అసలైన దేవుడు

అసలైన దేవుడు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ

ఆకాశానికీ, అవనికి దారాలు కడుతూ.. ఒకటే వాన.

బంగాళాఖాతంలో వాయుగుండమట. అయిదార్రోజుల్నుండీ అదే పరిస్థితి.

మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణశాఖ వారి హెచ్చరిక.

అర్ధరాత్రి దాటి చాలసేపైంది.

ఆ కాలనీలో కరెంట్‌ లేదు. కన్ను చించుకున్నా కానరాని చీకటి. మెరిస్తే తప్ప తెలియని ఉనికి. చలికి తట్టుకోలేక చుట్టూ దుప్పటి బిగదీసుకుని కూర్చు నున్నాడు రంగబాబు.

అతనా గేటెడ్‌ కమ్యూనిటీలో ప్లంబర్‌. డ్యూటీ టైమైనా అతనక్కడే ఉన్నాడింకా. కమిటీ ఆదేశం. వర్షాలకి ముందుచూపు.

దసరా నవరాత్రి ఉత్సవాల ముమ్మరం ఆ కాలనీలో. వినాయకచవితికి పిల్లలకి పరీక్షల వత్తిడని దసరానే చేస్తారా కాలనీలో. వర్షాలు కావటంతో ఆ నవరాత్రుళ్లూ ఎలక్ట్రీషియన్నీ, రోడ్లు ఊడ్చే సూరయ్య మ్మని ఉత్సవాలు జరిగినన్నాళ్లూ రాత్రుళ్లు కాలనీలోనే ఉండమన్నారు. అయితే, ఎడతెరిపినీయని వానలు ప్లంబర్నీ వాళ్లకు జతచేసాయి.

ఆరు రోజులూ ఇట్టే గడచిపోయాయ్‌.

ఆ రోజు ఏడోరోజు. ఆ రాత్రి సహపంక్తి భోజనా లేమో అంతకు కొద్ది గంటల ముందే పూర్తయ్యాయి. అతిగా తిన్నాడేమో.. ఉండుండి మూసుకుపోతున్న కళ్లు.. అంతలోనే అంతకుముందే జరిగిన సంఘటన గుర్తొచ్చి ఉలిక్కిపడుతున్నాడు.

చికాగ్గా ఉంది రంగబాబుకి.

‘ఇవ్వాళ వాడికైంది. రేపు తనకవ్వచ్చు’ ఇలా ఎన్ని సార్లనుకున్నాడో తనలో తను.

ఇలా ఆలోచిస్తున్నకొద్దీ కలవరపెడుతున్న అభద్రతా భావం.

‘ఎప్పుడనగా వెళ్లాడో? తెలియద్దా ఆ మనిషికి?’ గొణుక్కున్నాడు ఎలక్ట్రీషియన్‌ మల్లిని తలచుకుని. అతను చాలసేపైంది ఏదైనా తినొస్తానని బయటికి వెళ్లి. అదే అతని కొంప ముంచింది.

రంగబాబు మనసులో వాన చినుకుల్ని మించిన ఆలోచనలు.

దుప్పట్లోంచే చుట్టూ చూశాడు.

వానతో పాటు ఉండుండి వీస్తున్న గాలికి అమ్మవారి ముందున్న దీపం ఎప్పుడో ఆరిపోయింది. చుట్టూ కటిక చీకటి.

అంతకుముందు మూడు గంటల వరకూ సంగీతం ఒకటే ¬రెత్తిందక్కడంతా. పిల్లలు నత్యాలు చేస్తుంటే పెద్ద పెద్ద కెమెరాలతోనూ, ఫోన్లు పట్టుకుని పెద్దాళ్లు అటూ ఇటూ తిరుగుతూ చేసే హడావుడి ఇంకా కళ్లల్లో మెదుల్తూనే ఉంది రంగబాబుకి. గత వారం రోజులుగా అదే వరస.

భోజనాలయ్యాక సామాన్లతో ట్రక్కెళ్లి కూడా చాలా సేపైంది.

మిగిలిన వాటిల్లో తనక్కావాల్సినవి తీసుకుని బాక్సుల్లో సర్దుకుని అదే హాల్లో ఒక మూలగా గురక పెడుతోంది సూరయ్యమ్మ.

దేవీ నవరాత్రులన్నాళ్లూ కాలనీలో కార్యక్రమాలు పెందరాళే మొదలెట్టి అంతే త్వరగా ముగించేస్తారు పసిపిల్లలకి ఇబ్బందని.

గత నాల్గయిదేళ్లుగా ఎలక్ట్రీషియన్‌ మల్లి, సూరయ్యమ్మా అక్కడే పనిచేస్తున్నారేమో.. ఉత్సవాల న్నాళ్లూ ఏ నిమిషంలో ఏ ఇబ్బంది వస్తుందోనని అక్కడే ఉంటారు.

సంసారాలని వదిలిపెట్టి అలా ఉండాల్సిరావటం కష్టమని కమిటీ వాళ్లకీ తెలుసు. అందుకే కాలనీలో పనిచేసే వాళ్లంతా ఇంటింటికీ వెళ్లి వసూలు చేసుకున్న దసరా మామూళ్లు కాక, కమిటీ కూడా కొంత మొత్తాన్ని ఇచ్చి కొత్త బట్టలు కొంటుంది.

అందుకే ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోవాలన్నా, ఉన్న అప్పు తీర్చాలన్నా.. దసరా కోసం చూస్తూంటారు వాళ్లంతా.

సూరయ్యమ్మకి భర్తా, పిల్లలూ లేకపోటంతో రేయింబవళ్లూ అక్కడే. ఒక్క స్నానానికే ఇంటికెళుతుంది.

ఎలక్ట్రీషియన్‌ మల్లి ఒక్కడే ఎంత రాత్రైనా ఇంటికి వెళ్లిపోతున్నాడు. అతను ఈ మధ్యే తెలిసిన వాళ్లు అమ్ముతుంటే చవగ్గా వస్తుందని వాయిదాల మీద పాత యాక్టివా కొన్నాడు. అతనికి కొద్దో గొప్పో బయటి ఆదాయం కూడా ఉంటుంది. పైగా చిన్నోడు.

ప్లంబర్‌ రంగబాబుని మాత్రం కొత్తగా వర్షాలని ఉండమన్నారు.. ఎక్కడైనా నీళ్లు నిలిస్తే చీకట్లో పిల్లలకి ఇబ్బందని.

‘ఒరేయ్‌ మల్లిగా.. రారా బాబా’ అదేన్నోసారో అతనలా అనుకోవటం.

ఆలోచనల్లోనే మెల్లగా వచ్చి ఆగాడు మల్లి చుట్టూ ఆశ్చర్యంగా చూస్తూ..

స్కూటర్‌ లైటుని దూరం నుంచే చూశాడేమో ప్రాణం లేచొచ్చింది రంగబాబుకి.

‘ఏరా బతికే ఉన్నావా? నాయాల..’ అప్పటిదాకా ఊపిరి బిగబట్టి ఎదురు చూశాడేమో.. కోపంతో అరిచేశాడు రంగబాబు వాడు వచ్చాడన్న ఆనందంలో..

‘ఎక్కడెక్కడా తిరిగొచ్చేవ్‌? ఇక్కడ కొంపలంటుకు పోతుంటే?’ మళ్లీ అంతలోనే ఒకింత ఆత్రుతగా, నీరసంగా మల్లినే చూస్తూ. అతని గొంతులో అలజడి, కంగారు..ఏదో బాధ.

‘ఏమైంది? ఎంతసేపయ్యింది కరెంటు పోయి?’ అయోమయంగా అనిపించింది మల్లికి.

ఏమీ మాట్లాడకుండా మల్లి వైపే చూస్తూ ఉండి పోయేడు రంగబాబు. ఆ చూపుల్లో ఏదో జాలి.

కాసేపలా చూసి.. ‘మతిగానీ పోయిందా ఏటి నీకు?’

‘ఏమైంది? సార్లుగానీ పిల్చేరేటి కొంపదీసి? ఓరి బాబోయ్‌. ఈ పాత బండి ఎందుకు కొన్నానా అనిపించిందనుకో! మధ్యలో ఆగిపోయింది. ఎంతసేపున్నా స్టాటవదే! చచ్చాన్రా నాయనా దీంతో. ఆ ఉస్మాన్‌ అన్న గేరేజీ దాకా ఈడ్చుకెళ్లే సరికి అంత వాన్లోనూ ముచ్చెమట్లంటే నమ్ము. నిద్రలేపి బాగు చేయించుకున్న! ఆయన దగ్గరే గదా కొన్నది. అందుకని బండి స్టాటవుతుల్లేదన్నా అంటే పడుకున్నోడు లేచి మరీ చేసిచ్చేడు. గేరేజ్‌లోనే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాల ఇబ్బందైపోయేది’ అన్నాడు కమ్యూనిటీ హాలు మెట్ల కింద మడత పెట్టి ఉన్న టవల్‌ తీసుకుని ఒళ్లంతా తుడుచుకుంటూ.

‘సార్లు అడిగేరా నా గురించి? చెప్పక పోయావా? తినటానికి వెళ్లానని’

‘…ఇంతకీ దొరికిందా ఏదైనా?’

‘ఆ.. ఏదో.. దొరికిందిలే.. అడుగూ, బొడుగూ…!’

‘..ఎక్కడ..?!’

‘ఆ హనుమాన్లు టిఫిన్‌ సెంటర్లో..! ఏ…? ఏవైంది?’ అని తల తుడుచుకుంటూ మళ్లీ తనే..

‘…సార్లేవైనా అన్నారా.. అలా కంగారుగా మాట్లాడతన్నావ్‌?’ దగ్గరకంటా వస్తూ ఆత్రుతగా అడిగాడు ఎలక్ట్రీషియన్‌ మల్లి.

అలా కూర్చుని అతన్నే చూస్తూ…’చూశావా? నీ నమ్మకం నిన్నెంత ఇబ్బంది పెట్టిందో!’

అంత చీకట్లోనూ.. ఒకింత తెల్లబోతూ చూశాడు రంగబాబుకేసి ఏ నమ్మకం అన్నట్టుగా..

ఒక్క నిమిషం అలాగే చూసి అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు..

‘అదే అడుగుతున్నాను ఏవైందని?’

‘…విన్నావంటే.. కారుద్ది రెండు కాళ్ల మధ్య నించీ…’

‘అవునా? చెప్పన్నా ఏవైంది?’ అంతకు ముందున్న ధీమా లేదతని మాటల్లో..

‘సర్ధుకో సరంజామా..! ఇంకేంటి చెప్పేది..?’

‘అంటే…’ దెబ్బతో దిగిపోయిందేమో.. కంగారుగా అన్నాడు మల్లి.

‘సెక్రెట్రీ సారు కోపం చేసేడు..’ నిస్సత్తువగా అన్నాడు రంగబాబు.

‘య్యే.. కరెంటు పోయిందా?’ షాక్కొట్టినట్లయి పోయాడతను.

‘దార్లో ఎక్కడా లైట్లు లేవన్నా? మొత్తం పోయిందనుకున్నాను..’ పిచ్చెక్కినట్టయ్యి కళ్లు బైర్లు కమ్మాయొక్కసారిగా.

ఏమీ మాట్లాడలేదు రంగబాబు.

‘ఏవైందో సెప్పెహ్హే.. పిచ్చెక్కుతుందిక్కడ…’ విసుగ్గా అన్నాడు కాళ్లు వణుకుతుండగా మల్లి.

‘ఇంక నీకెంత పిచ్చెక్కినా నీ పిచ్చి గిచ్చి పట్టిచ్చుకునేవోళ్లెవరూ లేరిక్కడ..’

‘అంటే.. అంటే… కరెంటు.. కరెంటు….?’

‘అవును. ఫీజు కొట్టేసింది. పోనీ కరెంటు పోతే జనరేటర్‌ నేనన్నా వేసేవాడ్ని. ఏకంగా ఫీజే పోయింది. డాన్సులన్నీ మధ్యలోనే ఆగిపోయేసరికి పిల్లలంతా ఒకటే అరుపులూ, ఈలలు. అంతా గోల గోల. వేలకి వేలు ఖర్చు చేసి డాన్సులు నేర్పించేరంట. ఆ మాస్టరుగారు కూడా ఇక్కడే ఉన్నాడు. నాకు కంగారు వచ్చేసి ఎన్నిసార్లు ఫోన్జేసినా నువ్వేమో ఎత్తవ్‌. సార్లు కూడా ఎన్నిసార్లు చేసేరో నీ ఫోన్‌కి. ఏదీ ఫోనెక్కడ పెట్టేవ్‌?’

‘నువ్‌ చెప్పలేదా తినటానికి వెళ్లేనని?’

‘నోరు ముయ్యేస్సే. మా బాగా చెప్పేవ్‌ గానీ..! నువ్‌ తింటాకే వెళ్లావో, పడుకుంటాకే వెళ్లావో ఎవ్వడికి పట్టుద్ది? ఫీజు కొట్టేసిందిక్కడ. సమయానికి నువ్వు లేవు ఇక్కడ. అంతే..! అక్కడికీ చెప్పేననుకో. అయితే మాత్రం?’

‘ఫోను ఇక్కడే ఉంది. తడిచిపోతుందని పట్టుకెళ్లలేదు..’

‘మంచి పని చేసేవ్‌? దగ్గరుంచుకోవద్దా? మనం ఏ ఉద్దేశంతో ఇలా రాత్రుళ్లు ఇక్కడ ఉండాల్సి వచ్చింది? అసలే వర్షం. దానికితోడు ఇవ్వాళ కాలనీ పిల్లల కార్యక్రమాలు. పైగా భోజనాలొకటి. ఎంత హడావుడి? ఎప్పుడే కరెంటు పోతుందో, ఏ అవసరం వస్తుందో అనే మనల్ని ఇక్కడే ఉండమన్నది?’

‘ఎవరు వేసేరు ఫీజు..?’ అతని ఫీజు ఎగిరి పోయిందేమో.. గొంతు వణుకుతుండగా నీరసంగా అన్నాడతను.

‘ఎవరు వేస్తారు? సార్లేమో సెల్‌ఫోనుల్లో లైట్లు వేసేరు. టైముకి బ్యాట్రీ లైటు కూడా ఎక్కడ పెట్టేవో కనపడలేదు. ఎవరికి వచ్చింది వాళ్లు చేసేం. అయినా పనైతేగదా? ఎవరిమట్టుకు వాళ్లకే భయం ఏం జరుగుతుందోనని. పైగా వానొకటి..’

‘సెక్రెట్రీ సార్‌ ఎక్కడున్నాడు? ఇప్పుడెళ్లి కలవనా?’

‘కోపంతో రగిలిపోతున్నాడు. కలిసి ఏం చేస్తావ్‌? ఇప్పటికిప్పుడు చేసేదేం లేదు. కార్యక్రమాలు ఆగిపోయి పిల్లలు ఏడుస్తూ వెళ్లిపోయేరు. ఇంక చేసేదేం లేదు. అడుగో… సూపర్‌వైజర్‌ వస్తున్నాడు. కావాలంటే అడుగు సెప్తాడు.’

దూరాన కనిపిస్తున్న టార్చిలైటు వెలుగుని చూసి.

ఇంతలో గొడుగేసుకుని రానే వచ్చాడు సూపర్‌వైజర్‌ మహేశ్‌.

వస్తూనే.. ‘ఎంతసేపైందొచ్చి? నిద్రపట్టక లేచి వచ్చాను బాధేసి…’

‘ఇప్పుడే వచ్చేను. తిందామని వెళ్లాను.’ నూతిలోంచి వచ్చినట్టుందతని స్వరం.

‘వెళితే వెళ్లేవ్‌ లే. సార్లతో చెప్పి వెళ్లచ్చు కదా! ఇంత వరకూ రాకపోను..’

‘ఏమైంది? అదే అడుగుతున్నాను. తిట్టేరా?’

‘తిడితే బాధేవుందిరా? పెద్దోళ్లు ఒకమాటంటే తప్పేముంది. తిట్టలేదు. పొమ్మన్నారు..’

‘అంటే?’ అర్ధం కాక అయోమయంగా అన్నాడు మల్లి.

‘అదే..! నేను చెప్పేనుగదా..! చూసేవా నీ నమ్మకం నీకు అయిదార్రోజుల్నించీ కూడు పెట్టలేదు సరిగదా… నీ ఉద్యోగం..’

‘ఊ.. ఉద్యోగం…’ మల్లిలో ఒకటే వణుకు. అతన్నే చూస్తున్నాడు రంగబాబు. ఆ చూపుల్లో మల్లి పట్ల జాలి.

‘పోయింది..’

ఆ మాటతో కళ్లు బైర్లుకమ్మాయి మల్లికి. మల్లేశ్‌ మౌనం రంగబాబు మాటల్ని సమర్థిస్తున్నట్లుగా ఉండే సరికి.. ‘నిజం చెప్పండ్రా..’ అరిచాడు మల్లి. మళ్లీ అంతలోనే.. నిమ్మళించి..

‘ఏం తినకుండా ఇంక ఉండలేనేమో అని పించింది మహేషూ..! కళ్లు తిరుగుతున్నట్ల య్యింది. లేదంటే ఒక పూట తినకపోతే చస్తానా? ఇంతకీ ఏం చెయ్యమంటారు?’ దిగాలుగా అన్నాడు మల్లి.

‘చెయ్యటానికేముంది కానీ.. ఇప్పుడైనా వాస్తవంగా ఆలోచిస్తే బాగుంటుందేమో ఆలోచించు’

ఏం మాట్లాడలేదు మల్లి.

‘నమ్మకం కూడు పెట్టాల్రా..! కడుపు మీద కొట్టగూడదు. ఇప్పుడేం జరిగింది? నోటికాడ కూడు పట్టుకుపోయింది. ఇది.. ఇదిరా నీ నమ్మకం నీకిచ్చింది.

ఒరేయ్‌! నీ దేవుడు.. నీ ఇష్టం. నా దేవుడు నా ఇష్టం. ఎవరి ఇష్టాఇష్టాలు వాళ్లవే. దేవుడనేవాడు ఒక నమ్మకం. అంతేరా! నమ్ముకో. నీకు ఇష్టమైన దేవుణ్ణి నమ్ముకో. అతను చెప్పినట్లే నడుచుకో. ఎవ్వరూ కాదనరు. కానీ ఆ నమ్మకాలు ఎలా ఉండాల్రా..! మనకి సుఖాన్ని ఇచ్చేవై ఉండాలి. అంతేగాని! చెడగొట్టేవి అయి ఉండకూడదు కదా’ మల్లి ఉద్యోగం పోయిందనే బాధలో ఏదేదో అనేశాడు రంగబాబు.

ఆ కాలనీలో పనిచేసే వాళ్లల్లో వీళ్లిద్దరికే ఎక్కువ స్నేహం.

‘అవుననుకో..!’ అంత గాలివాన రొదలోనూ సూరయ్యమ్మ గురక స్పష్టంగా వినిపిస్తుంటే.. కమ్యూనిటీ హాల్‌ లోపలికంటా చూస్తా..

‘చేసేదా ఉజ్జోగం. ఇంట్లో వాళ్లా సెలవులకెళ్లేరు. వండి పెట్టేవాళ్లు ఒక్కళ్లూ లేరు. ఒరేయ్‌.. ఒరేయ్‌.. మన నమ్మకం మన కడుపు కాల్చకూడదురా..’

‘నేనిక్కడ తిననని సార్లకి తెలుసు..’

‘గొప్పోడివేలే కానీ.. నువ్విక్కడ తింటే ఎంత? తినకపోతే ఎంత? ఎవరు పట్టించుకుంటారు నువ్వు తిన్నావో, తినలేదో. అయినా తింటే తప్పేంటంటావ్‌? అసలు ఇలాంటప్పుడు వీటిని భోజనాలని అనరు నీకు తెల్సో లేదో! సహపంక్తి భోజనాలంటారు. అంటే ఏంటో తెలుసా? కులాలూ, మతాలకతీతంగా, చిన్నా, పెద్దా, ఉన్నోడూ, లేనోడూ.. అనే తేడా లేకుండా అందరూ కలసి తినటం అన్నమాటేగా! మరి నువ్వేం చేసేవ్‌, అమ్మోరికి పెట్తారని తినటం మానేసేవ్‌. అలా మానేసి నువ్వు ఎవ్వర్నీ ఉద్ధరించలేదు. నీ కడుపుని నువ్వే ఎండబెట్టుకున్నావ్‌? అంతేగదా!’ అన్న మహేష్‌ అదే బాధతో..

‘పండగన్నాళ్లూ రోజూ కాలనీలో ఆడాళ్లు ఏదో ఒకటి ఇళ్లల్లో చేసుకొచ్చి అన్నీ మన కళ్లెదురుగా ఇక్కడే టేబుల్‌ మీద పెట్టి కొద్దికొద్దిగా వేరే పళ్లెంలో తీసుకెళ్లే గదా అమ్మగారి విగ్రహం ముందు పెడుతున్నారు. మొత్తం గిన్నెలన్నీ తీసుకెళ్లి ఏం పెట్టటం లేదుగదా? అలాంటప్పుడు తినటానికి నీకేమైంది?

నాకు అదే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఆలోచిస్తే! ఒక్కటి చెప్పు అడుగుతాను. ఇప్పుడు నువ్వెళ్లి తినొచ్చేనన్నావ్‌ గదా? ఆ ఆంజనేయుడో, హనుమంతుడో ఏదో టిఫిన్‌ సెంటరు! నీకు తెలుసో లేదో! ఆ టిఫిన్‌ సెంటర్‌ వాడు పొద్దున్నే పళ్లెంలో మొదటగా రెండు ఇడ్లీలు, కొంచెం పచ్చడి, కొంచెం ఉప్మా ఏది చేస్తే అది దేవుడి పటం ముందు పెట్టి అగరొత్తులు వెలిగించాకనే కదా అమ్మకాలు మొదలుపెడతాడు. మరి అది ఏమిటంటావ్‌?

ఈ లెక్కన ఆ తర్వాత వండినవన్నీ హను మంతుని ప్రసాదాలే కదా! మరి ఇప్పుడు నువ్వు తిని వచ్చిన ఆ టిఫిన్‌ దేనికిందకి వస్తుంది? ఆలోచించావా?’ అన్నాడు.

‘అంటే… నీ కళ్లెదురుగా ఇక్కడ విగ్రహం ముందు పెట్టారు కాబట్టి నువ్వు తినవ్‌. ఎక్కడికో దూరంగా వెళ్లి వెతుక్కుని వెతుక్కుని మరీ తినొస్తావ్‌. లేదంటే ఖాళీ కడుపుతో పడుకుంటావ్‌. ఏ రాయైతే ఏముందిరా ఆకలితో ఉన్న కడుపును పగలగొట్టు కోవటానికి?’ నవ్వుతూ అన్నాడు గిరిధర్‌, ఆ మర్నాడు ఉదయం అంతా కలసి సెక్రెటరీగారితో చెప్పమని అడగటానికి అతనింట్లో అతన్ని కలసినప్పుడు. అతను ఆ కాలనీకి మాజీ ప్రెసిడెంటు.

ఏమీ మాట్లాడలేదు ఎవ్వరూ.. వింటూ నిలబడ్డారు…తప్ప.

‘నిన్నేదో మార్చెయ్యాలని నేనేమీ శపథం చేసుకోలేదు. అది గుర్తుంచుకో. అర్ధం చేసుకుంటావని చెప్తున్నా..

అంతెందుగ్గానీ ఒక్కదానికి సమాధానం చెప్పు.

నీ ఇంట్లోకని పచారీ సరుకులు ఎక్కడ కొంటావ్‌?’ ప్రశ్నించాడు గిరిధర్‌.

‘ఇక్కడే నండి. మన కాలనీ గేటు దగ్గరున్న మార్వాడీ షాపులో’ నేల చూపులు చూస్తా అన్నాడు మల్లి.

‘నెలంతా తీసుకుని జీతాలు వచ్చాక కట్టేస్తాడండి నెలాఖరున’ అన్నాడు సూపర్‌వైజర్‌ గిరిధర్‌నే చూస్తా..

‘సరే…! ఎక్కడో ఒకచోట కొనాలి కదా? తప్పదు. నువ్వు కొనే కిరాణా షాపాయన రోజూ దేవుడికి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి గానీ అమ్మకాలు మొదలెట్టడు. తెలుసా నీకా సంగతి? మరి వాడి షాపులో నీ నమ్మకం ప్రకారం నువ్వు కొనకూడదు కదా? ఒకదాంట్లో నమ్మకం ఉండి, మరోదాంట్లో లేకుండా ఉండకూడదు కదా? అన్నింట్లో ఉండాలి కదా? శ్రీలక్ష్మీ వెజిటెబుల్స్‌లో కూరగాయలు కొన్నా, ఉస్మాన్‌ దగ్గర మోటరు బండి కొన్నా అంతే.. అయినా ఉస్మానంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఆ ఉస్మాన్‌నే కదా…పడుకున్నోడ్ని లేపి బండి బాగు చేయించుకున్నానని అన్నావ్‌. మరి ఆ ఉస్మాన్‌ అదే రిపేర్‌ షాపులో రోజుకి అయిదు సార్లు నమాజ్‌ చేస్తాడు. అక్కడే నమాజ్‌ చేసుకుంటాడు కాబట్టి అదో మసీదే కదా..! మరి ఆ బండి ఫర్వాలేదా?

అంతెందుగ్గానీ.. ఇప్పుడే కదా ! మీ మేడమ్‌ ఇచ్చిన మంచినీళ్లు తాగారు. ఆ నీళ్ల సీసా వచ్చిందె క్కడ్నించి? అయ్యప్పా వాటర్‌ ప్లాంటు నుంచేగా? తెల్సా మీకు? ఆ ప్లాంటాయన మన వాళ్లకు స్నేహితుడే. అలా చూస్తే ఒకటా? రెండా? ప్రతీదీ మానెయ్యాలి ఈ లెక్కన. మానేసి బ్రతకగలవా?

ఆలోచించు.

అప్పుడుగానీ మనం అనుకునే మన నమ్మకంలో ఎంత మూర్ఖత్వం ఉందో తెలిసొస్తుంది.

దేవుణ్ణి నమ్ముకో.. నమ్మొద్దనను.. నేనూ నమ్ముతా.. నమ్మాలి కూడా. ఆయన ముందు కళ్లు మూసుకుని నిలబడి ప్రార్థనలు చేసుకుందాం. ప్రశాంతత వస్తుంది. అంతేకానీ..’

అని ఇంకేదో చెప్పబోతున్నంతలో… అంతకు ముందే అయిదు నిమిషాల క్రితం అక్కడికి వచ్చి అప్పటిదాకా అంతా విన్న గిరిధర్‌ పొరుగింటాయన కలగచేసుకుని..

‘నేనొకటి చెప్పనా?’ అనే సరికి అతనికేసి చూశారంతా..

‘నాకు అర్ధమైంది. అందుకే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. బయటి వాళ్లకైతే చెప్పననుకో.. గానీ..’ అని కాసేపాగి..

‘ఇది… ఇదేంటిది? శరీరమేనా?’ అడిగాడు చేతి మీద చరుచుకుంటూ….

ఏం చెప్పబోతున్నాడా అన్నట్టు గిరిధర్‌తో సహా అందరూ అతన్నే చూడసాగారు..

‘…శరీరం అని మీరనుకుంటున్నారుగానీ.. నేనైతే ఇది గుడి అనే అనుకుంటాను. ఇందులో ఎంతుందిరా…! పైనించి పోస్తే మనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసి మిగతాది కిందకి పోతుంది. ఈ లోపు ఎంత జరుగుతుంది లోపల? మంచీ, చెడని ఎంచేదెవర్రా లోపల? చెప్పే వాళ్లు ఎవరున్నారు లోపల ఇది పనికొస్తుంది, ఇది పనికిరాదు అని. నువ్వు ఊహించగలవా లోపల ఏం జరుగుతుందో?

ఆలోచిస్తే అంతకంటే ఆశ్చర్యం ఇంకొకటుందా? వాడేరా దేవుడు. అక్కడున్నాడ్రా దేవుడు. వాడే ఆకలి. ఆ ఆకలి దేవుణ్ణి బాగా చూసుకోవాల్రా మనం. వాణ్ని పట్టించుకోకపోతే ఈ గుడి ఉంది చూశావా? ఇది కూలిపోతుంది… ఇది’ అన్నాడు గుండెల మీద కుడి చేత్తో కొట్టుకుంటూ..

‘ఈ గుడి కూలితే .. ఈ గుడి మీదే బతుకున్న పావురాలూ, పిచ్చుకలూ.. చిన్న చిన్న మొక్కలూ… అర్ధమైందా… అవే.. మీ పెళ్లాం పిల్లలూ.. వాళ్లూ కూలిపోతారు. అదీ విషయం.

ఇంతకంటే ఎక్కడైనా ఏముందిరా? ఏదో పరుగులు పెడతాంగానీ.. ఎక్కడైనా ఏవుంది ? ఉంటే చెప్పు.

నీ రెక్కలు పని చేసినన్నాళ్లు, నీ కాళ్లు తిరిగినన్నాళ్లు నీ గుడికేం కాదు. నీ గుడిమీద బతికే వాళ్లకీ ఏం కాదు. నీ దేవుడు క్షేమం. ఎవళ్లమట్టుకు వాళ్లే గుడి, వాళ్ల ఆకలే దేవుడు. ఏవంటావ్‌?

ఆ గుడి చల్లగా ఉండాలంటే నీ దేవుణ్ణి మెప్పించాల. అదే నీ ఆకలి దేవుణ్ణి.. అంతేగానీ.. ఎవరో ఏదో చెప్పేరని.. నోటి దగ్గరకి వచ్చినదాన్ని వదిలేసి.. కడుపు నాయగట్టుకుని.. ఆకల్తో ఉండ చుట్టుకుపోయి.. నిన్ను నీవు కసింపచేసుకుంటానంటే ఎవడిక్కావాలి? ఎవరడుగుతారు నిన్ను? తర్వాత మనకి ఏదైనా అయితే ఎవరు చూస్తారు మన మీద ఆధారపడ్డవాళ్లను.?

ఒక్క మనకే కాదు..

ఈ భూమ్మీద పుట్టే ఏ ప్రాణికైనా నేను చెప్పిందే దేవుడు. అందుకే మనకి తప్ప మిగతా ప్రాణు లందరికీ వల్లమాలిన ప్రేమ వాళ్ల ఆకలి దేవుడంటే. ఏ ప్రాణినైనా…చూడండి. పాములూ, పశువులూ, కప్పలూ, గొర్రెలూ, బర్రెలూ దేన్నైనా చూడు. కేవలం తిండి తప్ప మరో యావ ఉండదు వాటికి. ఇంకో మాట..’

అని కాసేపాగి..గిరిధర్‌ వైపు తిరిగి..

‘మా ఆవిడా చేస్తుంది గిరిధర్‌ పూజలు. కానీ అందరిలాగా ఉపవాసాలూ, ఏమీ తినకుండా చెయ్యటాలూ అలాటివేవీ ఉండవ్‌. ముందు కడుపు నిండా తినేసాకనే పూజైనా, ఏదైనా. మనం సమాధానం చెప్పుకోవాల్సిందల్లా మన మనసుకి’ అన్నాడు..నవ్వుతూ…

అందరి ముఖాల్లో ఒకలాంటి ఆలోచన..

అప్పుడే లోపలికెళ్లి అందరికీ కాఫీ పెట్టమని చెప్పి వచ్చిన గిరిధర్‌..

‘కాఫీ.. పెడుతున్నారు మేడమ్‌. కాఫీ తాగి ఆఫీసుకు పదండి. ఇంత సర్వీసుంది. నిన్ను పన్లోంచి తీసేస్తారని నేను అనుకోను. ఏదో పిల్లలు కష్టపడి ప్రిపేర్‌ అయ్యారు. నిరుత్సాహపడ్డారని బాధ అంతే. అంతగా అయితే మేము చెప్తాములే. ముందు మీరంతా వెళ్లి వాళ్లతో మాట్లాడండి..’

అన్నంతలో కాఫీలు తీసుకొచ్చి అందరికీ తలో కప్పూ అందించింది గిరిధర్‌ భార్య శ్రీకళ.

వాళ్లు కాఫీలు తాగేంతలో.. కాలనీ గార్డెనర్‌ ఉదయం పూజా ప్రసాదాలు తీసుకొచ్చి టేబుల్‌ మీద పెట్టాడు ప్రతి రోజూలాగే..

శ్రీకళ వచ్చి స్పూన్‌ తీసుకుని అందరి చేతుల్లో తలో స్పూను పులి¬ర పెట్టింది.

చెయ్యి చాపాడు మల్లి. అతని చేతిలో స్పూనెడు పులిహార వేసింది శ్రీకళ.. అతను నోట్లో వేసుకోబో తుంటే.. గిరిధర్‌ అన్నాడు…

‘మేమేదో నిన్ను మార్చెయ్యాలని ఇదంతా చెప్పలేదు! ఎవరో ఏదో చెప్పేరని ఎప్పుడూ మారిపోకూడదు. మన ఆలోచనా కొంత ఉండాలి..’

మీరు చెప్పింది సబబే అన్నట్టుగా నవ్వుతూ తలూపి పులి¬ర నోట్లో వేసుకోబోతుంటే..

‘ఆగు..’ అరిచాడు రంగబాబు.

తెల్లబోయాడు.. మల్లి..

‘తినేముందు దేవుణ్ణి తల్చుకోరా..! నువ్వెవరినైతే నమ్ముకుంటున్నావో.. ఆ దేవుణ్ణి తలచుకుని మరీ తిను. ఇవ్వాళ ఈ ముద్ద మనదాకా వచ్చిందంటే ఆయన చలవే..! సార్లన్నట్టు ఆకలి మొదటి దేవుడైతే.. మనం నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆకలి దేవుడికి కొడుకన్నమాట…’

మనసులోనే రెండుసార్లు ప్రేయర్‌ చేసుకుని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు.. మల్లి.

రచయిత్రి పరిచయం

కన్నెగంటి అనసూయ 1.12.1962న పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, పశివేదల గ్రామంలో పుట్టారు. ఇప్పటివరకు 2 నవలలు, 300 పైగా కథలు, 150 కవితలు, 15 గల్పికలు, 300 బాలల కథలు రాశారు. ఈమె రాసిన ‘బుద్ధిబలం’ అనే బాలల కథ సాహిత్య అకాడమీ వారి కథల సంకలనంలో చోటు సంపాదించి 22 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. వివిధ వారపత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో ఎన్నో బహుమతులు అందుకున్నారు. అడవిబాపిరాజు పురస్కారం, గురజాడ – ఉత్తమ కథా రచయిత్రి పురస్కారం అందుకున్నారు. ఎన్నో ఇతర సాహిత్య పురస్కారాలు కూడా అందుకున్నారు.

– కన్నెగంటి అనసూయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *