అసాధారణ కార్యసాధకుడి కథ

అసాధారణ కార్యసాధకుడి కథ

తెలంగాణలోని సినీ కళాకారులు, సాంకేతిక నిపుణులలో ఎప్పటి నుండో తమ భాషకు, తమ సంస్క ృతీ, సంప్రదాయాలకు వెండితెరపై తగిన ప్రాధాన్యం లేకుండా పోయిందనే బాధ ఉంది. ఇది వాస్తవం కూడాను. కొన్ని దశాబ్దాల క్రితం తెలంగాణ నేపథ్యంలో మంచి చిత్రాలు వచ్చాయి. కానీ అవి వర్గ పోరాట నేపథ్యంలోనో, కొన్ని సామాజిక సమస్యల మీదనో రావడంతో వాటి ప్రభావం అన్ని ప్రాంతాల మీద అధికంగా లేక పోయింది. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన ఆరేడు సినిమాలు ఏ రకంగానూ ఆ ప్రాంత గౌరవాన్ని పెంచేవి కాదని చెప్పొచ్చు, ‘ఫిదా’ లాంటి యువతరాన్ని ఆకట్టుకున్న ఒకటి రెండు సినిమాలు మినహా యిస్తే !

ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరిలో పుట్టి, నేత కార్మికుల వెతలను స్వయంగా అనుభ వించి, ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా చూపించి, పద్మశ్రీ పురస్కారం పొందిన ఓ వ్యక్తి కథను వెండి తెరకు ఎక్కించడమంటే సాహసమే! కానీ ఎంచుకున్న కళ పట్ల మక్కువ, నమ్మిన కథా వస్తువు పట్ల ప్రేమ ఉంటే తప్పకుండా అది సాకారమవుతుందని నిరూపించారు రాచకొండ రాజ్‌. పద్మశ్రీ చింతకింది మల్లేశం విజయగాథ నుండి స్ఫూర్తి పొందిన రాజ్‌ తన మిత్రుడు శ్రీ అధికారితో కలిసి ‘మల్లేశం’ చిత్రాన్ని రూపొందించి జనం ముందుకు తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బయోపిక్స్‌ వస్తున్నాయి. అయితే.. ఆయా వ్యక్తుల జీవితంలోని సంఘటనలకు మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా కొన్ని బయోపిక్స్‌ ఉంటే, మరి కొన్నింటిలో ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని లేనిపోని సంఘటనలు చొప్పించడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ‘మల్లేశం’ అలాంటి సినిమా కాదు. మట్టి వాసన తెలిపే సినిమా. మన మధ్యలోనే ఉంటూ సాధారణ జీవితం గడుపుతున్న ఓ అసాధారణ కార్యసాధకుడి జీవితం. ఆ జీవితాన్ని ఆకళింపు చేసుకుని, వెండితెరపై అతి సహజంగా, ఎలాంటి కమర్షియల్‌ హంగులూ అద్దకుండా ఆర్‌. రాజ్‌ తెరకెక్కించారు. అందువల్ల ఈ సినిమా చూస్తున్నంత సేపు మన పక్కనే ఉన్న ఓ స్నేహితుడి కష్టాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో కళ్లు చెమ్మగిల్లి, మనసు బరువెక్కుతుంది.

చేనేత పనిలో ప్రధానమైనది ఆసు పోయడం. ఆ ఆసు పోయడం ద్వారా కొన్ని లక్షలమంది ఇల్లాళ్లు తమ భుజం ఎముకలను తెలియకుండానే అరగదీసు కుంటున్నారు. తన తల్లిసైతం అలా కష్టపడటం చూసి కరిగిపోతాడు మల్లేశం. ఆర్థిక స్థోమత లేక ఆరవ తరగతిలోనే చదువు ఆపేసిన మల్లేశం, తనకున్న కొద్దిపాటి తెలివితేటలతో ఆసు యంత్రం తయారు చేయడానికి సిద్ధపడతాడు. అందుకోసం ఊరి నిండా అప్పులు చేస్తాడు. ఎంతో కష్టపడి తయారు చేసిన ఆసు మిషన్‌ మోటారు సాంకేతిక లోపంతో కాలిపోతుంది. దాంతో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో పెళ్లి చేస్తే ఆసు పిచ్చి వదిలిపోతుందని భావించిన పెద్దలు మల్లేశంకు పెళ్లి చేస్తారు. కొత్తగా వచ్చిన భార్య మీద కంటే… పక్కన పడేసిన ఆసు యంత్రం మీద మల్లేశంకు ఇరవై నాలుగు గంటల ధ్యాస. అతని ఆవేదనను, బాధను గుర్తించిన భార్య కూడా ఒంటిమీద ఉన్న కొద్ది పాటి నగలు కుదవపెట్టి భర్త చేతిలో పెడుతుంది. చేసిన అప్పులు తీర్చడానికి, ఇల్లుగడవడానికి భార్యతో కలిసి పట్నం వచ్చిన మల్లేశం చివరకు తాను అనుకున్న విధంగా ఆసు యంత్రం ఎలా తయారు చేశాడు, ఊర్లోని జనం మనసుల్ని ఎలా గెలుచుకున్నాడన్నది మిగతా కథ.

ఓ లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగే వ్యక్తికి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎంతోమంది వెనక్కిలాగుతారు. కుటుంబపరంగానూ ఆర్థికంగా, మానసికంగా కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఎందుకు ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నా మనే నిర్వేదం కూడా కలుగుతుంది. అటువంటి సమయంలోనూ మనను ముందుకు నడిపే వ్యక్తి ఒక్కరైనా పక్కన ఉంటే తిరిగి కొత్త ఉత్సాహం తెచ్చుకుని ముందుకు సాగుతాం. ఇక్కడ కూడా మల్లేశం వెనుక ఉన్న ఆ చోదక శక్తి అతని భార్య పద్మ. నిజానికి ఆమే అతని విజయానికి మూల కారకురాలు. ఈ విషయాలన్నింటినీ విశదీకరిస్తూ ఆర్‌. రాజ్‌ ‘మల్లేశం’ చిత్రంగా రూపొందించారు.

ఇప్పటి వరకూ హాస్యనటుడిగా ముద్ర వేయించుకున్న ప్రియదర్శికి ఇదో మేకోవర్‌. కొత్తమ్మాయి అనన్య నాగళ్ల, ఝాన్సీ, చక్రపాణి ఆనంద్‌ ఇలా ప్రతి ఒక్కరూ ఆ యా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు, బాలనటులతో సహా! పెద్దింటి అశోక్‌ కుమార్‌ మాటలు, రాఘవేందర్‌ కూర్పు, మార్క్‌ కె రాబిన్‌ సంగీతం, బాలు శాండిల్యస ఛాయాగ్రహణం సినిమాకు బలం చేకూర్చాయి. తెలంగాణ సినిమా అంటే ఇది, బయోపిక్‌ అంటే ఇది, నిబద్ధతతో సినిమా తీయడమంటే ఇది అని చెప్పుకోదగ్గదిగా ‘మల్లేశం’ నిలవడం ఆనందకరం. అయితే… పతాక సన్నివేశంలో మల్లేశం సాధించిన విజయాన్ని మరింత ఉత్తేజభరితంగా చూపించడానికి ప్రయత్నం చేయవలసింది. ఏడేళ్ల పాటు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిన ఆ విజయా నందానికి ఇంకొంత సమయం కేటాయించి ఉంటే… థియేటర్ల నుండి బయటకు వచ్చే ప్రేక్షకులు మరింత స్ఫూర్తిని, ఉత్సాహాన్ని పొంది ఉండేవారు.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *