తన దాకా వస్తే కానీ

తన దాకా వస్తే కానీ

అది ఆరో తరగతి. హరి ఆ క్లాసులో మహా దుడుకు, అల్లరివాడు. క్లాసులో పక్కనున్న పిల్లల్ని ఏడ్పించటం వాడి హాబీ. తను సరిగా పాఠం వినడు, పక్కన వారిని విననీయడు. ఒక టీచరు క్లాసు పూర్తి కాగానే, వేరొక టీచరు వచ్చే లోపల పక్క వారిని గిల్లటమో, వాడి పుస్తకం లాక్కోవటమో చేస్తాడు. క్లాసు లీడరు మాట వినడు. ఎన్నిసార్లు టీచర్లు హెచ్చరించినా, క్లాసులోంచి బయటకు పంపినా వాడి ధోరణి మారటం లేదు. గుండు సూదితో గుచ్చేవాడు. పిల్లలంతా ఎదురు తిరిగినా వాడిదే పై చేయి. పైగా వాళ్ళ నాన్న ఆ స్కూలుకి ఛైర్మన్‌. అందుకని అధ్యాపకులంతా వాడి దుడుకుతనాన్ని సహిస్తున్నారు.

ఒకసారి 6, 7 తరగతుల పిల్లల్ని పిక్నిక్‌కి తీసు కెళ్ళారు. 6వ తరగతి పిల్లలంతా ఆడుకుంటూంటే హరి వారితో కలవకుండా, ఒక చెట్టుక్రింద కూర్చున్నాడు. ఇసుక, చిన్న రాళ్ళను ఆడుకుంటున్న పిల్లలపై విసురుతూ ఏంతెలియని నంగనాచిలా దిక్కులు చూడసాగాడు. 7వ క్లాసు పిల్లలు హరి వాలకం చూసి వాడిని బెదిరించారు.

‘ఏం రా! రాళ్లు, ఇసుక మాపై విసురు తున్నావేంటి? నలుగురితో కలిసి మెలిసి మంచి – మర్యాదతో ప్రవర్తించాలి కానీ, ఇలా ప్రవర్తిస్తే నీ జీవితంలో చాలా బాధపడాతావు’ అని హెచ్చరించి టీచర్లకి చెప్పారు. ఇదంతా తెలుసుకున్న ఆరో తరగతి మాష్టార్లు హరిని ఓ కంట కనిపెడ్తూ వాడొక్కడ్నే వదిలేశారు. మిగతా వారిని వాడితో మాట్లాడొద్దని చెప్పారు. వాడిలో కోపం, ఉక్రోషం, అవమానం ఉవ్వెత్తున ఎగిసి పడసాగాయి.

బుంగమూతి పెట్టి ఒక చెట్టు క్రింద కూచుని అక్కడున్న చీమల పుట్టని పుల్లతో కెలికాడు. అంతే చీమలు చకచకా వాడి ఒంటినిండా పాకి చికాకు పెట్టాయి. వాటిని దులుపుకుంటుండగా, చెట్టు పైన ఉన్న తేనెతుట్టె లోంచి తేనె టీగలు ఎగురుతూ వచ్చి వాడ్ని చుట్టు ముట్టాయి. కొన్ని వాడి మొహం, చేతులపై దాడి చేయటంతో ‘బాబోయ్‌! అమ్మో! కాపాడండి’ అని అరవ సాగాడు.

వాడి పెడబొబ్బలకి టీచర్లు, విద్యార్థులంతా పరుగెత్తుకొచ్చారు. వాళ్ళంతా చేతుల్లో ఉన్న రుమాళ్ళతో వాటిని పారద్రోలే ప్రయత్నం చేశారు. అయినా అవి వదలకపోవటంతో ఎండుటాకులు, పుల్లలు పోగేసి అగ్గిపుల్ల వెలిగించారు. పొగ, మంటకి అవి వెళ్ళిపోయాయి.

ఒంటినిండా గాట్లతో, ఉబ్బిన కళ్లతో ఉన్న హరిని చూస్తే అందరికీ జాలేసింది. వాడిని సముదాయిస్తూ గాయాలకి ఉల్లిగడ్డని చిదిపి రుద్దుతూ తన క్లాస్‌మెట్స్‌ ఉపచారాలు చేస్తుంటే వాడిలో పశ్చాత్తాపం మొదలైంది. స్కూలు బస్సులో హరిని తీసుకుని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న డాక్టరు దగ్గరికి తీసుకెళ్లి చికిత్స చేయించారు సైన్సు టీచర్‌.

‘హరీ! నువ్వు క్లాసులో ప్రతివారినీ గిల్లి, రక్కి, గుండు సూదులతో పొడిచి ఏడిపిస్తుంటావు. వాళ్ళకు ఎంత బాధ కలిగి ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది. మరి ప్రకృతి పగబడితే ఎవరం ఏమీ చేయలేం. నీ మిత్రులు ఎంత మంచివాళ్లో చూడు, సమయానికి నీకు సపర్యలు చేశారు’ అన్నాడు.

హరికి తాను చేసిన తప్పేమిటో అర్థమైంది.

పశ్చాత్తాపంతో ‘అవును సార్‌!’ అన్నాడు.

– అచ్యుతుని రాజ్యశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *