గురువు గారి చాతుర్యం

గురువు గారి చాతుర్యం

ఒక గురువుగారుండేవారు. ఆయన తన శిష్యులకు చిన్నతనం నుండే జీవితాన్ని గురించి తెలియజేయాలనుకున్నారు. ఆ విషయాలను సూటిగా చెప్పక, పంచతంత్ర కథల ద్వారా రాజకుమారులకు విద్యనేర్పిన విష్ణుశర్మ మార్గాన్నే గురువుగారు ఎంచుకున్నారు.

గురువుగారు శిష్యులకు కథ చెప్పడం మొదలు పెట్టారు.

‘మీరు ఒక అడవికి వెళ్తున్నారు. అప్పుడు మీ తల్లిదండ్రులను తోడు తీసుకెళ్తారా? లేక మీ స్నేహితులను తీసుకెళ్తారా? లేక ఒంటరిగా వెళ్తారా?’ అని గురువుగారు శిష్యులను అడిగారు.

ఒక శిష్యుడు మాత్రం ఒంటరిగా వెళ్తానన్నాడు. మిగిలిన వారందరూ తమ తల్లిదండ్రులను తోడు తీసుకెళ్తామన్నారు. గురువుగారు ఎందుకిలా అడిగారా?! అని శిష్యులందరూ గురువుగారి వంక చూశారు.

‘మీరు తల్లిదండ్రులనో లేక స్నేహితులనో తోడు తీసుకెళ్తే, మీరు ఏ నిర్ణయమైనా వారి సహాయంతో తీసుకుంటారు. ఒకరు కాక ఇద్దరు ఆలోచించడం వలన మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. మీరు ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏ నిర్ణయమైనా మీ అంతట మీరు తీసుకోవాలి. అది మంచి కావచ్చు లేక చెడు కావచ్చు’ అంటూ గురువుగారు శిష్యుల సందేహాన్ని తీర్చారు.

మళ్ళీ కథ చెప్పడం మొదలు పెట్టారు గురువు గారు.

‘మీరు ఒంటరిగా అడవిలో వెళ్తుండగా క్రూర జంతువులు ఎదురు పడినప్పుడు ఏం చేస్తారు?’

అవి కనపడితే పారిపోతామని కొందరు, దగ్గరలో ఉన్న చెట్టెక్కి తమను తాము కాపాడుకుంటా మని కొందరు శిష్యులన్నారు.

గురువుగారు శిష్యులందరినీ ‘శభాష్‌’ అన్నారు.

శిష్యుల మోహాలలో ఆనందం వెల్లివిరిసింది.

అప్పుడు గురువుగారు శిష్యులతో ఇలా అన్నారు. ‘క్రూర మృగా లంటే మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు. వాటిని మనం ఉపాయంతో సమర్థ వంతంగా ఎదుర్కోవాలి’.

మళ్ళీ గురువుగారు కథ చెప్పడం మొదలు పెట్టారు.

‘మీరు అడవిలో ముందుకు వెళ్తుండగా మీకు ఒక ఇల్లు కనపడుతుంది. ఆ ఇంటికి ప్రహారీ గోడ ఉండాలనుకుంటున్నారా? లేక వద్దనుకుంటున్నారా?’ అని గురువుగారు శిష్యులను అడిగారు.

శిష్యులందరూ ముక్తకంఠంతో ‘ప్రహారీ గోడ ఉండాలి’ అన్నారు.

గురువుగారు ‘ఎందుకని’ అడిగారు.

‘గురువుగారు! ప్రహారీ గోడ ఉంటే మనకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇంట్లోకి వస్తారు’ అన్నారు ఒకరు.

అప్పుడు గురువుగారు నవ్వి, ‘శిష్యులారా! ప్రహారీగోడ ఉంటే మన సంబంధాలు పరిమితంగా ఉంటాయి. అదే ప్రహారీగోడ లేకపోతే బాటసారులు, జంతువులు ఆ ఇంటి ఛాయలో సేదతీర్చుకుంటాయి. ప్రహారీగోడ లేనట్లే మన ఆలోచనలతో తన, మన భేదం లేక విశాల దృక్పథం కలిగి ఉండాలి, అన్నారు.

అంతటితో ఆగక గురువుగారు కథను కొనసాగించారు.

‘ఆ ఇంటి వెనుక ఒక నది ప్రవహిస్తున్నది. ఆ నది ఒడ్డున కొన్ని పడవలు కూడా నిలిచి ఉన్నాయి. మీరు ఆ నదిని ఏ విధంగా దాటగలరు?’ అని గురువుగారు శిష్యుల నడిగారు.

ఒక్క శిష్యుడు తప్ప మిగిలిన వారందరూ ‘పడవ సహాయం’తో నదిని దాటతామన్నారు.

ఒక్క శిష్యుడు మాత్రం నదిని ‘ఈదుతూ దాటతాను’ అన్నాడు.

అప్పుడా శిష్యుడిని ‘శభాష్‌’ అంటూ గురువు గారు మెచ్చుకున్నారు.

మిగతా శిష్యులందరూ బిక్కమొహం వేసుకొని గురువుగారి వంక చూడసాగారు.

గురువుగారు ‘పడవ సహాయంతో నదిని దాటడం తేలిక. నదిని ఈదగలిగిన వాడు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, జీవితమనే సాగరాన్ని అవలీలగా దాటగలడు’ అని శిష్యుల సందేహాన్ని తీర్చారు.

– పి.మానస, 9160437152

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *