సిద్ధార్థ-6

సిద్ధార్థ-6

కమల ఆ మాటలకు విరగబడి నవ్వుతూ అన్నది –

నా అనుభవంలో ఇంతవరకు ఒక శ్రమణుడు నా వద్ద శుశ్రూష చేస్తానంటూ రాలేదు. జడలు పెంచుకొని, కావిగుడ్డలు కట్టుకునే శ్రమణులు నా వద్దకు ఎన్నడూ రారు. పెక్కుమంది యువకులు – బ్రాహ్మణ యువకులు కూడా – నా వద్దకు వస్తారు. కాని వారు అందమైన దుస్తులతో, సుగంధాలు విరజిమ్ముతూ సంచులలో ద్రవ్యాన్ని నింపుకొని నా వద్దకు వస్తారు.”

”కమలా ! నీ వద్ద శుశ్రూషను ఇదివరకే ప్రారంభించాను. నిన్ననే కొంత నేర్చుకున్నాను. నిన్న నీవు చూచినదాడి ఈనాడు లేడు. నా కేశాలలో దుమ్ము వదిలింది. సుగంధ తైలం రాచి దువ్వుకున్నాను. ఇక కావలసినది అందమైన వేషము, ద్రవ్యము. సిద్ధార్థుడు ఎన్నో దుర్ఘట కార్యాలను సాధించాడు. ఈ అల్ప వస్తువులను సంపాదించుకో నేరడా ? కమలా! ఈ రెంటిని సంపాదించుకునే వరకు సిద్ధార్థుడు నీ శుశ్రూషకు అర్హుడు కాడా?”

”కాడు! చక్కని వేషము, సంచిలో రొక్కము, కమలకు బహుమానములు, ఇవి తప్పవు. అడవినుంచి దిగి వచ్చిన శ్రమణుడా! అర్థమైందా?”

”బాగా అర్థమైంది. ఆ పెదవులనుంచి వచ్చిన మాటలు అర్థం కాకపోవడమేమిటి? కమలా ! నీ పెదువులు రెండుగా చీలిన దొండపండులాగా ఉన్నవి. నా పెదవులు కూడా ఆలాగే ఉన్నవికదూ! నీ పెదవులకు నా పెదవులకు బాగా పొందిక కుదురుతుంది. కాని, కమలా ! శ్రమణుడంటే నీకు భయం లేదా?”

”ఆడదానిని గూర్చి ఓనమాలు తెలియని శ్రమణుని చూస్తే భయమెందుకోయి?”

”కమలా! శ్రమణుని మహిమను ఏమనుకున్నావూ? నిన్ను బలవంతంగా లోబర్చుకోగలడు. నిన్ను దోచగలడు. నిన్ను బాధించగలడు.”

”అలాగా ! నాకు ఆ భయం లేదు. ఒక శ్రమణునికి గాని, ఒక బ్రాహ్మణునికి గాని తన విజ్ఞానాన్ని, తన ధర్మ నిష్ఠను, తన ధీశక్తిని ఎవ్వరైనా బాధించి బలవంతంగా దోచుకుంటారనే భయం వుంటుందా? వుండదు. ఎందుకని? అవి అతనికి సంబంధించినవి. అతని వశంలో ఉన్నవి. అందులో తనకు ఇష్టమైనది, ఇష్టమైనంత ఇతరులకు ఇవ్వగలడు. ఆలాగే కామవిద్యలో కమల కూడాను. కమల పెదవులు దొండపండులాగా ఉన్నవి కదూ ! కమల ఇష్టం లేకుండా వాటిని ముద్దుపెట్టుకొని చూడు! వాటిలో నీకు ఒక్క మధుకణం కూడా లభించదు. ఆ తీయదనాన్ని ఏలా ఈయవలెనో ఆ పెదవులకే తెలుసు. ఇవ్వడంగాని ఇవ్వకపోవడంగాని ఆ పెదవులవశంలో ఉంటుంది. సిద్ధార్థా! నీవు మంచి శిష్యుడవు. కాబట్టి ఈ రహస్యం గ్రహించు. ప్రేమను ఆశ్రయించి మంచి పొందగలవు. ధనమిచ్చి పొందగలవు. ఇష్టపడి ఇస్తే తీసుకోగలవు. కాని ప్రేమను దొంగిలించలేవు. యువకుడా! నీవు ప్రేమను అపార్థం చేసుకున్నావు.”

”కమలా ! నీవు చెప్పింది అక్షరాలా నిజం. నీ పెదవులనుంచి కాని నా పెదవుల నుంచి కాని ఒక్క మధుబిందువైనా వృథాగా పోకూడదు. సిద్ధార్థుడు మంచి వేషంతో సంచినిండా రొక్కంతో తిరిగి నీ దర్శనం చేస్తాడు. కాని, కమలా ! నాకు కొంచెం సలహా చెప్పగలవా?”

”అలాగే”

”కమలా ! ఈ రెండు వస్తువులను త్వరగా సంపాదించే సాధనమేమిటి?”

”మిత్రుడా! ఈ సాధనం తెలుసుకొనలేనని చాలా మందికి ఉంటుంది – కాని నీకు ఏ వృత్తిలో ప్రజ్ఞ ఉంటే దానిద్వారా ధనం సంపాదించుకోవలె. ఇంకొక మార్గం లేదు.”

”నేను ఆలోచించగలను – వేచి ఉండగలను – పస్తులుండ గలను.”

”అంతేనా ? ఇంకేమి చేతగాదా?”

”అంతే – ఆఁ – కవిత్వం చెప్పగలను. కమలా ! ఒక పద్యానికి ఒక్క ముద్దు ఇవ్వగలవా?”

”నీ పద్యం నాకు నచ్చితే ఆలాగే – ఏదీ చెప్పు.”

ఒక క్షణకాలం ఆలోచించి సిద్ధార్థుడు ఈ పద్యం చదివాడు –

”కమలాసుందరి తనతోటలోకి వెళ్ళింది,

తోట వెలుపల నిలబడి వున్నాడు శ్రమణుడు.

తామర పూవును చూచి శ్రమణుడు,

వినయంతో తలవంచాడు-

చిరునవ్వుతో ఆమోదించింది కమల”,-

”ఎవరో దేవతల కెందుకు పూజలు

ఎదుట ఉండగా సుందరి కమల,

కమలకు చేసిన పూజ మేలని,

తలచాడు, ఆ శ్రమణకుమారుడు.”

చేతుల బంగారు గాజులు గలగల మనేట్టు కమల కరతాళధ్వని చేసింది. ”నీ కవిత్వం చాలా బాగున్నది. ఈ పద్యానికి ఒక్క ముద్దు ఈయవచ్చు.”

కమల కనుచూపులతో అతనిని చేరపిలిచింది. అతను కమల మొగం దగ్గర మొగం పెట్టాడు. ఆమె పెదవులమీద తన పెదవులు ఆనించాడు. కమల గాఢంగా ముద్దుపెట్టుకున్నది. ఆ ముద్దులో ఆమె ఎంత బోధించిందో, ఎంత చాకచక్యం చూపిందో, తనను ఎంత లోబర్చుకొన్నదో, ఎంత లాలించిందో, సిద్ధార్థుడు తలుచుకొని ఆశ్చర్యపడుతున్నాడు. ఆ సుదీర్ఘ చుంబనం – తరువాత – చుంబన పరంపర. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రుచి. సిద్ధార్థునికి ఊపిరి సలపలేదు. తన కళ్ళముందు ఉన్మీలనమయ్యే ప్రజ్ఞావిశేషానికి ఒక పసిబిడ్డలాగా విస్తుపోయి చూస్తున్నాడు.

”నీ కవిత్వం చాలా బాగుంది. కాని కవిత్వంతో ధనాన్ని సంపాదించడం సాధ్యపడదు, నీకు కమల స్నేహం కావాలె నంటే ధనం సంపాదించక తప్పదు.” అన్నది కమల.

”కమలా ! నీ ముద్దులో ఎంత ప్రజ్ఞ చూపావు!”

”అవును – అందుకే ఈ వైభవమంతా నాకు లభించింది. అయితే నీవు ఏమి చేయదలచావు? ఆలోచనలు, పస్తులు, కవిత్వాలు – ఇంతకంటే నీకు ఏమీ చేత కాదా?”

”నాకు యాజ్ఞికం తెలుసును. కాని అది వదిలి పెట్టాను. నాకు ప్రయోగాలు చేయడం కూడా తెలుసును. అదీ మానుకున్నాను. మతగ్రంథాలు చదివాను.”

”చదవడం, వ్రాయడం తెలుసునా?”

”దాని కేమి ! – చదవడం వ్రాయడం ఎంతమందికో తెలుసు.”

”ఎంతమందికి తెలుసు? నాకు రాదు. అవి తెలియడం మంచిదే. మంత్రప్రయోగాల అవసరం కూడా వుంటుంది.”

ఆ సమయంలో ఒక నౌకరు వచ్చి కమలతో ఏమో రహస్యంగా చెప్పాడు.

”నా కోసం ఎవరో వచ్చారు. సిద్ధార్థా ! నీవిక్కడ ఉండగూడదు. నిన్నెవ్వరు చూడగూడదు. రేపు కలుసుకుందాం. వెళ్లు.” అన్నది కమల. ఒక నౌకరును పిలిచి సిద్ధార్థునికి తెల్లని వస్త్రాలిచ్చి బైటికిపోవడానికి దారి చూపమని చెప్పింది. ఆ నౌకరు సిద్ధార్థుని చుట్టుదారిని ఒక మందిరంలోకి తీసుకొని వెళ్ళి తెల్లని వస్త్రాలిచ్చి బైటికి పంపాడు.

సిద్ధార్థుడు నగరంలోకి వచ్చాడు. ఒక సత్రం ముందు నిలబడి అన్నం పెట్టమని అడిగాడు. ఎవరో అన్నం తెచ్చి అతని ఒడిలో వేశారు. రేపటినుంచి భిక్షాటనం మానుకోవలెననుకొన్నాడు. అంతలో అతనికి అభిమానం వేసింది. తానిప్పుడు శ్రమణుడు కాడు. అడుక్కోవడం తనకు తగిన పని కాదు. అన్నం ఒక కుక్కకు వేశాడు. ఆ రోజుకు పస్తు పండు కొన్నాడు. ”ఈ బ్రతుకే బాగున్నది. శ్రమణుని జీవితంలో అంతా కష్టమే. అంత్యానికి నిరాశ కూడా, ఇంతకూ నాకు కావలసినవి – వేషము, ద్రవ్యము. వీటి కోసం నిద్రాహారాలు మానుకోనక్కరలేదు” అనుకున్నాడు.

నగరంలో కమలభవనం ఎక్కడో విచారించి మరుసటిరోజు వెళ్లాడు. అతనిని చూడగానే కమల అన్నది ”అంతా అనుకూలంగానే ఉన్నది. ఈ నగరంలోని షాహుకారులలో ముఖ్యుడు కామస్వామి. చాలా ధనవంతుడు. అతడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు వెళ్లి అతనిని చూడు. అతనికి నచ్చితే నిన్ను పనిలో చేర్చుకుంటాడు. తెలివితో ప్రవర్తించు. ఒకరిద్వారా నీ పేరు అతనికి శిఫారసు చేయించాను. అతనితో స్నేహంగా మెలగవలె. అతనిమాట ఎంతైనా చెల్లుబడి అవుతుంది. కాని అతి వినయంగా వుండబోకు. నీవు అతనికి సేవకుడుగా ప్రవర్తించ గూడదు. సమానంగా ప్రవర్తించవలే. అలా ఉంటేనే నాకు సంతోషం. కామస్వామి పెద్దవాడు అవుతున్నాడు. మాంద్యం ప్రబలింది. అతనికి నచ్చేటట్టు మెలగితే నీ మీద పూర్తి నమ్మకం వుంచుతాడు.”

సిద్ధార్థుని ముఖం వికసించింది. కమలకు కృతజ్ఞత తెలుపుకున్నాడు. ముందురోజు ఆ రోజు సిద్ధార్థుడు పస్తు వుండినట్టు కమల గ్రహించింది. వ్యంజనాలతో సహా అన్నం తెప్పించింది. స్వయంగా వడ్డించింది. సిద్ధార్థుడు తృప్తిగా తిన్నాడు.

”నీకు మంచి అదృష్టం పట్టింది. ఒక ద్వారం తరువాత ఒక ద్వారం తెరుచుకుంటున్నవి నీ ముందు. నీ దగ్గర ఏదైనా మంత్రౌషధి ఉన్నదా?” అన్నది కమల.

”ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసం వీటిని గూర్చి నిన్న నీకు చెప్పాను. అవి ప్రయోజనకరములని నీవు నమ్మలేదు. కమలా ! ముందుముందు నీకే నమ్మకం కలుగుతుంది. పనికిమాలిన శ్రమణునికి కూడా ఉపయోగకరములైన విషయాలు చాలా తెలుసునని నీవే గ్రహిస్తావు. మొన్న నేనొక బికారిని. నిన్న కమలను ముద్దు పెట్టుకున్నాను. నేడో రేపో షాహుకారిని కాబోతున్నాను. ద్రవ్యమే కాదు. నీవు కోరే అన్ని హంగులు లభిస్తవి.”

”సరే! కమల లేకపోతే నీ పని ఏమైవుండేది? కమల సాయపడకుంటే నీవు ఎక్కడ ఉండేవాడవు?”

”కమలా! నీ తోటముందు నిన్ను చూచిన క్షణంలోనే నేను ప్రథమ ఘట్టంలో అడుగు పెట్టాను. పరమసుందరిని ఆశ్రయించి ప్రణయవిద్యను గడించవలెనని నా సంకల్పం. ఆ సంకల్పం కలిగినప్పుడే నాకు తెలుసును. దానిని సాధించగలనని. నీవు సాయపడుతావని నాకు తెలుసును, నీ ప్రథమ వీక్షణంలోనే ఆ సంగతి నేను గ్రహించాను. ”

”నేను ఇష్టపడక పోతే ?”

”కాని ఇష్టపడ్డావు. కమలా ! నీటిలో రాయివేస్తే అది సూటిగా అడుగుకు పోతుంది. సిద్ధార్థునికి ఒక సంకల్పం ఒక లక్ష్యం ఏర్పడినప్పుడు కూడా అంతే- సిద్ధార్థుడు ఏమీ చేయడు. ఆలోచిస్తాడు. ప్రతీక్షిస్తాడు. ఉపవసిస్తాడు. నీటిలోకి ఆ రాయి పోయినట్టే లౌకిక వ్యవహారంలో సిద్ధార్థుడు ఏమీ చేయకుండా, క్షోభపడకుండా తన్ను తాను వదిలి వేస్తాడు. ఏదో లోపలికి లాక్కుపోతుంది. అతని లక్ష్యమే అతనిని లాగుతుంది. ఆ లక్ష్యానికి ప్రతికూలమైన ఏ భావాన్నీ మనసులోనికి రానీయడు. అదే సిద్ధార్థుడు శ్రమణుల వద్ద నేర్చినవిద్య. దానినే అవివేకులు ఇంద్రజాల మనుకుంటారు. దయ్యాలు భూతాలు అనుకుంటారు. దయ్యాలు భూతాలు ఎక్కడా లేవు. ప్రతివాడు ఇంద్రజాలం చేయవచ్చు, తన లక్ష్యాన్ని సాధించ వచ్చు. కాని, ఆలోచన- ప్రతీక్షణ- ఉపవాసం చేయగలిగి ఉండాలి.”

కమల అతని మాటలు విన్నది. అతని కంఠ స్వరమూ, అతని చూపులు కమలను ఆకర్షించినవి.

”నీవు చెప్పినదంతా నిజమే కావచ్చును. సిద్ధార్థుడు అందకాడు కావడం, ఆతని చూపు స్త్రీలకు ఆకర్షణీయం కావడం అతని అదృష్టమేమో!?” అన్నది కమల.

సిద్ధార్థుడు కమలను ముద్దు పెట్టుకున్నాడు. ”ఓ గురుదేవీ ! ఆలాగే కావచ్చును. నా చూపులు ఎల్లప్పుడూ నిన్ను సంతోషపెట్టునుగాక ! నీ ద్వారా ఎల్లప్పుడూ నాకు శుభం కలుగును గాక !” అంటూ సిద్ధార్థుడు వెళ్లాడు.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *