సిద్ధార్థ -12

సిద్ధార్థ -12

7. ఓం

చాలాకాలం సిద్ధార్థుని ఆ గాయం బాధపెడుతూనే వున్నది. అతడు ఆ నది మీద ఎందరో ప్రయాణికులను దాటిస్తూ వుండేవాడు. ఆ ప్రయాణికులలో కూడ మగపిల్లలు, ఆడపిల్లలు వుండేవాళ్లు. వాళ్ళను చూచినప్పుడు అతని మనస్సు చివుక్కురు మనేది. ఈర్ష్యపడేవాడు. ఆ సుఖము ఆనందము అంతమందికి వుండగా తనకు మాత్రమే ఎందుకు లేకపోవలె. దుర్మార్గులకు దొంగలకు కూడా బిడ్డలు వుంటారు. ఆ బిడ్డలను ప్రేమించుకుంటారు. వాళ్ళ ముద్దు ముచ్చటలను అనుభవిస్తారు. సిద్ధార్థుని మనస్సు అంత పసితనంగానూ, అంత అవివేకంగానూ ఆలోచిస్తున్నది. అతనికి అంత పామరత్వం కలిగింది. ఇప్పుడు ప్రజలపట్ల అతనికి మునుపటిభావం లేదు. అతని దష్టి మారింది. తానే మహా తెలివిగలవాడనన్న గర్వం పోయింది. అందరినీ ఆదరంతో ఆసక్తితో ఆప్యాయంగా చూస్తున్నాడు.

మామూలు ప్రయాణికులను దాటించేటప్పుడు మునుపటిమాదిరి తనకు పరాయి వాళ్లుగా కనబడడం లేదు. వాళ్ళ కష్టసుఖాలన్నీ తనకు అర్థంకాక పోవచ్చు. వాటిలో తాను పాల్గొనక పోవచ్చు. కాని వాళ్లు చెప్పుకునే సంగతులన్నీ ఇష్టంగా వినేవాడు. తనకున్న ఆత్మసంస్కారం వాళ్లకు లేకపోవచ్చు. అయినా ప్రతి మనిషినీ సోదర భావంతో చూచేవాడు. వాళ్ళదర్జాలు కానీ, అల్ప భావాలు కానీ అతనికి హేయంగా తుచ్ఛంగా తోచేవికావు. వాళ్ళను అర్థం చేసుకొనేవాడు. ప్రేమ చూపేవాడు. గౌరవించేవాడు.

ఒక తల్లి తనబిడ్డను ప్రేమిస్తుంది. ఒక తండ్రి తన ఏక పుత్రుని ప్రేమిస్తాడు. ఒక స్త్రీ సొమ్ములను, చీరలను ప్రేమిస్తుంది. ఒక యువతి యువకుని ప్రేమిస్తుంది. అలా ప్రేమించడం గుడ్డితనం కావచ్చు. వివేకం కాకపోవచ్చు. పేలవం కూడా కావచ్చు. కాని ఆ ప్రేమ వెనక ఒక తీవ్రమైన ప్రేరణ ఉన్నది. ఆ ప్రేమలో గాఢమైన ప్రాణ శక్తి ఉన్నది. అట్టి ప్రేమ తణీక రించ తగింది కాదను కున్నాడు సిద్ధార్థుడు. దాని కోసమే మనుషులు బతుకు తున్నారు. మహా కార్యాలు సాధిస్తున్నారు. దేశాలన్నీ తిరుగుతున్నారు. యుద్ధాలు జరుపుతున్నారు. ఎన్నో బాధలు పడుతూ వాటిని సహిస్తున్నారు. అందుకే వాళ్లమీద అతనికి ఆదరం కలిగింది. వాళ్ళ వాంఛలలోనూ, అవసరాలలోనూ జీవశక్తినీ చైతన్యాన్నీ బ్రహ్మపదార్థాన్ని కూడా చూస్తున్నాడు. గుడ్డితనంగా కనిపించేవాళ్ల సంబంధ బాంధవ్యాలు వాటిలో వాళ్ళు చూపే బలము పట్టుదల అవన్నీ ఆదరించ తగినవి, హర్షించ తగినవి.

అయితే ఆలోచనాపరునికి సిద్ధపురుషునికి తెలిసిన ఒక్క స్వల్పవిషయం మాత్రం వాళ్లకు తెలియదు. జీవరాశి అంతా ఏకం అన్న విషయం వాళ్లకు తెలియదు. మిగతా విషయాలలో వాళ్లు సిద్ధపురుషునికి ఆలోచనాపరునికి ఏవిధంగానూ తీసిపోరు. ఈ జీవైక్యభావం అంత ముఖ్యమైందా ? ఆలోచనాపరుల మనుకునే వారు తమ గొప్ప తనాన్ని ప్రకటించుకోడానికి చెపుతూ ఉంటారు, అంతా ఒకటేనని. అనుభవంలో వారుకూడా అల్పులే, పసివారే. ఈ మాటలు చెప్పడంలో తప్ప వారు దేనిలోనూ మామూలు ప్రజలకంటే ఘనులు కారు. ఇంకా నికష్టులు కూడా.

వాస్తవంగా జ్ఞానమంటే ఏమిటి? చిర కాలంగా తాను చేస్తూ ఉన్న అన్వేషణకు ఫలితాంశం ఏమిటి? అన్న విషయం సిద్ధార్థునికి క్రమక్రమంగా గోచరి స్తున్నది. అతనిలో పరిపాకం పొందుతూ ఉన్నది. ఇదే ఆ జ్ఞానం. జీవితంలో ప్రతిక్షణమూ ఏకత్వాన్ని గమనిస్తూ భావిస్తూ దానినే ప్రకటిస్తూ ఉండగల రహస్యకళ అది. ఆత్మకు ఆ శక్తిని సంపాదించడానికి చేసే ప్రయత్నం, సాధన, ఇదే జ్ఞానం. ఈ భావం అతనిలో నెమ్మదిగా పరిపక్వం అవుతూ ఉన్నది. ఈ భావమే వాసుదేవుని ముఖంలో ప్రతిఫలిస్తూ ఉన్నది. ఈ ప్రపంచం నిత్యమైంది, పరిపూర్ణమైంది, ఏకమైంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడమూ, జీవితంలో సమత్వదష్టిని కలిగి ఉండడమూ, ఇదే జ్ఞాన లక్షణం. ఈ లక్షణం వాసుదేవుని ముఖంలో ముద్ర వేసినట్టుగా ఉన్నది.

ఇంకా సిద్ధార్థుని గాయం లోపల బాధిస్తూనే ఉన్నది. కొడుకుమీద మమకారం తగ్గలేదు. కొడుకు వెళ్లిపోయినందుకు దుఃఖం అలాగే ఉన్నది. పైగా, అదే ఆలోచనతో మమకారాన్ని పెంచుకుంటున్నాడు. ఆ బాధనంతా అనుభవిస్తూ ఉన్నాడు. గాయం దానంతట అది మానేటట్టుగా లేదు.

ఒకనాడు సిద్ధార్థుడు ఆవేదనను పట్టలేక పోయినాడు. పడవమీద నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు. కొడుకును చూడవలెనన్న భ్రాంతికొద్దీ వెదకడానికి నగరానికి వెళ్లుదామనుకున్నాడు. అది యెండకాలం. ఆ నది నెమ్మదిగా పారుతున్నది. కాని దానిగొంతుక వింతగా మోగుతూ ఉన్నది. అది నవ్వుతూ ఉన్నది. ఆ నవ్వు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నది. అతనిని చూచి ఆ నది ఉల్లాసంతో గలగలా నవ్వుతూ ఉన్నది.

సిద్ధార్థుడు నది ఒడ్డున కదలకుండా నిల్చున్నాడు. ఆ నవ్వును బాగా వినవలెనని నీటిమీదికి వంగాడు. నెమ్మదిగా పారుతూ ఉన్న నీటిలో తనముఖం ప్రతిఫలించింది. ఆ నీడను చూడగానే ఏదో మరుపు తగిలిన విషయం స్మతికి వచ్చింది. ఒక క్షణం ఆలోచించాడు. ఫలానా అని గుర్తుకు వచ్చింది. తన ముఖంలో తనతండ్రి పోలిక కనిపించింది.

ఒకనాడు తాను యువకుడిగా ఉన్నపుడు శ్రమణులలో చేరుదామనుకున్నాడు. తండ్రిని ఒప్పు కొమ్మని బలవంత పెట్టాడు. ఆయన కష్టంమీద ఒప్పుకున్నాడు. ఇల్లు వదలి వచ్చాడు. మళ్లీ తండ్రిదగ్గరకు వెళ్ళలేదు. ఆ కథంతా జ్ఞప్తికి వచ్చింది. ఈనాడు తన కొడుకుకోసం అనుభవిస్తూ ఉన్న బాధను ఆ నాడు తనకోసం ఆ తండ్రి అనుభవించి ఉండడా? మళ్ళా తనను చూడకుండానే ఆయన ప్రాణాలు విడిచాడు. ఆ గతే తనకూ పట్టింది. విధిఘటన చక్రంలాగా తన తండ్రి దగ్గరనుంచి తనదాకా తిరిగి రావడం విచిత్రంగా లేదూ? ఇదంతా ఒక స్రహసనమా?

నది నవ్వుతూనే ఉన్నది: అవును అది ”అంతే” అన్నట్టుగా. ఏది కాని చివరిదాకా అనుభవించ కుండా, తుదిముట్టకుండా, అనుభవానికి మధ్య తెంపుకలిగితే, అది తిరిగి వచ్చి చుట్టుకుంటుంది. అవే దుఃఖాలను తిరిగి అనుభవించక తప్పదు.

సిద్ధార్థుడు పడవ నెక్కి వెనక్కు వెళ్ళాడు. దారి పొడుగునా తన తండ్రిని తన కొడుకును తలచు కుంటూ ఉన్నాడు. ఆ నది తనను చూచి ఎగతాళిగా నవ్వింది. తనతో తనకే పోరాటంగా ఉన్నది. ఏ క్షణానికి ఆ క్షణం నిరాశ పొంచుకుని ఉన్నది. తనను చూచుకున్నా, లోకాన్ని చూచినా బిగ్గరగా నవ్వుదా మనిపిస్తున్నది.

ఇంకా గాయం బాధపెడుతూనే ఉన్నది. ఇంకా తన విధితో ఎదురుతిరిగి పోరాడుతూనే ఉన్నాడు. ఇంకా శాంతి కలగలేదు. తన బాధను జయించలేదు. కాని ఏదో ఆశ కనిపిస్తూనే ఉన్నది.

గుడిసె దగ్గరకు వెళ్లాడు. వాసుదేవునికి తన బాధను దాపరికం లేకుండా విప్పి చెపుదామను కున్నాడు. తన దుర్బలత్వాన్నీ దోషాన్నీ అతని ముందు ఒప్పుకుందామనుకున్నాడు. అతనికి చెప్పుకోవలెనన్న కోరిక తీవ్రంగా కలిగింది. వినడంలో నేర్పుగలవాడు వాసుదేవుడు. అతడు గుడిసెలో కూర్చుని బుట్టలు అల్లుకుంటున్నాడు. చూపు మందగించింది. దేహంలో సత్తువ సన్నగిల్లింది. కాని అతని ముఖంలో సంతోషము, శాంతి, స్థిమితత్వము, మాయకుండా వెలుగుతూ ఉన్నవి.

సిద్ధార్థుడు అతని పక్కన కూర్చొని మెల్లగా మాట్లాడడానికి ప్రారంభించాడు. తన కొడుకును వెదుకుతూ నగరానికి వెళ్ళినప్పుడు వాడు కనబడక పోగానే తన మనస్సులో కత్తిపోటులాగా గాయం పడడము; బిడ్డలతో కలిసి వెళ్ళే ప్రయాణికులను చూచి తనకట్టి సుఖం లేనందుకు తాను ఈర్ష్య పడడము; అలాంటి భావం కలగడం దోషమని తెలిసికూడా తనలో తాను తెంపులేకుండా పోరాడ డము, ఈ సంగతులన్నీ, ఇదివరకు ఎన్నడూ చెప్పనివి చెప్పడానికి కష్టమైనవి, వాసుదేవునికి వివరంగా చెప్పాడు. ఆ నాడు మళ్లా నగరానికి వెళ్ళవలెనని నదిని దాటడము; ఆ నది తనను చూచి అపహా స్యంగా నవ్వడము; వెంటనే తాను వెనక్కు తిరిగి రావడము – అంతా చెప్పాడు. తనగుండెలో ఇంకా సెలవేస్తూ ఉన్న గాయాన్ని పూర్తిగా విప్పిచూపాడు.

సిద్ధార్థుడు మాట్లాడుతూ ఉన్నంతసేపూ, వాసుదేవుడు ప్రశాంతంగా వింటున్నాడు. అతడు జాగ్రత్తగా వింటున్నాడని సిద్ధార్థుడు బాగా గ్రహించాడు. తన బాధలు తన ఆవేదన తన లోపలి ఆశలు వాసుదేవుని స్పశించి తిరిగి తనలోకి వస్తూ వున్నటుగా తోచింది. వాసుదేవునికి తన గాయాన్ని విప్పిచూపడం ఆ నదిలో దానిని కడిగి మంటను చల్లార్చుకున్నట్టుగా ఉన్నది.

మధ్యలో సిద్ధార్థునికి ఒక భావం కలిగింది. తన మాటలను వింటూ ఉన్నది వాసుదేవుడు కాడని పించింది. చలనం లేకుండా కూర్చున్న ఆ వ్యక్తి ఆ నది ఒకటే అనిపించింది. నిత్యసత్యమైన బ్రహ్మ పదార్థమే ఆ వ్యక్తి అనిపించింది. ఈ భావం తనను ఆవేశించేకొద్దీ అది సహజంగానే తోచింది. తాను పూర్తిగా గ్రహించకపోయినా వాసుదేవుడు ఎప్పుడూ అలాగే ఉండినట్టుగా తోచింది. నిజానికి తనకూ అతనికీ భేదమే లేదనిపించింది. ఈ దర్శనం ఎక్కువ కాలం నిలిచేది కాదనిపించింది.

వాసుదేవుడు అతని వైపు చూచాడు. మాట్లాడ లేదు. అతని ముఖంలో ప్రేమ, శాంతి, జ్ఞానం, వెల్లివిరుస్తూ ఉన్నవి. సిద్ధార్థుని చేయి పట్టుకున్నాడు. నది వద్దకు తీసుకొని వెళ్లాడు. ఇద్దరూ ప్రకప్రక్కన కూర్చున్నారు. వాసుదేవుడు నదినిచూచి నవ్వాడు. ”ఈ నది నవ్వు విన్నావు కాదూ ? కాని నీవు పూర్తిగా వినలేదు. నీవు ఇంకా వినవలసింది ఉన్నది. విందాము” అన్నాడు.

ఇద్దరూ వింటున్నారు. ఆ నది పాట వేయి గొంతుకలతో మదువుగా మోగుతున్నది. సిద్ధార్థుడు ఆ నదిలోనికి వంగి చూచాడు. ఆ నీళ్ళలో ఎన్నో బొమ్మలు తేలాడుతూ ఉన్నవి. తన తండ్రిబొమ్మ కనిపించింది. ఒంటరిగా తనకోసం దుఃఖపడుతూ ఉన్నాడు. తన బొమ్మ కనిపించింది. పరుగెత్తి పోయిన కొడుకుకోసం ఒంటరిగా బాధపడుతూ ఉన్నాడు. తనకొడుకు బొమ్మ కనిపించింది. ఆసక్తితో సంసార సుఖాలకోసం ఒంటరిగా సాగిపోతూ ఉన్నాడు. ఎవరిదష్టి వారి లక్ష్యం మీదనే ఉన్నది. ముగ్గురూ బాధపడుతూనే ఉన్నారు. నదిగొంతుక దిగులుగా మోగుతున్నది. ఆశతో విచారంతో పాడుకుంటూ తన గమ్యస్థానానికి ప్రవహిస్తూ వున్నది ఆ నది.

‘వినబడుతున్నదా’ అన్నట్టు వాసుదేవుడు సిద్ధార్థుని వైపుచూచాడు. సిద్ధార్థుడు తల వూపాడు. ”బాగా విను” అని వాసుదేవుడు అతని చెవిలో ఊదాడు.

సిద్ధార్థుడు శ్రద్ధగా వింటున్నాడు. తన తండ్రి బొమ్మ – తనబొమ్మ తన కొడుకుబొమ్మ ఒక దానితో ఒకటి కలిసి ప్రవాహంలో కొట్టుకొని పోయినవి. కమల బొమ్మ కూడా కనిపించి కొట్టుకుపోయింది. అలాగే గోవిందుని బొమ్మ ఇంకా ఎందరివో బొమ్మలు లేచి కొట్టుకుపోయినవి. అన్నీ నదిలో లీనమై పోయినవి. ఆకలితో, వాంఛలతో, బాధలతో బ్రతికిన అందరికి గమ్యస్థానం ఆ నదే. ఆ నది గొంతుకలో ఆశ వాంఛ బాధ నిండుకొని ఉన్నవి. నది గమ్యస్థానానికి ప్రవహిస్తూ ఉన్నది.

నది వడిగా ప్రవహిస్తున్నది. అందులో తన బొమ్మను తన బంధువుల బొమ్మలను తానెరిగిన అందరి బొమ్మలను చూచాడు సిద్ధార్థుడు. అన్ని బొమ్మలు నీళ్ళలో కొట్టుకొనిపోతూ ఉన్నవి. ఆ నీళ్ళు జలపాతానికి సముద్రానికి వేర్వేరు గమ్యస్థానాలకు పరుగెత్తిపోతూ ఉన్నవి. ఒకదాని వెనక ఒకటిగా అన్ని గమ్యస్థానాలను చేరుకుంటవి ఆ నీళ్ళు.

నీరు ఆవిరిగా పైకి పోతుంది. వానగా నేలమీద పడుతుంది. సెలయేరవుతుంది. నది అవుతుంది. ఈలా మారుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది గొంతుకలో సంతోషము, దుఃఖము, మంచి, చెడు, నవ్వు, ఏడుపు, ఒక వేయి ధ్వనులు మోగుతూ ఉంటవి.

సిద్ధార్థుడు అన్ని గొంతుకలను జాగ్రతగా విన్నాడు. వినడం ఎలాగో పూర్తిగా నేర్చుకున్నాడు. నదిలో ఈ గొంతుకలన్నీ ఇదివరకూ విన్నాడు. కాని ఈనాడు ఇంకో రకంగా మోగుతున్నవి. సంతోషధ్వని, దుఃఖధ్వని, బాలధ్వని, శ్రీధ్వని, పురుషధ్వని అన్నీ విడదీయరాకుండా ఉన్నవి. ఆ ధ్వనులన్నీ ఒక దానితో ఒకటి మిళితమై పెనవేసుకుని ఉన్నవి. అన్ని ధ్వనులు, అన్ని గమ్యాలు, అన్ని ఆశలు, అన్ని దుఃఖాలు, అన్ని సుఖాలు, అన్ని శుభాలు, అన్ని అశుభాలు అన్నీ కలిసిందే ఈప్రపంచం; ఈ సంసారం.

వేయి గొంతుకలతో పాడే ఆ నది పాటను శ్రద్ధగా విన్నప్పుడు ఒక సుఖధ్వనికి ఒక దుఃఖధ్వనికి కట్టు బడకుండా అన్నిటినీ తనలో లీనం చేసుకున్నప్పుడు- అన్నిటినీ విన్నప్పుడు ఆ వేయిగొంతుకల పాట సిద్ధార్థునికి ఒక్క మాటలో మోగింది. ఆ మాట ”ఓంకారం” అనగా పరిపూర్ణం.

”విన్నావా” అన్నట్టు వాసుదేవుడు సిద్ధార్థుని వైపు చూచాడు. వాసుదేవుని చిరునవ్వు వెలిగిపోతూ ఉన్నది. అతని ముఖంలోని ప్రతి ముడతలోనూ వెలుగు ప్రసరిస్తూ ఉన్నది. ఆ నది గొంతుకలన్నీ కలిసి ఓంకారంగా వినిపించినట్టు. ఆ వెలుగునవ్వుతో చూచాడు సిద్ధార్థునివైపు. అతని ముఖంలో కూడా అదేనవ్వు మొలకెత్తింది. అతని గాయం మాని పోతున్నది. అతడు ఏకత్వంలో చేరిపోతున్నాడు.

ఆ క్షణం నుంచి సిద్ధార్థుడు తనవిధితో పోరాటం మానాడు. జ్ఞానంవల్ల రాగల శాంతి లభించింది. రాగ ద్వేషాల సంఘర్షణ అంతరించింది. సర్వ జీవితంలో సామరస్యం కుదిరింది. సర్వభూత ప్రేమ కలిగింది. నదీప్రవాహంలో లీనుడైనాడు. సర్వైక్య భావం ప్రాప్తించింది.

వాసుదేవుడు లేచాడు. సిద్ధార్థుని కళ్ళలోనికి చూచాడు. అందులో జ్ఞాన తేజస్సు గోచరించింది. ఆశీర్వదిస్తున్నట్టుగా అతని వీపుమీద తట్టి అన్నాడు: ”సిద్ధార్థా! ఈ క్షణంకోసం ఎదురుచూచాను. ఆ సమయం వచ్చింది. దీర్ఘకాలం నేను పల్లెకారిగా వాసుదేవునిగా ఉన్నాను. అవసరం తీరింది. కుటీరమా! శలవు. నదీ ! శలవు సిద్ధార్థా !శలవు.”

సిద్ధార్థుడు వంగి నమస్కారం చేశాడు. ”నాకు తెలుసును నీవు అడవిలోనికి వెళుతున్నావా?” అన్నాడు. ”అవును అడవిలోకి వెళుతున్నాను. సర్వైక్యస్థితిలో వెళ్ళుతున్నాను” అన్నాడు వాసుదేవుడు. వెళ్ళుతూ ఉన్న వాసుదేవుని వైపు చూస్తూ సిద్ధార్థుడు నిలబడ్డాడు. అతని అడుగులో శాంతి, అతని ముఖంలో పరమసుఖం, అతని ఆకారంలో తేజస్సు నిండి వున్నది.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *