మాదాపూర్‌లో నిర్మాత ఇంటికి వెళ్లి, ఆయనను కలిసి కథ విన్పించి వచ్చేసరికి సాహితి, లిపిక వెళ్లిపోయారు. సాహితి నా కూతురు. లిపిక సాహితి కూతురు. నాకు మనవరాలు. ఆరేళ్ల వయసు. వెళ్లిపోతామని చెప్పారు. వెళ్లిపోయారు.
కథ బాగుందని నిర్మాత అన్నా, నాకు పెద్దగా ఆనందం లేదు. కథ ఒక కొలిక్కి వచ్చి అది సెట్స్ మీదకి వెళ్లేటప్పటికి చాలా టైమ్ పడుతుంది. మధ్యలో చాలా మార్పులు. ఇంకా కొంత మందికి అవసరాన్ని బట్టి కథ వినిపించాల్సి ఉంటుంది. దాన్నే స్టోరీ ట్రీట్మెంట్ అంటారు.
ఊబర్ కారు, ఓలా కారు దొరకలేదు. బస్సులో ఇంటికి బయల్దేరాను. ఆదివారం కాబట్టి డ్రైవరు లేడు. నిర్మాత కార్లు ఉన్నా నేను అడగను. ఆ సమయానికి ఏ ట్రాన్స్‌పోర్టు దొరికితే అందులో వచ్చేస్తాను.
ఇంటికి వస్తున్నప్పుడు ఆ ముందు రెండు రోజులు లిపికతో గడిపిన జ్ఞాపకాలు నా మనసుని ఊపుతున్నాయి..
”తాతా మనం జంప్స్ అండ్ బంప్స్కి వెళ్దామా?” అడిగింది వచ్చిన రోజునే లిపిక.
”వెళ్దాం. కాని నువ్వు శనివారం వస్తావు. ఆదివారం సాయంత్రం వెళ్లిపోతావు. సోమవారం నీకు స్కూలు. ఈ రోజు నిన్ను ఇంట్లో ఉంచమని అమ్మమ్మ చెబుతుంది ఏం చెయ్యాలి?” అన్నాను లిపికను రెండు చేతులు పట్టుకుని దగ్గరగా లాక్కుని.
”ఒక గంటే కదా. వెళ్లొచ్చేద్దాం” మళ్లీ అడిగింది.
”ఇప్పుడే వచ్చావు. వెంటనే నిన్ను నేను బయటకు తీసుకెళ్లితే మీ అమ్మ, అమ్మమ్మ నన్ను వాయగొడతారు”
”ఏం వాయగొట్టరు. నేను చెప్తాగా?”
”అయితే చెప్పు”
మా ఇద్దరి సంభాషణ విన్న మా ఆవిడ, నా కూతురు ఒకరి తరువాత ఒకరు ఇలా సెలవిచ్చారు.
”దాన్ని ఇప్పుడు బయటకు తీసుకెళ్లకండి. చల్లగాలి. అసలే దానికి జలుబుగా ఉంది” అంది మా ఆవిడ.
”మీరు బయటకు తీసుకెళ్తారు. జంప్స్ ఎన్ బంప్స్ అంటారు. అక్కడి నుంచి ఐస్‌క్రీమ్ షాపుకు తీసుకెళ్తారు?” అంది సాహితి.
‘ఏం చెయ్యను?’ నా మొహంలో ఒక ప్రశ్న వేలాడేసుకుని కూర్చున్నాను. ఏం మాట్లాడితే ఏం ప్రమాదం వచ్చి పడుతుందోనని. వాళ్ల మాటలు విన్న లిపిక,
”నేను ఐసుక్రీములు అడగను కదా” అంది.
”అడగదంట. తీసుకెళ్లనా?” అన్నాను వెంటనే. ”అది అలానే అంటుంది. మీరు ఇలానే అంటారు. చివరికి మాకు కంఠోశోషే మిగులుతుంది.” అంది మా ఆవిడ.
‘ఏం చెయ్యను?’ అని నా మొహంలో మళ్లీ ప్రశ్న మార్కు.
”ఇప్పుడే వచ్చావు కదా. డ్రెస్ ఛేంజ్ చేసుకొని వేడి నీళ్లతో స్నానం చేసిరా. అప్పటికి నాకు ఏదో ఒక ఐడియా వస్తుంది” అన్నాను లిపిక బుగ్గమీద ముద్దుపెట్టి.
”సరే” అంటూ వాళ్ల అమ్మ దగ్గరికి పరుగెత్తింది. అన్నమాట ప్రకారం అది మళ్లీ వచ్చి జంప్స్ ఎన్ బంప్స్ అని మొదలెడుతుంది. అబద్ధం ఆడాలి. లిపికను తీసుకొని హాయిగా బయట గడిపి రావాలి కొంత సమయం.
”ఇంట్లో సరుకులైపోయినట్లున్నాయి. విజేతకు వెళ్లి రానా?” అన్నాను.
”వెళ్లండి. లిపికను తీసుకువెళ్లొద్దు” అంది మా ఆవిడ.
”నీకు బి.పి., షుగర్‌కి ట్యాబ్లెట్స్. సాహితికి రసమలై, పాపకి మోతీచూర్ లడ్డూ తేవాలి కదా. వెళ్తాను” అన్నాను.
”వెళ్లండి. అన్నీ తీసుకురండి. లిపికను తీసుకు వెళ్లొద్దు” అంది సాహితి కూడా.
ఈ లోపు స్నానం పూర్తి చేసి, చక్కగా బుట్ట బొమ్మలా తయారయ్యింది లిపిక.
”మరి దాన్ని ఎందుకు తయారు చేస్తున్నారు?” అడిగాను నేను.
”జంప్స్ ఎన్ బంప్స్కి వెళ్లడానికి” చెప్పింది లిపిక. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఏదో ఒక ఎత్తు వెయ్యాలి. లిపికతో చెప్పాను ”రేపు మనం జంప్స్ ఎన్ బంప్స్కి వెళ్దాం. ఈ రోజు ఆదివారం. ఆలయం ఖాళీగా ఉంటుంది. హనుమాన్ టెంపుల్‌కి వెళ్దాం” అని.
”నో” అంది.
చెవిలో నెమ్మదిగా ”అట్నుంచి అటు ఐస్‌క్రీమ్ పార్లర్‌కి కూడా వెళ్దాం” అని రహస్యంగా చెప్పాను. హయ్ హయ్ అని లిపిక కిసుక్కున నవ్వింది. ముక్కు మీద వేలేసి సైగ చేసాను. వాళ్లకి తెలియకూడదని.
”ఓ.కె.” అంది లిపిక. అప్పుడు బయటకు వెళ్తూ
”మేం హనుమాన్ ఆలయానికి వెళ్తున్నాం” అని గట్టిగా చెప్పాను.
”నిజంగా?” అంది సాహితి.
”లేదమ్మా ఆ జంప్స్‌కి వెళ్లి గెంతులేస్తారు” అంది లిపిక వాళ్ల అమ్మమ్మ.
”లేదమ్మా ప్రామిస్. మీ అమ్మ అలానే అంటుంది” అంటూ ఇంటి నుంచి బయటపడ్డాం.
”తొందరగా వెళ్లి వచ్చెయ్యండి” అని మా ఆవిడ కేక పెట్టింది.
”ఇక్కడే కదా. ఇప్పుడే వచ్చేస్తాం” అని నేనూ గట్టిగా అరిచి చెప్పాను. లిపిక గంతులు. ఇద్దరం నా నల్ల ఆక్టివా స్కూటర్ మీద బయల్దేరాం.
* * * *
స్కూటర్ మీద ఉండగా
”నువ్వు బుల్లెట్ కొనుక్కోవచ్చుగా. అదైతే స్పీడుగా వెళ్తుంది” అంది లిపిక.
”ఇప్పుడు నాకు అది హెవీగా ఉంటుంది నాన్నా” అన్నాను.
”ఎందుకంటే బుల్లెట్ మా బాబాయి దగ్గరుంది. నన్ను ఎక్కించి తిప్పుతుంటాడు. వేగంగా వెళుతుంది. నువ్వు కొనుక్కో. నీకు చెబితే నువ్వు కొనుక్కుంటావని చెప్పాను” అంది.
నేను నవ్వాను.
”మరి మీ పప్పాకి చెప్పలేకపోయావా?” అనడిగాను.
”చెప్పాను. కాని పప్పా కొనలేదు”
”లేదు. లేదు. కొంటారు”
చిన్న రోడ్డు మీద నుంచి పెద్ద రోడ్డుకు వస్తుంటే కార్లు చూసింది.
”కారు కొనుక్కో” అంది.
”కారు ఉండేది. అమ్మేసాను. అయినా ఈ హైద్రాబాద్ ట్రాఫిక్‌లో డ్రైవ్ చెయ్యడం కష్టం పండూ” అన్నాను.
”అవును మా హబ్సిగూడలో కూడా చాలా ట్రాఫిక్” అంది.
”మరి రోజూ స్కూలుకి తార్నాక వెళతావు కదా”
”అవును అమ్మ బైక్ మీద తీసుకెళ్తుంది. మార్నింగ్ కదా. అంత ట్రాఫిక్ ఉండదు. పప్పా కూడా తీసుకెళ్తారు ఒక్కోసారి”
ఇంతలో హనుమాన్ టెంపుల్ వచ్చింది. ఇద్దరం దిగి, లోపలికి వెళ్లాం.
”హనుమాన్ అంటే నీకిష్టమా? నాకూ ఇష్టమే” అంది లిపిక.
”నాకూ ఇష్టమే. బిగ్ హనుమాన్” అన్నాన్నేను.
”గద ఉంటుంది. తోక ఉంటుంది. స్కైలో ఎగురుతాడు.. ఆ హనుమాన్” అని చెప్పింది. దానికి ఎప్పుడో నేను చెప్పిన మాటలే గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పింది.
”మా బుజ్జితల్లి” అని ముద్దుపెట్టు కున్నాను. ఆలయం లోపలికి వెళ్లాం. హనుమంతుడు ఎంతో అద్భుతంగా ఉన్నారు. లిపిక అలా చూస్తూనే ఉంది. నాకు ఆ విగ్రహం అంటే చాలా ఇష్టం.
”దణ్ణం పెట్టుకో” అని చెప్పాను లిపికకు. పెట్టుకుంది భక్తిగా. కళ్లు మూసుకుని. మనసులో ”మనోజనం మారుత తుల్యవేగం..” శ్లోకం చెప్పి కళ్లు తెరిచి దక్షిణ హుండీలో వేసాను. హారతి తీసుకుని పాపకి హారతి ఇచ్చాను. నుదుట నేను బొట్టు పెట్టుకొని, లిపికకు పెట్టాను. సెనగలు ప్రసాదం ఇచ్చారు.
ఇద్దరం బయటకు వచ్చేసాం. గట్టుమీద కూర్చుని ఆ సెనగల ప్రసాదం తిన్నాం.
”మరి ఐస్‌క్రీమో?” అంది లిపిక. నవ్వాను.
”వెళ్దాం తల్లి” అని లేచి బయటకు వచ్చాం. స్కూటర్ స్టార్టు చేసి ఐస్‌క్రీమ్ పార్లర్ వైపు బయల్దేరాం.
”ఆదివారం కదా భక్తులు ఎక్కువగా లేరు” అన్నాన్నేను.
”భక్తి అంటే ఏమిటి?” అడిగింది లిపిక.
”భక్తి అంటే ప్రేమ”
”ప్రేమంటే?”
”నీ మీద నాకున్నది. నువ్వంటే నాకు ప్రేమ.”
”మరి అమ్మంటే నీకు ప్రేమ లేదా.” వెంటనే అడిగింది.
”నా కూతురు కదా ఉంటుంది” అన్నాను. ఐస్‌క్రీమ్ పార్లర్ వచ్చేసింది. పార్లర్‌లోకి దిగి గంతులేసుకుంటూ వెళ్లింది. నేను స్కూటర్ పార్కు చేసి వెళ్లాను. ఇద్దరం టేబుట్ ముందర కూర్చున్నాం. కుర్రాడు వచ్చాడు.
”నువ్వేం తింటావు?” అడిగాను.
”నాకు బటర్‌స్కాచ్” అంది. బాక్సుల్లో ఐస్‌క్రీమ్ చూస్తూ.
చెప్పాను. కుర్రాడు ఐస్‌క్రీమ్ తేవడానికి వెళ్లాడు. నాకు ఇంటి నుంచి మా ఆవిడ ఫోన్ చేసింది.
”దానికి ఐస్‌క్రీమ్ ఇప్పించారా ఏం?” అంది మా ఆవిడ ఫోన్లో. దీనికి ఎలా తెలిసిపోయింది. ఎక్కడ నుంచైనా చూస్తోందా? లేదు. అవకాశమే లేదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ ఇంటి పనిలో బిజీ. లేదంటే టి.వి. మొబైల్ ఫోన్లలో బిజీ.
”లేదు. లేదు. హనుమాన్ టెంపుల్లో ఉన్నాం” పచ్చి అబద్ధం ఆడేశాను.
”సరే తొందరగా వచ్చెయ్యండి” చెప్పింది. ఇంకా సాగదియ్యకుండా ఫోన్ కట్ చేసాను. హాయిగా లిపిక ఐస్‌క్రిమ్ తింది. నేను కూడా ఐస్‌క్రిమ్ తింటున్న లిపికను చూస్తూ, దాని మాటలు వింటూ లస్సీ తాగాను. ఈ ఆనందం ఎలా దొరుకుతుంది?
”ఇక్కడ మనం ఐస్‌క్రీమ్ తిన్న విషయం ఇంట్లో చెప్పకూడదు. సరేనా?” అన్నాను లిపికతో.
”చెప్పను” అంది.
* * * *
ఇంటికి వచ్చేసాం. ఏం జరగనట్లు ఓవరేక్షన్ చేసాం. వాళ్లు నమ్మేశారు. పిచ్చోళ్లు. తాతా మనవరాళ్ల గురించి వాళ్లకి ఏం తెలుసు? అయితే నాకు ఒక భయముంది. లిపికకు ఏ దగ్గో, జలుబో వస్తే…? భయమేసింది. ఆంజనేయస్వామికి దండం పెట్టాను. మీరే ఈ విషయంలో తలదూర్చి, మా ఆనందం కాపాడండి అని. ఆ రాత్రి గడిచిపోయింది. లిపికకు జలుబు రాలేదు. ఆ మరుసటిరోజు లిపిక ఒక తెల్లకాగితం అడిగింది. ఇచ్చాను. దాని మీద వాటర్ కలర్స్ ముద్దలు ముద్దలుగా వేసి, గీతలుగా గీసి ఒక బొమ్మ తయారు చేసి
”ఎలా ఉంది నా పెయింటింగ్?” అని అడిగింది.
”సూపర్” అన్నాను. నవ్వింది.
నా తెల్లటి పరుపు మీద ఆ పెయింటింగ్, రంగులు పడేసింది. ఆ పరుపు కాస్త రంగుల పరుపు అయింది. ఆ తరువాత రోజు మళ్లీ పచారీ కొట్టుకు లిపిక, నేను వెళ్లాం.
”బెలూన్లు కావాలి” అంది.
రంగు రంగుల బెలూన్లు కొన్నాను. ఇంటికి తెచ్చాం.
”ఊదు” అంది.
”నేను ఊదలేను. బాబోయి” అన్నాను.
”అమ్మమ్మా నువ్వు ఊదవా?” అని వాళ్ల అమ్మమ్మని అడిగింది. ఆవిడ కొన్ని ఊదింది. వాళ్ల అమ్మ కొన్ని ఊదింది. ఆ బెలూన్లతో ఇల్లంతా ఒకటే సందడి. ఒకటే సంతోషం.
”నువ్వు కూడా ఆడు” అంది. ఆడాను ఆడాను.. అలసిపోయాను.
”ఇంక నేను ఆడలేను బేబీ” అన్నాను. ఆ అలుపులో ఆనందముంది.
”ఆడు” అంది.
”మీ అమ్మ ఆడుతుంది” అన్నాను. వాళ్ల అమ్మ కాసేపు ఆడింది. తరువాత వాళ్ల అమ్మమ్మ అడింది. బెలూన్లు ఎగురుతుంటే చూస్తూంటే, కిందికి వస్తుంటే పైకి కొట్టడం. అటు ఇటు గెంతడం ఆటలే ఆటలు..
ఆ తరువాత కిచెన్ డోర్ మీద సుద్దముక్కతో లెక్కలు. ఏ,బి.సి.డి.లు.. నెంబర్ టీమ్స్.. గీతలు.. కలపడాలు.. తీసివేతలు.. డోర్ నింపేసింది. ఫ్రిజ్ డోరు మీద బాల్ పాయింట్ పెన్నుతో, స్కెచ్ పెన్నుతో ఏవేవో బొమ్మలు, రాతలు..
”ఏంట్రా పండూ ఎవరైనా ఇలా ఫ్రిజ్ మీద గీస్తారా?” కోప్పడింది అమ్మమ్మ.
”అమ్మమ్మ నన్ను తిట్టింది. నీతో కటిఫ్” అని ఏడ్చింది.
”ఆపు. ఏడవకు” అంది వాళ్ల అమ్మ.
”ఏడవకమ్మా” అని గడ్డం పట్టుకుని బతిమి లాడాను నేను. కాసేపటికి ఏడుపు ఆపింది. డ్రెసింగ్ టేబుల్ డ్రాయర్లని, కింద ఉండే బాక్సులను హాలు మధ్యలో పెట్టింది. డైనింగ్ టేబుల్ కుర్చీలు హాల్లోకి లాగింది.
తరువాత ”ఊయల కావాలి” అంది.
”నువ్వేమైనా చిన్న పిల్లవా” అంది సాహితి.
”అది చిన్నపిల్లే” అని స్లాబ్ హుక్‌కి చీర ఊయల లాగ కట్టి వేలాడ దీసింది నా భార్య. దాని మీద హాయిగా చాలాసేపు ఊగింది లిపిక. నిలుచుని ఊగింది.
* * * * *
అలా లిపిక జ్ఞాపకాలతో ఇంటికి వచ్చాను. సోఫాలో కూర్చున్నాను. సాహితి, లిపిక వెళ్లిపోయారు.
ఇల్లంతా నిశ్శబ్దం.
నా భార్య దేవుడిగదిలో పడుకుని ఉంది. నిద్రపోతున్నట్లు లేదు. నా లాగే జ్ఞాపకాలతో కొట్టుకుపోతున్నట్లుంది. డిస్టర్బ్ చెయ్యాలని అనిపించలేదు.
కాళ్లు, చేతులు, మొహం కడుక్కుని ఫ్లాస్కులో కాఫీ, కప్పులో పోసుకొని తాగుతున్నాను.. పైన ఫ్యాను తిరుగుతోంది.
ఎగురుతూ ఎగురుతూ సీతాకోక చిలుక ఒక దగ్గర వాలినట్లు, ఫ్యాను గాలికి బెలూన్ ఎగిరి నా భుజం మీద వాలింది. లిపిక గుర్తుకొచ్చింది. లిపిక నా ఒంటి మీద చెయ్యివేసినట్లనిపించింది. కాఫీ కప్పు పెట్టడానికి కిచెన్‌లోకి వెళ్తుంటే తలుపుమీద సుద్దముక్కల రాతలు కనిపించాయి.
నాకిష్టమైన దేవరకొండ బాలగంగాధర్ తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ చదువుతూ మంచం మీద పడుకున్నాను. పక్కకు ఒత్తిగిల్లినప్పుడు నా కుడి భుజం మీద ఓ పేపరు ఉంది. అది లిపిక గీసిన వాటర్ కలర్స్ చిత్రం.. అలాగే నెమ్మదిగా తీసి నా పక్కనే పరుపు మీద ఉంచుకున్నాను. అది ఒక మాస్టర్ పీస్లాగ నా కళ్లకు కనిపించింది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. గాఢ నిద్ర పట్టింది. తెల్లవారి ఐదుకు మెలకువ వచ్చింది.
ఆ రోజు సాయంత్రం డాక్టరుకి ఫోన్ చేసి చెప్పాను. నా నిద్ర గురించి ”నిన్న రాత్రి భలే నిద్ర పట్టిందండి. చాణ్ణాల్ల తరువాత” అని.
”ఏం మందులు వేసుకున్నారండి” అని డాక్టరు అడిగారు.
”మా మనవరాలి జ్ఞాపకాలు” అని నవ్వుతూ అన్నాను.
”జ్ఞాపకాలా?” ఆశ్చర్యపోయాడు డాక్టరు.
”అవును” అని జరిగింది చెప్పాను. ఆయనకు అర్థం అయిందో లేదో నాకు తెలియదు. సరిగ్గా అప్పుడే మా అమ్మాయి ఫోన్ చేసింది.
”లిపికకు ఐస్‌క్రీమ్ పెట్టారా? లిపిక చెప్పింది” అంది. నా మౌనం.
”జలుబేం రాలేదు నాన్నా” అంది. పకపకా నవ్వాను.
– జియో లక్ష్మణ