అమృతమూర్తి

అమృతమూర్తి

ఆప్యాయంగా నా భుజాలచుట్టూ చేయి వేసి నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు ప్రమీల గారు. సోఫాలో కూర్చుని ఆవిడతో మాట్లాడుతున్నానే గానీ మనసంతా ఏదో తెలీని కలవరం! హాలుని ఆనుకునే ఉన్న బెడ్రూం వేపే క్షణానికోమారు చూస్తున్నాయి నా కళ్లు. నా ఆత్రుతా, ఆరాటమూ ప్రమీల గారికి అర్థమయినట్లుంది.

”మీనా, ఒక్కమారు ఇలా హాల్లోకి రామ్మా” అంటూ కూతురిని పిలిచారు.

ఘల్లుఘల్లుమంటూ గజ్జెల శబ్దంతో బుట్ట బొమ్మలా హాల్లోకి వస్తున్న మీనాని చూస్తూనే మనసులోని ఆందోళనంతా మంత్రం వేసినట్లుగా మాయమయిపోయింది.

రెప్పార్పకుండా మీనానే చూస్తుండిపోయా!

చెంపకి చారెడున్న మీనా అందమైన నయనాలు నాతో ముచ్చట్లాడ్డం మొదలెట్టాయి!

”అమ్మా, మరే ఈరోజు మా స్కూల్లో ఏం జరిగిందో తెలుసా?”

”ముందు ఈ పాలు త్రాగేసి ఆ తర్వాత కబుర్లు చెప్పు నాన్నా”

”పో అమ్మా, నువ్వెప్పుడూ ఇంతే! తిను, త్రాగు అంటూ నా వెంటపడతావే తప్ప నేను చెప్పేదెప్పుడూ పూర్తిగా విననే వినవు”

పెద్దపెద్ద కళ్లని గుండ్రంగా తిప్పుతూ బుంగమూతి పెట్టిన మోము తెగముద్దొచ్చే సింది.

”అయ్యో ఆంటీ, మీరు నా కళ్లని తడి చేసేస్తున్నారు”

గింజుకుంటున్న మీనా మాటలకి స్పృలోకి వచ్చి చటుక్కున మీనాని వదిలేసాను.

గబగబా వాళ్లమ్మ దగ్గరకి పరిగెత్తుకెళ్లి ఆవిడ చీరకుచ్చిళ్లని చాటు చేసుకుని ఉండుండి నా వేపు తొంగి చూస్తోంది మీనా. నా కళ్లు తన కళ్లతో కలవగానే మళ్లీ వాళ్ల అమ్మ వెనకాల దాక్కుంటూ నన్నాడిస్తోంది నా చిట్టి మీనా.

”కొద్దిగా ఈ పకోడీ, స్వీట్‌ తీసుకోండి”

ప్రమీల గారు ట్రే తీసుకొచ్చి నా ముందర పెట్టారు.

”వద్దమ్మా. మీనాని చూసానుగా, కడుపు నిండిపోయింది.వెళ్లొస్తాను తల్లీ”

సున్నితంగా చెప్పి మరొక్కమారు మీనాని కళ్లారా చూసుకుని అక్కడినుండి కదిలాను.

”ఆ ఆంటీ ఎవరు మమ్మీ?”

వెనకనుండి మీనా ప్రశ్న వినిపించి నవ్వుకున్నాను.

*  *  * *  *

కొడుకుతో చదరంగం ఆడుతున్న ఆర్యన్‌ తండ్రి రాజశేఖరం గారు నన్ను చూస్తూనే కుర్చీ నుండి లేచొచ్చి సాదరంగా లోనికి ఆహ్వానించారు.

ఆయా శాంతమ్మ ఇచ్చిన టీ త్రాగుతూ వాళ్ల ఆటని ఆసక్తిగా గమనించసాగాను.

ఆర్యన్‌ తెలివైన కుర్రాడు. చదరంగంలో దిట్ట. పదే పది ఎత్తుల్లో తండ్రిని ఓడించేసాడు. చివరి ఎత్తు వేసి తండ్రికి ‘చెక్‌’ చెప్పాడు.

ప్రక్కనే పెట్టిన ట్రే నుండి హార్లిక్స్‌ గ్లాసుని తీసుకోబోయాడు.

”ఆగు బాబూ, పాలు వేడిగా ఉన్నట్లున్నాయి”

గ్లాసు అందుకుని పాలని చల్లార్చి పావు చెంచాకి పిసరంత ఎక్కువ పంచదార కలిపి ఇవ్వగానే గటగటా త్రాగేసాడు.

ఆ ప్రక్కనే వున్న ప్లేట్‌లోని ఉప్మాలో కరివేపాకంతా ఏరి ప్రక్కకి తీసేసి, నా ప్లేట్‌లోని జీడిపప్పులని కూడా అందులో కలిపి ఆర్యన్‌కి తినిపించాను. ఏ పేచీలూ పెట్టకుండా రెండే రెండు నిమిషాల్లో తినేసాడు.

”నేను తినిపిస్తే తెగ మారాం చేస్తాడమ్మా. మీరు పెడితేనేమో ఇలా బుద్ధిగా తినేస్తాడు. మీ చేతుల్లో ఏదో మాయ ఉందమ్మా”

కినుకగా అంటున్న శాంతమ్మ మాటలకి నవ్వేసా!

ఆర్యన్‌ రూపాన్ని హృదయం నిండా నింపుకుని అక్కడినుండి బయల్దేరాను.

”డాడీ, నా ఇష్టాఇష్టాలన్నీ ఆంటీకి ఎలా తెలుస్తున్నాయి? నాకు పాలు ఎంత తీపిగా, ఎంత వేడిగా వుంటే బావుంటాయో ఆంటీకి ఎలా తెలుసు? ఉప్మాలో జీడిపప్పు నాకిష్టమనీ , కరివేపాకు నాకస్సలిష్టముండదని ఆంటీకి ఎవరు చెప్పారు?”

గేటు దాటుతుండగా వినిపించింది ఆర్యన్‌ ప్రశ్న.

పిచ్చి సన్నాసి. వాడిని గురించిన విషయాలని వేరెవరో నాకు చెప్పడమేమిటీ?

*  *  * *  *

నేనక్కడికి వెళ్లేటప్పటికి ఆ వీధిలోని పిల్లలంతా కలిసి ఇంటి ముందున్న ప్లే గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుతున్నారు.

బ్యాటింగ్‌ చేస్తున్నాడు సృజన్‌.

నా కళ్లు సృజన్‌నే రెప్పార్పకుండా చూస్తున్నా, మనసు మాత్రం గతస్మృతుల్లోకి జారిపోయింది.

”క్రికెట్‌ ఆడుతుంటే తిండీతిప్పలస్సలు గుర్తుకు రావు కదూ! అయినా ఆ ఆటంటే అంత పిచ్చేమిటిరా నీకు? ఒక్కసారి ఇంటికి వచ్చి పాలు త్రాగేసి మళ్లీ వెళ్లరా నాయనా”

”అమ్మా, ఈ ఒక్క ఓవర్‌ అయిపోతే ఇన్నింగ్స్‌ బ్రేక్‌ తీసుకుంటాం. అప్పుడొస్తానింటికి”

”హే సిక్సర్‌”

చప్పట్ల చప్పుడుకి నా జ్ఞాపకాల దారం తెగిపోయింది.

సృజన్‌ సిక్స్‌ కొట్టినట్లున్నాడు. వాడి చేతులని పట్టుకుని ఒకటే ఊపేస్తున్నారు పిల్లలు.

”ఇంట్లోకి రాకుండా అక్కడే నిలుచుండి పోయారేమిటండీ? లోనికి రండి”

సుమిత్ర గారు గేటు వద్దకి వచ్చి పిలిచారు.

”తోటి కుర్రాళ్లతో కలిసి సృజన్‌ హాయిగా ఆడుకుంటుంటే కనువిందుగా అనిపించి అలా చూస్తుండిపోయాను సుమిత్ర గారూ”

”నిజమేనండీ. వాడిలా మళ్లీలేచి తిరుగుతాడని నేనెన్నడూ అనుకోలేదు”

పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చాడు సృజన్‌.

”మమ్మీ, తినేందుకు ఏమైనా పెట్టి త్వరగా పాలు కూడా ఇచ్చేసేయ్‌. మళ్లీ ఆటలకి వెళ్లాలి. ఇది ఇన్నింగ్స్‌ బ్రేక్‌”

”ఆపరేషన్‌ తర్వాత పిల్లవాడి ఆరోగ్యం ఎలా ఉందమ్మా ? ఏ ఇబ్బందులూ లేవు కదా?” అంటూ నేనడగబోయిన ప్రశ్న నోటిలోపలే ఆగిపోయింది.

సృజన్‌ హడావిడి, వాడిలోని ఆ చురుకుదనం చూసాక కడుపు నిండిపోయింది.

”బాబుకి కాసింత దిష్టి తీస్తుండమ్మా” అని చెప్పి అక్కడనుండి తృప్తిగా కదిలాను.”

”ఆ ఆంటీ ఎవరు మమ్మీ?”

సుపరిచితమైన ప్రశ్న.

*  *  * *  *

”అమ్మా, ఆ ఆంటీ ఈవేళ యింకా రాలేదేంటి?”

చారెడు కళ్ల మీనా ప్రశ్న!

”డాడీ, శాంతమ్మ కలిపే బూస్ట్‌ నాకస్సలు నచ్చట్లా. ప్రతీ సండే మన ఇంటికి వస్తుంటుందే, ఆ ఆంటీ రెండు వారాల నుండి రావడం లేదేమిటి? ఆంటీ చేత్తో ఏం పెట్టినా ఎంతో బావుంటుంది నాకు”

ఆర్యన్‌ బెంగ!

”మమ్మీ, మనింటికి రెగ్యులర్‌గా వచ్చే ఆంటీ ఈ మధ్య రావట్లేదేమిటి?”

సృజన్‌ ఆరాలు !

మూడు కుటుంబాల వాళ్లూ యిలా కంగారు పడుతున్న సమయంలో రెండు మూడు నిమిషాల తేడాతో మూడిళ్లల్లోనూ ఒకేసారి ఫోన్లు మ్రోగాయి.

ఫోన్లో చెప్పింది వింటూనే హుటాహుటిన బయలుదేరారంతా.

*  *  * *  *

”లుకేమియా అని తెలిసేటప్పటికే ఆలస్య మయిందండీ. డాక్టర్లు రేపో మాపో అంటున్నారు. ఈ వేళ ఉదయం నుండీ పిల్లలని చూడాలని తను నిద్రలో ఒకటే కలవరిస్తుంటే నేనే యిక ఉండబట్టలేక మీకు ఫోన్‌ చేసాను.”

నా ప్రాణస్నేహితురాలు, హెడ్‌నర్సు మేరీ చెబు తున్న మాటలు లీలగా నా చెవులకి వినిపిస్తున్నాయి.

”నీ కోసం ఎవరొచ్చారో చూడు”

నా భుజాల చుట్టూ చేతులేసి లేపి కూర్చోబెట్టి ఆనుకునేందుకు వీలుగా తలగడలని అమర్చి వేరే కేసుని అటెండ్‌ అయేందుకు వెళ్లింది మేరి.

నా ఈ కళ్లల్లో మిణుకుమిణుకు మంటూ ఎవరికోసమైతే ఈ జీవం ఇంకా మిగిలివుందో ఆ ముగ్గురినీ చూస్తూనే ఒక్కసారిగా నాకళ్లల్లోకి కోటి దీపాలకాంతి వచ్చింది.

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటే ఇదేనేమో మరి! బిక్క మొహాలేసుకుని దూరంగా నిలబడ్డ పిల్లలని దగ్గరకి రమ్మన్నాను. వాళ్లని దగ్గరకు తీసుకుని తనివితీరా ముద్దులు పెట్టుకున్నాను.

”ఈ జన్మకి ఈ అదృష్టం చాలు ప్రభూ!”

మనసులోనే భగవంతునికి అంజలి ఘటించాను.

”ఈ కట్టెపోయేలోగా పిల్లలని చూడలేనేమోనని భయపడ్డాను. మిమ్మల్నందరినీ కష్టపెడుతున్నందుకు క్షమించండి. మీ పనులన్నీ మానుకుని నాకోసం వచ్చినందుకు కృతజ్ఞురాలిని.”

రెండు చేతులూ ఎత్తి నమస్కరించబోయిన నన్ను మధ్యలోనే ఆపేసారు.

”అమ్మా, మీరు మాకు కృతజ్ఞతలని చెప్పడమేమిటి? మీరు పడ్డ కష్టాలను తలుచుకుంటేనే మా గుండె నీరైపోతోంది. కన్నకొడుకుని కళ్లారా ఒక్కమారైనా చూసుకోకుండానే యుద్ధంలో మీ భర్త మరణిస్తే ఆ బాధని పళ్ల బిగువున దాచేసుకుని కొడుకుతోటిదే లోకంగా గడిపిన మాతృమూర్తి మీరు. మీ ఒంటరి జీవితానికి చిరుదీపంలా నిలిచిన ఆ కొడుకు కూడా పద్నాలుగేళ్లు నిండకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించడమన్నది పగవారికి కూడా రాకూడని కష్టం. ఒక్కగానొక్క కొడుకు అర్థాంతరంగా చనిపోతే పుట్టెడు దుఃఖంలో వుండీ, ఎంతో పెద్ద మనసుతో మీ పిల్లాడి కళ్లు, గుండె, మూత్రపిండాలని మా పిల్లలకి దానం చేసి వాళ్లకి కొత్తజీవితాన్నిచ్చిన అమృతమూర్తి మీరు. మీకు ఏం చేసినా ఋణం తీరదమ్మా”

”అంత మాటనకండి బాబూ! అప్పుట్లో నాకున్నది ఒక్కడే కొడుకు. మరి యిప్పుడో, ముగ్గురు బిడ్డలు. మృతుడైన నా కొడుకుని ఈ ముగ్గురు పసివాళ్ల రూపంలో పునర్జీవుడిని చేసినందుకుగానూ నేనే మీకు ఆజన్మాంతమూ కృతజ్ఞురాలను. భగవత్‌ ప్రసాదిత మైన ఈ మానవదేహం, మరణం పిదపా ఉపయోగ పడడం కంటే గొప్ప అదృష్టం మరే ముంటుంది చెప్పండి? ఈ క్యాన్సర్‌ జబ్బు నా ఒళ్లంతటినీ కలుషితం చేసేసి నాలోని ఏ అవయ వాన్నీ మరొకరికి దానం చేసేందుకు పనికిరాకుండా చేసిందన్న ఒక్క బాధ తప్ప మరే బెంగా లేదు నాకిప్పుడు.”

”మీరలా బాధపడకండమ్మా. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు చూపించిన దారిలోనే ఇకపై మేమంతా నడుస్తాము, మరణానంతరం మేమంతా మా శరీరావయవాలని దానం చేయడమే కాకుండా అలా చేయవలసిన ఆవశ్యకతని జనులందరి మనసుల్లోగట్టిగా నాటుకునేలా తప్పకుండా కృషి చేస్తామని మీకు మాటిస్తున్నాము.”

”ఈ ఒక్క మాట చాలండీ. నేనిక నిశ్చింతగా వెళ్లిపోతా……ను”

ఒక అమృతమూర్తి జీవితం ముగిసిపోయింది.

*  *  * *  *

”ఆంటీ ఎవరని ఎన్నిమార్లడిగినా ఎందుకు చెప్పలేదు?”

పిల్లలు ముగ్గురూ తల్లిదండ్రులని నిలదీసారు.

ఇంకా దాచడంలో అర్థం లేదనిపించింది.

పదేళ్లు దాటని పిల్లలకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో వాళ్లకి అర్థం కాలేదు.

అందుకే మాటలు పేర్చుకుని మెల్లిగా చెప్పారు.

”మీకు చెప్పవద్దని ఆంటీ మా దగ్గర మాట తీసుకుంది. ఈ విషయం చెబితే ఆంటీపట్ల మీరు జాలినీ, కృతజ్ఞతనీ చూపిస్తారనీ, అది తనకి ఇష్టం లేదనీ, తనకి కావలసింది మీ కళ్లల్లో తన పట్ల జాలువారే స్వచ్ఛమైన ప్రేమే తప్ప కృతజ్ఞతా, జాలీ కాదని స్పష్టంగా చెప్పారు ఆంటీ.”

తల్లిదండ్రులు చెప్పింది విన్నాక పిల్లల మనస్సులో ఆ అమృతమూర్తి పట్ల వున్న గౌరవమూ, ప్రేమా రెట్టింపయ్యాయి.

– అప్పరాజు నాగజ్యోతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *