జయాపజయాల వి’చిత్రలహరి’

జయాపజయాల వి’చిత్రలహరి’

గత వారం ‘మజిలీ’ విజయంతో నాగ చైతన్య మాత్రమే కాదు… ఆ చిత్ర దర్శక నిర్మాతలూ కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వారం విడుదలైన సినిమాల్లో అలాంటి రిలీఫ్‌ను ‘చిత్రలహరి’ బృందం పొందిందనే అనుకోవాలి. ‘మజిలీ’ అంతటి విజయాన్ని అందుకోకపోయినా… వారి గత చిత్రాల ఫలితాలతో పోల్చినప్పుడు ‘చిత్రలహరి’ వేసవిలో కాస్తంత దాహార్తిని తీర్చిందనే భావించాలి.

విజయ్‌ కృష్ణ (సాయి తేజ్‌) బాల్యం నుండే పరాజయాలతో ప్రయాణం సాగిస్తుండే మనిషి. తన పేరులో విజయం ఉంది తప్పితే జీవితంలో లేదని తెగ కృంగిపోతుంటాడు. అయితే అతని మనస్తత్వాన్ని గుర్తించి, తండ్రి (పోసాని) ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటాడు. కారులో ప్రయాణించే వ్యక్తి ప్రమాదానికి గురైతే, అతన్ని కాపాడే ఓ యాప్‌ను తయారు చేసి, తద్వారా పేరు సంపాదించి, జీవితంలో స్థిరపడాలని విజయ్‌ కృష్ణ భావిస్తాడు. కానీ ఏ కంపెనీకి వెళ్లినా అతని ప్రతిభను నమ్మే వాళ్లు దొరకరు. ఇలాంటి నిరుత్సాహ పూరిత వాతావరణంలో అతనికి బాసటగా నిలుస్తుంది ప్రియురాలు లహరి (కళ్యాణి ప్రియదర్శన్‌). కానీ ఆమెకు చిన్న చిన్న తప్పులు చెప్పి, దొరికి పోయిన విజయ్‌ పట్ల అపనమ్మకం ఏర్పడి దూరంగా వెళ్లిపోతుంది. అదే సమయంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కీలక పదవిలో ఉన్న స్వేచ్ఛ (నివేథ పెతురాజ్‌) విజయ్‌ టాలెంట్‌పై నమ్మకంతో తమ కంపెనీ అధినేతను పరిచయం చేసి, అతని యాప్‌ను డెవలప్‌ చేసేందుకు సాయం చేస్తుంది. కానీ దురదృష్టం ఆ కంపెనీ భాగస్వామి (బ్రహ్మాజీ) రూపంలో వెంటాడటంతో అక్కడా విజయ్‌కు ఎదురు దెబ్బ తగులుతుంది. మరి తనను తాను ప్రూవ్‌ చేసుకోవడానికి విజయ్‌ ఏం చేశాడు? ఆ ప్రయాణంలో అతనికి ఎవరెవరు సహకరించారు? మనసులోని అనుమాలను తొలగించుకుని లహరి తిరిగి విజయ్‌ ప్రేమను స్వీకరించిందా? ఇవన్నీ సినిమా ద్వితీయార్థంలో మనకు లభించే సమాధానాలు.

సాయిధరమ్‌ తేజ్‌కు ‘సుప్రీమ్‌’ సినిమా తర్వాత సరైన విజయం దక్కలేదు. వరుసగా ఆరు సినిమాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ఈ సినిమాలోని హీరోకు ఉన్న బ్యాడ్‌ లక్‌ అతనికి వర్తిస్తుందనిపిస్తుంది. దాంతో ఆ పాత్రతో తేజు బాగానే కనెక్ట్‌ అయ్యాడు కూడా. తొలి చిత్రం ‘హలో’తో పరాజయాన్ని మూట గట్టుకున్న కళ్యాణీ ప్రియదర్శన్‌కు ఇందులోనూ మంచి పాత్ర లభించింది. ఉన్నంతలో బాగానే నటించింది. ‘మెంటల్‌ మదిలో’ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన నివేథా పేతురాజ్‌ ఇందులో కీలక పాత్రను సమర్థవంతంగా పోషించింది. హీరో పాత్రలను పక్కన పెట్టి మళ్లీ కమెడియన్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకుంటున్న సునీల్‌ సైతం హీరో స్నేహితుడిగా మంచి పాత్ర చేశాడు. ద్వితీయార్థంలో వెన్నెల కిశోర్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. బ్రహ్మాజీని, ‘ముద్దమందారం’ ప్రదీప్‌ను పూర్తిగా ఉపయోగించుకో లేదనిపిస్తుంది. మొన్నటి ‘మజిలీ’లో హీరో మామగా నటించిన పోసాని, ఇందులో హీరో తండ్రి పాత్ర చేసి మెప్పించాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ వరుస పరాజయాల కారణంగా అనుకుంటా తన పేరులో ధరమ్‌ను తొలగించి ‘సాయితేజ్‌’గా మార్చుకున్నాడు. వరుసగా మూడు ఘన విజయాలను అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతలకు ఇటీవల ‘సవ్యసాచి, అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమాలతో ఎదురు దెబ్బ తగిలింది. దాని నుండి ఈ సినిమాతో కాస్తంత రిలీఫ్‌ పొందారు. అలానే దర్శకుడు కిశోర్‌ తిరుమల గత చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ సైతం నిరాశకు గురిచేసింది. ఆ రకంగా ఈ సినిమా ఫలితం వీరందరికీ ఓ ఊరట అనే చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా సన్నివేశాలను బాగానే ఎలివేట్‌ చేశాయి. సినిమా మొత్తం ఓ ఎత్తుకాగా, దర్శకుడు కిశోర్‌ తిరుమల రాసిన మాటలన్నీ ఓ ఎత్తు.

సహజంగా పరాజయం పాలైన వ్యక్తులు విజయపథంలోకి రావడమనేది స్ఫూర్తిదాయక అంశం. కాబట్టి ఇలాంటి సినిమాలు బాగాలేవని ఎవరూ అనలేరు. అంతమాత్రం చేత అద్భుతం అనే మాట కూడా ఈ సినిమా చూసి చెప్పాలనిపించదు. ఎందుకంటే ఈ కథను ఇంకాస్తంత శ్రద్ధతో తీస్తే మరింత మందిని ఆకట్టుకునే ఆస్కారం ఉండేది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని బాగా చూపించిన కిశోర్‌ తిరుమల, హీరోహీరోయిన్ల మధ్య బంధాన్ని హృద్యంగా తెరకెక్కించలేకపోయారు. ప్రథమార్థం కూడా సాదా సీదాగా సాగిపోవడం మరో మైనస్‌. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఈ సినిమాను చూస్తే నిరాశకైతే గురికారు!

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *