నేను – నాన్న

నేను – నాన్న

చాలా రోజులయ్యింది కలం పట్టి, కథ రాసి! రాష్ట్రస్థాయిలో రచయితగా గుర్తింపు వచ్చింది. కానీ ఎప్పటికైనా ఒక నేషనల్‌ లెవెల్‌ విన్నింగ్‌ కథ సాహితీ లోకానికి అందించా లన్నది రచయితగా నా ఆశయం.

రాత్రి పదకొండు దాటుతున్న వేళ. ఇంట్లో వాళ్లంతా నిద్రలోకి జారుకున్నారు. మంచి కథ సిద్ధం కావడానికి ఒకట్రెండు ముడిసరుకులైతే ఉన్నాయి గానీ ఏ కథ ముందు మొదలుపెట్టాలో తోచడం లేదు. ఏదెలా ఉన్నా జరగాల్సింది జరగక మానదు కదా!

నా ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా అసలు కథ మొదలవుతోంది..

————

ప్లేటెత్తి చూపిస్తూ ‘ఏరా! ఇది మనుషులు తినే తిండేనా.. నీ చిన్నప్పుడు ఉగ్గు కూడా మీ అమ్మ నీకింత మెత్తగా తినిపించి ఉండదు…’ నా వంక తీక్షణంగా చూస్తూనే దాన్ని నేలకేసి విసిరికొట్టారు నాన్న.

ఆయన కోపాన్నంత తీవ్రస్థాయిలో చూపిస్తారని ఊహించని నా భార్య రేవతి ఖంగుతింది. పిల్లలిద్దరూ తలెత్తకుండా గబగబా భోంచేస్తున్నారు. రాత్రి డైనింగ్‌ దగ్గర జరుగుతున్న దశ్యమిది. ఎందుకో నాన్నగారీమధ్య మాటల్లో, చేతల్లో హుందాతనం మరచి అసంబద్ధంగా ప్రవర్తిస్తున్నారు.. నా పిల్లల కంటే మరీ చిన్నా పిల్లాడైపోయి..!

‘ఏమైంది నాన్నా’ అంటూ నేను కదిపితే-

‘కనపడడం లేదా.. వయసు అరవై మూడు దాటాయేమో గానీ పళ్లింకా ఊడలేదురా! దేవుని దయ వలన జీర్ణ వ్యవస్థకేం ఢోకా లేదు. అన్నం మరీ ఇంత మెత్తగానా…’ అంటూ అసహనాన్ని వ్యక్తపరుస్తారు.

అందుకే నోరు మెదపలేక పోయాను.

నాన్నగారి కోపం నేనెరుగనిదేం కాదు. బ్రతికి ఉన్నన్నాళ్లూ అమ్మ మౌనంగా భరించింది. వంట పనుల కంటే ఎక్కువగా నాన్నగారి సూటిపోటి మాటలకు అమ్మ కళ్లొత్తుకున్నందుకే ఆవిడ కొంగు తడిసిపోయేది. నేనూ, చెల్లాయైతే ఇంట్లో నాన్నగారు ఉన్నంతసేపు పుస్తకాలు ముందేసుకొని బిక్కుబిక్కు మంటూ ఓ మూలన కూర్చుండి పోయేవాళ్లం. అలా అని ఆయన రాక్షసుడేం కాదు. కాకపోతే మొండి మనిషి. కోపగొండి అంతే..! ప్రతీదీ సిస్టమేటిక్‌గా జరగాలనే రకం. తానన్న దాంట్లో వీసమెత్తు తేడా జరిగినా సహించలేకపోయేవారు. ఈ విషయం మినహా మమ్మల్ని అన్ని విధాలా కంటికి రెప్పలా చూసుకున్నారు. అడగకముందే అన్నీ కొనిపెట్టేవారు.. ఏ లోటు రాకుండా, మాకు ఏ బాధా అనుభవంలోకి తేకుండా..! అందుకే ఇప్పటికీ ఎప్పటికీ.. దూరమై పోయిన అమ్మ అంటే ఆప్యాయతే. నా పిల్లల్లో ఒకరైన నాన్నగారన్నా అనురాగమే.

నాన్నగారి అలకలు, కోపాలు అనుభవమే కాబట్టి ముందస్తుగా ఓ వాటర్‌ బాటిల్‌, కాసిన్ని పండ్లు, బిస్కట్స్‌ రోజూ ఆయన గదిలో సర్దిపెడుతుంది రేవతి.

విసురుగా వెళ్లిపోయిన నాన్నగారు తన గదిలోకి వెళ్లి ధడాల్న తలుపులు వేసుకున్న చప్పుడుకు ముసురుకున్న ఆలోచనలు చెల్లాచెదురయ్యాయి.

ఓరగా రేవతి వంక చూసాను. ఆల్రెడీ ఆమె కన్రెప్పలు తడి అయ్యాయి.

‘ఆయన అలవాట్లు తెలుసు కదా..! ఇందులో నీ తప్పేం లేదు గానీ, అన్నం మెత్తబడకుండా చూసుకుంటే, ఇలా జరిగి ఉండేది కాదు కదా..!’ అంటూ అనునయంగా అక్కడి నిశ్శబ్దాన్ని నేను ఛేదించదలిస్తే –

‘మీ నాన్నగారు రాన్రాను మరీ ఓవరగా బిహేవ్‌ చేస్తున్నారండీ.. ఇక నా వల్ల కాదు..!’ అని రేవతి అని ఉండేది. ఆమె చూపుల భావాలను అర్థం చేసుకోగలను.

అందుకే మారు మాట్లాడకుండా మౌనాన్ని ఆశ్రయించాను. నాలాగే ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగిని. సాయంత్రం వేళ ఇంటికొచ్చి అన్ని పనులు ఒకర్తే చూసుకోవాలంటే ఇబ్బందే అవుతోంది. పనిమనిషిని చూసుకోమంటే వినదు. వయసు మీరాక ఎలాగూ తప్పదు… ఇప్పుడే ఎందుకండీ అంటుంది. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన రేవతికి నాన్న విలువ బాగా తెలుసు. మా నాన్నగారి విషయంలో తానెన్నడూ మాట జారలేదు. పైగా నాన్నగారిని పళ్లెత్తు మాటన్నా ఆయన కంటే ఎక్కువగా నేను బాధపడతానని పెళ్లైన కొత్తలోనే అనుభవమైంది ఆమెకు.

పిల్లలు నిద్ర పోయాక, రేవతి పక్కన చేరుతూ ‘నాన్నగారు రహస్యంగా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారట…’ తాపీగా నేనంటే –

అది విని ఆమె గుండెలో రేగిన అలజడుల కుదుపుకు… కదలిన రేవతి మేను స్పర్శని నా తనువు పసిగడుతోంది..

‘ఏం తక్కువవుతోందిక్కడ…’ అంటుంది.

‘అన్నీ ఎక్కువైనా మనసులో ఆలోచనలు మారతాయి. ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలుసు గానీ.. ఉదయం చొప్పదండి మావయ్య ఫోన్‌ చేసి చెప్పారు. మూడు నెలల నుండి నాన్నగారు కాల్‌ మీద కాల్‌ చేసి చంపుతున్నారట. ఎవరైనా ఉంటే చూడరా!’ అంటూ.. ఆయన వ్యవహారం విఫులంగా ఆమె చెవిలో వేస్తాను.

బదులుగా రేవతి ‘ఈ వయసులో ఇదేం పాడు బుద్ధండీ..’ అంటూ పక్కింటి రుక్మిణి ఆంటీ స్టైల్లో ముక్కు మీద వేలేసుకుంటుంది.

ఈ సాగతీతలు ఎందుకని మళ్లీ నేనే కావాలని ‘మాట్లాడవేం..’ అనడిగాను.

‘మీ ఇష్టం.. ఆయన గారిష్టం..’ ఆ మాత్రం అనేసి అటు తిరిగి పడుకుంది. నేనీ వైపు తిరిగాను. అప్రయత్నంగా ఈ ఇంటి దేవత అమ్మ… అమ్మ గుర్తుకు వచ్చిందా సమయంలో, నాన్న అప్పుడే అమ్మ జ్ఞాపకాలనెలా మరచి పోగలిగారు. మరొకరిని, అదీ ఈ వయసులో అమ్మ స్థానంలో ఎందుకు ఆహ్వానించాలను కుంటున్నారు?

అలనాటి ఓ దశ్యం స్మతిపథంలో మెదిలింది.

ఓ రోజు నాన్నగారు ఇంట్లో ఆఫీసు తాలూకు పనుల్లో తలమునకలై కాగితాల్ని గుండుసూదితో కలపబోయి, వేలుకు గుచ్చుకొని ‘అబ్బా..!’ అన్న చిన్న మూలుగు సైతం అమ్మ హదయాన్ని తాకి వంటింట్లోంచి పరుగెత్తుకొని వచ్చింది. ఏం కాలేదని ఆయన వారిస్తున్నా పట్టించుకోకుండా కంగారుపడుతూ సపర్యలు చేసింది.

నాన్నగారిపై అమ్మకి ఉన్న మమకారాన్ని తెలియపరిచే ఇలాంటివెన్నో సంఘటనలింకా నా గుండె మాటున దాగి ఉన్నాయి.

నాన్నగారు ఏ సమయానికి ఏది కావాలన్నా, ‘అబ్బా! ఇప్పుడా? అలసటగా ఉంది. ఒళ్లంతా నొప్పులు పెడుతున్నట్లుంది’ వంటి ఎదురు మాటలు ఏనాడూ ఆమె గొంతు దాటి రాలేదు.

చివరి దశలో గ్యాస్‌ పొయ్యి వచ్చినా.. ఉనక పొయ్యి, కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి, కిరోసిన్‌ పొయ్యిలతో ఆమె చాలా కష్టపడింది తప్పితే తన సౌఖ్యాన్ని కోరుకోలేదు.

తనకిది కావాలంటూ నాన్నగారిని అడిగిందీ లేదు. ఆఫీసు పనుల్లో అలసి సొలసి ఇంటికి వచ్చే నాన్నగారంటే గౌరవం, ప్రీతి. నన్నూ చెల్లాయినైతే గుండెల్లో పెట్టుకుంది. మా అమ్మని దేవతతో పోల్చినా.. అమ్మని చిన్నబుచ్చినట్టే..! మా అమ్మని పోల్చదగిన పదం బహుశా.. ఏ భాషలోనూ పుట్టలేదేమో..!

అలాంటి అనురాగమూర్తి సాహచర్యపు అనుభూతులు మరచి, నాన్నగారు ఈ విపరీతపు ధోరణికెందుకు ఒడిగడుతున్నట్టు..? కొడుకుగా నా బుర్రకు అంతుచిక్కడం లేదు. కానీ, ఒక రచయితగా నాన్నగారి నిజ జీవిత పాత్రని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.

————

ఈ వయసులో పెళ్లేంటని నేను మందలించినా, దగ్గరి బంధువులతో చెప్పించినా సమస్య సమసిపోదు. పైగా నాన్నగారు మొండిఘటం. అనుకున్నది జరగందే పట్టు వదలరు.

నా మిత్రుడి నాన్నగారి విషయంలో ఇలాగే జరిగింది. తండ్రిని వ్యతిరేకించాడు. గొడవ పడ్డాడు. వాడొక్కడే కొడుకు ఆయనకు. అంకుల్‌ మౌనం వహించినట్టే వహించి, ఆరు నెలల అనంతరం ఎవరికి చెప్పాపెట్టకుండా గుడిలో పెళ్లి చేసుకొని దూరంగా వేరు కాపురం పెట్టాడు.

ఎందుకో వాడిలా చేయాలనిపించలేదు. నాన్న గారితో విభేదించడమూ నా వల్ల కాని పని. అందుకే చెల్లాయి, బావతో చర్చించి నాన్నగారికి ఓ రోజు పెళ్లిచూపులు ఏర్పాటు చేయించాను. ఆయన ముఖంలో చాలా రోజుల తర్వాత సంతోషం కనపడింది.

అమ్మాయి వాళ్లింటికి వెళ్లేసరికి చొప్పదండి మావయ్య అక్కడే ఉన్నారు.

అందరి పరిచయాలు, పలకరింపులు, ఫలహారాలు అనంతరం ఆవిడను తీసుకువచ్చారు హాల్లోకి. పరిచయం చేసి… ఏమైనా మాట్లాడమని మధ్యవర్తులు అంటూంటే చొరవగా అడిగిందామె.

‘నాకు ముఫ్పై ఎనిమిదేళ్లు.. మీ వయసెంతుం టుంది అంకుల్‌..?’ అని.

ఆమె నుండి అలాంటి ప్రశ్న వస్తుందని ఊహించని నాన్నగారు షాకయ్యారు. వయసు అడిగినందుకు కాదు, ఆ సమయంలో అంకుల్‌ అని సంబోధించి నందుకు..! సమాధానమివ్వకుండా చప్పున తలదించుకున్నారాయన. మేమంతా కంగారుపడ్డాం.

ఎవరినీ పట్టించుకోకుండా తన ధోరణిలో తను ‘నా కంటే ఓ అయిదు లేదా టెన్‌ ఇయర్స్‌ పెద్దయినా ఇట్సోకే..!’ అంటూ ఇంకా ఆవిడేమో అనబోతుంటే వ్యవహారం ముదిరేలా ఉందని ఆమె బంధువులు లోపలికి లాక్కువెళ్లినంత పనిచేసారు.

మా కంటే ఎక్కువగా చొప్పదండి మావయ్య చాలా బాధపడ్డారు ఇలా జరిగినందుకు. తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్లిచూపులకు ఒప్పుకుందని అర్థమైంది మాకు. వెనక్కి వచ్చేసాం.

వారం తిరక్కుండానే మరో సంబంధానికి అటెండ్‌ కావాల్సి వచ్చింది. ఈసారి నాన్నగారు మీసాలకు సహా బట్టగుండు చుట్టూ ఉన్న కాసిన్ని వెంట్రుకలకి దట్టంగా కలర్‌ పట్టించారు. పాతని మరచి హుషారుగా ముస్తాబయ్యారు.

వాళ్లది ఉమ్మడి కుటుంబం. ఆమె వయసు యాభైకి దగ్గరగా ఉంది. ఈ సంబంధం ఖాయ మవడం ఖాయం అనుకున్నారంతా, నాన్నగారితో సహా. కానీ, ఆవిడో మెలిక పెట్టింది. మహా గట్టిపిండంలా ఉంది.

మేం ఉంటున్న ఇల్లు తన పేరిట రాసివ్వాలట. అలాగే ఓ పది లక్షలు ఆమె పేరిట డిపాజిట్‌ చేయాలట.

‘పది లక్షలు డిపాజిట్టంటే ఓకే..! సమ్మతమే. కానీ, ఇల్లు రాసివ్వడమేంటి?’ నాన్నగారికి మింగుడు పడలేదా కండిషన్‌.

వారం పది రోజులు గొణిగి గొణిగి ‘ఆ సంబంధం వద్దని చెప్పరా..’ అని అన్నారెందుకో.

నెల గడిచాక మళ్లీ మరో సంబంధం ఉందంటే వెళ్లాం. ఈసారి కూడా నాన్నగారికి గట్టిదెబ్బే తగలింది. ప్రైవసీగా మాట్లాడాలంటూ ఆమె నాన్న గారినో గదిలోకి తీసుకెళ్లిందట. అక్కడేం జరిగిందో తెలియదు. బాగా హర్టయ్యారాయన. ఎవ్వరెంత కదిపినా విషయం మాత్రం చెప్పలేదు.

‘ఈ వయసులో మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీకెందుకు వచ్చింద’ని మొహం మీదే అడిగేసరికి నాన్నగారు బిర్రబిగుసుకు పోయారట.

నాన్నగారు అలా మౌనంగా ఉండేసరికి ‘ఆ ఇంట్లో చాకిరీ చేయించడానికి నన్ను పెళ్లాడాలను కుంటున్నారా?’ అంటూ మళ్లీ ప్రశ్నించిందంట.

ఓ నెలరోజులు చొప్పదండి మావయ్య నాన్నగారి వెంటపడితే మ్యాటర్‌ చెప్పి బాధపడ్డారట.

కొన్నాళ్లు పోయాక దూరపు బంధువు ద్వారా కబురు వస్తే నాన్నగారికి చెప్పాను. పెద్దగా ఆసక్తి కనబరచలేదాయన. ‘ఇక ఆ విషయం వదిలేయరా..’ అన్నారు నిర్లిప్తంగా, ఆశ్యర్యపోవడం నా వంత య్యింది.

ఓ సాయంత్రం మా దంపతుల సమక్షంలో ‘ఏరా..! వాసూ ! ఇన్నాళ్లూ నా భార్యే అనురాగ దేవత అనుకునేవాడిని.. నీ భార్య కూడారా..’ అన్నారు. హఠాత్తుగా, ఆయన కనుపాపల తెరల వెనుక తడి పరదా లీలగా కదలాడుతుంటే!

మా అమ్మ గురించి తొలిసారిగా ఆయన నోటివెంట నేను విన్న అమత వాక్కులివి. అలాగే రేవతి తన గురించి తాను కూడా పధ్నాలుగేళ్ల వైవాహిక జీవితానంతరం మామగారి హదయం నుండి విన్న మంచి మాటలివి. మా ఇరువురి గుండెలు కుదిపినట్లై ఉక్కిరి బిక్కిరయ్యాం.

ఎందుకో నాన్నగారిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన వార్థక్యమిపుడు మళ్లీ బాల్యాన్ని చవిచూస్తోంది. ఇన్నాళ్లూ కొడుకుగా నేను గ్రహించనిది, నాన్నగారు మిస్సయ్యింది, రచయితగా ఆయన నిజ జీవిత పాత్రకు పరిష్కారం అనిపించింది కూడా ఇదే!

నాన్నగారు ఒంటరితనం ఫీలవుతూ ఒక తోడును కోరుకుంటున్నారని ఆలస్యంగా అర్థమైనా, ఇంట్లో చాలా మటుకు మార్పులు తీసుకువచ్చాను. ఆయన మొదటి పెళ్లిచూపులకు కాస్త ముందుగా రేవతి తన జాబ్‌కి లాంగ్‌ లీవ్‌ పెట్టేసింది. వంట పనులు, ఇంటిపనులు మినహా మిగతా సమయ మంతా నాన్నగారితో కబుర్లాడుతూ ఆయనకు కాలం తెలియకుండా చేయడం మొదలుపెట్టింది. నేను కూడా లాప్ట్యాప్‌ పక్కన పెట్టేసి, ఫ్రెండ్స్‌తో సాయంకాలపు షికారు తగ్గించేసి ఆ కాస్త సమయం నాన్నగారి కోసం వెచ్చిస్తున్నాను. ఆయన తన జ్ఞాపకాల దొంతరలని ఒక్కొక్కటిగా విప్పుతుంటే.. అమ్మంటే ఆయనకెంత ప్రేమో అర్థమవుతోంది. నేను నా రేవతిని ఇంకెంతగా ప్రేమించాలో తెలిసి వస్తోంది.

నాన్నగారు… మా తాతగారి గురించి, ఆయన తాతగారి గురించి, మా వంశం చరిత్ర గురించి మనసు విప్పి ఒక్కటొక్కటిగా తీరిక చిక్కినప్పుడల్లా చెబుతుంటే.. ఏ మందు పూసినా మానని గాయమొకటి నా గుండె మాటున చెలరేగింది.

సుల్తాను రాజుల గురించి, చాళుక్యులు, శాతవాహనుల గురించి ఉద్యోగం కోసం కంఠతా పట్టేసిన నేను… కనీసం మా వంశస్తుల గురించి, మా తాత ముత్తాతల గురించి కించిత్‌ ఎందుకు తెలుసుకోలేక పోయానో.. అంతెందుకు మా నాన్నగారి ఆంతర్యమే తెలుసుకోలేకపోయాను. నాలాంటి మెటీరియలిస్ట్‌ బుర్రలకు ఎప్పటికీ అర్థం కాని విషయమేమో..!

హోంవర్క్‌ పూర్తయ్యాక అస్తమానం సెల్‌తో ఆటలు, టివి ముందు గడిపేయడం కాకుండా తాతగారితో కథలూ గట్రా చెప్పించుకునేలా పిల్లల్ని మార్చగలిగాను. పెద్దవాడికి నాలోని రచయితలా కథలు వినడమంటే ఇష్టమట. చిన్నవాడికేమో మా నాన్నగారిలా తాతముత్తాతల గురించిన ముచ్చ ట్లంటే.. వదలకుండా వింటాడట. తన మనవళ్ల గురించి ఫోన్లో బంధువులకు మురిపెంగా.. నాన్నగారు చెబుతుంటే విన్నానోసారి. ఆయన సంతోషం… మా కుటుంబ సభ్యులందరి సంతోష మవుతోందిపుడు..!

– ఎనుగంటి వేణుగోపాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *