వినోదాన్ని పంచే కిడ్నాప్‌ డ్రామా ‘బ్రోచేవారెవరురా’

వినోదాన్ని పంచే కిడ్నాప్‌ డ్రామా ‘బ్రోచేవారెవరురా’

చిన్న సినిమాలు, పెద్దంత పేరులేని నటీ నటుల చిత్రాలను జనం థియేటర్లకు వచ్చి చూసే రోజులు పోయాయన్నది ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. అయితే… కథలో కాస్తంత కొత్తదనం, తెరకెక్కించడంలో నేర్పు ఉంటే చాలు… నటీనటుల గురించి పట్టింపే లేదని ఇటీవల వచ్చిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమా నిరూపించింది. చక్కటి వినోదాన్ని అందిస్తూ, సమాజంలోని అసాంఘిక శక్తులు చేస్తున్న ఓ ఘోరాన్ని గురించి ఆ చిత్రంలో ప్రస్తావించారు. దాంతో నటీనటులు కొత్తవారైనా, దర్శకుడికి అదే తొలి చిత్రమైనా… పట్టించుకోకుండా కాసుల వర్షం కురిపించారు జనం. ఇప్పుడు అదే ‘బ్రోచేవారెవరురా’ సినిమా విషయం లోనూ జరుగుతోంది. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుండీ ఆదరణ లభిస్తోంది.

కథలోకి వెళితే, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ విశాల్‌ (సత్యదేవ్‌) తాను దర్శకత్వం వహించడం కోసం కిడ్నాప్‌ డ్రామా కథను తయారు చేసుకుంటాడు. ఓ నిర్మాతకు చెబితే, కథ నచ్చిందని అయితే పాపులర్‌ హీరోయిన్‌ షాలినీ (నివేత పేతురాజ్‌) ఇందులో నటిస్తానంటే సినిమా నిర్మిస్తాననే షరతు పెడతాడు. మొదటి సిట్టింగ్‌లోనే కథ పట్ల ఆసక్తి పెంచుకున్న షాలినీ… దాన్ని డెవలప్‌ చేయమని విశాల్‌కు చెబుతుంది. ఆ క్రమంలో విశాల్‌పట్ల షాలినీలో తెలియకుండానే ప్రేమ చిగురిస్తుంది.

ఇదిలా ఉంటే… రాహుల్‌ (శ్రీవిష్ణు), రాకీ (ప్రియదర్శి), రాంబో (రాహుల్‌ రామకృష్ణ) ముగ్గురూ మిత్రులు. ఇంటర్‌ దగ్గరే డింకీలు కొడుతూ ఉంటారు. వారికి అదే కాలేజీ ప్రిన్సిపల్‌ (కె.ఎస్‌. అయ్యంగార్‌) కూతురు మిత్ర (నివేదా థామస్‌) జత కలుస్తుంది. తల్లి చనిపోవడంతో తప్పని పరిస్థితుల్లో తండ్రి చెంత చేరిన మిత్రకు మొదటి నుండి నృత్యమంటే అభిమానం. చదువంటే అనాసక్తి. తండ్రి తనను ఏ విధంగాను ప్రోత్సహించకపోవడంతో ఇంట్లోంచి వెళ్లిపోయి తన బతుకు తాను బతకాలనుకుంటుంది. అందుకు డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి తనను కిడ్నాప్‌ చేసినట్టుగా డ్రామా ఆడమని రాహుల్‌, రాకీ, రాంబోను కోరుతుంది. ఆమె సలహా మేరకు కిడ్నాప్‌ చేసి ప్రిన్సిపాల్‌ నుండి ఎనిమిది లక్షలు డిమాండ్‌ చేస్తారు. ఆ డబ్బు తీసుకుని డాన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం కోసం మిత్ర హైదరాబాద్‌ వస్తుంది. కానీ ఊహించని విధంగా ఇక్కడకు రాగానే ఆమె కిడ్నాప్‌కు గురవుతుంది. ఆమెను, ఎవరు, ఎందుకు కిడ్నాప్‌ చేశారు? వారి లక్ష్యం ఏమిటి? మిత్రను వారి బారి నుండి రాహుల్‌ మిత్రబృందం కాపాడిందా లేదా అనేది మిగతా కథ. అలానే సినిమా చేయడానికి షాలినీ అంగీకరించిన తర్వాత తండ్రికి జరిగిన యాక్సిడెంట్‌తో విశాల్‌ జీవితమే తారుమారై పోతుంది. ఊహించని విధంగా ఎదురైన కష్టాలను అతను ఎలా ఎదుర్కొన్నాడు? అందుకు షాలినీ ఎలాంటి సాయం అందించింది? చివరకు వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా? అనేది మరో కథ. ఈ రెండు కథలను చక్కగా మిళితం చేసి, ఆయా పాత్రల మధ్య సంబంధాలను ఏర్పాటు చేయడంలో దర్శకుడు వివేక్‌ ఆత్రేయ విజయం సాధించాడు.

శ్రీవిష్ణు, నివేతా పేతురాజ్‌ జంటగా గతంలో వివేక్‌ ఆత్రేయ ‘మెంటల్‌ మదిలో’ అనే సినిమా తెరకెక్కించాడు. అదే అతనికి తొలి చిత్రం కావడంతో అనుకున్న కథను వెండితెరకెక్కించడంలో కాస్తంత తడబడ్డాడు. కానీ ఈసారి అలాంటి పొరపాటు చేయకుండా కిడ్నాప్‌ డ్రామాను, అందులోనూ మల్టీలేయర్స్‌ ఉన్న కథను కన్‌ఫ్యూజన్‌ లేకుండా సినిమాగా మలిచాడు. పైగా వినోదానికి పెద్ద పీట వేశాడు. క్లాస్‌రూమ్‌ కామెడీ ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో వచ్చినా… ఇందులో వాటికి కాస్తంత భిన్నంగా ఉంది. అలానే కిడ్నాప్‌ డ్రామాలూ తెలుగులో కొత్త కాదు. కానీ ఆ ఛాయలు లేకుండా ఈ సినిమా తెరకెక్కిం చాడు. దానికి తోడు పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. ఇక వివేక్‌ సాగర్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం, సినిమా మధ్యమధ్యలో వచ్చే గీతాలు బాగున్నాయి. సాయిశ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ కూడా కన్నుల పండువగా ఉంది. అయితే హీరోయిన్‌, డైరెక్టర్‌ మధ్య ప్రేమ చిగురించడానికి ఇంకాస్త బలమైన కారణాలను చూపించాల్సింది. అలానే కూతురు ఆలోచనలను సరిగా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించిన తండ్రి పాత్రలో కలిగిన పరివర్తనను హృదయానికి హత్తుకునేలా మరింత బాగా చూపించి ఉండాల్సింది. ఏది ఏమైనా కొన్ని సున్నితమైన అంశాలను బోల్డ్‌గా తెరమీద చూపించిన వివేక్‌ ఆత్రేయను అభినందించాల్సిందే. మన్యం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మించిన విజయ్‌ కుమార్‌నూ మెచ్చుకోవాలి. రొట్టకొట్టుడు కథలకు స్వస్తి చెప్పి, నటనకు ఆస్కారమున్న ఇలాంటి కథలను ఎంపిక చేసుకుని, పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో సినిమా తీస్తే, విజయం తధ్యమని ‘బ్రోచేవారెవరురా’ నిరూపించింది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *