సిద్ధార్థ-8

సిద్ధార్థ-8

3. సంసారం

సిద్ధార్థుడు చాలా దినాలు లౌకిక జీవితాన్ని – దానికి అంటకుండా గడిపాడు. శ్రమణుడుగా ఉండినప్పుడు మొద్దువారిన అతని ఇంద్రియాలు తిరిగి మేలుకొన్నవి. అర్థాన్ని, కామాన్ని, అధికారాన్ని అతడు రుచిచూచాడు. కాని అంతకాలం హదయంలో శ్రమణుడుగానే వున్నాడు. కమల తెలివితో ఈ విషయాన్ని గ్రహించింది. అతని జీవితం ఎల్లప్పుడూ ఆలోచన, ప్రతీక్షణ, ఉపవాసము వీటి మీదనే లగ్నమై ఉండేది. లోకంలో సామాన్య జనంతో అతనికి సంబంధం లేదు. అతడు వారికి వేరుగానే వుండేవాడు.

సంవత్సరాలు గడిచినవి. సుఖాలలో మునిగి తేలుతూ ఉన్న సిద్ధార్థునికి కాలచక్రం దొర్లిపోతూ ఉన్నదనే గమనమే లేదు. అతడు శ్రీమంతుడైనాడు. ఊరి వెలుపల నది వొడ్డున సొంత యిల్లు కట్టిం చాడు. సొంత నౌకరులను పెట్టాడు. అందరికీ అతడంటే గౌరవం – డబ్బుకోసమూ సలహాల కోసమూ అతని వద్దకు వస్తూ ఉండేవాళ్లు. కాని కమలతో తప్ప వేరెవ్వరితోనూ అతనికి గాఢ స్నేహం లేదు.

గౌతమబుద్ధుని బోధలు విన్న తరువాతను, గోవిందుని వదలిపెట్టి వచ్చిన తరువాతను అతనికి కలిగిన ఉజ్జ్వల జ్ఞానోదయము, మెలకువతో కూడిన ఆ ప్రతీక్షణ; గురువులతోనూ సిద్ధాంతాలతోనూ సంబంధం లేకుండా ఒంటరిగా నిలబడగలిగిన నాటి ఆత్మవిశ్వాసము; తన హదయంలోని దివ్యవాణిని వినవలెనన్న ఆసక్తి, సంసిద్ధత – ఇవన్నీ అంతరించి స్మతి మాత్రంగా మిగిలిపోయినవి. ఒకనాడు అతనిలో పొంగులు వారి ¬రెత్తిన దివ్యధార ఈనాడు ఎక్కడో దూరంగా మూలుగుతున్నట్టు వినిపిస్తున్నది. అయినా, అతడు శ్రమణుల వల్లను, గౌతముని వల్లను, తన తండ్రి వల్లను, బ్రాహ్మణుల వల్లను నేర్చుకొన్న విషయాలు ఇంకా అతనిని అంటుకొని వున్నవి. నియమజీవితము, ఆలోచనలో ఆనందము, ధ్యానము, దేహము మనస్సు కాని ఆత్మను గూర్చిన జ్ఞానము, వీటి వాసన అతనిలో చాలావరకు నిలిచి వున్నది. మిగతావి అడుగంటి పోయినవి.

కుమ్మరిసారె ఒకసారి త్రిప్పిన తరువాత చాలసేపు తిరిగి క్రమక్రమంగా వడి తగ్గి ఆగిపోయి నట్టుగా, అతనిలోని వైరాగ్యచక్రము – ఆలోచనా చక్రము – వివేక చక్రము – దీర్ఘకాలం తిరిగి తిరిగి నెమ్మది నెమ్మదిగా ఆగలేక దాదాపుగా ఆగిపోయినవి. సంసార వ్యామోహము, మాంద్యము అతని ఆత్మను కప్పివేసినవి. అతని ఆత్మ బరువు, అలసట కలిగి జోకొట్టినట్టు నిద్రపోయింది. కాని అతని ఇంద్రియాలకు అదివరకు లేని మెలకువ కలిగింది. అతని ఇంద్రియాలు చాలా అనుభవాన్ని గడించినవి.

సిద్ధార్థుడు తన వ్యాపారం నిర్వహించుకునేవాడు, ఇతరుల మీద అధికారాన్ని చలాయించేవాడు. స్త్రీలతో ఆనందించేవాడు. పన్నీటిలో జలకమాడేవాడు. అందమైన దుస్తులు ధరించేవాడు. మధుర పదార్థాలతోనూ మత్స్య మాంసాలతోనూ భోజనం చేసేవాడు. మద్యపానం చేసేవాడు, జూదం ఆడేవాడు, పల్లకి మీద తిరిగేవాడు-మెత్తని పరుపులపై పవ్వళించేవాడు-ఇతరులకంటే తాను ఘనుడ ననుకొనేవాడు. ఇతరులను ఏవగింపుతో చూచేవాడు. వ్యాపారంలో ఏవైనా చిక్కులు కలిగి కామస్వామి బాధపడుతూ ఉంటే అతనిని గేలిచేస్తూ మాట్లాడేవాడు. అయితే పోనుపోను అతని అహంకారం కొంత తగ్గింది.

ఒక వైపున సంపద పెరుగుతూ ఉంటే – ఇంకొక వైపున అతనికి సామాన్య ప్రజల అల్పత్వమూ వ్యాకులత పట్టుకున్నవి. సామాన్య ప్రజలను చూచి అతడు ఈర్ష్య పడేవాడు. వాళ్ళకు సుఖదుఃఖాలతో పాటు భార్యాబిడ్డలు ఉన్నారు. భార్యాబిడ్డలను ప్రేమిస్తూ వాళ్ళు ఆశతో జీవిస్తూ ఉంటారు. అలాంటి ఆనందం తనకు లేదని అతని ఈర్ష్య. వాళ్ళ ఆనందం లేకపోయినా వాళ్ళ అల్పత్వం అబ్బింది. అసంతప్తి, నిరుత్సాహము, విచారము, సోమరి తనము, ద్వేషము – ధనికులకుండే మనోవ్యాధి ఇవన్నీ అతనికి సంక్రమించినవి.

సన్నని ముసుగులాగా మంచు తెరలాగా అతనిలో ఒక అలసట యేర్పడి మెల్లమెల్లగా పుంజుకొని కొంత కాలానికి మోయరాని బరువై కూర్చున్నది. నూతన వస్త్రాలు కాలం గడిచే కొద్దీ వన్నె మాసి చినుగులు పట్టినట్టు అతని జీవితం వెలుగును సారాన్ని కోల్పోయి వికారరూపం తాల్చింది. ఆ మార్పును అతడు గమనించలేదు. ఒకనాడు తనలో మేలుకొని సుస్పష్టంగా వినిపించిన అంతర్వాణి, తనను ఉదాత్తపథంలో నడిపిన అంతర్వాణి, ఈనాడు మూగవోయిందని మాత్రం అతనికి తెలిసివచ్చింది.

అతనిని సంసారం చుట్టుకున్నది. భోగవాంఛకు, దురాశకు, సోమరితనానికి, తానెప్పుడూ అసహ్యించు కునే ధనార్జనా పరత్వానికి అతడు వశుడైనాడు. చివరకు అతని సంపదే అతనికొక బోనుగా తయారైంది. ఇదివరకు ధనార్జన అతనికి ఒక క్రీడగా వుండేది. అదే ఇప్పుడు అతనిని బంధించే శంఖలంగా పరిణమించింది. అతని పతనం ఎంతవరకు దిగిందంటే : జూదమాడి ధనార్జన చేయడానికి సిద్ధపడ్డాడు.

డబ్బుపెట్టి, నగలుపెట్టి జూదం ఆడడం ప్రారంభించాడు. అందులో అతని ఉద్రేకం పట్టపగ్గాలు లేకుండా పెచ్చు పెరిగింది. అతడు పెట్టే పై పందెములు చూచి ఎవ్వరూ అతనితో ఆడడానికి సాహసించ లేకపొయ్యేవారు. జూదం ఆడితేకాని అతనికి తోచేది కాదు. డబ్బు వచ్చినా పోయినా అతనికి లెక్క లేదు. అసలు ఆడడమే అతనికి మహానందం. తనకు ధనం ఒక లెక్కలోనిది కాదని చూపడానికి జూదం అతనికి సాధనమైంది. ధనాన్ని వెదజల్లుతూ తన్ను చూచి తానే అసహ్యించు కునేవాడు. తన ఆవేశానికి తానే నవ్వుకునేవాడు. జూదంలో వేలకొలది పోగొట్టుకొన్నాడు. వేలకొలది సంపాదించాడు. ధనం, నగలు, ఒక యిల్లు కూడా పోయినవి. మళ్ళా వచ్చినవి. పై పందెములు వేస్తూ గెలుపు ఓటమి తేలని సందిగ్ధ స్థితిలో వుండే ఆవేశము, ఆకాంక్ష, ఉద్రేకము, అతనికి చెప్పరానంత ఆనందాన్ని కలిగించేవి. ఆ విధమైన అనుభూతిమీది రక్తికొద్దీ దానిని పెంచుకోడానికి అతడు విసుగు వేసట లేకుండా జూదమాడేవాడు.

మందమైన నిస్సారమైన బ్రతుకులో ఆలాంటి ఉద్రేకమూ, తద్వారా ఆనందానుభవమూ అతనికి అగత్యములైనవి. జూదంలో ఓడేవాడు. తిరిగి ఆడడానికి ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర నుంచి గొంతుమీద కూర్చుని బాకీలు వసూలు చేసేవాడు. ధనం మీద తనకంత అసహ్యమని తెలపడమే అతని కోరిక.

పదేపదే ఓడడం వల్ల అతనికి సహనం సన్నగిల్లింది. అప్పులు వసూలు కావడం మందగించడంతో అసహనం మరీ పెచ్చు పెరిగింది. పేదసాదల మీద మునుపటి దయాదాక్షిణ్యాలు పోయినవి. జూదంలో వేలకొలది నష్టమయ్యేకొద్దీ వ్యాపారంలో అధిక లాభాలు రాబట్టవలెనన్న కాంక్ష అధికమైనది. రాత్రులు నిద్రలో కూడా అతనికి ధనాన్ని గూర్చిన కలలే – నిద్రలేచి అద్దంలో తన మొగం చూచుకునేవాడు. ముదురుపారి వికారంగా కనబడేది. తనకే వెగటు వేసేది. వెంటనే మద్యపానం చేసేవాడు. మళ్ళా జూదానికి కూర్చునేవాడు. ఈ సుడిగుండంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు.

అతనికి ఒక పూర్వానుభవం స్మతికి వచ్చింది. ఒకనాడు సాయం కాలం ఉద్యానవనంలో కమలతో కూర్చుని ఉన్నాడు. ఏవో కబురులు చెప్పు కుంటున్నారు. కమల గంభీరంగా మాట్లాడుతున్నది. విచారము విసుగుదల ఆమె ధోరణిలో కనబడుతున్నవి. ఆమె గౌతమబుద్ధుని గూర్చి – ఆయన రూపు రేఖలను గూర్చి అడుగుతున్నది. అన్నీ విన్న తరువాత కమల నిట్టూర్చి అన్నది : ”స్వల్ప కాలంలో నేను గూడా బుద్ధుని శిష్యురాలినవుతాను. ఈ తోటను ఆయనకు సమర్పిస్తాను. ఆయన ధర్మమే నాకు శరణ్యం” అని. ఆ మాటలంటూనే కమల అతనిని దగ్గరకు లాక్కున్నది. పట్టరాని ఉద్రేకములో – కన్నీళ్లు పెట్టుకొంటూ – పరుగెత్తి పోతూ ఉన్న ఆ సుఖప్రవాహంలో చిట్టచివరి మాధుర్యాన్ని దోసిలి నిండా పట్టి తనివితీర తాగదలచినట్టుగా – అతనిని గాఢాతి గాఢంగా, భయంకరంగా కౌగిలించుకున్నది.

కామానికి మత్యువుకు ఎంత సన్నిహిత సంబంధం ఉన్నదీ అప్పుడు స్పష్టపడినట్టుగా ఇదివరకెప్పుడూ అతనికి స్పష్టపడిందికాదు. ఇద్దరూ కలిసి పండుకున్నారు. అతడు కమల ముఖాన్ని పరికించి చూచాడు. ఆ ముఖంలో ఆ పెదవుల చివరల ఒక విచార రేఖ తీర్చినట్టుగా కన్పించింది. తన తల కూడా అక్కడక్కడ నెరుస్తూ వున్నట్టు కన్పించింది. దిగులుతోనూ భయంతోనూ కమలను వదలిపెట్టి తన ఇంటికి వెళ్ళాడు.

సిద్ధార్థుని జీవితంలో ఒక అధ్యాయం ముగియ నున్న రోజు అది. ఆ రాత్రి ఇంటివద్దనే వున్నాడు. నాట్యాలు ముగిసినవి. బాగా తాగాడు. అలిసిపోయి పండుకునే వేళకు అర్థరాత్రి అయింది. ఒకటే ఆందోళన. ఒకటే నిరాశ. కన్నీళ్లు ఉబికి వస్తున్నవి. ఎంత ప్రయత్నించినా కళ్లు మూతపడ లేదు. మనస్సులో మితిమీరిన దిగులు గాటంగా త్రాగినప్పుడు, అదేపనిగా కామాసక్తుడైనప్పుడు కలిగే వెగటు ఓకరింత అతనిలోనుంచి పుట్టుకొని వస్తూ వున్నది. అసలు తన్ను చూచుకుంటేనే వెగటు వేస్తున్నది. తలమీద సుగంధ తైలాల వాసన, దేహంమీద అత్తరువాసన, నోటివెంట సారాయి వాసన, ఇవన్నీ తనమీదనే తనకు అసహ్యభావాన్ని కలిగిస్తూ వున్నవి. ఎవరైనా మిక్కుటంగా తిని, త్రాగి కడుపులో గలబరించినప్పుడు బలవంతంగా డోకు తెచ్చుకొని కొంచం హాయి చిక్కిందనుకున్నట్టు ఈ భోగాలను ఈ తుచ్ఛ జీవితాన్ని ఒక్కసారిగా వదిలించుకుంటే బాగుండుననుకున్నాడు సిద్ధార్థుడు.

అతనికి తెల్లవారుతూ వుండగా కొంచెం కునుకు పట్టింది. అందులో ఒక కల వచ్చింది : బంగారు పంజరంలో పెట్టి కమల ఒక పిట్టను పెంచుతున్నది. ఆ పిట్టరోజూ ప్రొద్దున పాడేది. ఆరోజు పాట వినిపించలేదు. ఆశ్చర్యంతో అతడు పంజరం వద్దకు వెళ్ళి చూచాడు. పిట్ట చచ్చిపోయింది. దానిని బైటకు తీసి వీధిలో పారవేశాడు. ఆ చచ్చిన పిట్టతోపాటు తనలోనుంచి మంచి భాగాన్నంతా వీధిలో పారవేసి నట్టు అతనికేదో భయమూ బాధా కలిగినవి.

నిద్రలేచాడు. మనసులో ఏమో దిగులు, ”బ్రతుకంతా అవివేకంగా గడిపాను. సార్థకమైంది ఏమీ మిగలలేదు. పడవ పగిలి ఒడ్డున ఒంటరిగా నిల్చున్న నావికుని లాగా వున్నాను.” అనుకున్నాడు.

ఆ దిగులుతోనే సిద్ధార్థుడు తన తోటలోకి వెళ్ళాడు. తోట తలుపులు మూశాడు. మామిడి చెట్టు నీడలో కూర్చున్నాడు. ఇంకా అదే భయం. తాను చచ్చిపోతున్నట్టుగా తోచింది. ఆలోచనలను చిక్కబట్టాడు. బాల్యం నుంచి తాను బతికిన బ్రతుకునంతా స్మరించుకున్నాడు. తాను ఎన్నడైనా నిజంగా సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాడా ? అనుభవించకేమి ? ఎన్నిసారులో అనుభవించాడు.

బాల్యంలో తన తెలివినిచూచి బ్రాహ్మణులు మెచ్చుకున్నారు. విద్యలలో సహపాఠులను మించాడు. పండితులతో తర్కవితర్కాలు చేశాడు. యజ్ఞకర్మలలో పాల్గొన్నాడు. అప్పుడు అతని హదయంలో ఒక వాణి వినిపించింది. తాను అనుసరించవలసిన మార్గం ముందున్నదని.

తరువాత యౌవనం వచ్చింది. అతనిలో ఒక ఆకాంక్ష ఆగనీకుండా ముందుకు నెట్ట నారంభిం చింది. బ్రాహ్మణోపదేశాలను అర్థం చేసుకోవలెనని చాలా తంటాలుపడ్డాడు. ఏ విజ్ఞానం సంపాదించినా దాని వెనక ఒక తీరని తష్ణ ఉండేది. ఆ తష్ణలో నుంచి ఒక వాణి వినిపించింది. తాను అనుసరించ వలసిన మార్గం ముందున్నదని.

ఇల్లు విడిచాడు. శ్రమణులలో చేరాడు. శ్రమణుల సాంగత్యం విడిచి బుద్ధభగవానుని వద్దకు వెళ్ళాడు. మళ్ళా అదే వాణి వినిపించింది. తాను అనుసరించవలసిన మార్గం ముందున్నదని.

ఇల్లు వదలి శ్రమణులతో చేరినప్పుడు, శ్రమణులను వదిలి బుద్ధభగవానుని వద్దకు వెళ్లినపుడు, ఆయనను కూడా వదిలి అజ్ఞాత మార్గాన్ని ప్రవేశించినపుడు అదే వాణి వినిపించింది.

ఆ వాణిని విని ఎంత కాలమైంది? చివరకు తాను అనుసరించిన మార్గం ఎట్టిది ? ఒక ఉదాత్త లక్ష్యం లేకుండా తష్ణ లేకుండా, దివ్యానుభూతి లేకుండా అల్ప భోగాలతో తప్తిపడుతూ, వాటి వల్లనైనా వాస్తవమైన తప్తి లేకుండా ఎన్ని దీర్ఘ సంవత్సరాలు గడిపాడు! లోకులతోపాటు తానూ జీవితాన్ని గడపవలెననుకున్నాడు. కాని వారి బ్రతుకుకన్నా తన బతుకు మరీ భ్రష్టమైంది. లోకుల లక్ష్యము, తష్ణ వేరు. తన లక్ష్యము, తష్ణ వేరు.

అతడు ప్రేమించింది ఒక్క కమలను. కాని ఇంకా తాను కమలను ప్రేమిస్తున్నాడా ? ఇంకా తనకు కమల కావలెనా ? కమలకు తాను కావలెనా? ఇంత కాలమూ తామిద్దరు ఆడిన నాటకానికి పరమార్థం ఏమిటి? ఈ నటన కోసం బ్రతకడం పరమార్థమా? కాదు కాదు ! ఈ నాటకమే సంసారం. ఇది బాలురకు మాత్రమే తగిన ఆట. ఈ ఆటను కొంతకాలం ఆడుతూ సుఖించవచ్చు. ఎల్ల కాలం ఆడతగింది కాదు.

ఈ నాటకం ముగిసిందని సిద్ధార్థుడు తెలుసు కున్నాడు. అందులో ఇంకా నటించడం అసాధ్యమని కూడా తెలుసుకున్నాడు. అతని దేహాంలో ఒక కంపం కలిగింది. తనలో ఏదో చచ్చిపోయినట్టు అనిపించింది.

ఆ రోజంతా ఆ మామిడి చెట్టు క్రిందనే కూర్చు న్నాడు, తన తండ్రిని గోవిందుని గౌతమబుద్ధుని స్మరిస్తూ. ఇందరిని వదిలిపెట్టి వచ్చింది ఇంకొక కామస్వామి కావడానికేనా? చీకటి పడేవరకు అలాగే కూర్చున్నాడు. తల యెత్తి చూచాడు, ఆకాశాన నక్షత్రాల వైపు. మామిడి చెట్టును చూచి అనుకున్నాడు : నా తోటలో నేను పెంచిన మామిడి చెట్టు ఇది” ఆ మాటకు నవ్వుకున్నాడు. ”నా తోట! నేను పెంచిన మామిడి చెట్టు ! ఎంత అవివేకం!”

అంతా ముగిసింది. అతని మనసులో తోట, ఆ మామిడి చెట్టు చెరిగిపోయినవి. లేచాడు. ఆ రోజు తిండి లేదు. ఆకలి వేస్తున్నది. తన యిల్లు, శాకపాకాలు జ్ఞాపకం వచ్చినవి. విసుగుదలతో చిరునవ్వు నవ్వాడు. అవికూడా ఆతని మనసులో నుంచి చెరిగిపోయినవి. ఆ రాత్రే సిద్ధార్థుడు ఆ తోటను, ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. అతని జాడ తెలుసుకోడానికి కమల ప్రయత్నించలేదు. అతడు వెళ్ళినట్టు తెలిసినప్పుడు కమలకు ఆశ్చర్యం కలగలేదు. అట్టిది జరుగుతుందని ఆమె అను కుంటూనే ఉన్నది. వాస్తవంలో అతడు శ్రమణుడు. శ్రమణులకు ఇల్లు వాకిలి ఏమిటి ? అతనితో చివరిసారి పొందిన సుఖాన్ని క్షణకాలం స్మరించు కున్నది కమల.

కమల లేచి బంగారుపంజరం వద్దకు వెళ్ళింది. పంజరం తలుపులు తెరిచింది. పిట్టను బైటికి తీసి వదిలి పెట్టింది. చాలా కాలం ఆ పిట్ట పోయిన వైపు చూస్తూ ఉండేది. ఆ నాటినుంచి కమల ఇంటికి రసికులు రావడం లేదు. కొన్నాళ్ళకు తాను గర్భవతిగా ఉన్నట్టు కమల గ్రహించింది.

(ఇంకా ఉంది)

మూలం: హర్మన్‌హెస్‌

తెలుగు అనువాదం: బెల్లంకొండ రాఘవరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *