వర్మ తెరకెక్కించిన పరాజితుడి కథ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

వర్మ తెరకెక్కించిన పరాజితుడి కథ  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఎన్టీయార్‌ జీవిత చరిత్ర జనవరిలో ‘ఎన్టీయార్‌ మహానటుడు’గానూ, ఫిబ్రవరిలో ‘ఎన్టీయార్‌ మహానాయకుడు’గానూ వెండితెరకెక్కింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, అగస్య మంజు అనే వ్యక్తితో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీయార్‌’ అంటూ మరో సినిమాను జనం ముందుకు తీసుకొచ్చారు. ఓ ప్రముఖుడి జీవితం ఇలా మూడు భాగాలుగా, వరుసగా మూడు మాసాల్లో, సినిమా రూపంలో ప్రేక్షకులకు చేరువ కావడం బహుశా ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావచ్చు.

ఎన్టీయార్‌ బయోగ్రఫీ తొలి రెండు భాగాలకు కర్త, కర్మ, క్రియ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ. ఆయన ఆలోచనల మేరకే, ఆయనే నిర్మాతగా ‘ఎన్టీయార్‌’ చిత్రాలు రెండూ తెరకెక్కాయి. అయితే… ఈ మూడో భాగానికీ బాలకృష్ణే పరోక్ష కారణం కావడం విశేషం. ఎన్టీయార్‌ బయోపిక్‌ తెరకెక్కించాలనే ఆలోచన బాలకృష్ణకు వచ్చినప్పుడు రామారావంటే అభిమానం ఉన్న వర్మ సైతం ఈ ప్రాజెక్ట్‌ తాను చేపడతానని ముందుకొచ్చారు. కానీ సృజనాత్మకమైన విభేదాల కారణంగా అది జరగలేదు. బాలకృష్ణ ఆ సినిమా పగ్గాలు మొదట తేజకు, ఆ తర్వాత క్రిష్‌కు అప్పగించాడు. దాంతో వర్మ… తనదైన స్టయిల్‌లో ఎన్టీయార్‌ జీవిత చరమాంకాన్ని, అదీ లక్ష్మీపార్వతి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో తెరకెక్కించా లని భావించారు. వర్మ ఆలోచన గ్రహించి, వైసీపీ నేత రాకేశ్‌ రెడ్డి నిర్మాతగా ముందుకు రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు నాయుడును ప్రతినాయకుడిగా చూపించి, ఎన్నికల్లో లబ్దిపొందడానికే వర్మ ఇలా చేస్తున్నాడన్నవారూ లేకపోలేదు. అదే భయంతో ‘లక్ష్మీస్‌ ఎన్టీయార్‌’ సినిమాను కొందరు ఆంధ్ర ప్రదేశ్‌లో విడుదల కాకుండా కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ రాష్ట్రం మినహా మిగతా ప్రాంతాల్లో ఇది విడుదలైంది.

ఎలాంటి ఉపోద్ఘాతాలకూ తావివ్వకుండా ఎన్టీయార్‌ జీవితంలోని ప్రధాన ఘట్టాలను టైటిల్స్‌ సమయంలో చూపించేసి, ఎన్టీయార్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన సంఘటన నుండే సినిమాను వర్మ ప్రారంభించాడు. అక్కడ నుండీ వారి మధ్య పెరిగిన సాంగత్యం, ఆ తర్వాత ఎన్టీయార్‌ ముఖ్యమంత్రి కావడం, లక్ష్మీపార్వతి ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా మారుతుందో, తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడుతుందో అనే భయంతో చంద్రబాబు తెలివిగా ఆమె సాకుతో ఎన్టీయార్‌ను పదవీచ్యుతుడిని చేయడం… ఆ క్రమంలో ప్రజల మనసుల్ని గెలిచి కూడా రాజకీయ చదరంగంలో పరాజయుడిగా మిగిలిపోయిన ఎన్టీయార్‌ ప్రాణాలు కోల్పోడంతో సినిమా ముగుస్తుంది.

ఎన్టీయార్‌పై వచ్చిన మొదటి రెండు చిత్రాలను ఆయన తొలి భార్య బసవతారకం పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో చూపిస్తే, దీనిని ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి తరఫున చూపించారు. దాంతో సహజంగానే ఈ చిత్రంలో ఆమెది పూర్తి స్థాయి పాజిటివ్‌ క్యారెక్టర్‌గా మారిపోయింది. ఎన్టీయార్‌ తిరిగి కోలుకోవడానికి, రాజ్యాధికారాన్ని చేజిక్కించు కోవడానికి లక్ష్మీపార్వతి చేసిన కృషిని ఎవ్వరూ కాదనలేరు. అదే సమయంలో ఆమె తనకంటూ ఓ వర్గాన్ని కూడగట్టుకోవడం, పార్టీని తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలని ప్రయత్నించడం కూడా అప్పటి రాజకీయాలపై అవగాహన ఉన్నవారు కాదనలేని మాట. కానీ లక్ష్మీపార్వతికి ఎన్టీయార్‌ సేవ తప్పితే మరేదీ పట్టదు, ఆమె ఆయన గీసిన గీతను అస్సలు దాటలేదు అన్నట్టుగానే ఈ సినిమాలో చూపించారు. గతంలో వర్మ కొన్ని బయోపిక్స్‌ లేదా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాల్లోనూ కథానాయకుడి పాత్రలోని మంచి, చెడులను చూపించారు. కానీ ఇందులో మాత్రం ఏకపక్షంగానే వ్యవహరించారు. రాష్ట్రంలో జరిగిన కీలక రాజకీయ పరిణామాలలో లక్ష్మీపార్వతి పాత్ర ఏమాత్రం లేదన్నట్టుగా ఆమెకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. దాంతో సహజంగానే ఇది రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసిన సినిమా అనే భావన ప్రేక్షకులకు కలుగుతుంది. గుంటూరు జిల్లాలో ఓ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్న లక్ష్మీపార్వతిని ఎన్టీయార్‌కు తొలిసారి పరిచయం చేసింది చంద్రబాబే అనేవారు ఉన్నారు. అలానే రామారావు చనిపోయినప్పుడు హరికృష్ణ విదేశాలలో ఉన్నారని, వార్త తెలిసే ఆయన వచ్చారని అంటారు. ఇలాంటి సత్యాలకు వర్మ ప్రాధాన్యం ఇవ్వలేదు.

నటీనటుల విషయానికి వస్తే ఎన్టీయార్‌ పాత్ర పోషించిన విజయకుమార్‌, లక్ష్మీ పార్వతిగా నటించిన యజ్ఞాశెట్టి, చంద్రబాబు పాత్ర చేసిన శ్రీతేజ్‌ నుండీ వర్మ చక్కని నటన రాబట్టుకున్నాడు. సిరాశ్రీ పాటలు సందర్భానుసారంగా సాగగా, కల్యాణీ మాలిక్‌ సంగీతం సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. వర్మ నుండి ఇలాంటి ఎమోషనల్‌ సెంటిమెంట్‌ సినిమా వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. బహుశా ఆయనతో పాటు దర్శకత్వం వహించిన అగస్య మంజుకు ఆ క్రెడిట్‌ ఇవ్వాలేమో! ఏదేమైనా ఎన్నికల వేళ వచ్చిన ఈ సినిమా జనానికి కొత్తగా చెప్పేది ఏమీలేదు. ఆనాటి సంఘటనల్లోని నిజానిజాల పట్ల అందరికీ ఓ అవగాహన ఉంది. అయితే… ఈ తరానికి ఆ విషయాలు అంతగా తెలిసి ఉండక పోవచ్చు. కానీ వారు థియేటర్‌కు వచ్చి ప్రత్యేకంగా ఈ సినిమాను చూసి, తమ అభిప్రాయాలను మార్చుకుంటారని ఆశించలేం!!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *