క్రేజీ బాక్సర్‌..!

క్రేజీ బాక్సర్‌..!

ఫ్లాయిడ్‌ మే వెదర్‌ ప్రపంచ బాక్సింగ్‌ అభిమానులకు, క్రీడాప్రియులకు ఏమాత్రం పరిచయం అవసరంలేని పేరు. ఓ నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లోకి దూసుకువచ్చాడు. అతికొద్ది సమయంలోనే కొన్ని వందల కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు. క్రేజీ క్రేజీ బాక్సర్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సాధించాడు.

అమెరికాలోని మిషిగాన్‌ ర్యాపిడ్స్‌ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం ఫ్లాయిడ్‌ మే వెదర్‌ జూనియర్‌ ఓ నిరుపేద బాక్సర్‌ ఇంట్లో జన్మించాడు. తండ్రి మే వెదర్‌ సీనియర్‌ సైతం బాక్సర్‌ కావడంతో చిన్ననాటి నుంచే ఈ పంచ్‌ల క్రీడ పట్ల ఆకర్షితు డయ్యాడు. తండ్రి తొలిగురువుగా బాక్సింగ్‌లో పరిపూర్ణ శిక్షణ పొందాడు.

చిటికెలో లక్షల డాలర్లు, వందల కోట్ల రూపాయలు సంపాదించే ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో ఫ్లాయిడ్‌ మే వెదర్‌ ఓ సంచలనం. ఓటమి ఎరుగని మొనగాడు. మొత్తం ఐదు వేర్వేరు విభాగాలలో ఏడు ప్రపంచ టైటిల్స్‌ సాధించిన విశ్వవిజేత. డీలా హోయ, పీకే లాంటి ఎందరో మేటి బాక్సర్లను మట్టి కరిపించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు. బాక్సింగ్‌ బరిలోకి మే వెదర్‌ దిగుతున్నాడంటే చాలు నిర్వాహకులకు డాలర్ల పంట పండుతుంది. తన కెరియర్‌లో మే వెదర్‌ 49సార్లు ఫైట్‌కు దిగితే 49సార్లూ తిరుగులేని విజేతగా నిలిచాడు. ఇందులో 26 నాకౌట్‌ విజయాలు ఉన్నాయి!

మే వెదర్‌ బాక్సర్‌గా కళ్లు చెదిరే విజయాలు సాధించడమే కాదు.. భారీ మొత్తంలో సంపాదించడం లోనూ మొనగాడే. రెండు దశాబ్దాల తన కెరియర్‌లో కేవలం 49 ఫైట్లు చేసినా 1000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించాడు. బాల్యంలో నిరుపేద జీవితాన్ని గడిపిన మే వెదర్‌ తాను సంపాదించిన కోట్ల డాలర్లతో అత్యంత ఖరీదైన వజ్రవైడూర్యాలు, కార్లు, విల్లాలు కొనుగోలు చేయటం ద్వారా ప్రస్తుతం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక్క 2014-2015 సీజన్లోనే మే వెదర్‌ 300 మిలియన్‌ డాలర్లు సంపాదించడంతో పాటు కొంత మొత్తాన్ని జూదంలోనూ పెట్టుబడిగా పెట్టాడు.

కోట్ల డాలర్ల ఆదాయం ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? ఏ బ్యాంకులోనో లాకర్లలోనూ దాచు కొంటారు? కానీ మే వెదర్‌ మాత్రం నోట్ల కట్టలను తనతోనే ఉంచుకోడం ఓ హాబీగా చేసుకొన్నాడు. కూర్చొన్నా… ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తున్నా…నోట్ల కట్టలను తనచుట్టూ పరుచుకోడ మంటే అతనికి ఎంతో ఇష్టం. అంతేకాదు… పడకగదిలో సైతం డాలర్ల కట్టలను పరచుకొని మరీ నిద్రపోవడం మే వెదర్‌ డబ్బు దర్పానికి నిదర్శనం. ఇటీవల తన కూతురు పుట్టినరోజు నాడు 30 కారెట్ల డైమండ్‌ రింగ్‌ను కానుకగా ఇచ్చి తనలోని తండ్రి ప్రేమను చాటుకొన్నాడు మే వెదర్‌.

కిలోల బరువున్న ఓ బంగారు గిన్నెతో పానీయం సేవిస్తున్న తన వీడియోను ఈ మధ్యనే న్యూయార్క్‌లో విడుదల చేయటం ద్వారా మే వెదర్‌ తన దర్పాన్ని మరోసారి ప్రదర్శించాడు. తాను నివాసం ఉండే లాస్‌వెగాస్‌లో 22వేల చదరపు అడుగుల ఓ విలాసవంతమైన మాన్షన్‌ను కొన్నాడు. సువిశాలమైన ఈ మాన్షన్‌లో ఐదు బెడ్‌ రూమ్‌లు, ఏడు బాత్‌ రూమ్‌లు, 12 వ్యక్తిగత షవర్లు, రెండు సినిమా థియోటర్‌ భారీ స్క్రీన్లు ఉండేలా ఏర్పాట్లు చేసుకొన్నాడు. అంతేకాదు.. ఈ కుబేర బాక్సర్‌కి విలాసవంతమైన కార్లు కొనటం అన్నా కూడా మహా ఇష్టమే. లాస్‌ వెగాస్‌లోని తన భారీ మాన్షన్‌లో వంద కార్లు ఉంచుకొనే విధంగా ఓ గరాజ్‌ను సైతం ఏర్పాటు చేసుకొన్నాడు. ఇందులో 150 లక్షల డాలర్ల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన వంద కార్లు ఉన్నాయి. వీటిలో 10 లక్షల డాలర్లు ఖరీదు చేసే బుగాటీ, రోల్స్‌రాయస్‌, ఫోర్జే, ఫెరారీ, లాంబర్‌ గోనీ లాంటి ఖరీదైన బ్రాండ్‌ కార్లు సైతం ఉన్నాయి. అంతే కాకుండా ఇతనికి రెండు ప్రయివేటు జెట్‌ విమానాలు సైతం ఉన్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో రోయింగ్‌ పార్టీల కోసం మెర్సిడెస్‌ కంపెనీ తయారు చేసిన ఓ లగ్జరీ బస్సును సైతం సమకూర్చుకొన్నాడు. మే వెదర్‌ ఆస్తుల చిట్టాలో పసిఫిక్‌ మహాసముద్రంలో ఓ ప్రయివేటు ద్వీపం, సాగరజలాలలో నౌకావిహారం చేయటానికి వీలుగా అత్యంత విలాసవంతమైన ప్రయివేటు నౌక సైతం ఉన్నాయి.

బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులను తన ముష్టి ఘాతాలతో కకావికలు చేసే మే వెదర్‌కు క్షణాలలో మిలియన్లకొద్దీ డాలర్లు సంపాదించడమే కాదు.. ఆ డాలర్లతో అత్యంత ఖరీదైన వాచీలు కొనడం అంటే మహా ఇష్టం. ఈ బాక్సర్‌ గారి వాచీల వాడ్రోబ్‌లో 60 లక్షల డాలర్లు ఖరీదైన గడియారాలున్నాయి. వీటిలో 11 లక్షల డాలర్ల ఖరీదైన హుబ్‌ లోట్‌ వాచీ సైతం ఉండటం విశేషం. స్విట్జర్లాండ్‌లో తయారైన అత్యంత ఖరీదైన వాచీలన్నీ మే వెదర్‌ ముంగిట్లో వాలాల్సిందే. ఈ అమెరికన్‌ బాక్సర్‌ పెంపుడు జంతువుల జాబితాలో ఓ చిరుతపులి, సైబీరియాలో మాత్రమే కనిపించే మంచుపులి సైతం ఉన్నాయి.

నలభై సంవత్సరాల వయసుకే వెయ్యి కోట్ల రూపాయల స్థిరాస్థులు, అంతే మొత్తంలో చరాస్తులు సంపాదించిన మే వెదర్‌ విలాసవంతమైన జీవితం, వైభోగం చూస్తుంటే క్రేజీ క్రేజీ బాక్సర్‌ అనుకోవాలో లేక ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనుకోవాలో మరి!

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *