు కళ్లుతిప్పి చూచాడు. మళ్లీ మూసు కున్నాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. సిద్ధార్థుడు దగ్గరకు తీసుకొని ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. ఏవో శ్లోకాలు చదివాడు. పిల్లవాడు ఏడుపు చాలించి తండ్రి ఒడిలోనే నిద్రపోయినాడు. తిన్నగా ఎత్తుకొని వాసుదేవుని పక్కమీద పండుకోపెట్టాడు. వాసుదేవుడు ఏదో సవరించుకుంటున్నాడు. సిద్ధార్థుడు అతనివైపు చూచాడు. వాసుదేవుడు చిరునవ్వు నవ్వాడు.

”అయిపోతున్నది” అన్నాడు సిద్ధార్థుడు.

వాసుదేవుడు తల ఆడించాడు ”అవును” అన్నట్టు. అతని ముఖంలో కరుణ తొణుకుతూ వున్నది ఒక వెలుగుతో కూడా.

కమలకు మళ్ళా స్మృతి వచ్చింది. సిద్ధార్థుని వైపు చూచింది. ”నీకు సిద్ధి కలిగిందా? శాంతి లభించిందా?” అన్నది. సిద్ధార్థుడు ఆమె చేతిలో చేయిపెట్టి మెల్లగా నవ్వాడు. ”అవును నీకు లభించింది. నాకు కూడా లభిస్తుంది” అన్నది కమల. ”నీకు లభించింది” అన్నాడు సిద్ధార్థుడు కమల చెవిదగ్గరకు వంగి.

బుద్ధభగవానుని దర్శించి శాంతిపొందవలెనని బయలుదేరి వచ్చింది కమల. ఆయనకు బదులుగా సిద్ధార్థుని చూచింది. ఆ ఇద్దరిలో ఎవరిని చూచినా మంచిదే. అతనితో ఏమో చెప్పవలెననుకున్నది. కాని, మాట పెగలలేదు. అతనివైపు మళ్లా చూచింది. కొద్ది మరణ వేదన, కొద్దిగా కంపం. సిద్ధార్థుడు తన చేతులతో కమల కళ్లు మూశాడు.

ఆ శవాన్ని చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు. అతనికి అప్పటి ముఖం; ఆ పెదవులు, ఆ రూపం స్మృతికి వచ్చినవి. ఇప్పటి శవాకారాన్ని చూస్తున్నాడు. ”ఏదీ నశించేది కాదు. ఆ క్షణంలో అది సత్యమే” అనుకున్నాడు.

అన్నం సిద్ధంగా వున్నది. కాని సిద్ధార్థుడు తినలేదు. ఇద్దరూ బైట వసారాలో పండుకున్నారు. సిద్ధార్థునికి నిద్ర పట్టలేదు. లేచిపోయి నది వొడ్డున కూర్చున్నాడు. నది కబురులను వింటూ కూర్చు న్నాడు. మధ్యమధ్య తిరిగి వచ్చి పిల్లవాడు లేచాడేమో చూస్తున్నాడు.

తెల్లవారింది. సూర్యోదయమైంది. వాసుదేవుడు అడిగాడు : ”నీవు నిద్రపోలేదనుకుంటాను” అని. ”లేదు, నది వద్ద కూర్చున్నాను. నది ఎంతో చెప్పింది. చివరకు అంతా ఒకటే అని చెప్పింది” అన్నాడు సిద్ధార్థుడు.

”సిద్ధార్థా! నీవు చాలా బాధలు పడ్డావు. కాని నీ హృదయాన్ని దుఃఖం స్పృశించలేదు.”

”మిత్రమా! నాకు దుఃఖం ఎందుకు? ఒకనాడు నేను శ్రీమంతుడను. ఈనాడు అంతకంటే శ్రీమంతుడను. నా కొడుకు దక్కాడు నాకు.”

”మంచిది! ఆ కొండమీదనే నా భార్యకు చితిని పేర్చాను. ఆ కొండమీదనే కమలకు చితిని పేర్చుదాము.”

పిల్లవాడు నిద్రలో వున్నాడు. ఇద్దరూ వెళ్లి కొండ మీద కమలకు చితిని పేర్చారు.

(ఇంకా ఉంది)

మూలం: హర్మన్‌ హెస్‌

తెలుగు అనువాదం: బెల్లంకొండ రాఘవరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *