పానకాల నరసింహస్వామి క్షేత్రం

పానకాల నరసింహస్వామి క్షేత్రం

మంగళగిరిని మంగళాచలం, మంగళశైలం, మంగళాద్రి, ధర్మాద్రి, ముక్త్యాద్రి అని కూడా పిలుస్తారు. ఇది సుప్రసిద్ధ వైష్ణవాలయం. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. ఇక్కడ నరసింహస్వామి గంధకంతో కూడిన పర్వతం మీద కొలువుదీరి ఉండటం విశేషం.

స్థల పురాణం ప్రకారం శ్రీమహావిష్ణువు నముచి అనే రాక్షసుని సంహారం కోసం సుదర్శన చక్రం రూపంలో వెంబడిస్తే, అతడు ప్రాణ రక్షణ కోసం మంగళగిరిలోని సూక్ష్మబిళంలో దాక్కున్నాడట. అప్పటికే అక్కడున్న నరసింహస్వామి సుదర్శన చక్రంలో ప్రవేశించి తన నిశ్వాసాగ్ని చేత నముచిని సంహరించాడు.

ఈ గుహ నేటికీ మనం చూడొచ్చు. కొండ మీద శ్రీమహావిష్ణువు సుదర్శన మూర్తిగా; శ్రీమహాలక్ష్మీ రాజ్యలక్ష్మి స్వరూపంలో స్వయంభువుగా వెలసి దర్శనమిస్తున్నారు.

ఉగ్రమూర్తి నరసింహస్వామి కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో నీటిని, ద్వాపర యుగంలో ఆవుపాలను, కలియుగంలో బెల్లపు పానకాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. పానకాన్ని స్వీకరించడం వలన ఈ స్వామికి పానకాల లక్ష్మీ నరసింహస్వామి అనే పేరొచ్చింది. ఇక్కడ నారసింహుడు పానకం సేవిస్తున్నట్టు గుటకల శబ్దం కూడా విన్పిస్తుందని కొందరు చెబుతారు. మరో విచిత్రం ఏమంటే స్వామివారికి భక్తులు ఎంత పానకం సమర్పించినప్పటికీ సగం మాత్రమే స్వీక రించి మిగిలినది భక్తులకే ప్రసాదంగా అందిస్తారు.

దిగువ సన్నిధిలో ఎడమ తొడపై అమ్మవారిని కూర్చోబెట్టుకొని సతీసమేతంగా నృసింహస్వామి మనకు దర్శనమిస్తాడు. దీన్ని ధర్మరాజు భీముడితో గండశిలను తెప్పించి విగ్రహంగా మలచి ప్రతిష్టించాడని పురాణ ప్రశస్తి.

ఈ ఆలయంలోని గాలిగోపురం దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనదిగా గుర్తింపు పొందింది. దీనిని క్రీ.శ. 1807-1809 మధ్యకాలంలో రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు.

మంగళగిరి కొండ పడుకొని ఉన్న ఏనుగు ఆకారంలో ఉంటుంది. ఏనుగు మీద అంబారీ మాదిరిగా గండాలయి స్వామి ఆలయం ఉంటుంది. ఈ దేవునికి రూపం ఉండదు. చిన్న గుహలో ఓ ఇనుపపాత్రలో ఆవు నెయ్యి, నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఆపదలో ఉన్నవారు ఇక్కడ దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని ప్రతీతి. శ్రీరామా నుజాచార్యులు ఈ ప్రదేశాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది.

10 సంవత్సరాల క్రితం వరకు కొండమీదుండే పానకపు స్వామిని భక్తులు 450 మెట్లు ఎక్కి దర్శించుకునేవారు. 2004 కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ కొండపైకి ఘాట్‌రోడ్డు నిర్మించారు. మంగళగిరి క్షేత్ర మహాత్యానికి సంబంధించిన ప్రస్తావన మనకు పురాణాల్లో కూడా కనిపిస్తుంది.

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పంచమి మొదలు, పూర్ణిమ వరకు స్వామివారి బ్ర¬్మత్సవాలు (రథోత్సవం) నిర్వహిస్తారు. మంగళగిరి తిరునాళ్లకి చాలా ప్రసిద్ధి. ఈ జాతరకు జనం లక్షల్లో వస్తారు.

ఇలా వెళ్లొచ్చు..

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లడానికి బస్సు, రైలు సదుపాయాలున్నాయి. అక్కడి నుంచి మంగళగిరి 11 కిలోమీటర్లు. గుంటూరు నుండి ప్రతి 5 నిమిషాలకు మంగళగిరి వెళ్లేందుకు ఓ బస్సు ఉంటుంది.

– ఎస్‌.వి.ఎస్‌.భగవానులు, డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి. ట్రాన్స్‌కో, ఒంగోలు, 9441010622

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *