రాజ్యవర్థన్‌ బాటలోనే..

రాజ్యవర్థన్‌ బాటలోనే..

స్వతంత్ర భారత క్రీడారంగం మొదటి ఆరున్నర దశాబ్దాల కాలంలో సాధించిన ప్రగతి ఒక ఎత్తయితే.. నరేంద్ర మోదీ ప్రధానిగా గత ఐదేళ్లకాలంలో సాధించిన ప్రగతి మరో ఎత్తుగా భావించాలి. మోదీ ఆలోచనలు, క్రీడాభివద్ధి పథకాలను మాజీ క్రీడల మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ అత్యంత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆశించిన ఫలితాలు సాధించారు. ఖేలో ఇండియా, టువర్డ్స్‌ ఒలింపిక్స్‌ పోడియం లాంటి వినూత్న పథకాలతో అత్యధిక యువజన జనాభా కలిగిన భారత క్రీడారంగానికి జవసత్వాలను అందించారు.

దార్శనికత

నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో దేశభవిష్యత్తు మాత్రమే కాదు.. భారత క్రీడారంగ భవిష్యత్‌కు సైతం భరోసా వచ్చి నట్లయ్యింది. మొదటి ఐదేళ్ల కాలంలో మాజీ ఒలింపియన్‌ రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ క్రీడా మంత్రిగా తన విధులను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తే.. ఆయన వారసుడిగా, నూతన క్రీడా మంత్రిగా అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కిరణ్‌ రిజిజు బాధ్యతలు చేపట్టారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడారంగం రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ నాయకత్వంలో కళ్లు చెదిరే ప్రగతి సాధించిందని.. తాను సైతం అదేబాటలో నడుస్తానని ప్రస్తుత క్రీడామంత్రి రిజిజు అంటున్నారు. దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 651 జిల్లాలలో ప్రతిభాన్వేషణ శిబిరాలు నిర్వహించడం ద్వారా మొత్తం 16 క్రీడాంశాలలో ఎంపిక చేసిన 12 వేల 415 మంది ప్రతిభా వంతులైన యువతీయువకులను రానున్న కాలంలో మరింతగా ప్రోత్సహిస్తామని చెప్పారు.

సమ ప్రాధాన్యం

ఒలింపిక్స్‌ క్రీడాంశాలతో పాటు దేశవాళీ క్రీడలకు తగిన ప్రాధాన్యమివ్వటమే తమ ప్రభుత్వ లక్ష్యమని కిరణ్‌ రిజిజు తేల్చిచెప్పారు. ఇప్పటికే అథ్లెటిక్స్‌, విలువిద్య, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌ బాల్‌, బాక్సింగ్‌, ఫుట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, జూడో, కబడ్డీ, ఖో-ఖో, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, కుస్తీ, హాకీ లాంటి క్రీడలకు ప్రభుత్వం ఊతమిస్తోందని గుర్తు చేశారు.

పతకాలే లక్ష్యం

గత ఏడాది గోల్డ్‌కోస్ట్‌ వేదికగా ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌, జకార్తా వేదికగా ముగిసిన ఆసియా క్రీడలు, బ్యునోస్‌ఏర్స్‌ వేదికగా జరిగిన ప్రపంచ యువజన ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అంచనాలకు మించి పతకాలు సాధించడం ద్వారా సరికొత్త స్ఫూర్తిని నింపారని, అదే జోరును రానున్న మూడు ఒలింపిక్స్‌ క్రీడల్లో కొనసాగించడానికి తగ్గట్టుగా వ్యూహాలకు రూపకల్పన చేస్తున్నట్లు కొత్త క్రీడామంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత అథ్లెట్లు గత క్రీడల కంటే ఎక్కువగా పతకాలు సాధించడం ఖాయమని క్రీడామంత్రి ధీమాగా చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్న భారత షూటర్లు అసాధారణంగా రాణించడం ద్వారా ఇప్పటికే ఏడు ఒలింపిక్స్‌ బెర్త్‌లు సాధించడం దేశానికే గర్వకారణమని క్రీడామంత్రి ప్రశంసించారు. ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన యువషూటర్లు మను బాకర్‌, సౌరభ్‌ చౌదరీ, రాహీ సర్నోబట్‌ ఇప్పటికే ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాలతో తమ సత్తా చాటుకొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు సైతం అర్హత సాధించడం శుభసూచకమని కిరణ్‌ రిజిజు భావిస్తున్నారు.

భారత ఒలింపిక్స్‌ సమాఖ్యకు అనుబంధంగా ఉన్న వివిధ క్రీడాసంఘాల వ్యవహారాలలో తాము జోక్యం చేసుకునే ప్రసక్తేలేదని, ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకొనే వాతావరణం కల్పిస్తామని ఆయన భరోసా ఇస్తున్నారు. మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఏర్పాటు చేస్తున్న భారత తొలి క్రీడా విశ్వవిద్యాలయాన్ని సకల హంగులతో పూర్తి చేయటం తనముందున్న లక్ష్యమని అన్నారు. స్పోర్ట్స్‌ సైన్స్‌, స్పోర్ట్స్‌ టెక్నాలజీ, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, స్పోర్ట్స్‌ కోచింగ్‌ లాంటి అంశాలతో పాటు ఎంపిక చేసిన కొన్ని క్రీడల కోసం అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు ఉంటాయని ప్రకటించారు. మొత్తం మీద నూతన క్రీడామంత్రి నేతత్వంలో భారత క్రీడారంగం సరికొత్తగా మెరిసిపోడం ఖాయంగా కనిపిస్తోంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *