రైతు వెతల పరిష్కారంలో తడబడిన మహర్షి

రైతు వెతల పరిష్కారంలో తడబడిన మహర్షి

మహేష్‌బాబు లాంటి స్టార్‌డమ్‌ ఉన్న హీరో నటిస్తున్న 25వ చిత్రమంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం. పైగా ఆ సినిమాను ఒకరు కాకుండా అగ్ర నిర్మాతలు ముగ్గురు కలిసి నిర్మిస్తుంటే ఆ అంచనాలు అంబరాన్ని తాకుతాయి. అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తే ఘన విజయం సాధించడం గ్యారంటీ అనిపిస్తుంది. ఇంతలా అంచనాలు పెంచుకున్న ‘మహర్షి’ మాత్రం పూర్తి స్థాయిలో వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడనే చెప్పాలి.

రిషి (మహేశ్‌ బాబు)కి చిన్నప్పటి నుండి తండ్రి అంటే చిన్నచూపు. ఆయనో పరాజితుడనే భావన. చేసిన అప్పులు తీర్చలేక నలుగురితో మాటలు పడుతూ కూడా… చేతనైనంతలో తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేస్తుంటాడనే కోపం. దాంతో తండ్రిలా తాను మధ్య తరగతి జీవితాన్ని గడపకూడ దని, బాగా చదువుకుని విదేశాలకు వెళ్లి మల్టీ మిలియనీర్‌ కావాలని కలలు కంటాడు. దానికి తగ్గట్టే వైజాగ్‌లోని ట్రిపుల్‌ ఐటీలో సీటు సంపాదించుకుని, యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి, అనుకున్న విధంగానే ఓ విదేశీ కంపెనీలో సీఈఓ స్థాయికి ఎదుగుతాడు. కాలేజీలో చదివే రోజుల్లో పూజ (పూజా హెగ్డే)తో ప్రేమలో పడినా, తన కెరీర్‌కు ఈ ప్రేమ ప్రతి బంధకం అవుతుందనే భావనతో ఆమెకు దూరమవు

తాడు. రవి అనే కాలేజ్‌మెట్‌తో స్నేహంగా మెలిగినా… చదువు పూర్తయ్యే సరికి అతని గురించి కూడా మర్చిపోతాడు.

అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని హాయిగా జీవితాన్ని సాగిస్తున్న రిషికి ఒకానొక రోజున తాను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం స్నేహితుడు రవి అని తెలుస్తుంది. అతనితో స్నేహాన్ని నిర్దాక్షిణ్యంగా తుంచేసుకుని ఎంతో పొరపాటు చేశానని తెలుసు కుంటాడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెలో ఉంటున్న స్నేహితుడు రవిని కలుసుకోవడానికి హుటాహుటిన అమెరికా నుండి బయలుదేరతాడు. రవిని కలుసుకున్న తర్వాత రిషి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? కార్పొరేట్‌ రంగానికి అధినేత అయిన రిషి ఓ సాధారణ రైతుగా ఎందుకు మారాడు? ప్రభుత్వాలను సైతం ప్రభావితం చేయగలిగిన ఆ సీఈఓ… ఎవరితో పోరాడవలసి వచ్చిందన్నది మిగతా కథ.

దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు హరి, సాల్మన్‌ ఈ కథను తయారు చేశారు. జీవితమంటే ధనార్జనే అని భావించే ఓ యువకుడు తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత తన తప్పు తెలుసుకుని ఎలా దానిని చక్కదిద్దుకున్నాడన్నది ఇందులోని ప్రధానాంశం. అయితే… ఇవాళ కొన్ని కార్పొరేట్‌ సంస్థల ధన దాహం కారణంగా పంటలు పండే భూములు ఎలా ఎడారులుగా మారుతున్నాయి, రైతుల భూములను లాక్కోవడానికి వారు ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు? భూములను అయిన కాడికి అమ్ముకునేలా ఎలాంటి కుతంత్రాలు పన్ను తుంటారు? ఆ క్రమంలో ప్రభుత్వాలు సైతం ఎలా ప్రేక్షక పాత్ర పోషిస్తుంటాయి? అనే అంశాలను ఇందులో వంశీ పైడిపల్లి చూపించారు. కానీ కార్పొరేట్‌ సంస్థలకు బుద్ధి చెప్పిన వైనం, రైతుల పక్షాన నిలిచి కడదాక పోరాటం సాగించిన విధానం, దళారీ వ్యవస్థ లేకుండా పంటకు గిట్టుబాటు ధర కలిగేలా చేసే ప్రయత్నం ప్రేక్షకులను పెద్దంతగా రంజింపచేయవు. ఏదో గాలివాటున సంఘటనలు జరిగిపోతున్నట్టుగా ఉంటుంది. నాయకుడికి ప్రతినాయకుడికి మధ్య వైరం ప్రత్యక్షమైనది కాకపోవడం… స్నేహితుడి పక్షాన అతను పోరాటం చేస్తుండటంతో కథా వస్తువు బలహీన పడింది. తండ్రిని, ప్రియురాలిని, స్నేహితుడిని అపార్థం చేసుకున్న ఓ వ్యక్తిలో జరగాల్సిన మానసిక సంఘర్షణ గానీ, పరివర్తనకు సంబంధించిన బలమైన సన్నివేశాలు కానీ మనకు కనబడకపోవడం నిరాశకు గురిచేస్తుంది. ప్రథమార్ధం కాలేజీ సన్నివేశాలతో సరదాగా సాగిపోయినా, ద్వితీయార్థంలో కథ రకరకాల మలుపులు తిరుగుతూ, ప్రతి మలుపులో హీరోకు ఎవరో ఒకరు కర్తవ్య బోధ చేస్తుండటంతో ప్రేక్షకులు అసహనానికి లోనవుతారు.

మహేశ్‌ బాబు నటనలో ఎత్తిచూపడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే… రైతుగా అతన్ని ఊహించు కోవడం కాస్తంత కష్టంగా అనిపిస్తుంది. ఇక పూజా హెగ్డే పాటల కోసమే పరిమితమైంది. ‘అల్లరి’ నరేశ్‌ తనకున్న ఇమేజ్‌కు భిన్నమైన పాత్ర చేసినా, ద్వితీయార్థంలో మహేశ్‌ పాత్రను ఎలివేట్‌ చేయడం కోసం అతన్ని ఆస్పత్రికి పరిమితం చేయడం ఇబ్బంది కరంగా ఉంటుంది. జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, సాయికుమార్‌… వీళ్లంతా కీలక పాత్రలు పోషించినా అవన్నీ ఇలా వచ్చి అలా వెళుతుంటాయి తప్పితే ప్రేక్షకుల మనసులపై బలయమైన ముద్రను వేయవు. సినిమాలో చెప్పుకోదగ్గది మోహనన్‌ కెమెరా పనితనం. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు రెండు మాత్రమే బాగున్నాయి. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. శ్రీమణి సాహిత్యం చెప్పుకో దగ్గదిగా ఉంది. దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ ముగ్గురు కలిసి భారీగా సినిమానైతే నిర్మించారు కానీ ఆ స్థాయిలో ఇది ప్రేక్షకుల హృదయాల్లోకి చొచ్చుకు పోయాలా చేయడంలో దర్శకుడు వంశీ పైడిపల్లి విఫలమయ్యాడు. ఎంచుకున్న కథ ఆదర్శవంతమైనది కావడంతో చూసిన వారు పెదవి విరవలేని పరిస్థితిని దర్శక నిర్మాతలు కల్పించారు!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *