అసాధారణ ఆటగాడు

అసాధారణ ఆటగాడు

భారత క్యూస్పోర్ట్స్‌ రారాజు పంకజ్‌ అద్వానీ సరికొత్త చరిత్ర సష్టించాడు. బిలియర్డ్స్‌, స్నూకర్‌ విభాగాలలో ప్రపంచ, ఆసియా టైటిల్స్‌ సాధించడంతో పాటు కెరియర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేసిన ఏకైగా ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 34 ఏళ్ల వయసులోనే 21 ప్రపంచ టైటిల్స్‌తో పాటు ఆసియా స్నూకర్‌లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకొన్నాడు. బెంగళూరు వేదికగా ముగిసిన 2019 ప్రారంభ ఆసియా స్నూకర్‌ టోర్నీ రెడ్‌-6, రెడ్‌ -15 విభాగాలలో పంకజ్‌ విజేతగా నిలిచాడు.

గత 23 సంవత్సరాలుగా క్యూస్పోర్టే ఊపిరిగా చేసుకొన్న పంకజ్‌ ఇటు బిలియర్డ్స్‌లో మాత్రమే కాదు అటు స్నూకర్‌ గేమ్‌లోనూ ప్రపంచ విజేతగా, ఆసియా చాంపియన్‌గా అన్ని రకాల ఫార్మాట్లలో విజేతగా నిలవడం ద్వారా కెరియర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తిచేసిన ఏకైక ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

భారత్‌ చిరునామా

ఇన్‌డోర్‌ గేమ్స్‌కే రాయల్‌ గేమ్‌గా పేరుపొందిన బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌కు ప్రపంచ ప్రధాన క్రీడల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. ఇంగ్లండ్‌, భారత్‌, సింగపూర్‌, చైనా, మాల్టా, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, కెనడా, మియన్మార్‌, థాయ్‌లాండ్‌ లాంటి దేశాలలో విశేష ఆదరణ పొందుతున్న ఈ క్యూస్పోర్ట్‌లో అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ గెలుచుకొన్న దేశం భారత్‌ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలలో 10 కోట్ల 20 లక్షల మంది పురుషులు, మహిళలు బిలియర్డ్స్‌, స్నూకర్‌ క్రీడలు ఆడుతుంటే 45 కోట్లమంది అభిమానులున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం నుంచే మనదేశంలో బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడ తన ఉనికిని చాటుకుంది. అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ను, విశ్వవిజేతలను అందించిన క్రీడగా గుర్తింపు తెచ్చుకొంది. 1920లో భారత క్రీడారంగంలోకి దూసుకొచ్చిన ఈ ఆట విల్సన్‌ జోన్స్‌, మైకేల్‌ పెరెరా, గీత్‌ సేథీ లాంటి పలువురు దిగ్గజ ఆటగాళ్లను మనకు అందించింది.

పంకజ్‌ ఇప్పటి వరకూ జాతీయ సీనియర్‌, జూనియర్‌ స్థాయిల్లో 31 టైటిల్స్‌ సాధించాడు. జూనియర్‌ స్థాయిలో ఏడు బిలియర్డ్స్‌, నాలుగు స్నూకర్‌, సీనియర్‌ విభాగంలో 9 బిలియర్డ్స్‌, 11 స్నూకర్‌ ట్రోఫీలు అందుకొన్నాడు. భారత బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ చరిత్రలోనే అత్యధిక జాతీయ టైటిల్స్‌ సాధించిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

విశ్వవిజేత

చిన్నవయసు నుంచే బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల్లో పాల్గొంటూ వచ్చిన పంకజ్‌ అద్వానీ 2003లో ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌ సాధించడం ద్వారా తన జైత్రయాత్ర మొదలుపెట్టాడు. 2003 నుంచి 2018 మధ్య 14 సంవత్సరాల కాలంలో మొత్తం 18 ప్రపంచ టైటిల్స్‌ సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. భారత క్రీడాచరిత్రలోనే అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డుల్లో చోటు సంపాదించాడు. బిలియర్డ్స్‌ 150 పాయింట్ల ఫార్మాట్‌తో పాటు టైమ్‌ ఫార్మాట్‌ విభాగాలలోనూ పంకజ్‌ తిరుగులేని మొనగాడుగా గుర్తింపు పొందాడు. 2005, 2008, 2014, 2016, 2017 2018 సంవత్సరాలలో 150 పాయింట్ల ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. టైమ్‌ ఫార్మాట్లోనూ2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015 సంవత్సరాలలో విశ్వవిజేతగా నిలిచాడు.

స్నూకర్‌ విభాగంలో 2003, 2015 సంవత్సరాలలో విశ్వవిజేతగా నిలిచిన పంకజ్‌ ప్రపంచ సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌ టైటిల్స్‌ను 2014, 2015 సంవత్సరాలలో సాధించాడు. 2014లో ప్రపంచ టీమ్‌ బిలియర్డ్స్‌ టైటిల్‌ను సైతం భారత్‌కు అందించాడు. 2019 ఆసియా స్నూకర్‌ రెండు విభాగాలలోనూ పంకజ్‌ విజేతగా నిలవడం ద్వారా కెరియర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తి చేయగలిగాడు.

అవార్డులే అవార్డులు!

పంకజ్‌ ఎన్నో క్రీడా, పౌర పురస్కారాలు అందుకొన్నాడు. 2004లో అర్జున అవార్డు, 2005- 06లో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 2007లో ఏకలవ్య పురస్కారం, 2009లో పద్మశ్రీ పురస్కారం పంకజ్‌ను వరించాయి. భారత క్యూస్పోర్ట్‌ చరిత్రలో మాత్రమే కాదు ప్రపంచ బిలియర్డ్స్‌, స్నూకర్‌ క్రీడల చరిత్రలోనూ పంకజ్‌ అద్వానీ ఓ అసాధారణ క్రీడాకారుడిగా మిగిలిపోతాడు.

బంగారు పతకాలు

2006 దోహా ఆసియా క్రీడలు, 2010 గాంగ్జు ఆసియాక్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు. 23 సంవత్సరాల తన క్రీడా జీవితంలో పంకజ్‌ అద్వానీ 55 బంగారు పతకాలు,31 జాతీయ టైటిల్స్‌, 21 ప్రపంచ టైటిల్స్‌ సాధించి భారత క్రీడాచరిత్రలోనే మరే క్రీడాకారుడూ సాధించని ఘనతను సొంతం చేసుకొన్నాడు.

 –  క్రీడా కృష్ణ, 8466864969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *