సిద్ధార్థ -13

సిద్ధార్థ -13

8. గోవిందుడు

బౌద్ధభిక్షుకులకు కమల సమర్పించిన తోటలో విశ్రాంతికోసం గోవిందుడు కొన్నాళ్లు ఉన్నాడు. సమీపంలో నదిఒడ్డున ఒక పల్లెకారి ఉన్నట్టూ, అతడు గొప్ప సిద్ధుడు అయినట్టు చెప్పుకోగా విన్నాడు. ఆ పల్లెకారిని చూడవలెనని బయలుదేరాడు. గోవిందుడు భిక్షుక నియమాలను శ్రద్ధతో పాటించేవాడు. అతడంటే తోటి భిక్షుకులకు చాలా గౌరవం కూడాను. కాని అతని హృదయంలో అశాంతి ఇంకా వదలలేదు. అతని సాధన ఇంకా ఫలించలేదు.

గోవిందుడు నదిదగ్గరకు వచ్చాడు. నదిని దాటించమని పల్లెకారిని అడిగాడు. అవతలి గట్టుకు చేరి పడవ దిగిన తరువాత గోవిందుడు పల్లెకారితో ఈలా అన్నాడు: ”భిక్షుకుల మీదను ప్రయాణికుల మీదను నీవు చాలా దయ చూపుతున్నావు. నీవు ఎంతమందినో ఈ నదిమీద దాటించి ఉంటావు. నేను ధర్మపథంలో సాధన చేస్తూ ఉన్నాను. నీవుకూడా నాలాంటి సాధకుడవేమో?”

సిద్ధార్థుడు నవ్వుతూ: ”అయ్యా! మీరు సాధకులా? మీరు భిక్షుక వేషంతో ఉన్నారు. పైగా వృద్ధులు, మీకు ఇంకా సాధన ఏమిటి?” అన్నాడు.

”నేను వృద్ధుడనే, కాని నేను ఎప్పుడూ సాధన చేస్తూనే ఉన్నాను. ఈ సాధనను ఎన్నటికీ మాను కోను. సాధన చేస్తూ ఉండడమే నా పాలిటివిధిగా తోస్తున్నది. నీవుకూడా సాధన చేసినట్టు కనబడు తున్నది. నీ అనుభవం ఏమిటో చెప్పగలవా?” అన్నాడు గోవిందుడు.

”నీకు ఉపయోగించే విషయం నేను ఏమి చెప్పగలను? నేను చెప్పగలిగింది ఇంతే. బహుశా నీవు అతిగా సాధన చేస్తూ ఉంటావు. దాని ఫలితం ఏమంటే నీకు సిద్ధి కలగడం లేదు.”

”అదేమిటి?”

”ఒకడు సాధన చేస్తున్నాడంటే, దేనికోసం సాధన చేస్తున్నాడో అదే అతనికి గోచరించడం సహజం. ఇంకొక విషయం అతనికి గోచరించదు. ఇతర విషయాలను అతడు జీర్ణించుకోలేడు. కారణం ఏమంటే తాను దేనికోసం సాధన చేస్తున్నాడో దానిని గూర్చే ఆలోచిస్తాడు. అతనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం వైపే ఉంటుంది అతనిచూపు. సాధన అనగానే దానికి ఒక లక్ష్యం ఉంటుంది. కాని పరమార్థాన్ని తెలుసుకోవలెనంటే, ఏలాంటి నిర్బంధం ఉండగూడదు. అన్నిటినీ గ్రహించగలిగిఉండవలె. ఒకటే లక్ష్యమంటూ ఉండగూడదు. మీరు సాధకులు కావచ్చు. కాని మీ లక్ష్యంకోసం యత్నిస్తూ మీకళ్ళ ముందున్న అనేక విషయాలను గ్రహించలేక పోతున్నారు.”

”నీవు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. నీ అభిప్రాయం ఏమిటి?”

”చాలాకాలం క్రిందట మీరు ఈ నది వద్దకు వచ్చారు. అక్కడ ఒక మనిషి నిద్రపోతున్నాడు. అతడు నిద్రలేచే వరకు కాపలాగా ప్రక్కన కూర్చున్నారు. కాని ఆ మనిషిని గుర్తుపట్టలేదు.”

”సిద్ధార్థుడవా నీవు? ఈ తడవ కూడా నిన్ను గుర్తు పట్టలేకపోయినాను. నిన్ను చూడడం నాకు మహానందంగా ఉన్నది. నీవు చాలా మారిపోయి నావు. ఇప్పుడు పల్లెకారిగా ఉన్నావా?”

”అవును. నేను పల్లెకారిగా ఉన్నాను. చాలా మందికి ఎన్ని విధాలనో మారక తప్పదు. ఎన్నో వేషాలు వేయక తప్పదు. అందులో నేనొకడను. గోవిందా నా వెంట రా. ఈ రాత్రి నా గుడిసెలో గడుపుదువుగాని.”

ఆ రాత్రి గోవిందుడు ఆ గుడిసెలో పండుకున్నాడు. ఇద్దరు చిన్న నాటి స్నేహితులు. గోవిందుడు సిద్ధార్థుని ఎన్నో సంగతులు అడిగాడు. సిద్ధార్థుడు తన జీవితాన్ని ఏలా గడిపిందీ, తాను ఎలాంటి అనుభవాలు పొందినదీ అన్ని వివరాలు చెప్పాడు.

మరుసటిరోజు ఉదయాన గోవిందుడు ప్రయాణం అవుతూ కొంచెం సందేహంగా సిద్ధార్థునితో ఈలా అన్నాడు:

”సిద్ధార్థా! నేను వెళ్లే ముందు నిన్ను ఇంకొక పశ్న అడగవలెనని ఉన్నది. నీకు ఒక సిద్ధాంతమంటూ ఉన్నదా? నీ జీవితానికి నీ ధర్మసాధనకూ ఉపకరించే ఒక ప్రత్యేక విశ్వాసమూ, జ్ఞానమూ కలదా?”

సిద్ధార్థుడు: ”మిత్రమా! నీకు తెలుసును. నీవూ నేనూ అడవిలో శ్రమణులతో కలిసిఉండినప్పుడు కూడా ఒక సిద్ధాంత మన్నా, గురువులన్నా నాకు విశ్వాసముండేది కాదు. ఇప్పటికీ నా మనస్సు అలాగే ఉన్నది. కాని నాకు కూడా చాలామంది గురువు లతో సంపర్కం కలిగింది. ఒక చక్కని వేశ్య నాకు గురువుగా ఉన్నది. ఆమె దగ్గర చాలాకాలం శుశ్రూష చేశాను. ఒక గొప్ప షాహుకారు, జూదరులు నాకు గురువులైనారు. ఒకప్పుడు ఒక బౌద్ధ భిక్షుకుడు గురువైనాడు. అతడు మార్గాన వెళ్లుతూ అడవిలో నేను నిద్రపోతూ ఉండగా నా పక్కన కూర్చున్నాడు. అతనివల్ల కూడా కొంత నేర్చుకున్నాను. అతనికి నేను ఎంతో కృతజ్ఞుడను. అందరికన్నా ఈ నదివల్లనూ, నాకు ముందు ఈ గుడిసెలో ఉండిన వాసుదేవుని వల్లనూ చాలా విషయాలు గ్రహించాను. ఆ వాసుదేవుడు కేవలం సాధువు. మామూలు మనిషిగానే ఉండేవాడు. పెద్ద ఆలోచనాపరుడు కాడు. కాని బుద్ధభగవానునిలాగా పరమార్థాన్ని తెలుసుకున్నవాడు. అతడొక సిద్ధ పురుషుడు.”

గోవిందుడు : సిద్ధార్థా! ఇంకా నీ చమత్కారం అలాగే ఉన్నది. నీవు చెప్పేమాట నాకు నమ్మకమే. నీవు ఏ గురువునూ అనుసరించలేదని నాకు తెలుసును. కాని నీకు స్వయంగా ఏదో సిద్ధాంతం, ఏవో భావాలు లేవా? నీకు ఉపకరించిన ఏదో ఒక విధమైన జ్ఞానాన్ని నీవు సంపాదించలేదా? ఆ విషయాన్ని తెలుసుకోవలెనని నాకు కుతూహ లంగా ఉన్నది.”

సిద్ధార్థుడు : ”అవును. నాకు ఏవేవో భావాలు ఉండేవి. ఏదో జ్ఞానంకూడా అక్కడక్కడ సంపాదిం చాను. ఒక్కొకవేళ ఒక రోజో ఒక గంటో నాకు జ్ఞానం అంటే ఏమో తెలిసేది. నాకు కలిగిన భావాలన్నీ చెప్పడం కష్టం. కాని, నాకు అచ్చు గుద్దినట్టుగా నిలిచిపోయిన భావం ఒక్కటే. జ్ఞానం అనేది ఒకరు చెపితే తెలుసుకోతగింది కాదు. జ్ఞానాన్ని మాటలతో చెప్పడం సాధ్యం కాదు. కొందరు జ్ఞానులనిపించుకున్న వారు మాటలతో జ్ఞానాన్ని ఉపదేశించడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి ఉపదేశం ఎప్పటికీ వృథా.”

గోవిందుడు : ”నీ వేమి చమత్కారంకోసం మాట్లాడుతున్నావా ?”

సిద్ధార్థుడు : ”చమత్కారం కాదు. నేను తెలుసుకున్న విషయాన్నే నీకు చెపుతున్నాను. విజ్ఞానం వేరు, జ్ఞానం వేరు. విజ్ఞానాన్ని మాటలతో ఒకరికి చెప్పవచ్చును. జ్ఞానాన్ని తెలుసుకో వచ్చును. అనుభవంలోకి తెచ్చుకో వచ్చును. అది మనకు రక్ష కావచ్చును. దాని ద్వారా ఎన్ని మహత్తులైనా సాధించవచ్చును. కాని దానిని చెప్పడం, ఉపదేశించడం అసాధ్యం. ఈ సందేహం నాకు చిన్న తనంలోనే కలిగింది. అందుకే నేను ఏ గురువును ఆశ్రయించ లేదు.”

”నీకు ఇంకొక విశేషం చెపుతున్నాను. ఇదికూడా నీకు చమత్కారంగా తోచవచ్చు. ప్రతి విషయానికి వ్యతిరేకంగా ఇంకొక విషయం ఉంటుంది. ఇది ఎంత సత్యమో అదీ అంత సత్యమే. ఒక సత్యానికి ఒక వైపును మాత్రమే మనము మాటలతో చెప్పగలము. మనసుతో ఆలోచించేదీ, మాటలతో చెప్పేదీ, ఏదైనా సరే అది ఒక వైపే మనకు గోచ రిస్తుంది. అది సగం సత్యమే. దానికి సంపూర్ణత్వం, సమగ్రత్వం, ఏకత్వం ఉండవు. బుద్ధభగవానుడు ప్రపంచానికి బోధించవలసినప్పుడు సంసారం, నిర్వాణం, మాయ, సత్యం, దుఃఖం, విముక్తి అంటూ రెండుగా విభజించక తప్పింది కాదు. ఎవరికైనా ఇంకొక మార్గం లేదు.”

కాని, మన చుట్టూ, మనలోపల ఉన్న ప్రపంచం ఒక్కవైపే కలది కాదు. ఒక మనిషి కాని, ఒక పని కాని పూర్తిగా సంసారమూ కాదు. పూర్తిగా నిర్వాణమూ కాదు. ఏ మనిషి కానీ ఎన్నటికీ పూర్తిగా సిద్ధుడూ కాడు, పూర్తిగా పాపీ కాడు. కాలం సత్యపదార్థం అన్న భ్రమలో, మనం ఉండడం వల్లనే ఈ దోషదృష్టి కలుగుతూ ఉన్నది. కాలం సత్యపదార్థం కాదు. ఈ విషయం నేను ఎన్ని సారులో గ్రహిం చాను. కాలం సత్యపదార్థం కాన ప్పుడు, ఈ ప్రపంచాన్నీ, శాశ్వతత్వాన్నీ, దుఃఖాన్ని, సుఖాన్నీ, మంచినీ చెడ్డనూ, విడదీసే రేఖకూడా భ్రాంతి కాక తప్పదు.”

గోవిందుడు : ”ఏలాగు ?”

సిద్ధార్థుడు : ”మిత్రమా ! విను. నేను పాపిని నీవు పాపివి. కాని ఒక నాటికి ఈ పాపి నిర్వాణాన్ని, బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఒక నాటికి బుద్ధుడు కాగలడు. ఈ ‘ఒకనాటికి’ అన్నది భ్రాంతి. ఒక స్థితిని వేరొక స్థితికి పోల్చి చెప్పేమాట అది. ఒక పాపి బుద్ధస్థితికిపోతూ ఉండడమంటూ లేదు. అతడు వెరిగి ఆ బుద్ధస్థితిని అందుకోవడం కాదు. మనం ఇంకోవిధంగా ఆలో చించడం సాధ్యం కాదు. కాబట్టి అలా అంటున్నాము. ప్రతి పాపిలోనూ గూఢంగా బీజరూపంగా బుద్ధుడు ఇదివరకే ఉన్నాడు. అతని భవిష్యత్తుకూడా వర్తమానంలో ఇమిడే ఉన్నది. నీలోనూ నాలోనూ ప్రతివ్యక్తిలోనూ గూఢంగా బీజరూపంగా బుద్ధుడు ఉన్నాడని గ్రహించవలె.”

”ఈ ప్రపంచం అసంపూర్ణంగా ఉండి ఏనాటికీ నెమ్మదిగా పూర్ణత్వాన్ని పొందబోవడం లేదు. ప్రతిక్షణమూ పూర్ణంగానే ఉన్నది. ప్రతి పాపంలోనూ అనుగ్రహం ఇమిడి ఉన్నది. ప్రతి బాలుడూ బీజదశలో ఉన్న వృద్ధుడే. పాలుత్రాగే ప్రతి శిశువులోనూ మృత్యువు దాక్కొని ఉన్నది. మృతినిపొందే ప్రతి మనిషిలోనూ శాశ్వతస్థితి గుప్తంగా ఉన్నది. ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నదీ చెప్పడం సాధ్యం కాదు. దొంగలోనూ, జూదరిలోనూ బుద్ధుడు ఉన్నాడు. బ్రహ్మపదార్థంలోనే దొంగ ఉన్నాడు.”

”ఏకాగ్రమైన ధ్యానస్థితిలో కాలాన్ని త్రోసివేసి, ఒక్కసారిగానే భూత భవిష్యద్వర్తమానాలను చూడడం సాధ్యపడుతుంది. ఆ స్థితిలో అంతా మంచిదే, అంతా పూర్ణమే, అంతా బ్రహ్మమే. కాగా మృత్యువు కానీ, జీవంకానీ, పుణ్యంకానీ, పాపంకానీ, జ్ఞానంకానీ, అజ్ఞానం కానీ అన్ని పదార్థాలు మంచివనే నాకు తోస్తుంది. ప్రతిదీ అగత్యమైందే. అయితే మనం దేనినిగాని ప్రేమపూర్వకంగా అర్థం చేసుకొని ఆమోదిస్తే అన్ని మంచివే. దేనివల్లనూ మనకు హాని కలగ నేరదు.”

”నేను పాపం చేశాను. కామసుఖం అనుభవించాను. ధనం సంపాదించాను. వెగటు పుట్టింది. నిరాశ కలిగింది. వాటిని నిరోధించకుండా అనుభవించడం నేర్చుకున్నాను. ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నాకు ఇష్టమైన ఏదో ప్రపంచాన్ని ఊహించి దానిలో ఈ ప్రపంచాన్ని పోల్చి చూడడం లేదు. ఎక్కడో పరిపూర్ణం ఉన్నదని ఊహించి దానితో దీనిని పోల్చుకోవడం లేదు. ఈ ప్రపంచాన్ని ఉన్న దానిని ఉన్నట్టుగా గ్రహిస్తున్నాను. ప్రేమిస్తున్నాను. నేను దీనికి సంబంధించి ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఈ అనుభవమంతా అవసరమని నా దేహం ద్వారాను, నా ఆత్మ ద్వారాను నేర్చుకున్నాను.”

”ఈ రాయి చూడు, కొంత కాలానికి ఈ రాయి మట్టి కావచ్చు. ఆ మట్టిలో ఒక మొక్క పుట్టవచ్చు. అటు తరువాత ఒక జంతువు, ఒక మనిషి కావచ్చు. ఇదివరకైతే : ‘ఈ రాయి రాయి మట్టుకే, దీనికి విలువలేదు. ఈ రాయి వట్టి మాయ’ అనేవాడను. ఇప్పుడు ‘ఈ రాయి రాయిమాత్రమే కాదు. ఇది జంతువు, మనిషి, భగవంతుడు, బుద్ధుడు అన్నీ కూడా అంటాను, ఈ రాయి ఈనాడు రాయిగా ఉండి ముందెప్పుడో బుద్ధుడు కాబోతున్నదని దాని మీద గౌరవం. ఇదివరకే అన్నీ అందులో ఉన్నవి. ఎప్పుడుకూడా అన్నిగానే ఉన్నది ఈ రాయి. దీని గరుకులోనూ, నునుపులోనూ, వన్నెలోనూ, ధ్వనిలోనూ విలువను అర్థాన్ని చూస్తున్నాను. ఒక్కొక్క రాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతిరాయి తన మార్గంలో ‘ఓం’ను జపిస్తూ ఉన్నది. ప్రతిరాయి బ్రహ్మ పదార్థామే. బ్రహ్మ పదార్థంగా ఉంటూనే రాయిగా కనిపిస్తున్నది. ఈ భావమే నాకు ఆనందాన్ని కలిగిస్తున్నది. ఇందుకే ఈ రాయి నాకు ఆశ్చర్యం గాను, పూజనీయంగాను కనిపిస్తున్నది. ఈ భావాన్ని ఇంతకంటే తేటతెల్లంగా చెప్పలేను. భావాలను మాటలను పూర్తిగా వ్యక్తీకరించలేవు. మాటలతో చెప్పినప్పుడు ఆ భావాలకు అపార్థం కలగవచ్చు. ఇంకొక విశేషమేమంటే ఒక మనిషికి సార్థకమైంది. జ్ఞానప్రదమైంది. వేరొక మనిషికి కాకపోవచ్చు. అదికూడా న్యాయమే నంటాను. దానికీ నేను సంతోషిస్తాను.”

గోవిందుడు : ”రాయిని ఉదాహరణగా ఎందుకు తీసుకున్నావు?”

సిద్ధార్థుడు : ”అందులో ప్రత్యేకమైన వుద్దేశం ఏమీ లేదు. ఈ రాయిలాగానే ఆ నదిని అన్ని వస్తువులను ప్రేమిస్తాను. అన్నిటివల్ల నేర్చుకుంటాను. గోవిందా! ఇవన్నీ వస్తువులు. మనం వస్తువులను ప్రేమించగలము. మాటలను ప్రేమించజాలము. అందుకే మాటలతో చేసేబోధలు ప్రయోజనం లేనివి అంటాను. ఆ మాటలకు కరుకు, మెత్తన, వన్నె, వంపు, వాసన, రుచి ఆవేవీ లేవు. వస్తువులను వదిలి మాటలను పట్టుకోవడంవల్లనే నీకు శాంతి కలగలేదు. సంసారం, నిర్వాణం అన్నవికూడా మాటలే. నిర్వాణం ఒక వస్తువు కాదు.”

గోవిందుడు : ”మిత్రమా! నిర్వాణం వట్టి మాటకాదు. అది ఒక భావం.”

సిద్ధార్థుడు : ”అది భావం కావచ్చు. భావానికి మాటకు అంత వ్యత్యాసం లేదు. వస్తువులకే నేను ప్రాధాన్యం ఇస్తాను. నేను రాక ముందు ఇక్కడ పడవను నడుపుతూ ఉండిన వాసుదేవుడు గొప్ప సిద్ధుడు. అతడు నాకు – గురువు కూడా. అతడు చాలాకాలం ఈ నదిని మాత్రమే నమ్మేవాడు. ఈ నది అతనితో మాట్లాడేది. ఈ నది అతనికి అన్ని విషయాలు బోధించేది. ఈ నదే అతనికి భగవంతుడు. ప్రతిగాలి, ప్రతి మబ్బు, ప్రతిపక్షి అన్నిటిలో దివ్యత్వం ఉన్నదనీ అన్నీ ఈ నదిలాగానే బోధించగలవనీ తరువాత తరువాత గ్రహించాడు. అతనికి అన్నీ తెలుసును. గురువులు లేకుండా గ్రంథాలు లేకుండా ఈ నదిని నమ్మి అతడు సిద్ధుడైనాడు.”

గోవిందుడు : ‘నీవు వస్తువు అనేదానికి నిత్యత్వం ఉన్నదా? ఈ దృశ్యమంతా మాయాకల్పితం కాదా?”

సిద్ధార్థుడు : ”ఈ వస్తువులన్నీ భ్రాంతి అయితే నేను కూడా భ్రాంతే. వాస్తవంలో అవీ నేనూ ఒకటే నన్నమాట. అందుకే వాటిని నేను ప్రేమిస్తాను, ప్రపంచంలో ప్రధానమైంది ప్రేమ ఒక్కటే. గొప్ప పండితులు ప్రపంచాన్ని గూర్చి విమర్శించవచ్చు. తర్కించవచ్చు. ఇదంతా తుచ్ఛం అనవచ్చు. కాని ప్రపంచాన్ని ప్రేమించవలెననీ, దాన్ని నిరసించరాదనీ, పరస్పర ద్వేషాన్ని పోనాడి ప్రపంచాన్ని, మనలను, అన్ని జీవులను ప్రేమతో గౌరవంతో చూడవలెననీ నా ఉద్దేశం.”

గోవిందుడు : ”నాకు అర్థమైంది. కాని బుద్ధభగవానుడు ఈ ప్రపంచాన్ని క్షణికమనీ, మిధ్య అనీ అన్నాడు. ఆయన భూతదయ ఉండాలని కూడా చెప్పాడు. అయితే ఐహికమైన ప్రేమ వ్యాపారాన్ని ఆయన నిషేధించాడు.”

సిద్ధార్థుడు : ”నాకు తెలుసును. ప్రేమ అనడంలో నా భావానికి, బుద్ధభగవానుని బోధకు స్థూలంగా వ్యత్యాసం కనపడుతుంది. అందుకే మాటలంటే నాకు నమ్మకం లేదు. గౌతముని బోధకు నా భావానికి నిజంగా వ్యత్యాసం లేదు. ఆయన క్షణిక వాదాన్ని బోధించినా మానవులను ప్రేమించాడు. అలాంటి ప్రేమ లేకపోతే మానవులను ఉద్ధరించడానికి తన జీవితాన్నంతా ఆ విధంగా సర్వసమర్పణ చేసి ఉండడు. ఆయన విషయంలోనూ నేను ప్రధానంగా పాటించేది ఆయన బోధ కాదు. నాకు ముఖ్యమైనవి ఆయన చేసిన పనులు, ‘ఆయన జీవితం – ఆయన సిద్ధాంతాలలో కన్నా ఆయన చూపులోనూ, చిరునవ్వులోనూ చేతికదలికలోనూ ఎక్కువ అర్థం గోచరిస్తుంది. మాటలలో కాదు. పనులలో, బతుకులో గౌతముని మహాపురుషునిగా భావిస్తాను.”

సిద్ధార్థుడు గోవిందుడు చాలాసేపు మౌనంగా ఉన్నారు గోవిందుడు ప్రయాణానికి సిద్ధమై ఇలా అన్నాడు, ”మిత్రమా ! నీ భావాలను వివరంగా తెలిపినందుకు కృతజ్ఞుడను. నీ భావాలు కొన్ని వింతగా ఉన్నవి. అవన్నీ వెంటనే నేను అవగాహన చేసుకోలేకుండా ఉన్నాను. అయినా నీవు తీసుకున్న శ్రమకు వందనాలు.”

”ఈ సిద్ధార్థుడు విచిత్ర పురుషుడుగా తోస్తున్నాడు. ఇతనిభావాలు కూడా విచిత్రంగానే ఉన్నవి. కాని, ఆ భావాలలో ఒక క్రమం కనిపించడం లేదు. బుద్ధభగవానుడు ఏది చెప్పినా తేటగా సూటిగా తెలిసేటట్టుగా ఉండేది. సిద్ధార్థుని భావాలు ఎలా ఉన్నా ఇతని చూపులు చిరునవ్వు ముఖ వైఖరి ఎంత ఆకరక్షంగా ఉన్నవి! బుద్ధభగవానుడు నిర్యాణం చెందిన తరువాత ఆయనవలె నా దృష్టిని ఆకర్షించి, నా మనస్సును కదిలించిన వ్యక్తి ఈ సిద్ధార్థుడు ఒక్కడే. ఇతడు నిస్సందేహంగా సిద్ధపురుషుడు. ఇతని భావాలు వింతగా తోచవచ్చు. ఇతని సంభాషణ తికమకగా తోచవచ్చు. కాని ఆపాదమస్తకం ఇతనిరూపం – ఆముఖంలో స్వచ్ఛత, శాంతి, సాధుత్వం, పవిత్రత ఒక్క బుద్ధభగవానునియందు తప్ప ఇంకెక్కడా చూడలేదు.” ఈ విధంగా గోవిందుడు తనలో తాను అనుకున్నాడు.

గోవిందుడు సిద్ధార్థుని పాదాలముందు మోకరించి నమస్కరించి ఇలా అన్నాడు. ”సిద్ధార్థా! మనం వృద్ధులమైనాము. ఈ జన్మలో మళ్ళా ఒకరినొకరు చూచుకోకపోవచ్చు. నీకు శాంతి లభించినట్టుగా నాకు స్పష్టమైంది. నాకు శాంతి లభించలేదు. నా సాధనకు అనుకూలించేది, నాకు అర్థమయ్యేది. ఏదైనా ఒక ఉపాయాన్ని నీ వల్ల తెలుసుకోవలెనని నా మనసు ఆరాటపడుతున్నది. ఎటు చూచినా నాకు చీకటిగా ఉన్నది. దారి కని పించడం లేదు, ఏలాగైనా నీవే నన్ను కడతేర్చవలె.”

సిద్ధార్థుడు మౌనంగా కూర్చున్నాడు. ఒక్కసారి శాంతంగా మందహాసం చేస్తూ గోవిందుని వైపు చూచాడు, గోవిందుడు నిశ్చలంగా అతని ముఖంలో నికి చూస్తున్నాడు. ఆకాంక్ష, ఆవేదన, అన్వేషణాసక్తి వీటితోపాటు ఆశా భంగమూ గోవిందుని ముఖంలో కనిపిస్తూ ఉన్నవి. సిద్ధార్థుడు ఆ ముఖాన్ని చూచాడు. గ్రహించాడు. చిరునవ్వు నవ్వాడు.

సిద్ధార్థుడు గోవిందుని దగ్గరకు రమ్మని సైగ చేశాడు, ”దగ్గరకువచ్చి నా నుదుటిమీద ముద్దు పెట్టుకో” అన్నాడు. గోవిందునికి ఆశ్చర్యం కలిగింది. అంతవరకు అతనిమనసులో సిద్ధార్థుని ప్రసంగమే మోగుతూ ఉన్నది. కాలం లేదనుకోవడం ఏలాగు? నిర్వాణము సంసారము ఒక్కటే అనుకోవడం ఏలాగు? ఈ ప్రశ్నలు తేలక అతని మనస్సు, మధనపడుతూ ఉన్నది. కాని, సిద్ధార్థునిపై గౌరవమూ తనలో కలిగిన ప్రేరణా వీటిబలంవల్లే గోవిందుడు వెంటనే ముందుకుపోయి నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు. తక్షణం అతనికి ఒక అద్భుతమైన అనుభవం కలిగింది.

సిద్ధార్థుని ముఖం కనపడడం లేదు. ఏవో ముఖాలు, ఎన్నో ముఖాలు, వందలు వేలు వరసలుగా ముఖాలు, వస్తూపోతూ, మారుతూ మళ్లా కనపడుతూ ఈ విధంగా ఉన్నవి. కాని ఇవన్నీ సిద్ధార్థునిలోనే. ఒక చేప కనిపించింది. ఒక తిమింగలం కనిపించింది. చేపను తిమింగిలం మింగుతూ ఉన్నది. అప్పుడే పుట్టిన బిడ్డముఖం కనిపించింది. ఏడుస్తూ ఉన్నాడు. ఒక హంతకుని ముఖం. ఎవరినో కత్తితో పొడవబోతున్నాడు. హత్య చేసినందుకు, ఉరితీస్తున్నారు. ఉరి తాడు తగిలించిన ఆముఖం కనిపించింది. కామ పరవశులై పురుషులు స్త్రీలు దిసమొలలతో భోగిస్తున్నారు. ఏవో శవాలు కనిపించినవి. ఎలుగుబంట్లు, మొసళ్లు, ఏనుగులు, ఎద్దులు, పక్షులు ఏవేవో జంతువులు కనిపించినవి. అగ్ని దేవుడు కనిపించాడు. శ్రీకష్ణుడు కనిపించాడు.

ఈ ముఖాలు, ఈ రూపాలు వీటికి ఒక దానితో వేరొక దానికి వేయి సంబంధాలు, ప్రేమలు, ద్వేషాలు, హత్యలు, చావులు, పుట్టుకలు, చచ్చిన ప్రతిజీవికి తిరిగి పుట్టుక – కొత్తరూపం – కొత్తముఖం. ఈ రూపాలన్నీ ఒక ప్రవాహంలో మునుగుతున్నవి. తేలుతున్నవి. మునిగేటప్పుడు ఒకరకం. తేలేటప్పుడు ఇంకొక రకం. వీటినన్నింటిని ఆవరిస్తూ సిద్ధార్థుని ముఖంలో చిరునవ్వు – ఈ జనన మరణ ప్రవాహం మీద, ఈ సహస్ర రూపాలపైన ఒక్క రకంగా వెలుగుతూ ఉన్నది ఆ చిరునవ్వు. సిద్ధార్థుని చిరునవ్వు.

గోవిందుడు బుద్ధభగవానుని చిరునవ్వు చూచాడు. ఆ చిరునవ్వులో – ఏ శాంతి, ఏ దయ, ఏ జ్ఞానం, ఏ వెలుగు గోచరించిందో అచ్చంగా ఆ విధంగానే గోచరిస్తున్నది సిద్ధార్థుని ముఖంలో చిరునవ్వు.

కాలమంటూ ఒకటి ఉన్నదో లేదో అతనికి తెలియదు. ఈ దృశ్యమంతా గోచరించినది ఒక క్షణమో, ఒక యుగమో అతనికి తెలియదు. గౌతముడు సిద్ధార్థుడు తాను ఉన్నారో లేదో తెలియదు. ఏదో దివ్య వేదన, దివ్యానందం – అంతే. ఈ వేలకొలది రూపాలన్నీ అద్దంలో కనిపించినట్టు కనిపించి, అంతరించగానే సిద్ధార్థుని ముఖం ఆ చిరునవ్వు – అలాగే కనిపించినవి గోవిందునికి. బుద్ధభగవానుని చిరునవ్వు సిద్ధార్థుని చిరునవ్వు ఒకటే – వేరు కాదు.

గోవిందునికి కన్నీళ్ళు ధారలుకడుతున్నవి. అతనిలో దివ్యమైన ప్రేమభావం – వినయం – భక్తి – నిండి ఉన్నవి. ముఖంలో దివ్యమందహాసం చిలుకుతూ నిశ్చలంగా కూర్చున్న సిద్ధార్థుని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. గోవిందుడు. అతనికి జీవితపరమార్థం గోచరించింది. గోవిందుని ముఖంలోనూ అదే చిరునవ్వు.

– మూలం: హర్మన్‌ హెస్‌

– తెలుగు అనువాద: బెల్లంకొడ రాఘరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *