మధుగీతం

మధుగీతం

”మనం పెళ్లి చేసుకుందాం” ఆఫీసు క్యాబ్‌ దిగి తమ వాటాలోనికి వస్తూ అంది గీతామాధురి. ”ఏమిటి ఇంత హఠాత్తు నిర్ణయం” ల్యాప్‌టాప్‌లో రచన చేసుకుంటున్నవాడు ఆగి, అన్నాడు మధుకర్‌.

”ఇప్పుడు కాకపోతే, షష్టిపూర్తి నాడు చేసుకుంటామా.. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాం” గుర్తు చేస్తున్నట్టుగా అంది గీతామాధురి. ”ఒకే వాటాలో కలిసుంటున్నంత మాత్రాన అది సహజీవనం ఐపోతుందా” ఉడికిస్తున్నట్టు అన్నాడు మధుకర్‌. ”ఇంకేం కావాలి.. కలిసి ఉంటున్నాం.. కలిసి తింటున్నాం.. సినిమాలకి, షికార్లకి కలిసే తిరుగుతున్నాం” దీన్నేమంటారు చెప్పమన్నట్టు చూసింది గీతామాధురి.

”కానీ, కలిసి… కాపురం చేయడంలేదు కదా” కన్నుగీటాడు మధుకర్‌.

”మగబుద్ధి చూపించుకున్నావు” చిరాకుపడింది గీతామాధురి.

”శంగారం గురించి మాట్లాడితే మగబుద్ధి అయినప్పుడు, స్వయంవరం గురించి మాట్లాడితే ఆడబుద్ధి అనుకోవాలా” ఎగతాళి చేశాడు మధుకర్‌.

”బుద్ధి గడ్డితిని నిన్ను ఇష్టపడ్డాను.. అమ్మనాన్న మీద వదిలేస్తే ఈ కష్టాలు లేకపోను” నిష్టూర మాడింది గీతామాధురి. ”నీకిప్పుడేం కావాలి” అనునయంగా అడిగాడు మధుకర్‌.

”మనం పెళ్లి చేసుకుందాం” పాడిన పాటే మళ్లీ పాడింది గీతామాధురి.

”ఇప్పుడిప్పుడే కదా దర్శకుడిగా అవకాశాలు వస్తున్నాయి. ఏదైనా ప్రణాళిక దశ్యరూపందాల్చి చిత్రం విడుదలవ్వనీ” నచ్చచెప్పబోయాడు మధుకర్‌. ”రెండేళ్లుగా ఇదే అంటున్నావు. ఇంట్లో వాయిదాలు వెయ్యలేక తలప్రాణం కాళ్లకొస్తోంది” చిరాకు పడింది గీతామాధురి.

”తెలివైనదానివే, మోకాళ్లకి వస్తుందనలేదు” నవ్వాడు మధుకర్‌.

”నీకా మోకాళ్లలో మెదడు ఉండబట్టే నాకీ తిప్పలు” రిటార్టిచ్చింది గీతామాధురి.

”నా మీదకే తిప్పి దెప్పిపొడిచావన్నమాట” నవ్వాడు మధుకర్‌.

”ఇదుగో ఈ చమత్కారాలతో తప్పించుకోచూస్తున్నావేమో, ఈ రోజు నీ పప్పులేం ఉడకవు” హెచ్చరిస్తున్నట్టుగా అంది గీతామాధురి. ”ఉడకకపోవటం ఏమిటి, ఇదివరకే ఉడికించేస్తేనూ.. భోజనం తయార్‌.. నువ్వు తెమిలితే తినేయ్యొచ్చు” భోజనాల బల్లవేపు నడిచాడు మధుకర్‌.

”నన్నిలా ఉడికించడం నీకు న్యాయమా?” అక్కడ కూర్చుండిపోతూ అంది గీతామాధురి.

”మరి నన్నిలా దడిపంచటం మాత్రం నీకు న్యాయమా! నీకేం సాఫ్ట్‌వేర్‌ జాబ్‌, నెలకింతని తెచ్చుకుంటావ్‌ నాది సజనతో కూడిన పని, అదష్టం కూడా తోడైతేకాని దిక్కుండదు” నిజాయితీగా అన్నాడు మధుకర్‌.

”అలాగని దిక్కు దివాణం లేకుండా నీతో ఎన్నాళ్లిలా పడుండమంటావ్‌” నిష్టూరంగా అంది మాధురి.

”పోనీ మీ ఇంట్లోవాళ్లకి చెప్పి మన పెళ్లి చెయ్యమను” సలహా చెప్పాడు మధుకర్‌.

”వాళ్లెందుకు చేస్తారు? ఎంత కట్నమైనా ఇచ్చి వాళ్లకి నచ్చిన వాడితో చేస్తారు కాని!” జరగబోయేది చెప్పింది గీతామాధురి. ”కట్నమే ఇవ్వాలనుకుంటే నేను కొంచెం చవకని చెప్పు” నవ్వాడు మధుకర్‌.

”చవటని చెప్తాను కాని” ఆగి, ”ఏంటి కట్నంకోసం చూస్తున్నావా?” సూటిగా చూసింది గీతామాధురి.

”ఇంట్లోవాళ్ల కమిట్‌మెంట్‌ కూడా ఉండాలి కదా మరి” ఏదో చెప్పబోయాడు మధుకర్‌.

”ఏం నేను తెచ్చేది చాలదా నీకు?” ఆవేశపడింది గీతామాధురి.

”సపోజ్‌ రెసిషన్‌లో నీ జాబ్‌ పోయిందనుకో..” అర్ధోక్తిగా ఆగాడు మధుకర్‌.

చురుక్కున చూసింది గీతా మాధురి.

”లేదూ.. పిల్లలు పుట్టటం జరిగితే వాళ్లు చదువు కెళ్లే వయసొచ్చే వరకైనా నీ స్వంత చేతులతో సాకాలనుకుంటావు కదా. అప్పుడు నీకూ దిక్కులేక, నాకూ దిక్కులేక దివాణం ఖాళీ. దుకాణం బంద్‌ అవుతుంది” ముందుచూపుగా అన్నాడు మధుకర్‌.

”నీలా చేతులెత్తేసే మగాడిని నేనెక్కడా చూడలేదు” వ్యాఖ్యానించింది గీతామాధురి.

”ఎంతమంది మగాళ్లతో ఇలా చర్చించా వేమిటి?” నవ్వి, ”చేతులెత్తెయ్యటం కాదు. చేతల్లో సాధ్యమెంతవరకూ ఆలోచించమంటున్నాను” వాస్తవం గ్రహించమన్నట్టు చెప్పాడు మధుకర్‌.

”చుంచు ముఖమోడా.. మంచి చేప్తే తల కెక్కదేం.. నీ తిక్క కుదురుస్తాను ఉండు” అంటూ తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంది గీతామాధురి. నవ్వుకున్నాడు మధుకర్‌.

కట్‌ చేస్తే… తరువాత రోజు..

ఉరుము ముందు మెరుపులా తలుపు తెరచుకొని ఇంట్లోకి ప్రవేశించింది గీతామాధురి. తలవని తలంపుగా ఊడిపడ్డ కూతురు ముఖంలోనికి చూసి ఏదో తొందరపాటు నిర్ణయంతో వచ్చిందని గ్రహించింది మాలతి.

”ఎందులో వచ్చావు” అడిగింది.

”జన్మభూమి” జవాబిచ్చింది గీతామాధురి.

”పొద్దున్ననగా హైదరాబాదులో ఎక్కుంటావు. విశాఖపట్నంకి పన్నెండు గంటల పైనే ప్రయాణం. దార్లో తినటానికి ఏమైనా దొరికిందో లేదో.. తెమిలోస్తే వడ్డిస్తాను” అంది మాలతి.

నిన్న రాత్రి ‘ఇదే సమయానికి ఇలాంటిదే మాట మధు దగ్గర వింది. అది గుర్తొచ్చి భోజనాల బల్ల దగ్గర కూర్చుండిపోయింది మాధురి.

”ఏం జరిగింది?” అడిగింది మాలతి.

”వాడుత్త చెత్తగాడమ్మా” అంది మాధురి.

”ఎవరు.. నీ కొలీగా?” ఆరాతీస్తూ అడిగింది మాలతి.

”కాదమ్మా.. మీడియావాడు” చెప్పింది మాధురి.

”ఏ ఛానెల్లో పనిచేస్తున్నాడు?” అడిగింది మాలతి. ”ఛానెల్‌ కాదమ్మా.. సినిమా ఫీల్డ్‌” చెప్పింది మాధురి.

”సినిమా ఫీల్డా” అయిష్టంగా అంది మాలతి. ”ఇప్పటినుండే డైరెక్టర్‌లా పెద్దపోజూ వాడు” తన ధోరణిలో ఉక్రోషంగా అంది మాధురి. ”ఏమంటాడు?” అడిగింది మాలతి.

”పెళ్లి చేసుకోవాలంటే కట్నం కావాలంట. పైగా ఇంట్లోవాళ్లే పెళ్లి చెయ్యాలంట” ఫిర్యాదు చేస్తున్నట్టు అంది మాధురి. ”స్థితిమంతుడైతే దానికేం, అలానే చేద్దాం” భరోసా ఇచ్చినట్టుగా అంది మాలతి.

”ఏదీ ఇప్పుడిప్పుడే కదా అవకాశాలు వస్తున్నాయి” అర్దోక్తిగా చెప్పింది మాధురి.

”ఇంకా స్థిరపడ లేదన్నమాట” సాలోచనగా అంది మాలతి.

”స్థిరపడకపోతేనేం.. పడగల సామర్థ్యం, ధైర్యం ఉన్నవాడు” నమ్మకంగా చెప్పింది మాధురి.

”ధైర్యం వుంటే సరిపోదు, స్థైర్యం ఉండాలి.. గాలిలో మేడలు కట్టే గాలిగాడికిచ్చి చెయ్యమంటే మీ నాన్న ఒప్పుకోరు. మనకేం తక్కువ, కట్నంతో పెళ్లిచెయ్యాలంటే కోటికి దగ్గరిచ్చి కోటలాంటి ఇంట్లో కోడలిగా నీతో అడుగు పెట్టిస్తారు” నచ్చచెప్పేలా అంది మాలతి. మాధురి మాట్లాడలేదు. మౌనం అర్ధాంగీకారమన్నట్టు కూతురంత తొందరగా దారికొచ్చినందుకు రవంత తేలికపడింది మాలతి.

కట్‌ చేస్తే… ¬టల్‌ తాజ్‌బంజారా..

మాధురి తన తల్లిదండ్రులతో, పెళ్లికొడుకు ప్రవీణ్‌ తన తల్లిదండ్రులతో ఎదురెదురుగా కూర్చున్నారు. ”సో.. ఆబ్బాయి అమెరికాలోనే స్థిరపడతాడా, ఇండియా వచ్చేసే ఆలోచన ఏమైనా ఉందా” ఉపోద్ఘాతంగా అడిగాడు మాధురి తండ్రి డాక్టర్‌ మాధూర్‌.

”లేదంకుల్‌.. ఐదు, పదేళ్లుండి ఆపై ఇండియా వచ్చెయ్యాలనుంది” చెప్పాడు ప్రవీణ్‌.

”పిల్లలు అప్పటికి పెద్దవాళ్లవుతారేమో.. అక్కడ చదువులు మాన్పించి ఇక్కడ చేరుస్తారా” అడిగింది మాలతి. ”చూడాలాంటీ” సమాధానమిచ్చాడు ప్రవీణ్‌.

”అంటే కచ్ఛితమైన నిర్ణయం ఏమీ లేదా” అడిగింది మాలతి. ”ఇంకా లేదు. అప్పటికి ఎలా ఉంటే అలా” చెప్పాడు ప్రవీణ్‌. గీతామాధురి అతడి వేపు చూసింది. అతడు నవ్వాడు. మొహమాటానికి తిరిగి నవ్వి సూప్‌ కోసమన్నట్టు చూపు తిప్పుకుంది.

”అమ్మాయి ఎటూ ప్రక్కనుంటుంది కదా.. అప్పటికి ఇద్దరూ ఏదోటి నిర్ణయించుకుంటారు” కొడుక్కి మాట సాయం చేశాడు ప్రవీణ్‌ తండ్రి లాయర్‌ శ్రీధర్‌.

”అమ్మాయి అక్కడ కూడా జాబ్‌ చెయ్యాలా” అడిగింది మాలతి.

”తనిష్టం” చెప్పాడు ప్రవీణ్‌.

”చదువుకుంది కదా, ఒంటరిగా ఇంట్లో ఏం తోస్తుంది. ఉద్యోగానికేళ్తే ఊసుపోతుంది. పిల్లలు పుట్టాక తనిష్టం. అయినా బేబీ సిటింగ్‌ సెంటర్లు ఉంటాయి కదా” అంది ప్రవీణ్‌ తల్లి శ్రీవల్లి.

మాధురి ప్రవీణ్‌ వేపు చూసింది. అతడేం మాట్లాడలేదు.

”తాంబూలం గూర్చి ఓ మాట అనుకుందామా” అడిగాడు మాధూర్‌.

”ఒక ‘అర్థ’మైనా లేందే..” అర్ధోక్తిగా ఆగాడు శ్రీధర్‌. ”అర్థమైంది” సమ్మతించాడు మాధూర్‌.

”సగం రొక్కం, సగం స్వర్ణం.. పెళ్లెటూ తాహతుకి తగ్గట్టు చేస్తారు” లౌక్యంగా అన్నాడు శ్రీధర్‌.

పిల్ల సౌఖ్యంగా ఉండటమే కావాలన్నట్టు నిశ్శబ్దమైపోయాడు మాధూర్‌. భోజనాలు ముగించి లేస్తుండగా ఆ ప్రక్కన ఉన్న బల్ల దగ్గరికి మధు మరో ముగ్గురితో వస్తూ కనిపించాడు. తను తప్ప మిగతా ముగ్గురిలో డబ్బుదర్పం బాగా కనిపిస్తుంది. అక్కడ మాధురిని చూసిన మధుకర్‌ మొదట ఆశ్చర్యపడినా సర్దుకొని చిన్నగా నవ్వాడు. తిరిగి పలకరింపుగా నవ్వింది గీతామాధురి. ఆమెలో పులకరింతని గుర్తించింది ఒక్కరే.. మాలతి.

మధుకర్‌తో ఉన్న ముగ్గురు ప్రవీణ్‌ని పలకరించారు. ”ఏదో సినిమా ప్రాజక్ట్‌ మీద ఇండియా వస్తున్నామన్నారు” ప్రవీణ్‌ అన్నాడు ఆ ముగ్గురితో. ”అవును.. ఈయనే మా దర్శకుడు” మధుకర్‌ని పరిచయం చేశారు. వాళ్లేదో మాట్లాడుకుంటుండగా, ”తనే మధుకర్‌” మెల్లిగా తల్లికి చెప్పింది మాధురి. బుద్ధిమంతుడిలా కనిపించడంతో ”బావున్నాడే” సహజంగా అనేసింది మాలతి.

మధుకర్‌ వాళ్లు ముందుకు నడవటంతో రెండు కుటుంబాలు ¬టల్‌ బయటకొచ్చి, ”కలుద్దామని” చెప్పుకుని ఎవరి వాహనం వేపు వాళ్లు వెళ్లిపోయారు.

కట్‌ చేస్తే.. గీతామాధురి వాళ్లుండే ప్లాట్‌..

టీవీ చూస్తున్న తల్లి ప్రక్కన చేరింది గీతామాధురి.

”ఏంటమ్మా” అడిగింది మాలతి.

”మరి.. పుట్టిన పిల్లల్ని సొంత చేతులతో సాకితేనే కదమ్మా తల్లిగా ఆ తప్తి” అంది గీతామాధురి.

”అందుకే కదా, ఒకప్పటి భారత సుందరి, నేటి భారతీయ సినిమా అగ్రనాయిక ఐశ్వర్యారాయ్‌ కోట్లు కాదనుకొని సినిమాలను ప్రక్కన పెట్టి తన కూతురుకి తడిగుడ్డలు మారుస్తుంది. కోట్లిచ్చినా ఆ అమ్మతనం కొనుక్కోగలమా అమ్మా” చెప్పింది మాలతి.

”పోనీ, ఆ కట్నమేదో మధుకే ఇచ్చేద్దామమ్మా.. తను స్థిరపడేంత వరకూ మాకు అక్కరకొస్తుంది” వేడుకోలుగా అంది గీతామాధురి.

”ఆ అబ్బాయిని అక్కర్లేదనుకున్నావు కదా” భకుటి ముడిచింది మాలతి.

”కాని, తన ప్రతిభపై నమ్మకంతో కోట్లు పెట్టడానికి నిర్మాతలు ముందుకొస్తున్నప్పుడు, ఆ సామర్థ్యాన్ని ఎరిగున్న దానిగా ఈ మాత్రం ధరావతు ఇవ్వటంలో తప్పు లేదనిపిస్తుంది. తన దగ్గర లేకే కదా అడిగాడు. ఉండి అడుక్కునేవాళ్ల కంటే తనేం తీసిపోయాడు. పైగా, తను స్థిరపడితే లాభపడేది నేనేగా” తర్కించుకుంటున్నట్టుగా అంది గీతామాధురి.

”వివాహాన్ని వ్యాపారం చేస్తున్నావా” అడిగింది మాలతి.

”మీరు చేసే వివాహం కూడా వ్యాపారమే కదమ్మా” ఎత్తిచూపింది గీతామాధురి.

”కాని, పెట్టుబడిదారుగా ఎవరు తప్పుచేసినా మరోవైపు వాళ్లకి ప్రశ్నించే హక్కుంటుంది” అందులో గూడార్ధం చెప్పింది మాలతి. ”మీకా హక్కు, బాధ్యత ఉండాలనేమో, తను మీరు చేస్తేనే పెళ్లి అన్నాడు” గుర్తు చేసుకుంటున్నట్టుగా అంది గీతామాధురి.

”మరి ఆ అబ్బాయి తరుపు వాళ్లు చెయ్యి కలుపుతారా” అడిగింది మాలతి.

”వియ్యమందుకునేట్టు తను చూసుకుంటాడు” మధుకర్‌ తరపున భరోసా ఇచ్చింది గీతామాధురి.

”సరే అయితే, మీ నాన్నగారు ఆ గదిలో పడుకున్నారు కదా.. లేచాక చెప్పి చూస్తాను” అభయమిస్తున్నట్టుగా అంది మాలతి.

కట్‌ చేస్తే…రాత్రి భోజనాల సమయం..

తమ వాటా తాళం తియ్యబోయి తెరచి ఉండటంతో తటపటాయించి గంట మ్రోగించాడు మధుకర్‌. మాలతి తలుపు తీసింది. ”క్షమించండి.. పొరపాటు పడినట్టున్నాను” వెనుతిరిగి వెళ్లబోయాడు మధుకర్‌.

”పరిపాటిగానే వచ్చావు బాబూ” లోపలికి రమ్మన్నట్టు ప్రక్కకి తొలగింది మాలతి. అప్పుడే లోపలి నుండి వచ్చిన గీతామాధురి ఫర్లేదన్నట్టు కళ్లతో సైగ చేసింది. లోపలికి అడుగు పెట్టాడు మధుకర్‌.

”ఆరేళ్లుగా కలిసుంటూ మేం వచ్చినప్పుడల్లా నువ్వు ఫ్రెండ్‌ ఫ్లాట్‌కి వెళ్లిపోతూ తోడుదొంగల్లా ఇద్దరూ మా కళ్లు బాగానే కప్పారు” నవ్వింది మాలతి. ఆమె వేపు మొహమాటంగా చూశాడు మధుకర్‌.

”ఏళ్లుగా కలిసున్నా నా బిడ్డని అడ్డలనాటి దానిలానే ఉంచావు చూడు.. అక్కడే నీ నిజాయితీ ఏమిటో నిరూపించుకున్నావు” అతడిని చదివినట్టుగా అంది మాలతి. మధుకర్‌ కొంచం స్థిమితపడ్డాడు.

”గొప్పంతా అబ్బాయిగారిదే అనుకోకు.. మీ అమ్మాయి అలుసిస్తే కదా” కాలరెగరేసింది గీతామాధురి.

”నువ్వు పెళ్లి పేరెత్తగానే ఈ తల్లి దగ్గరకి పంపించాడు చూడు.. అక్కడే నా మనసు గెలుచుకున్నాడు” కూతురి తప్పు ఎత్తిచూపింది మాలతి.

”అందరూ ఈ చుంచు ముఖమోడినే మెచ్చుకుంటారు” ఉడుక్కుంది గీతామాధురి.

”నువ్వు మెచ్చావు కదా.. యధా పిల్ల తధా తల్లి” కూతురి అలక తీరుస్తున్నట్టు అంది మాలతి.

”రా బాబూ.. మీ సినిమా ఎంత వరకూ వచ్చింది” అప్పుడే గదిలోంచి బయటకొచ్చిన మాధూర్‌ పలకరింపుగా అన్నాడు. ”మాటలు అవుతున్నాయండి” చెప్పాడు మధుకర్‌.

”సినిమా సరే, తాంబూలం ఏ మాత్రం కావాలి” అడిగాడు మాధూర్‌.

”తాంబూలం ఏంటి?” భకుటి ముడిచాడు మధుకర్‌.

”అమ్మాయికి కట్నం అడిగావంట కదా” అన్నాడు మాధూర్‌.

”మీరు మీ అమ్మాయిని ఇవ్వటమే పెద్ద కట్నం అండీ” చెప్పాడు మధుకర్‌.

”డైలాగ్‌ బావుంది.. నువ్వు తీసే సినిమాలోనిదా” అన్నాడు మాధూర్‌.

”సినిమా కాదండీ, ఇది జీవితానికి సంబంధించిందే.. నాకే కట్నం వద్దండీ.. మీ అమ్మాయిని ఇవ్వండి అదే పదివేలు” నిజాయితీగా చెప్పాడు మధుకర్‌.

”ఏం బాబూ మా అమ్మాయి అంత చవకా” ఉన్నట్టుండి గంభీరంగా అన్నాడు మాధూర్‌.

మధుకర్‌తో పాటు గీతామాధురి, మాలతి కూడా ఆయన వేపు ఆందోళనగా చూశారు.

”మరీ పదివేలు విలువ కడితేనూ” నవ్వాడు మాధూర్‌.

”పాత నానుడి కదండీ.. ఇప్పట్లో అయితే పదికోట్లు అనాలేమో” నవ్వాడు మధుకర్‌.

”అను మరీ” చెప్పాడు మాధూర్‌.

”మీ కూతురునివ్వండి.. అదే పదికోట్లు” అన్నాడు మధుకర్‌. గీతామాధురి, మాలతి నవ్వుకున్నారు.

”మరి కట్నం అడిగావని చెప్పిందే అమ్మాయి” గుర్తు చేసుకున్నట్టుగా అన్నాడు మాధూర్‌.

”నిజమే.. మీరిచ్చే కట్నంతో నాకంటే మెరుగైన వాడిని ఎన్నుకుంటుందో లేక, తిరిగొచ్చి నన్నే కోరుకుంటుందో.. ఈ అనుబంధానికి ఎంతవరకు బందీ అయ్యుంటుందో తేల్చుకోటానికే కట్నంతో ముడివేసా” చెప్పాడు మధుకర్‌.

ఆ ముందు జాగ్రత్తకి ముచ్చటపడి, ”ఎందుకలా?” అదేదో అతడి నోటితోనే విందామని అడిగాడు మాధూర్‌.

”ఏదో ఒక ముడివేస్తేనే కదా కథకి అనుగుణంగా మరో సన్నివేశం మొదలయ్యేది. ఆ సన్నివేశాన్ని సునిశితంగా తీర్చిదిద్దాలంటే అనువగు అంశంతోనే కట్‌ పడాలి” సిద్ధాంతీకరించాడు మధుకర్‌.

”బావుంది బాబూ.. కథ సుఖాంతం కావటానికి సన్నివేశాల్ని అల్లుకున్నట్టే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని ఇలాగే చక్కటి సన్నివేశాలుగా మలచుకుని కోపతాపాలెదురైనా అపార్థాలకి తావు లేకుండా సమాధానాలు వెతుక్కోండి” సంతప్తుడైన మాధూర్‌ దీవిస్తున్నట్టు అన్నాడు.

గీతామాధురి, మధుకర్‌ వంగి అతడి కాళ్లకి నమస్కారం పెట్టారు.

”అంతేలే.. తరుణోపాయంతో కరణీకం చేసిన ఇంతి గతి ఇంతే సంగతులు” దెప్పిపొడుస్తున్నట్టుగా అంది మాలతి. ”పిల్లనిచ్చే వరకే మామయ్య వంతు. పెళ్లినాటి ప్రమాణాలు ఎటూ ఉంటాయి కదా అత్తయ్యా.. ప్రణామాలు అందుకోటానికి” అన్నాడు మధుకర్‌.

”ఒక్క పెళ్లినాడేనా..? అమ్మాయి పురుడికి, ఆ పుట్టింది పైటేస్తే పెరడులో కూర్చో పెట్టిన దానికి.. కాలమంతా ఉందిలే బాబు కాళ్లు మొక్కటానికి!” ధీమాగా అంది మాలతి.

”అన్ని మొక్కులు మొక్కలేం కాని, ఈ మొక్కుతో సరి పెట్టుకోండి. చంద్రునికో నూలుపోగు” అని నూలు చీర సమర్పించుకొని కాళ్లపై పడ్డారు గీతామాధురి, మధుకర్‌.

”అంతం కాదిది ఆరంభం” అన్నట్టు చిద్విలాసంగా దీవించింది మాలతి. అంతా భోజనాలకి డైనింగ్‌ టేబుల్‌ వేపు నడిచారు.

కట్‌ చేస్తే… మేడమీది ముందు వసారా..

”అవునూ, నేనా ¬టల్లో కనిపించకపోతే ఆ అమెరికా వాడిని పెళ్లి చేసుకునేదానివేమో” అల్లరిగా అన్నాడు మధుకర్‌.

”నాకేం కర్మ, ఈ మెరిక ఇక్కడుండగా అమెరికా వెళ్లటానికి” ధీమాగా అంది మాధురి.

”ఒకవేళ, నేను రాణించలేకపోతే” అడిగాడు మధుకర్‌.

”నాకు నమ్మకం ఉంది.. నీకు సఫలత సిద్ధిస్తుంది.. లేకపోయినా బాలింతరాలిని జీతపు రాళ్లకోసం ఉద్యోగానికి పంపవు. అమ్మతనపు కమ్మదనానికి దూరం చెయ్యవు. అది చాలు నీతో హాయిగా బతికెయ్యటానికి” లోతుగా అంది గీతామాధురి.

”కట్‌ చేస్తే…” మాట మార్చాడు మధుకర్‌.

”ఇంతకీ కట్‌ చేసిందెవరు, ముడేసిందెవరు?” అడిగింది మాధురి.

”నన్ను వద్దనుకుని వెళ్లిపోయి మన అనుబంధాన్ని ఆదుకోటానికి తిరిగొచ్చిన నువ్వుకాక ఇంకెవరు” అన్నాడు మధుకర్‌.

”ఇదుగో ఇదే నీలో నాకు నచ్చేది. ఎదుటి వాళ్లకి విలువిచ్చి గెలుపు బాధ్యతల్లో భాగస్వాముల్ని చెయ్యటం” మెచ్చుకోలుగా అంది గీతామాధురి.

”కట్‌ చేస్తే…” మళ్లీ మాటమార్చాడు మధుకర్‌.

”పెళ్లి.. పెళ్లాం.. గొళ్లెం.. మధుమాధుర్యం” నవ్వింది గీతామాధురి.

– శాంతారాం సూరపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *