క్లాసిక్‌, పాపులర్‌ టైటిల్స్‌పై కన్నేశారా!!

క్లాసిక్‌, పాపులర్‌ టైటిల్స్‌పై కన్నేశారా!!

తెలుగులో ఏడాదికి సగటున నూట యాభై స్ట్రయిట్‌ చిత్రాలు విడుదల అవుతున్నాయి. కథల్లో కొత్తదనం లేకపోవడమే కాదు.. ఆ కథలకు తగ్గట్టు కొత్త పేర్లు పెట్టడంలోనూ దర్శక నిర్మాతలు విఫలమవుతున్నారు. పాత సినిమా పేర్లనే అనేక మంది దర్శకులు వాడేసుకుంటున్నారు. గత ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే… దాదాపు పదిహేను స్ట్రయిట్‌ సినిమాలకు పాత చిత్రాల పేర్లు పెట్టారు. కానీ అందులో విజయం సాధించిన చిత్రం ఒక్కటంటే ఒక్కటే! మరి పాత పేరు పెద్దంతగా కలిసిరాదని తెలిసీ ఆ మోజులో దర్శక నిర్మాతలు ఎందుకు పడుతున్నట్టు!? దీనికి వారు చెప్పే సమాధానం ఒక్కటే. ‘ఓ సినిమాకు పెట్టే పేరు ప్రేక్షకుల పెదాలపై బాగా నాని ఉంటే… దానికి ప్రచారం బాగా జరుగుతుంది’ అని. కాబట్టి గతంలో వచ్చిన సినిమా పేరు పెడితే… అది వేగంగా జనంలోకి చొచ్చుకుపోతుందట! ఇందులో కొంత నిజం లేకపోలేదు. అందుకే ఈ టెక్నిక్‌ను మన మెగా టీవీ సీరియల్స్‌ నిర్మాతలు అనుసరిస్తున్నారు.

ఇక సినిమా రంగానికి వచ్చే సరికీ గత ఏడాది జనం ముందుకొచ్చిన ‘జైసింహా, ఛల్‌ మోహనరంగా, కృష్ణార్జున యుద్ధం, జంబలకడిపంబ, విజేత, శ్రీనివాస కళ్యాణం, నర్తనశాల, దేవదాసు, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ ఇలా… పలు చిత్రాలకు పాత సినిమాల పేర్లే పెట్టారు. కానీ దురదృష్టం కొద్దీ ఈ చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టాయి. ఒక్క ‘తొలిప్రేమ’ సినిమా మాత్రమే ఇందుకు మినహాయింపు. కాబట్టి సినిమా పేరు జనంలోకి వెళ్లడానికి పాత పేర్లు ఉపయోగపడతాయి కానీ విజయాన్ని అందించడానికి కాదని సదరు దర్శకులు ఈ పాటికి గుర్తించే ఉంటారనుకుంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే… ఈ ఏడాది సైతం ఇలాంటి పాత సినిమా పేర్లతో మరో పది పదిహేను సినిమాలు క్యూ కడుతున్నాయి.

పాత పేర్లపై మహేశ్‌, నాని ఆసక్తి

అత్యంత ప్రజాదరణ పొందిన యువ కథనాయకుల్లో మహేశ్‌బాబు, నాని ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇద్దరు హీరోలు ఇప్పుడు పాతిక చిత్రాల మైలు రాయిని చేరుకున్నారు. మహేశ్‌బాబు 25వ చిత్రం పేరు ‘మహర్షి’. గతంలో ఇదే పేరుతో దర్శకుడు వంశీ ఓ సినిమా తెరకెక్కించారు. అంతేకాదు… మహేశ్‌ తన కెరీర్‌లో రిపీట్‌ టైటిల్‌ను వాడటం ఇది ఆరోసారి. ‘రాజకుమారుడు’, ‘యువరాజు’, ‘టక్కరిదొంగ’, ‘శ్రీమంతుడు’, ‘బాబి’ ఇవన్నీ కూడా పాత సినిమాల పేర్లే. అలానే నాని సైతం పాత సినిమా పేర్లమీద మోజు పెంచుకున్నట్టు కనిపిస్తోంది. అతను కూడా ‘పిల్ల జమీందార్‌, జంటిల్మెన్‌, మజ్ను, కృష్ణార్జున యుద్ధం, దేవదాసు’ వంటి పాత సినిమాల పేర్లనే తన చిత్రాలకు పెట్టుకున్నాడు. ఇటీవల షూటింగ్‌ ప్రారంభించుకున్న నాని చిత్రానికి ‘గ్యాంగ్‌ లీడర్‌’ అనే పేరు పెట్టారు. దాంతో ఇప్పుడు మెగాహీరోలు గుస్సా అయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే ఇదే పేరుతో రామ్‌చరణ్‌ లేదా మెగా ఫ్యామిలీకి చెందిన యువ హీరోలు సినిమా చేయాలని అనుకున్నారు. వారి ఆలోచనలు ఆచరణ దాల్చకముందే ఆ టైటిల్‌ను నాని వాడేసుకోవడంతో వారంత కినుక వహించారని అంటున్నారు.

క్లాసికల్‌ టైటిల్స్‌ను వాడుకోవడం సమంజసమా!

కొన్ని సినిమాలను రీమేక్‌ చేయాలనే ఆలోచనే మనసులోకి రానీయకూడదు. అలానే కొన్ని సినిమాల పేర్లను తిరిగి వాడటం కూడా సరైనది కాదు. ముఖ్యంగా క్లాసికల్‌ మూవీస్‌ టైటిల్స్‌ను, పాపులర్‌ పేర్లను పెట్టుకోవడం వల్ల మంచి జరగకపోగా చెడే ఎక్కువ జరిగే ఆస్కారం ఉంది. అందుకు నిఖిల్‌ ‘శంకరాభరణం’, నాగశౌర్య ‘నర్తనశాల’, నాని ‘కృష్ణార్జున యుద్ధం’, శ్రీనివాసరెడ్డి ‘జంబలకిడిపంబ’ తదితర చిత్రాల పరాజయాలే పెద్ద ఉదాహరణ. అయినా కూడా ఈ ఏడాది సైతం కొందరు దర్శక నిర్మాతలు అదే తప్పు చేస్తున్నారు. కె.విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ పేరును తన హారర్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రియమణి పెట్టుకుంది. ఇక జయప్రద, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సోషియో ఫాంటసీ మూవీకి ‘సువర్ణ సుందరి’ పేరు పెట్టారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ ‘వాల్మీకి’ పేరుతోనూ, రాజకిరణ్‌ ‘విశ్వామిత్ర’ పేరుతోనూ, దర్శకుడు తేజ ‘సీత’ పేరుతోనూ సినిమాలు చేస్తున్నారు. అలానే ‘ప్రాణం ఖరీదు, సీతారామరాజు, నీ కోసం, నాగకన్య, ప్రేమాలయం’ వంటి పాత పేర్లతోనూ కొన్ని సినిమాలు ఈ ఏడాది రాబోతున్నాయి. ఏదేమైనా దర్శక నిర్మాతలతోపాటు హీరోలు సైతం పాత పేర్లకు స్వస్తి పలికితేనే కొత్తదనాన్ని సినిమాలు నింపుకునే ఆస్కారం ఉంటుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *