జీవన రసగుల్లాలు

జీవన రసగుల్లాలు

రాత్రి 12.45..!

‘ఇదిగో నిన్నే.. ఛస్తున్నా నీ వెధవ గురకతో ఆపు.. ఆపు.. అరె ఆపరా..? లాప్‌టాప్‌ మూసేసి హాల్లో నుండి బెడ్రూమ్‌లోనికి వచ్చిన మాలిని మరింత ఎరుపెక్కిన కళ్లతో చూస్తూ ముఖం చిట్లించింది! పళ్లు పటపట లాడించింది..! అలా తారీఖు మారిన రాత్రివేళల్లో ఆమె కళ్లూ, పళ్లూ ఉద్రేకపడిపోతూనే ఉన్నాయి!

‘నా తల దువ్వెన.. నా టవల్‌.. నా సోప్‌.. సెంట్‌ ఎట్సెట్రా వాడొద్దని నీకెన్ని సార్లు చెప్పాలి.. హుఁ.. అయినా మనిషన్న వాడికి ఓసారి చెప్తే చాలు.. అర్థమవుతుందంటారు.. ఛి.. ఛీ..!

నీతో నేను షాపింగ్‌కు రానంతే. అసలు నీకు ఇంటికేమేమి అవసరమో ఎందువసరమో ఇంటి దగ్గరే తెలియాలి. షాపింగ్‌ మాల్‌లోనికి ఎంట రయ్యాకే తెల్సిన దానిలా రెండున్నరల గంటలు షాపింగ్‌లు చేయించీ వర్సగా నాలుగు కార్డులు స్వయిపింగ్‌ చేయించేసే నీలాంటి స్పెండింగ్‌ బీయింగ్‌ని నేనెక్కడా చూడలేదు. ఐ కాంట్‌ ఎగ్జిస్ట్‌ అండ్‌ అడ్జస్ట్‌ విత్యూ..!

‘ఈ రోజు మా ఊర్నించి మా అమ్మానాన్న వస్తున్నారని తెల్సీ.. నీవు నీ పేరెంట్స్‌ దగ్గరకు చెక్కేయడమంటే..? ఏం మీ వాళ్లు ఈ సిటీలోనే ఉన్నారన్న అహంకారమా ఏం చేస్తున్నావక్కడ..? వెళ్లేముందు ఎందుకు వెళ్తున్నదీ చెప్పనక్కర్లేదా…? సెల్‌ఫోన్‌ పేలిపోయేలా గొంతు మార్మోగింది! దానికి రెస్పాన్స్‌గా అవతలిగొంతూ ప్రమాదకర స్థాయికి చేరుకుంది! అలా క్షణక్షణానికీ పెరిగిపోతూనే ఉన్నాయి శబ్ద తీవ్రతలు!

‘కూరల్లో మరీ ఇంత ఉప్పా.. మరీ ఇంత కారమా..? అసలిలాంటివి గొడ్లు కూడా తినవ్‌.. కరెక్ట్‌.. గొడ్లే తినవ్‌..!

షటప్‌..!

యూ షటప్‌..’

పై దృశ్యాలను చిన్న చిన్న స్కిట్స్‌లా మలచి ఏనిమేషన్‌ చిత్రాలుగా నిర్మించి తెరమీద ప్రదర్శిస్తున్న వివేక్‌ వాటిని కాసేపు ఆపాడు. తనముందున్న వారిని పరిశీలనగా చూసాడు.

చూసారుగా ఈ తెర చిత్రాలు..! ఇవి నేటి సాంఘిక విచిత్రాలు! మారుతున్న మన సమాజ ధోరణికి చిహ్నాలు. మీరు చూసిన చిత్రాల్లోని బొమ్మలకు సజీవ పాత్రధారులందరూ మా దగ్గర కొచ్చిన వారిలో కొందరు మాత్రమే! వచ్చిన అందరూ పెళ్లయి రెండేళ్లయినా గడవకముందే విడాకుల కోసమో.. వేరుగా ఉండి బ్రతికే మార్గాల కోసమో వచ్చిన వాళ్లే..! చెప్తున్న వివేక్‌ అందర్నీ మరోసారి పరిశీలనగా చూసాడు.

అందరూ నిశ్శబ్దంగా మంత్రించబడిన వాళ్లలా చూస్తు ఉండిపోయారు!

మీరు చూసిన చిత్రాలు నిజమైన నమూనాలు. బొమ్మలు చెప్పిన మాటలు కల్పితాలు కావు వాళ్లు చెప్పినవే! ఇలా చెప్పేవాళ్లు ప్రతిరోజూ కనీసం పదిమందికి తగ్గకుండా మా వద్దకు వస్తుంటారు. వచ్చిన వాళ్లందరూ అంతగా చదువులేని వారో.. ఏ సంపాదన లేని వారో.. పేద వారో కాదు.. వచ్చిన వాళ్లలో అరవయ్‌శాతం వరకూ స్టాఫ్ట్‌వేర్లే, భార్యా భర్తలిద్దరూ చక్కగా ఉద్యోగాలు చేస్తున్నవారే, చెరొకరూ దాదాపు లక్షవరకూ, కొందరు ఆపైనా సంపాదిస్తున్నవారే!

సమాజంలో ఉన్నత వర్గంలో చేరిన.. చేరబోతున్న వాళ్లలో ఆలోచనలు అవగాహనలు వాళ్ల ఉద్యోగాల్లా లేదా వాళ్ల చదువుల్లా ఉన్నత స్థాయిలో ఎందుకు ఉండటం లేదు..? ఈ స్థితి నేటి ఆధునిక సమాజంలో ఇప్పటికి నేలలో వేళ్లు బలపడి పైపైకి.. ఇంకా చుట్టూరా ధృడంగా విస్తరించుకుంటూ పోతున్న విషవృక్షమై సభ్యసమాజాన్ని భయంకరంగా హెచ్చరిస్తోంది !

మన సమాజమంతా ఇలాంటి మహా విష వృక్షాలతో నిండిపోతూ ఉంటే ఏం జరిగేదీ మనకు తెలియనిదేమీ కాదు.. ఊహించలేనిదేమీ కాదు! వందేళ్ల క్రితం సమాజంతో పోల్చుకుంటే నేటి మన సమాజంలో మనిషికి అవసరమయ్యే అన్ని అంశాలూ నాగరికతనూ, ఆధునికతనూ పెంచుకున్నాయి! సున్నితత్వాన్ని సొంతం చేసుకున్నాయి..! అలాగే వాటి స్థాయినీ.. ప్రమాణాన్ని గొప్పగా పెంచుకున్నాయి! దానికనుగుణంగానే మనుషుల జీవనశైలీ.. స్థాయీ పెరిగాయి! కానీ ఇవ్వన్ని కేవలం భౌతికమయినవి! కానీ దురదృష్టం కొద్దీ వారి మనసులు, వారి ఆలోచనా పరిధి ఆ స్థాయిలో పెరుగుతున్న రుజువులు లేవు.

చూసారుగా తన దువ్వెన.. టవల్‌.. సోప్‌ ఎట్సెట్రా వాడొద్దంటే వాడుతున్నాడని ఒకామె విడాకుల కోసం పరుగెత్తుకుంటూ వచ్చేసింది! మరి ఆమె అతనితో జీవితాన్ని ఎలా షేర్‌ చేసుకోవాలని పెళ్లి చేసుకుందో ఆమెకే తెలియాలి!

ఉప్పు.. కారాలు కాస్త ఎక్కువయ్యాయని భార్య మీద కారాలు.. మిరియాలూ నూరే భర్తని ఏమనిపిలవాలి? అని నివారించలేని సమస్యలా..? విడాకులు తీసుకోవడమే వాటికి పరిష్కారమా..? విడాకుల కోసం హడావిడిగా వచ్చే వాళ్లకు.. విడాకుల తర్వాత తమ జీవితాలు ఎలా ఉండొచ్చు.. ఉండగలవు..? అన్న విషయమై ఏ అవగాహనా లేకుండాపోతోంది. విడాకుల తర్వాత ఆ ఇద్దరూ ఒంటరిగానే ఉండిపోదల్చుకున్నారా.. లేక మళ్లీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే పార్టనర్స్‌ వీళ్ల అభిరుచులు.. ఆశయాలకు తగిన వాళ్లే వస్తారా.. వచ్చే అవకాశాలు నూటికి నూరు పాళ్లున్నాయా..? అలా ప్రశ్నిస్తే జవాబులు చెప్పలేరు! వీళ్లందరిలోనూ ఉన్నది క్షణికావేశం! లేనిది సంపూర్ణ అవగాహన.. సుదూర ఆలోచన.. సమగ్ర విశ్లేషణ..! అవి ఉంటే వాళ్లకు తమ భాగస్వామిని అర్థం చేసుకొనే జ్ఞానం ఒకరికొకరు సన్నిహితం కాగలిగే నేర్పూ.. అందుకు నిరీక్షించే ఓర్పూ ఉండేవి..!

మన చిత్రాల్లోని జంటలు బాగా చదువు కున్నవారే ! అయినా వారి చదువుల్లో భౌతికశాస్త్ర విషయజ్ఞానం తప్ప మనో విజ్ఞానం కానీ.. సామాజిక జ్ఞానం కానీ లేవనే అర్థమవుతోంది. ఏమంటారు? ప్రశ్నార్థకంగా చూసాడు వివేక్‌.

కదిలీ కదలనట్టుగా నిలువుగా అందరి తలలు ఊగాయి!

ఓ.కే. మీరు అర్థం చేసుకున్నారు.. థాంక్స్‌.

సార్‌.. మరి వాళ్లలో అవగాహన, మీరు చెప్పిన సాన్నిహిత్యం పెరగాలంటే కావాల్సినదేంటో చెప్పండి! ఉత్సాహంగా అడిగాడో యువకుడు.

సరసం! మెరుపులా ఆ సమాధానం రావడంతో ఉలికి పడ్డాడా యువకుడు.

సరసమా?

అవును. భార్యాభర్తల మధ్య అవగాహనకు తొలిబీజం వేసేది సరసతే! ఉదాహరణకు గురు శిష్యుల మధ్య అవగాహన, అనుబంధానికి కావాల్సి నవి జిజ్ఞాస, వినమ్రతలు. పిల్లలకూ, తల్లిదండ్రులకూ మధ్య ఉండాల్సినవి బాధ్యత, కర్తవ్యాలు! అలానే భార్యాభర్తల మధ్య అవగాహనకు ముందుగా తోడ్పడేవి సరసం, సాన్నిహిత్యం! ఇప్పుడు టాపిక్‌ పెళ్లి కావాల్సిన వాళ్లు, కొత్తగా పెళ్లయిన వాళ్లు కనుక వారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను.

సరసం అంటే ఏమిటి సార్‌..? నెలా పదిరోజుల క్రింద పెళ్లయిన ఓ అమ్మాయి అడిగింది!

కేవలం సరసం ఉంటే కాపురం బాగా సాగు తుందా సార్‌ ! వాళ్ల మధ్య ప్రేమ ఉండక్కర్లేదా..? మరో యువకుడి ప్రశ్న.

మంచి ప్రశ్న! ప్రేమ అన్నది అంతరంగ భావన. ఒక హృదయానుభూతి. అది బయటకు వ్యక్తమయ్యేది చూపుల్లో.. చేష్టల్లో.. మాటల్లో..! వాటి వ్యక్తీకరణ సాధనం సరసం! ఇవన్నీ తియ్యని పాలనుకోండి..! ఆ పాలలో కరిగిన పంచదారే ప్రేమ! ఆ ప్రేమ గట్టిపడితేనే ఇద్దరినీ ఒక్కటిగా చేసి శాశ్వతంగా బంధిస్తుంది. అనుబంధమంటే అదే! ఇక ఆ సరసమేమిటో నేను నా నోటితో చెప్పను. ఓ లఘు చిత్రం చూపిస్తా! చూసి మీ అంతట మీరే తెలుసుకునే ప్రయత్నం చేయండి..! చెప్పి ప్రొజెక్టర్‌ తెరిచాడు.

సీన్‌-1

‘సుశీల గారూ.. ఏమండీ సుశీల గారూ..’

‘ఆ.. వస్తున్నా..’ వద్దన్నా వినకుండా వంటగదిలో చొరబడతారు. ముద్దుగా గొణుక్కుంటూ తలదువ్వు కోవడాన్ని సగంలో ఆపి వెళ్లింది ఆమె.

ఈ రోజు ఈ కూర భలేగా కుదిరింది. కాస్త రుచి చూసి మార్కులు బాగా వేస్తారేమో అనీ.. అంటూ వండిన పాత్రలోని కూరని కలియపెడుతూ చెంచాతో కొద్దిగా తీసి ఆమె అరచేతిలో వేశాడు అతను.

కూరని రుచి చూసిందామె.

బాగుందాండీ..?

ఇక ఆపండీ !

ఏం ఆపాలండీ..?

ఆ అండీలు! ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు.. ముద్దుగా కసురుకుంది ఆమె.

అండీ అంటే తప్పేంటండీ..?

భార్యను ఎవరూ అలా పిలవరు. ఎవరయినా వింటే నవ్వుకుంటారు. అంతలో ఫోన్‌ రింగ్‌ శబ్దం వినపడి పరుగున హాల్లోనికి వెళ్లింది. సెల్‌లో కనిపిస్తున్న పేరును చూసిన ఆమె ముఖంలో వెలుగు చిమ్మింది. కాల్‌ ఆన్‌చేసి చెవికి అనించుకుంది.

హాయ్‌.. స్వీటీ.. నేనూ..

ఓ..కే.. ఓ..కే.. పంపిస్తున్నావా…? గుసగుసగా అంది మాటిమాటికి వెనుతిరిగి చూస్తూ..!

మా ఫ్రెండ్‌తో నిన్ననే పంపించేసా.. ఈ సాయంత్రం వాడొచ్చేస్తాడు. ఆ సమయంలో మీవారు లేకుండా చూస్కో.

అలాగే..!

ఇంకేంటి విశేషాలు.. మీ వారేం చేస్తున్నారు.. ఇంకా వంటగదిని పరిపాలిస్తూనే ఉన్నారా..!

ష్‌.. మెల్లగా మాట్లాడు, ఆయన విన్నారంటే అంతా రసాబాస అయిపోతుంది. అంది దాన్ని మధ్యలో విరుస్తూ..!

రహస్యంగా వంట గదిలోంచే గమనిస్తున్న సుదర్శనం బయటకొచ్చి భార్యను అనుమానంగా చూశాడు.

ఎవడు.. వాడేనా..? కోపంగా అడిగాడు.

అహ! వాడు కాదండీ..

నాకు తెలుసు.. వాడే. చూడండి సుశీల గారూ.. నావి పాముచెవులు.

పాముకు చెవులుంటాయాండీ..?

ఉండవు.. కనుకనే అవతలి వారి వైబ్రేషన్స్‌ గ్రహించి కనిపెట్టేస్తాయి..! నేనూ అంతే..!

మా మంచి శ్రీవారు.. పదండి ఆ కూర సంగతి చూద్దాం.

టాపిక్‌ మళ్లించకండి శ్రీమతిగారూ.. అయినా ఇప్పుడు వాడు ఇచ్చే తీపికన్నా ఈ ఆసలు తీపి మీకిప్పుడెంతో అవసరం.. ఆరోగ్యం కూడా..’ అంటూ ఆమె చెంపపై సున్నితంగా ముద్దు పెట్టాడు.

ఆమె చలించిపోయింది!

సీన్‌-2

పెన్సిల్‌ చెక్కడానికి షార్పనర్‌ ఉంటుందండీ శ్రీమతిగారూ. దాన్ని ఉపయోగించక బ్లెడ్‌ వాడారు. చూపుడు వేలికి రక్త సింధూరం అద్దారు. కుడిచేతికి సెలవు ఇచ్చేశారు.. ప్చ్‌..! నొచ్చుకుంటూనే అన్నాడు.

‘ఊఁ.. ఇదే ఆఖరి ముద్ద.. ఆఁ..! అంటూ నోరు తెరిచి చూపించారు శ్రీవారు ఇలా తెరవమంటూ..! అంతే ! అక్కడున్న బూరెను చటుకున్న ఆ నోట్లోకి విసిరింది శ్రీమతి!

సీన్‌-3

ఎక్కడికండీ తయారవమంటున్నారూ..?

తెలిసీ అడక్కూడదండీ..

సాయంత్రం వెళ్దామండీ..

సుశీలగారూ.. ఇప్పుడైతే హేపీగా వెళ్లి చీకటి పడక ముందే హేపీగా వచ్చేయొచ్చు. ఇంటికొచ్చాక చాలా హేపీ మూమెంట్స్‌ ఉంటాయి కదా!

ఆహాఁ.. కొంటెగా చూస్తూ అంది. అయినా ఇప్పుడా కొత్త చీరలు.. పువ్వులకూ ఎందుకండీ వెళ్లడం.. డబ్బు దండగ.

నో.. నో.. మ్యారేజ్‌ డే అనవాయితీ తప్పకూడ దండీ.. నిన్ననే వెళ్దామంటే వర్షమని వాయిదా వేస్తిరి. కమాన్‌ లేవండీ. కుర్చీలో కూర్చుని ఉన్న ఆమెను లేవదీసి హత్తుకున్నాడు.

సీన్‌ : 4

సుశీలగారూ.. మీ పన్నీటి జల్లు సాన్నం పూర్త యిందా..? లోపలికి రానా.. అంటూ అడిగారు సుదర్శన్‌ గారు.

వద్దొద్దు అయిదు నిముషాలు ఆగండీ.. ప్లీజ్‌! సిగ్గుపడుతూ స్నానాల గదిలో నుండే అరిచారు సుశీలగారు.

ప్రాజెక్టరు ఆఫ్‌ చేశాడు వివేక్‌!

చూశారుగా ఆ ఇద్దరి విన్యాసాలు! ఓ దంపతుల నిజ జీవితంలోని వేలాది ప్రేమరస తరంగాల్లో కొన్నింటిని మాత్రమే ఈ ఏనిమేషన్‌ చిత్రంలో మీరు చూశారు. ఇక వారెవరో చెపితే ఆశ్చర్యపోతారో లేదో! వారిని ఆదర్శంగా తీసుకుంటారో లేదో మీ ఇష్టం. అంటూ అందరినీ మరోసారి నిశితంగా కలయ చూశాడు. అందరి ముఖాల్లోనూ ఆసక్తిని గమనిం చాడు వివేక్‌.

మీరు చూసిన సీన్లలో ఉన్న సుశీలగారు రిటైర్టు కాలేజీ లెక్చరర్‌. ఆమె భర్త రిటైర్డు కాలేజ్‌ ప్రిన్సిపాల్‌. ఆమెకు మధుమేహం, రక్తపోటు రెండూ ఉన్నాయి. ముందుగా రిటైరయిన ప్రిన్సిపాల్‌ గారు వంటగదిని స్వంతం చేసుకొని భార్యకు పథ్యం భోజనం తయారు చేసే బాధ్యతను తలకెత్తుకున్నారు. భార్య వేలు కోసుకుపోతే ముద్దుగా ముద్దలు తినిపిస్తారు. ఆమె కాలేజీ నుండి అలసి ఇంటికొస్తే కాఫీ ఇచ్చి సేద తీరుస్తారు. పని మనిషి సెలవు పెడితే, భార్య వద్దన్నా తనే వంట బాధ్యత తీసుకుంటారు. అప్పుడా భార్య ఫీలింగ్స్‌ చూసి ముద్దలు పెట్టడమే కాదు సెల్ఫీలు కూడా తీసుకుంటారు.

అందరూ వింతగా చూడటం గమనించి చిన్నగా నవ్వాడు వివేక్‌.

వారికి ఒక్కడే కొడుకు! న్యూఢిల్లీలో సెంట్రల్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగం చేసి గత సంవత్సరమే రిటైర్‌ అయ్యారు. ఆయనకొక కొడుకు. పేరు వివేక్‌. నేనే! అడ్వకేట్‌గా, మ్యారేజ్‌ కౌన్సిలర్‌గా, సైకాల జిస్టుగా ఈ సిటీలోనే స్థిరపడ్డాను. కలకత్తాలో నేను కొన్నాళ్లు రైల్వేలో ఉద్యోగం చేశాను. మా నాన్నమ్మకు స్వీట్లంటే ముఖ్యంగా రసగుల్లాలంటే చాలా ఇష్టం! అక్కడ్నించి తరచుగా వాటిని పంపించేవాడిని. మా తాతయ్య చూడకుండా తినేసేది. స్వీట్లంటే ఇష్టపడే ఆమెను నేను స్వీటీ అని పిలిచేవాడ్ని! చూశారుగా వారి మధ్య అన్యోన్యం.! సరసం! అవి వాళ్లను ఓ గొప్ప ప్రేమానుబంధంతో కట్టిపడేసినట్లుగా లేవూ?!

ఆ కపుల్‌ ఇప్పుడెక్కడున్నారు సార్‌? ఓ యువకుడు అడిగాడు. విశాఖలో స్థిరపడ్డారు. మూడేళ్ల క్రిందటే అరవయ్‌ వివాహ వసంతాల వేడుక షష్టిపూర్తి మా అందరి మధ్య చేసుకున్నారు. నవ్వుతూ మళ్లీ అందర్నీ కలయచూశాడు. అందరూ ఏదో పోగొట్టున్న వారిలా నిట్టూరుస్తున్నట్టు గమనించాడు.

తన ఎదుటనున్న వారిలో కొందరు కౌన్సిలింగ్‌కు వచ్చిన వారు. ఇంకొందరు సంశయ నివృత్తి కోసం వచ్చినవారు. మిగిలినవారు విడాకులకు సిద్ధపడి వచ్చినవారు.

వచ్చిన వారందరూ తమలోని నెగటివ్‌ భావాలను వెలికితీసి, ఆ నిట్టూర్పులో కలిపేస్తు న్నట్లుగా, తమకు తెలియనిదేదో తెలిసి జ్ఞానోదయ మైనట్టుగా అనుభూతి చెందుతున్నట్లు గమనించిన వివేక్‌ తృప్తిగా నిట్టూర్చాడు!

– వారణాసి ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *