కాల్‌సెంటర్‌

కాల్‌సెంటర్‌

గచ్చీబోలి..

అరగంట కంటే ఎక్కువ సమయం పట్టని ప్రయాణం. అయితే ఆటో హాస్పిటల్‌ చేరుకోవడానికి ఎంతో సమయం పడుతున్నట్లు అనిపిస్తోంది నీలిమకు. ఎప్పుడూ అమ్మతోబాటే ఉండేది. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు.

కాల్‌సెంటర్‌లో ఉద్యోగం.. విదేశాల్లోని కస్టమర్ల కాల్స్‌ను ఎంతో పొలైట్‌గా రిసీవ్‌ చేసుకోవాలి. ఓపిగ్గా సమాధానాలివ్వాలి. వాళ్లెంత దురుసుగా మాట్లాడినా మనం వినయంగా ఉండాలి.

నీలిమ తల్లి, నాలుగేళ్ల క్రితం తండ్రి పోయినప్ప ట్నుంచీ తన సంరక్షణలోనే ఉంటోంది. నిజం చెప్పాలంటే తల్లి భాగ్యలక్ష్మే కూతురు నీలిమ, అల్లుడు రవీంద్ర, ఆరేళ్ల మనుమరాలు బిందులను కంటికి రెప్పలా చూసుకుంటోంది. వాళ్ల అవసరాలకు పెద్ద అండ ఆమె.

‘అంతా సజావుగా వెళ్లిపోతున్న సమయంలో ఇలా ఎందుకు జరిగింది’ నీలిమలో మెదిలిన ఆలోచన.

ఆర్నెల్ల క్రితం నీలిమ ఒక కాల్‌సెంటర్‌లో ట్రైనీగా చేరింది. అంతవరకూ తను ఇంట్లోనే ఉండేది.

కాల్‌సెంటర్‌లో చేరకముందు, చేరాక పరిస్థితుల్లో వచ్చిన మార్పు గుర్తొచ్చింది.

ఇంటి పనులు రొటీన్‌గా విసుగ్గా అనిపించడం, అపార్ట్‌మెంట్స్‌లో ఆడవాళ్లు చాలామంది ఉద్యోగాలకు వెళ్లిపోతూండడంతో కాల్‌సెంటర్‌లో ట్రైనీల నియామకం కోసమిచ్చిన ప్రకటన చూసి అప్లై చేసింది. సహజంగా చురుకైనది కావడంతో, విద్యార్హతలుండటంతో పరీక్ష రాసి సెలక్టయింది. కంపెనీ నుంచి లెటర్‌ రాగానే రవీంద్రతో ఆనందాన్ని పంచుకోవాలనుకుంది.

చేరాలని ఉందని నీలిమ చెప్పగానే రవీంద్ర నుంచి ముందు వచ్చింది సమాధానం కాదు. ప్రశ్న – ”ఎందుకు”

”ఉద్యోగం చేయడం నాకెంతో ఇష్టం. నాకున్న స్కిల్‌ బాగా సరిపోతుంది.”

రవీంద్ర నుండి మరోమాట బయటకు రాకముందే-

”ఫోన్‌ చేసి మాట్లాడాను. ట్రైనీలుగా చేరేవారు సాయంకాలం షిఫ్ట్‌ గానీ, నైట్‌ షిఫ్ట్‌గానీ ఆప్ట్‌ చేసుకోవచ్చునట”

”………………”

”నేను సాయంకాలం షిఫ్ట్‌ తీసుకుంటాను. మధ్యాహ్నం రెండుగంటలకు వెడితే రాత్రి పది. నా పర్‌ఫామెన్స్‌ నచ్చితే డే షిఫ్ట్‌ కూడా మారుస్తారట.”

రవీంద్రకు పెద్దగా నమ్మకం కుదరలేదు.

రవీంద్రకు సీనియర్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా మంచి జీతమే వస్తోంది. క్వాలిఫికేషన్లు, సిన్సియారిటీ కారణంగా అంచెలంచెలుగా ప్రమోషన్లు వచ్చాయి. నీలిమ ఇంటి పనులను చక్కగా చూసుకుంటోంది. రవీంద్ర బ్యాంకులోనే ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చినా సాఫీగా నడిచిపోతోంది. ముఖ్యంగా పాప బిందు గురించి వర్రీ కావల్సిన పనిలేదు. నీలిమ ఇంటిదగ్గరుండడం వల్ల బిందు స్కూలు వ్యవహారాలు, చదువు సజావుగా వెళ్లిపోతోంది. రవీంద్ర వర్క్‌ రిలేటెడ్‌ స్ట్రెస్‌కు నీలిమ గృహణిగా ఉండడం గొప్ప మందులా పనిచేస్తోంది. అదేమాట కొలీగ్స్‌ అంటుంటారు. నీలిమ ఆ ఇంటికి ఒక ఫ్రెండు – గైడ్‌ – ఫిలాసఫర్‌. బిందు వయసు పిల్లలు చాలామంది డేసెంటర్లలోనూ, కోచింగ్‌ సెంటర్లలోను అమ్మానాన్నలు ఉద్యోగాలై ఇంటికొచ్చేదాకా గడపాల్సి ఉంటుంది. ఇంట్లో అమ్మతోబాటు అమ్మమ్మ కూడా. బిందుకు ఇంకేం కావాలి. అలాగే నీలిమ తల్లికి కూడా ప్రేమగా చూసుకునే కూతురు ఎప్పుడూ పక్కనే ఉంటుందనే ధీమా.

”ఇంటి బాధ్యతల సంగతేమిటంటావు” కాస్త చిరాగ్గానే అడిగాడు రవీంద్ర.

నీలిమ నవ్వుతూ చెప్పింది, ”నేను అన్నీ ఆలోచించాను డియర్‌. షిఫ్ట్‌కు వెళ్లేముందు ఇంటి పనులన్నీ కానిచ్చేస్తాను. అమ్మ ఇంట్లోనే ఉంటుంది కనుక బిందు స్కూలు నుంచి రాగానే తను చూసుకుంటుంది. మీరు బ్యాంకు నుంచి వచ్చే టప్పటికి రోజూ ఎలాగూ ఎనిమిదవుతోంది. కాసేపు బిందుతో గడుపుతారు. నేనెలాగూ పదిన్నరకల్లా ఆఫీసు క్యాబ్‌లో డ్రాప్‌ అవుతాను. ఆదివారం అందరికీ సెలవే.. నాకు సమస్యనిపించడం లేదు.”

ఇంత వివరంగా చెప్పినా రవీంద్రకు నమ్మకం కుదరలేదని నీలిమకర్థమైంది.

”రవీ.. ప్లీజ్‌.. పొద్దుట పూటంతా ఇంట్లోనే ఉంటాగా.. జీతం చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. అంటే దానిమీద ఆధారపడతాం అని కాదు. ఎక్కువ డబ్బు వస్తే మంచిదే కదా. నేనుండని సమయం కొన్ని గంటలే. అదీ సాయంకాలం. అంతే. తరువాత కొన్నాళ్లకు నేను డే షిఫ్ట్‌ ఆప్షన్‌ తీసుకుంటే నేను లేనని కూడా మీకనిపించదు. అదీగాక బిందు కూడా తన పనులు తను చేసుకోగలుగుతుంది.”

రవీంద్ర మాట్లాడలేదు.

మౌనం అర్ధాంగీకారమనుకుందో ఏమో నీలిమ ఆనందంగా ఉద్యోగంలో జాయినై పోయింది.

కొత్త పరిస్థితులలో సంసారం సాగిపోతోంది. రాత్రి భోజన ఏర్పాట్లు చూసి మధ్యాహ్నం ఉద్యోగానికి బయలుదేరుతోంది.

ఉత్సాహంతో పన్జేస్తోంది నీలిమ.

కంపెనీ తమ పాలసీలో భాగంగా పనివేళల్లో సెల్‌ఫోన్‌లను స్విచాఫ్‌ చేసి ఉంచా లనడంతో ఇంటిపట్ల ఆలోచనలు అన్నీ ఆవిరై పోయాయి.

ఆఫీసులో పనో, క్యాబ్‌ అందుబాట్లో లేకనో.. ఏదో ఒక కారణంగా నీలిమ వచ్చేటప్పటికి అర్ధరాత్రి దాటుతోంది. ఉదయం ఏడు-ఎనిమిదికి ముందు నిద్రలేవడం కష్టమవుతోంది. పరిస్థితి గమనించిన భాగ్యలక్ష్మి చాలా ముందే నిద్రలేచి అన్ని ఏర్పాట్లు చేస్తూ, స్కూలుకు బిందు, బ్యాంకుకు రవీంద్ర టైముకు వెళ్లేలా చూస్తోంది.

కంపెనీ కస్టమర్లు పెరిగారు. లాభాలు పెరిగాయి. నీలిమకు పని ఒత్తిడీ పెరిగింది.

కస్టమర్ల నుంచి వచ్చే కోపిష్టి కాల్స్‌, అసభ్య కరమైన కాల్స్‌ మైగ్రేషన్‌కు కారణమయ్యాయి.

ఉద్యోగంలో బాస్‌ల దబాయింపులు, ఒత్తిళ్లు, అసమర్థులు సమర్థవంతంగా చేసే రాజకీయాలు ఎప్పుడూ బుర్రలో తిష్ట వేసుక్కూర్చోవడం మొదలైంది. ఎంత కష్టపడి పనిచేసినా డే షిఫ్ట్‌కు మార్చే పరిస్థితులు కనబడకపోగా, బాసులతో క్లోజ్‌నెస్‌ ప్రదర్శిస్తూ, స్వీట్‌ స్వీట్‌ కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తూ ఫేవర్లు కొట్టే అమ్మాయిలు ఎక్కువయ్యారు. ఎంత వారలైన కాంతదాసులే కదా. నీలిమ తరచు నిగ్రహం కోల్పోవడం, ఆఫీసులో చూపించలేని కోపం ఇంట్లో ప్రదర్శించడం మొదలైంది. తనకంటూ స్థిమితంగా కూర్చునే టైము కరవైంది. ఆదివారాలు వచ్చేవి.. కానీ రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్లుండేది.

కేర్‌ హాస్పిటల్‌..

రవీంద్ర ఐసియు బయట నీలిమ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. బిందుని తెలిసిన ఫ్రెండ్‌ ఇంట్లో దింపి వచ్చాడు.

నీలిమకోసం ఫోన్‌ ట్రై చేసి చేసి స్విచాఫ్‌లో ఉండడంతో బిందు డాడీ కోసం బ్యాంకుకు ఫోన్‌ చేసింది. అమ్మమ్మకు గుండెనొప్పని చెప్పడంతో ఎంతో కంగారుగా బయలుదేరి వచ్చాడు రవీంద్ర. పరిస్థితి బావుండకపోవడంతో హాస్పిటల్‌కు తీసుకొచ్చాడు.

భాగ్యలక్ష్మిని ఐసియులో అబ్జర్వేషన్‌లో ఉంచారు.

ఒక్కసారిగా బిపి పెరిగిపోవడంతో గుండెదడ ఎక్కువైంది. ‘ఏం కాదని’ ధైర్యం చెప్పాడు. ధైర్యం కోసం అన్నాడే కానీ రవీంద్రలోను భయంలేకపోలేదు డాక్టర్లు ఏం చెబుతారోనని.

రెండురోజుల్లో వార్డ్‌కు మారుస్తామన్నారు డాక్టర్లు. అయితే బిపి ఫ్లక్చుయేషన్స్‌ కారణంగా పదిరోజుల దాకా హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంద న్నారు.

ఎమర్జన్సీ తప్పిపోయినందుకు రవీంద్ర ఊపిరిపీల్చుకున్నాడు.

ఆ వయసులో పెద్దావిడకు పని ఒత్తిడి బాగా పెరిగిపోవడం, నీలిమ చూసుకునే ఇంటి బాధ్యతలన్నీ ఆవిడ చూసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని రవీంద్ర గ్రహించాడు.

హాస్పిటల్‌ ఎంట్రన్స్‌ దగ్గర నిలబడి ఉన్నాడు రవీంద్ర.

గడియారం చూసుకున్నప్పుడల్లా అసహనం పెరిగిపోతోంది.

నీలిమ రావడానికి ఎంత టైమైనా పట్టొచ్చు. ఒక పక్క మెట్రోపనులు, రోడ్డు పనులు.. ట్రాఫిక్‌ జామ్‌లుంటాయి…

బిందు గుర్తొచ్చింది..

నిజమే బిందు స్వతంత్రంగా ఉండ గలుగుతుంది. స్కూలు పని అదీ ఏ సపోర్టు లేకుండా చేసుకుంటోంది. నీలిమ ఉద్యోగంలో చేరడం వల్ల వచ్చిన మంచి మార్పు. అయితే తల్లిని మిస్సవుతోంది పిచ్చితల్లి. నీలిమ లేచేసరికి బిందు స్కూలు బస్సు వెళ్లిపోతుంది. రాత్రి పడుకున్నాక కానీ నీలిమ రాదు. అమ్మను చూడా లంటే ఒక్క ఆదివారమే. అమ్మ అలసట తీరడానికే సరిపోతుందా ఒక్కరోజు. బిందు పక్కన అమ్మమ్మ పడుకున్నా తల్లి లోటును తీర్చలేదు కదా.

రవీంద్ర నీలిమను చాలా మిస్సవుతున్నాడు. మార్నింగ్‌ వాక్‌కు కలిసి వెళ్లేవారు. కాఫీ కలిసి తాగేవారు.. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర సరదా కబుర్లుం డేవి. గేటు దగ్గర చిరునవ్వులతో సాగనంపడాలు ఉండేవి. మరికొన్నాళ్లయితే ఇవన్నీ జ్ఞాపకానికి కూడా రావు, కనీసం గుర్తు తెచ్చుకుని ఆనందించడానికి.

ఏ అర్ధరాత్రి దాటాకో పక్కలో తన పక్కన పడుకున్నా… ఏముంది. ఒకే మంచం మీద ఆడ, మగ – రెండు శరీరాలు అన్నట్లుంది. అలసిన దేహాలకు కోరికలేముంటాయి.

సునామిలా ప్రవేశించిన ఈ పెనుమార్పుల విలువ…?

పోగొట్టుకునేదెంత, పొందేది ఎంత – జీవితంలో ఈ లెక్క ప్రతి ఒక్కరూ వేసుకోవాలి.

నీలిమ ముఖంలో మునపటి కళలేదు. విశ్రాంతి లేని జీవితం. ఇంకా ఏదో మిణుకు మిణుకుమనే ఆశ – ‘చేరేటప్పుడు డే షిఫ్ట్‌ ప్రామిస్‌ చేశారు.. ఇస్తారు’

ఆ ఆశ.. ఎదురు చూపులు పిచ్చితనం అనిపించింది రవీంద్రకు.

ఒకవేళ డే షిఫ్ట్‌ ఇచ్చినా మునపటి ఆనందం ఉంటుందన్న నమ్మకం రవీంద్రకు లేదు.

ఈ ఒత్తిడంతా అరవై అయిదేళ్లు పైబడ్డ భాగ్యలక్ష్మి మీద పడింది. ఇంటిని నడిపించే శక్తి ఆమెలో లేదు. నీలిమతో సహాయపాత్ర మాత్రమే పోషించగలదు. అలసిపోయి సొమ్ముసిల్లిపోవడానికి సిద్ధమైన నీలిమ పనంతా ఆమెకు అప్పజెబితే-

హాస్పిటల్‌ దగ్గర ఆటో దిగింది నీలిమ.

కంగారుగా వస్తున్న ఆమెకు దారిలోనే అమ్మకు గండం తప్పిందన్న వార్త చెప్పి రిలీఫ్‌ పొందేలా చేశాడు రవీంద్ర.

ఆతురత నిండిన రెండు రోజులు ఐసియు బయట, వారంపాటు వార్డులోను తల్లితో ఉండాల్సి వచ్చింది నీలిమకు. పరిస్థితి తెలియజేస్తూ ఆఫీసుకు లెటర్‌ పంపింది.

రవీంద్ర వాళ్లమ్మ సహాయపడడానికి ముంబయి నుండి వచ్చింది. దాంతో రవీంద్ర బ్యాంకుకు, బిందు స్కూలుకు వెళ్లడం జరుగుతోంది.

భాగ్యలక్ష్మి నెమ్మది నెమ్మదిగా మాట్లాడగలుగు తోంది. పక్కనే సేవలందించే కూతురిని చూసేసరికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. ఆ వచ్చిన ధైర్యంతో త్వరగా కోలుకుంది.

”నువ్వు ఉద్యోగానికి వెళ్లాలేమో” నెమ్మదిగా అంది తల్లి.

నీలిమ తల్లి చేతిని దగ్గరికి తీసుకుని అదిమిపట్టు కుంది ధైర్యం ఇస్తున్నట్లుగా.

తల్లి కళ్లు మూసుకుంది ప్రశాంతత దొరికినట్లు.

”నీలిమా”

”ఏమిటమ్మా”

కళ్లు సగం మాత్రమే తెరచి ఉన్నాయి. గొంతు లోంచి మాట ముక్కలు ముక్కలుగా వస్తోంది.

”గుర్తించే ఉంటావు. నీ ఇల్లూ ఒక కాల్‌సెంటరే”

నీలిమకు ఆశ్చర్యం కలిగింది. అమ్మ ఏ ఉద్దేశ్యంతో అంటోందిలా.

”నీ భర్త కాల్స్‌కు గానీ, బిందు కాల్స్‌కు గానీ నువ్వు జవాబివ్వలేదు”

ఆ మాటలు పొడుచుకున్నాయి. కారణం అందులో యదార్థముంది. నీలిమ గొంతారి పోయింది.

”…………..”

”…….. వాళ్ల కాల్స్‌ వెయిటింగ్‌లో ఉన్నాయి. ఎందుకంటే నీలైన్‌ ఎంగేజ్‌ అయి ఉంది.”

అంతగా చదువుకోకపోయినా తల్లి విషయాన్ని బానే చెప్పగలిగింది.

నీలిమ బదులివ్వలేక మౌనంగా ఉండిపోయింది.

పరీక్షల తాలూకు రిపోర్ట్స్‌ తీసుకుని, మందులు వేయడానికి వచ్చింది నర్స్‌.

గది చిన్నది కావడంతో రూము డోర్‌ దగ్గరకు వచ్చి నిలబడింది నీలిమ.

తల్లి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి చెవుల్లో.. మనసులో… ఒక్కో సంఘటనా గుర్తొచ్చాయి.

”అమ్మా ఈ వేళ స్కూల్లో ఫన్నీ ఇన్సిడెంట్‌ జరిగింది…” అని చెప్పబోయింది బిందు సంతోషంతో.

”తరువాత ఎప్పుడైనా చెబుదువుగాని స్వీటీ”

”నీలిమా.. ఒక ఫారిన్‌ బ్యాంకు నుండి, నాకు మంచి ఆఫర్‌ వచ్చింది తెలుసా యాక్సెప్ట్‌ చేయాలా… వద్దా అనిపిస్తోంది…” వివరాల్లోకి వెళ్లకుండానే-

”డార్లింగ్‌.. ఇది చాలా ఆలోచించి తీసుకో వలసిన నిర్ణయం. రేపెప్పుడైనా డిస్‌కస్‌ చేద్దాం. నాకు తలనొప్పిగా ఉంది” ఆ జవాబిచ్చాక మళ్లీ ఆ ‘రేపు’ ఎప్పుడూ రాలేదు. వాళ్ల మధ్య ఆ ప్రస్తావనే లేదు.

”నీలిమా… నాకీ మధ్య కాళ్లు బాగా వాస్తున్నాయి… నీరసంగా అనిపిస్తోంది ఈ వేళ. వంట నువ్వు చూసుకుంటావా” తల్లి అప్పుడప్పుడూ అడుగుతూనే ఉంది.

”అలా అయితే బయటి నుంచి ఆర్డర్‌ ఇచ్చి తెప్పించుకుందామమ్మా.. మనకి సమర్థత లేకపోతే కదా” నీలిమ అనేసేది కానీ తల్లికి బయటి ఫుడ్‌ పడదనే నిజాన్ని మరచిపోయేది.

బిందు టీవీ ముందు ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తోంది. సెల్‌ఫోన్‌లో ఫ్రెండ్స్‌తో కబుర్లు ఎక్కువయ్యాయి.

రవీంద్ర పరధ్యానం ఎక్కువైంది.

బుర్ర తిరిగినట్లయింది.. నీలిమకు.

ఇంటిపనిని, ఉద్యోగాన్ని- రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న ఉద్యోగినులకు మనసులోనే సెల్యూట్‌ చేసింది.

కళ్లు మూసుకుని నిద్రలోకి జారుకున్న తల్లి ముఖంకేసి చూసింది.

చిన్నప్పట్నుంచీ తనతోబాటే ఉండి తన అవసరాలన్నీ తీర్చింది. రుచి రుచిగా తినిపించింది. తన చిర్రుబుర్రులను భరించింది.. కబుర్లకు మురిసిపోయింది.. ఏం చేయలేదని..

ఇప్పుడు ఆమె అవసరమొచ్చేసరికి…?

తను…

సమాధానం తెలియక కాదు.. తెలుసు.

నెలరోజుల తరువాత..

నిద్రపోతున్న బిందును ముద్దుపెట్టుకుంది.. బెడ్‌రూంలో తల్లిపెట్టే గురకలు వినిపిస్తున్నాయి. రవీంద్ర పడుకునే బెడ్‌రూంలోకి నడిచింది.

తల్లి ఆరోగ్యాన్ని ఒక కారణంగా చెబుతూ ఉద్యోగానికి రిజైన్‌ చేసింది. ఇంట్లో అందరి కాల్స్‌ ముఖ్యమనుకుంది.

కుటుంబ బాధ్యతలు బోర్‌ అనిపించడం లేదిప్పుడు.

బిందు.. రవీంద్ర ఎవరెప్పుడొచ్చినా నవ్వుతూ ఇంటి దగ్గర నీలిమ.

ఎప్పుడూ వాళ్లు చెప్పేది వినడానికి, సలహా లివ్వడానికి, సహకారం అందించడానికి సిద్ధం. కుటుంబంలోని ప్రతి ఒక్కరి కాల్‌ను ప్రేమాభిమానా లతో రిసీవ్‌ చేసుకునేందుకు సిద్ధం.. ఒక చిన్న త్యాగం – ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండడానికి.

నీలిమకు ఇప్పుడేబాధాలేదు.. జీవితంలో డబ్బే

ప్రధానం కాదు.

తృప్తి.. సంతోషం.. రెండూ నిండుగా ఉన్నాయి.

అన్నట్టు రవీంద్ర పెందలాడే వస్తానన్నాడు ఉదయం.

అతనికిష్టమైన చీరకట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని స్వాగతం పలకద్దూ నీలిమ. అందుకే ఆ పనిలో పడింది.

– మంత్రవాది మహేశ్వర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *