సిద్ధార్థ -5

సిద్ధార్థ -5

రెండవ భాగం

1.కమల

సిద్ధార్థునికి ప్రపంచమంతా మారురూపం పొందింది. అతడు ప్రపంచానికి అంత వశమై పోయినాడు. అడుగుతీసి అడుగు పెడితే అతనికి ఒక క్రొత్త సొగసు గోచరిస్తున్నది. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశాన నక్షత్రాలు, చిన్ని పడవలాగా తేలిపోతున్న నెలవంక, మబ్బులు, అడవిలో తీగెలు, పొదలు, పూలు, సెలయేరు, ఉదయాన చెట్ల ఆకులపై తళతళలాడే మంచు చుక్కలు, దూరాని కగుపించే కొండలు, పక్షుల కలకలారావాలు, తుమ్మెదల రొదలు, చేలమీదుగా మెల్లగా విచే గాలులు, ఇంకా వేర్వేరు రంగులతో వేర్వేరు రూపాలలో కనిపించే ఎన్నెన్నో దృశ్యాలు, ఇవన్నీ అంతకుముందు ఉండినవే. క్రొత్తగా వచ్చింది ఒకటీ లేదు.

అంతకుముందు ఆ దృశ్యాలన్నీ సిద్ధార్థుని కన్నులకు సత్యాన్ని కప్పివేసిన మాయముసుగులు. అవి గమనించతగినవి కావు. వాటిని గూర్చి ఆలోచించరాదు. దృశ్యమంతా అసత్యం – దృశ్యానికి అవతల ఉన్నది సత్యం. ఇప్పుడు సిద్ధార్థుని కన్నులు ప్రపంచాన్ని రక్తితో చూస్తున్నవి. ఈ ప్రపంచ స్వరూపాన్ని – దీనిలో తన స్థితినీ సిద్ధార్థుడు గ్రహించగలిగాడు. అతడు సత్యం కోసం ఎక్కడో అన్వేషించడం లేదు. అతని లక్ష్యం ఎక్కడో అవతలవైపున లేదు. ఈ దృష్టితో చూచినప్పుడు ప్రపంచమంతా అందంగానే కనిపిస్తున్నది. ఆ చూపులో ఆన్వేషణ లేదు. అది సహజమైన చూపు. పసిబిడ్డచూపు వంటిది. అలా పసిబిడ్డలాగా, అవిశ్వాసం లేకుండా, ఉన్న దానిని ఉన్నట్టుగా సద్యఃస్థితిని గ్రహించే అతని చూపుకు అంతా అందంగాను, ఆనందప్రదంగాను గోచరిస్తున్నది.

ఆ పకృతివిలాసమంతా ఎప్పుడూ అలాగే ఉన్నది. కాని ఆ విధంగా ఎన్నడూ అతనికి గోచరించలేదు. ఇదివరకు అతడు అక్కడ లేడు- ఇప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ ప్రకృతికి సంబంధించి ఉన్నాడు – తన కళ్లతో వెలుగు నీడలను చూస్తున్నాడు. మనస్సుతో, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను అర్థం చేసుకుంటున్నాడు.

జేతవనంలో పొందిన అనుభవాన్ని; బుద్ధుని ప్రవచనాలనూ; ఆయనతో తాను చేసిన సంభాషణనూ; గోవిందునితో వీడుకోలునూ అన్ని సంగతులు సిద్ధార్థుడు స్మరించుకున్నాడు – బుద్ధుడు పొందిన జ్ఞానానుభవమూ అందలి రహస్యమూ మాటలలో చెప్పడానికి బోధించడానికి సాధ్యమయ్యేది కాదని ఆయనతో తాను అన్న సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఆ రహస్యం ఈనాడు తనకు అనుభవంలోకి వస్తున్నది. అప్పుడు ఏమీ తెలియని స్థితిలో ఆలా మాట్లాడడం అతనికి ఆశ్చర్యంగా తోచింది.

తన అనుభవాన్ని తానే సంపాదించుకోవలెను. చాలా కాలం సిద్ధార్థుడు, తానూ – అంటే జీవుడు – పరమాత్మ ఒక్కటే అనుకుంటూ వచ్చాడు. కాని తానంటే ఎవరో అతనికి తెలిసింది కాదు. ఆలోచనలతో వలవేసి, ఆ జీవపదార్థాన్ని పట్టుకోడానికి ప్రయత్నించాడు – నిజానికి ఈ దేహం, ఇంద్రియాలు, సంకల్ప వికల్పాలు, జ్ఞాన విజ్ఞానాలు, ఇవేవీ తాను – అంటే జీవుడు కాడు. ఇంతకు ముందు ఉండిన ఆలోచనలను ఆశ్రయించి కొత్త ఆలోచనలను కల్పించుకొంటూ తద్వారా అసలు వస్తువును తెలుసుకోడానికి ప్రయత్నించాడు. ఆలోచన ఈవలిగట్టును స్పృశిస్తుంది; కాని, ఆవలిగట్టును స్పృశించదు.

తన పాండిత్యంతోనూ ఆలోచనతోనూ అహంతను పోషిస్తూ దానిని చంపపూనుకున్న వానికి లక్ష్యం గోచరించదు. మనస్సు ఇంద్రియాలు గొప్పవే. కాని, వాటి వెనుక దాక్కొని ఉన్నది చరమ పదార్థం. మన ఇంద్రియాలను గమనించవలె. వాటితోనే వ్యవ హరించవలె. వాటిని గర్హించగూడదు. వాటికి తగని విలువను కూడా ఈయగూడదు. కాని వాటి ప్రవృత్తులను జాగ్రత్తగా గమనించవలె. కాగా, అంతర్వాణి ఏలా ప్రబోధిస్తే అలా ప్రవర్తించవలెనని తేల్చుకొన్నాడు. అంతర్వాణి ప్రబోధనను తప్ప మిగతా దేనిని లక్ష్యపెట్ట గూడదనుకొన్నాడు సిద్ధార్థుడు.

బుద్ధత్వం కలిగిననాడు గౌతముడు బోధివృక్షం క్రింద ఎందుకు కూర్చున్నాడు? ఆయనకు హృదయకుహరంలో నుంచి ఒకవాణి వినిపించింది. ఆ వృక్షం క్రింద కూర్చోమని ఆ వాణి ప్రబోధించింది. ఆ క్షణంలో స్నానసంధ్యలను, యమనియమాలను, ఆహార నిద్రలను పట్టుకొని కూర్చోలేదు. ఆ వాణికి తలవొగ్గాడు. అలాగే బాహిర ప్రబోధనను దేనిని లక్ష్యపెట్టకుండా అంతర్వాణికి తలవొగ్గడమే కర్తవ్యంగా నిర్ణయించుకున్నాడు సిద్ధార్థుడు.

ఆ రాత్రి సిద్ధార్థుడు ఒక పల్లెకారిగుడిసెలో పండుకున్నాడు. అతనికి ఒక స్వప్నం వచ్చింది. అందులో గోవిందుడు కనిపించాడు. కాషాయవస్త్రం కట్టుకున్నాడు. ”నన్ను ఎందుకు విడిచి వచ్చావు ?” అని అడిగాడు గోవిందుడు. సిద్ధార్థుడు గోవిందుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు పెట్టుకోబో యినాడు. అంతలో గోవిందుడు మాయమైనాడు. తన కౌగిటిలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె పాలిండ్లు పైటలోనుంచి తొంగిచూస్తున్నవి. సిద్ధార్థుడు వాటిమీద తల ఆనించి స్తన్యపానం చేశాడు. ఆ స్తన్యం మధురాతిమధురంగా ఉన్నది. స్త్రీ పురుషుడు సూర్యుడు చంద్రుడు అడవి జంతువు పూవు పండు అన్నింటివల్ల కలిగే ఆనందం అంతా ఆ స్తన్యంలో రుచిచూచాడు. ‘నిషా’ కలిగించేదిగా ఉన్నది ఆ రుచి. సిద్ధార్థుడు మేల్కొన్నాడు. గుడిసె ముందుగా తళతళలాడుతూ ప్రవహిస్తున్నది నది. అడవిలో గుడ్లగూబ అరుపు స్పష్టంగా మోగుతున్నట్టు వినిపిస్తున్నది.

ప్రొద్దుపొడిచింది. నదిని దాటించమని సిద్ధార్థుడు పల్లెకారిని అడిగాడు. పల్లెకారి అతనిని వెదురు దోనెలో ఎక్కించి దాటించాడు. ఉదయకిరణాలు పడి నది మెరుస్తున్నది.

‘ఎంత అందంగా ఉన్నది ఈ నది’ అన్నాడు సిద్ధార్థుడు. ‘నిజమే – ఇది చాలా అందమైన నది. ఈ నదిమీద నాకు మహాప్రేమ. ఈ నది నాతో మాట్లాడుతుంది. ఎన్నిసారులో విన్నాను దాని మాటలు. దానివైపే చూస్తూ కూచుంటాను. ఈ నది వల్ల నాకు ఎప్పుడూ ఏదో సంగతి తెలుస్తూ వుంటుంది. నది వల్ల కూడా చాలా నేర్చుకోవచ్చు’ అన్నాడు పల్లెకారి.

‘ఓయీ! నీకు కృతజ్ఞుడను. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు. నేను బ్రాహ్మణశమణుడను.’

‘అది తెలుస్తూనే ఉన్నది. నీ వల్ల ప్రతిఫలం నేను అపేక్షించడం లేదు. నీవే ఎప్పుడో ఒకప్పుడు ఇస్తావు.’

‘ఆలాగా!’

‘తప్పకుండా. ఆ సంగతికూడా ఈ నదీ వల్లనే తెలుసుకున్నాను. ప్రతిదీ తిరిగివస్తుంది. నీవు కూడా తిరిగివస్తావు-నీ స్నేహమే నాకు బహుమానం. నీవు దేవతలను గూర్చి యజ్ఞాలు చేసేటప్పుడు నా సంగతి జ్ఞాపకం తెచ్చుకో.’

ఇద్దరూ విడిపోయినారు. పల్లెకారి చూపిన స్నేహ భావానికి సిద్ధార్థుడు సంతోషించాడు. ఎవరిని చూచినా అతనికి గోవిందుని లాగానే కనబడు తున్నారు. ప్రతివానిలోనూ స్నేహము, ఉపకారబుద్ధి, కృతజ్ఞత కనిపిస్తున్నవి. ప్రతిమనిషిలో ఒక పసిబిడ్డ వుంటాడు కాబోలు ననుకున్నాడు.

మధ్యాహ్నం అయ్యేసరికి ఒక పల్లె చేరుకున్నాడు. వీధిలో పిల్లలు గోలీలు ఆడుకుంటున్నారు. అతనిని చూడగానే భయం వేసి, పరుగెత్తిపోయినారు. ఆ పల్లె ప్రక్కన ఒక కాలువ పారుతున్నది. దానిలో ఒక పల్లెపడుచు గుడ్డలు ఉతుక్కుంటున్నది. సిద్ధార్థుడు నిలవబడ్డాడు. ఆ పడుచుపిల్ల తలయెత్తి చూచింది- చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్లలో ఒక తళుకు కనిపించింది అతనికి. ‘పట్టణానికి ఇంకా ఎంత దూరం ఉంటుంది, అమ్మాయి?’ అని అడిగాడు. ఆమె లేచి అతని సమీపానికి వచ్చింది. ఆ లేత ముఖంలో తడి పెదవులు ఆకర్షణీయంగా ఉన్నవి. ఆమె ఏదో ఛలోక్తిగా, పలకరించింది- ‘బువ్వ తిన్నావా? శ్రమణులు రాత్రిళ్లు అడవులలో ఒంటరిగా నిద్రపోతారుకదూ? అప్పుడు ఆడవాళ్లు ప్రక్కన ఉండకూడదంటారు. నిజమేనా!’ అని అడిగింది. ఈలా ప్రసంగిస్తూ ఏదో వింతసైగ చేసింది. అంటే ఆడది మగవాని మీద మనసుపోయినప్పుడు చేసే సైగ వంటిది.

అతనిలో రక్తానికి వెచ్చదనం కలిగింది. తన స్వప్నం జ్ఞప్తికి వచ్చింది. ఆమె వైపు కొంచెం వంగి స్తనచూచుకాలను చుంబించాడు. వెంటనే తలయెత్తి చూశాడు. ఆమె ముఖంలో చిరునవ్వు తాండవిస్తున్నది. అర మూతకన్నులు అభిలాషతో ఆహ్వానిస్తున్నవి. సిద్ధార్థుని హృదయంలో కామస్పందం కలిగింది. ఇంతవరకు అతడు స్త్రీని స్పృశించి యెరగడు. ఆమెను కౌగిలిలోనికి లాక్కోడానికి చేతులు సిద్ధపడినా అతనికి జంకు కలిగింది. అంతర్వాణి ‘వద్దు’ అన్నట్టుగా వినిపించింది. ఆ శబ్దం వినిపించగానే ఆ ముఖం లోనూ ఆ కళ్లలోనూ అదివరకు చూచిన ఇంద్రజాల మంతా విచ్చిపోయింది. ఒక కాముక స్త్రీ మాత్రమే కనిపించింది అతని కళ్ళకు. ఆమెను భగ్నహృదయగా విడిచి సిద్ధార్థుడు వెళ్లిపోయినాడు.

ఆనాడు సాయంవేళకు ఒక నగరం చేరుకున్నాడు. ఆ నగరం వెలుపల ఒక తోట ఉన్నది. ఆ తోటలోకి కొందరు నౌకరులు బరువైన తట్టలు మోసుకొని వెళ్లుతున్నారు. మధ్య నలుగురు మనుష్యులు ఒక పల్లకిని మోస్తున్నారు. ఆ పల్లకిలో ఒక స్త్రీ పట్టుపరుపుమీద కూర్చొని ఉన్నది. ఆమె ఆ తోట యజమానురాలు. ఆ పల్లకిలోని స్త్రీని చూస్తూ సిద్ధార్థుడు నిలబడ్డాడు. నిగనిగలాడే కేశభారం, అతి మధురమైన వదనం, బింబఫలం వంటి పెదవులు, విలువంపు కనుబొమలు, నీడలుకట్టే కన్నులు, నునుపైన మెడ, ధరించిన పసరువన్నె బంగారంచు చీర, తామర తూడులవంటి చేతులు, మణికట్టులకు బంగారు గాజులు- ఆ విగ్రహం సిద్ధార్థుని కళ్లను మిరుమిట్లు గొలిపింది.

పల్లకి తన ప్రక్కకు రాగానే సిద్ధార్థుడు గౌరవ సూచకంగా తల వంచుకున్నాడు. తలయెత్తి ఒక క్షణ కాలం ఆమె ముఖాన్ని చూచాడు. ఏదో సుగంధం అతని ఘ్రాణేంద్రియానికి సోకింది. ఆ స్త్రీ, అతనివైపు చూచి ఆమోదసూచకంగా తలవూపి ఒక్క- చిరునవ్వు నవ్వింది. అంతలో పల్లకి తోటలోకి పోయింది.

ఈ నగరానికి మంచి నక్షత్రంలో వచ్చాను అనుకున్నాడు సిద్ధార్థుడు. ఆ తోటలోకి వెంటనే పోవలెననిపించింది. మళ్లా ఆలోచించాడు. ఆ సేవకులు తనవైపు అసహ్యంగా చూచిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఈ శ్రమణ వేషంతో పోగూడద నుకున్నాడు. ఎవరినో అడిగి సుప్రసిద్ధ వేశ్య కమలది ఆ తోట అని తెలుసుకున్నాడు. ఆ తోట గాక ఆమెకు నగరంలో వేరొక భవనం కూడా ఉన్నట్టు తెలిసింది.

సిద్ధార్థుడు నగరంలోకి వెళ్లాడు. వీధులలో తిరిగాడు. ఒక మంగలితో పరిచయం చేసుకున్నాడు. తెల్లవారగానే తనకు ముందుగా క్షురకర్మ చేయవలెనని చెప్పాడు. నది ఒడ్డున ఒక పడవమీద పండుకొని ఆ రాత్రి గడిపాడు. సూర్యోదయం కాక ముందే మంగలివద్దకు వెళ్లి గడ్డాన్ని, తీసి వేయించుకున్నాడు. శిరోజాలు చిక్కు తీయించు కున్నాడు. సుగంధ తైలంం రాయించుకున్నాడు. నదికి వెళ్ళి చక్కగా స్నానం చేశాడు.

ఆరోజు మధ్యాహ్నం కమల తోటకు వచ్చే వేళకు వాకిట హాజరుగా నిల్చున్నాడు. అంతలో పల్లకి వచ్చింది. నిన్న లాగానే గౌరవసూచకంగా తల వంచాడు. ఆమోదసూచకంగా ఆమె కూడా తల వూపింది. వెనక చిక్కిన ఒక నౌకరును పిలిచాడు. ఒక బ్రాహ్మణయువకుడు మీతో మాట్లాడడానికి వచ్చి కాచుకొని ఉన్నాడు. లోపలికి రావచ్చునా అని మీ యజమానురాలిని కనుక్కురమ్మని పంపాడు. ఆ నౌకరు తిరిగివచ్చి సిద్ధార్థుని లోపలికి పిలుచుకొని వెళ్లాడు. అక్కడ కమల మదుతల్పంమీద పండుకొని ఉన్నది. అతనిని ప్రవేశపెట్టి శలవు తీసుకొని నౌకరు బైటికి వెళ్ళాడు.

‘నిన్న బైట నిలబడి నాకు వందనం చేశావుకదూ’ అని అడిగింది కమల.

‘అవును నిన్న చూచాను. వందనం చేశాను.’

‘కాని నీకు గడ్డం ఉన్నది కాదూ? నీ దీర్ఘ కేశాల నిండా దుమ్ము కమ్ముకొని ఉన్నట్టు జ్ఞాపకం.’

”అదికూడా నిజమే. నీవు సిద్ధార్థుని చూచావు. అతడు ఒక బ్రాహ్మణ కుమారుడు. శ్రమణులలో చేరవలెనని ఇల్లు వదలి వెళ్లాడు. మూడు సంవత్సరాలు శ్రమణుడుగా ఉన్నాడు. ఆ మార్గాన్ని వదిలిపెట్టి, నిన్న ఈ నగరం చేరుకున్నాడు. ఈ నగరంలో అతడు మొట్టమొదట చూచింది నిన్నే. సిద్ధార్థుడు రెప్పలు వాల్చకుండా మాట్లాడిన మొదటి స్త్రీవి నీవే. ఇక ముందు ఒక సౌందర్యవతిని చూచినప్పుడు సిద్ధార్థుడు రెప్పలు వాల్చడు. ఈ సంగతి నీకు చెప్పడానికే వచ్చాను.”

”ఈ సంగతి చెప్పడానికేనా సిద్ధార్థుడు నా వద్దకు వచ్చింది?”

”ఇంతే కాదు. నీ అతిలోక సౌందర్యాన్ని అభినందించడానికి కూడా. కమలా! ఈ సిద్ధార్థుడు ఒక వరం కోరుతున్నాడు. నీకు సమ్మతమైతే ఈ సిద్ధార్థుని నీ శిష్యునిగా గ్రహించు. నీవు ఆచార్యత్వం వహించిన కళలో ఈ సిద్ధార్థునికి బొత్తుగా ప్రవేశం లేదు.”

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *