ఏ నిమిషానికి ఏమి జరుగునో..!

ఏ నిమిషానికి ఏమి జరుగునో..!

దేశవ్యాప్తంగా లోక్‌సభకు, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు’ అనే పాట అందరి మదిలోనూ మెదులుతోంది. ఆయా రామ్‌, గయారామ్‌ల కహాని ఓ పక్క సాగుతుండగానే సీటు దక్కినవారు సైతం చేతులెత్తేసి ఎన్నికల బరికి దూరంగా జరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో అటు చిత్రసీమలోనూ రాజకీయ చిత్రాల విషయంలో పై పాటను గుర్తుచేసుకుంటు న్నారు సినీజనం. అంతేకాదు… ‘అనుకున్న దొక్కటీ అయినది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌ బుల్‌ పిట్ట’ పాటనూ పాడుకుంటున్నారు మరికొందరు.

పాజిటివ్‌ ఓట్‌ను సంపాదించుకుంటాయని భావించిన ‘ఎన్టీయార్‌’ బయోపిక్‌ ‘మహానాయకుడు’ సోదిలో లేకుండా పోవడం తెలుగు దేశం నాయకులకు, కార్యకర్తలకు జీర్ణించుకోలేని అంశంగా మారిపోయింది. తొలిభాగం ‘కథానాయకుడు’ ఫర్వాలేదనిపించినా, ‘మహానాయకుడు’లో చంద్ర బాబు ఇమేజ్‌ను పెంచేందుకు చేసిన ప్రయత్నాలను అసలైన ఎన్టీయార్‌ అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. ఈ సినిమాను ఉచితంగా చూపించాలని చేసిన ప్రయత్నాలు సైతం సఫలం కాలేదు. అలానే వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో రూపొందించిన ‘యాత్ర’ ఫర్వాలేదనిపించినా, అదీ పార్టీ చిత్రమనే ముద్రను వేయించేసుకుంది. దాంతో వైయస్‌ఆర్‌ అభిమానులు తప్పితే మిగిలిన వారు ఆ సినిమా జోలికి పోలేదు. ఇక ‘ఎన్టీయార్‌: మహా నాయకుడు’ తరహాలోనే ఈ సినిమానూ జనాలకు ఉచితంగా చూపించాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన పనులు బెడిసికొట్టాయి. ఈ నేపధ్యంలో అందరి దృష్టి రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్‌ ఎన్టీయార్‌’ సినిమాపై పడింది. ఎన్టీయార్‌ బయోపిక్‌ తీస్తానని బాలకృష్ణ ప్రకటించగానే తనకు ఛాన్స్‌ ఇవ్వమని వర్మ కోరాడు. అయితే… కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ వర్మ చేతిలోకి చేరలేదు. దాంతో వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీయార్‌’ ప్రాజెక్ట్‌ను ప్రకటించి, విడుదలకు సిద్ధం చేశాడు. ‘ఎన్టీయార్‌ మహా నాయకుడు’ సమయంలోనే ఈ సినిమాను విడుదల చేస్తారనే ప్రచారం జరిగినా… తెలివిగా వర్మ ఎన్నికల సమయంలోనే తన అస్త్రాన్ని వాడాలనే నిర్ణయం తీసుకున్నాడు. దీనిని ఆపడానికి తెలుగు దేశం పార్టీ నేతలు కొందరు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. కోర్టు సైతం ఈ సినిమా విడుదలపై పాజిటివ్‌గానే స్పందించింది. దాంతో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న జనం ముందుకు సినిమాను తీసుకొస్తానని వర్మ సెలవిచ్చాడు. ఇదే కనుక సెన్సార్‌ గడపదాటి బయటకు వస్తే మాత్రం మరింత చర్చనీయాంశం కావడం ఖాయం.

సందట్లో సడేమియాగా కేతిరెడ్డి, పోసాని

ఎన్టీయార్‌ బయోపిక్స్‌ గొడవ ఇలా ఉంటే… కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆ మధ్య ‘లక్ష్మీస్‌ వీరగ్రంధం’ అనే సినిమా మొదలు పెట్టాడు. ఎంతవరకూ చిత్రీకరణ జరిగింది? ప్రధాన తారాగణం ఎవరూ? అనే విషయాన్ని బయటకు చెప్పకుండా కేవలం ఆడియో పాటలను మాత్రం జనంలోకి సోషల్‌ మీడియా ద్వారా వదిలిపెట్టి కేతిరెడ్డి హంగామా చేస్తున్నాడు. అంతేకాదు… ఏప్రిల్‌ 8న ఈ సినిమాను విడుదల చేస్తానని చెబుతున్నాడు. అయితే… ఆలూలేదు చూలూలేదు అన్న సామెత కేతిరెడ్డికి వర్తింప చేయొచ్చన్నది సినీ జనం చెబుతున్న మాట. ఇదిలా ఉంటే…. ప్రముఖ నటుడు, జగన్‌ అభిమాని పోసాని కృష్ణమురళీ సైతం ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ మీద ధ్వజం ఎత్తడం కూడా సినీరంగంలో చర్చనీయాంశమైంది. ‘ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు’ పేరుతో ఎనిమిది నెలల క్రితమే పోసాని ఓ సినిమా తీసి, సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అంశాలు ఉన్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎలక్షన్‌ కమిషన్‌ జాయింట్‌ కమిషనర్‌ మార్కండేయులు, పోసానిని వివరణ అడిగారట! దాంతో అగ్గిమీద గుగ్గిలమైన పోసాని… ఇదంతా చంద్రబాబు కుట్ర అంటూ శివాలెత్తిపోతున్నారు. ఒకవేళ నిజంగానే ఈ రెండు సినిమాలు కూడా ఎన్నికల ముందు వస్తే మాత్రం చంద్రబాబు అండ్‌ కో ఇరకాటంలో పడటం ఖాయం.

దూసుకొచ్చేస్తున్న ‘పి.ఎం. నరేంద్రమోదీ’

ప్రాంతీయ స్థాయిలో రాజకీయ నేపథ్య చిత్రాల హడావుడి ఇలా ఉంటే, రెట్టించిన ఉత్సాహంతో జనం ముందుకు వచ్చేస్తోంది ‘పి.ఎం. నరేంద్రమోదీ’ చిత్రం. వివేక్‌ ఓబెరాయ్‌, మోదీ పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ తెరకెక్కించాడు. నిజానికి ఏప్రిల్‌ 12న సినిమాను విడుదల చేయాలని ముందు అనుకున్నా కోట్లాది మంది కోరిక మేరకు వారం ముందే అంటే ఏప్రిల్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా దీనిని రిలీజ్‌ చేస్తామని నిర్మా తలు చెబుతున్నారు. హిందీలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలోనూ డబ్‌ చేస్తున్నారు. మరి ఈ సినిమాలు సాధారణ ఓటరును ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *