పెంచెలకోన నరసింహస్వామి క్షేత్రం

పెంచెలకోన నరసింహస్వామి క్షేత్రం

పెంచెలకోన నరసింహస్వామి క్షేత్రం ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కేంద్రం నుండి 80 కి.మీ. దూరంలో, రావూరు మండల పరిధిలో ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా, శ్రీలక్ష్మీ సమేతంగా కొలువు దీరాడు.

స్థల పురాణం ప్రకారం హిరణ్యకశుపుని సంహారనంతరం ఉగ్రరూపంలో స్వామి అడవుల్లో సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి ఆయనతో చెలిమి చేసి శాంతింపజేసింది. దాంతో స్వామివారు ఆమెను వివాహం చేసుకొని చెంచుల ఇంటికి అల్లుడయ్యాడు.

చెంచులక్ష్మిని పెనవేసుకున్న రూపంలో స్వామి వారు ఇక్కడ భక్తులకు దర్శనమివ్వడంతో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంగా ఇది పేర్గాంచింది. కాలక్రమంలో ఇది పెంచెలకోనగా మారింది.

ఇక్కడ గర్భగుడిలో పెద్ద శిల రూపంలో స్వామి స్వయంభువుగా వెలిసి నిత్యపూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రానికి దగ్గరలోనే ఆదిలక్ష్మి అమ్మవారు కొలువుదీరారు.

ఈ కొండ పైనుంచి వర్షపు నీటి ధార వెండి కరగించి మూసలో పోసిన మాదిరి జారూతూ, దిగువన ఉన్న గ్రామాల గుండా ప్రవహిస్తూ కండలేరు జలాశయంలో కలుస్తుంది.

ఈ ప్రాంతంలో చాలా మందికి పెంచెలయ్య, పెంచెలమ్మ అనే పేర్లుంటాయి. ఈ నారసింహుడు గొల్లబోయిను శిలారూపాన అనుగ్రహించాడని చెబుతారు. గొల్లబోయి ఆలయం గోనుపల్లి గ్రామ సమీపంలో ఉంటుంది. ప్రతి శనివారం ఇక్కడ ఘనంగా పూజలు జరుగుతాయి.

పెంచెలకోనలో ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశినాడు స్వామివారి బ్ర¬్మత్సవాలు ప్రారంభ మవుతాయి. ఇక్కడ పూజలు పంచరాత్ర ఆగమాను సారం పంచాహ్నికంగా జరుగుతాయి.

ఈ స్వామికి ఛత్రవటి నారసింహస్వామి అని కూడా పేరుంది. కణ్వ మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలంగా పేరొందిన ఈ క్షేత్రంలో ఎత్తైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వచ్చే స్వామివారి ఉత్సవాల్లో ఇంటి అల్లునిగా భావించే చెంచులదే తొలి నైవేద్యంగా సమర్పిస్తారు.

దట్టమైన అటవీ ప్రాంతంలో, ప్రశాంత వాతావరణంలో, జలపాతాల మధ్యన, సరస్సులను ఆనుకొని దగ్గరగా ఉన్న ఈ క్షేత్రం విహార కేంద్రంగా కూడా అభివృద్ధి చెందింది.

ఇలా వెళ్లొచ్చు…

హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్లేందుకు బస్సు, రైల్వే సదుపాయాలున్నాయి. అక్కడి నుంచి బస్సుల్లో గాని, ప్రైవేట్‌ వాహనాల్లో గాని పెంచెలకోన వెళ్లొచ్చు. విజయవాడ నుంచి కూడా బస్సు లేదా రైల్లో నెల్లూరు చేరుకోవచ్చు.

– ఎస్‌.వి.ఎస్‌.భగవానులు, విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి. ట్రాన్స్‌కో, ఒంగోలు, 9441010622

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *