ఉత్తేజపరిచే విఫల, విషాదగాథ ‘జెర్సీ’!

ఉత్తేజపరిచే విఫల, విషాదగాథ ‘జెర్సీ’!

‘విధి చేయు వింతలన్నీ… మతిలేని చేతలేనని’ అంటూ ‘మరో చరిత్ర’లో ఓ పాట ఉంది. కొన్ని సినిమాలను చూసినప్పుడు విధిని మించిన శత్రువు మనిషికి వేరే ఏముంటుంది? అనిపిస్తుంది. అప్పుడెప్పుడో వచ్చిన ‘మాతృదేవోభవ’, ఇటీవల వచ్చిన ‘జెర్సీ’ని చూసినప్పుడు విధిని తిట్టుకోకుండా ఉండలేం! జీవితంలో తాను కోరుకున్నవన్నీ ఒక్కొక్కటిగా దక్కించుకుంటూ లక్ష్యం దిశగా సాగుతున్న అర్జున్‌ అనే రంజీ క్రికెట్‌ ప్లేయర్‌ లైఫ్‌తో డెస్టినీ ఎలా ఆడుకుందన్నదే ‘జెర్సీ’ సినిమా.

అర్జున్‌ (నాని) అనాథ. క్రికెట్‌ అంటే ప్రాణం. అర్జున్‌ను, అతనిలోని ఆటగాడిని చూసి ఫిదా అయిపోతుంది సారా (శ్రద్ధ శ్రీనాథ్‌). అతను హిందువు, ఆమె క్రిస్టియన్‌. వారి పెళ్లికి ఆమె ఇంట్లో పెద్దలు అంగీకరించరు. మతం మారమని కండీషన్‌ పెడతారు. కానీ అర్జున్‌ అలానే ఉంటాడని, తనకోసం మతం మారడాన్ని ఒప్పుకోనని సారా స్పష్టం చేస్తుంది. ఇద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుంటారు. వాళ్లకో కొడుకు నాని (మాస్టర్‌ రోనిత్‌). రంజీ మ్యాచ్‌లో సత్తా చాటిన అర్జున్‌ ఇండియన్‌ టీమ్‌ తరఫున ఆడాలని కలలు కంటాడు. కానీ క్రీడారంగం లోని పాలిటిక్స్‌ కారణంగా అతను సెలక్ట్‌ కాడు. ఓ ఊహించని సంఘటనతో అతను తన రూట్‌ మార్చు కుంటాడు. స్పోర్ట్స్‌ కోటాలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో చేరతాడు. అవినీతి ఆరోపణల కారణంగా కొంతమందిని మూకుమ్మడిగా తొలగించ డంతో అర్జున్‌ కూడా విధులనుండి బహిష్కరణకు గురవు తాడు. భర్తను, కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత సారామీద పడుతుంది. ఉద్యోగం పోయి, జీవితం నిస్తారంగా మారిపోయి, వెలుగు అనేది కనుచూపు మేరలో కనిపించకుండా పోయిన అర్జున్‌కు చూస్తుండ గానే 36 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఆ సమయంలో కొడుకుకోసం తిరిగి బ్యాట్‌ పట్టుకుని క్రీడా మైదానం లోకి అడుగుపెడతాడు. ఎలాగైనా ఇండియా టీమ్‌ తరఫున ఆడాలని ఉవ్విళ్లూరుతాడు. స్టార్‌ స్పోర్ట్స్‌మెన్‌ రిటైర్మెంట్‌ వయసులో రీ-ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌ కోరిక నెరవేరిందా? ఆ వయసులో అతనికి క్రికెట్‌పై మనసెందుకు పోయింది? అందుకోసం అతను చెల్లించిన మూల్యం ఏమిటీ? అనేది మిగతా కథ.

గత మూడు వారాలుగా జనం ముందుకు వచ్చిన ప్రధాన చిత్రాలన్నింటిలోనూ ఉన్న కామన్‌ పాయింట్‌.. ఇవన్నీ పరాజితుల కథలే కావడం. ‘మజిలీ’లో ఓ విఫల ప్రేమికుడు, ‘చిత్రలహరి’లో కెరీర్‌ పరంగా ఎదురుదెబ్బలు తిన్న యువకుడు మనకు కనిపిస్తే, ‘జెర్సీ’లో విధి చేతిలో బలైపోయిన ఓ భర్త, ఓ తండ్రి, అంతకు మించి ఓ క్రీడాకారుడు కనిపిస్తారు. ఈ మూడు చిత్రాల్లోకి కథ పరంగా, నిర్మాణ పరంగా ‘జెర్సీ’ ఉత్తమమైనదని చెప్పాలి.

క్లిష్టమైన ఓ కథను, ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా తెరకెక్కించడంలో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి సఫలీకృతుడయ్యాడు. ఓ విఫల, విషాద గాథను విజయవంతమైన చిత్రంగా మలచడం సామాన్యమైన విషయం కాదు. నటీనటుల నుండీ, సాంకేతిక నిపుణుల నుండీ తనకు కావాల్సింది రాబట్టుకోవడం మరీ ముఖ్యం. తొలి చిత్రం ‘మళ్లీ రావా’తో మంచి పేరు తెచ్చుకున్న గౌతమ్‌ రెండో సినిమాను ఇంత చక్కగా తెరకెక్కించాడంటే అభినందించాల్సిందే. అర్జున్‌ పాత్రలో నాని, సారాగా శ్రద్ధ శ్రీనాథ్‌, వాళ్ల అబ్బాయిగా మాస్టర్‌ రోనిత్‌, కోచ్‌గా సత్యరాజ్‌… అందరూ చక్కని అభినయం కనబరిచారు. రావు రమేశ్‌, సంపత్‌ రాజ్‌, శిశిర్‌ వర్మ తెరమీద కనిపించేది కాసేపే అయినా… తమదైన ముద్రను వేశారు. అనిరుధ్‌ సంగీతం బాగుంది. అయితే కొన్ని సన్నివేశాలలో సంభాషణలు వినపడకుండా చేసింది. సాను జాన్‌ వర్ఘీస్‌ సినిమా టోగ్రఫీ, నవీన్‌ నూలి ఎడిటింగ్‌ బాగున్నాయి.

ప్రధమార్థంలో సినిమా అక్కడక్కడా కాస్తంత ట్రాక్‌ తప్పినా… ద్వితీయార్థంలో తన ప్రతిభతో అందరినీ కట్టిపడేశాడు దర్శకుడు గౌతమ్‌. పతాక సన్నివేశంలో ఇచ్చిన ట్విస్ట్‌ అర్జున్‌ పాత్రను మరింత ఎలివేట్‌ చేసింది. కానీ కొడుకు పాత్రధారికి నాని డబ్బింగ్‌ చెప్పకుండా ఉండాల్సింది. అనారోగ్యం కారణంగా లక్ష్యాన్ని మార్చుకుని, భార్య, కొడుకు కోసమే జీవితాన్ని కొనసాగించాలనుకున్న అర్జున్‌… ఒకానొక సమయంలో ప్రాణంకంటే పోరాటమే ప్రధానమని అనుకోవడంలో తప్పులేదు. కానీ కొడుకు దృష్టిలో హీరోగా నిలబడటం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టడం అనేది కన్వెన్సింగ్‌గా లేదు. అయితే ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోవడం కాకుండా… ప్రాణాలు కోల్పోతానని తెలిసీ పోరాడట మనేది మాత్రం కచ్చితంగా యువతకు స్ఫూర్తి దాయకం. అందువల్లే ‘జెర్సీ’ తప్పనిసరిగా చూడదగ్గ చిత్రాల కోవలోకి చేరింది. క్రీడానేపథ్యంలో హిందీలో వచ్చిన సినిమాలు చూసి, మన తెలుగులో ఇలాంటివి రావెందుకు? అని ప్రశ్నించేవారందరికీ ‘జెర్సీ’ ఓ సమాధానం. ఇలాంటి చిత్రాన్ని అందించిన సమర్ప కుడు పీడీవీ ప్రసాద్‌, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు గౌతమ్‌, కథానాయకుడు నానిలను ప్రత్యేకంగా అభినందించాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *