56 ఎపివొ

56 ఎపివొ

నేను క్లాసులో అడుగుపెట్టేసరికి పిల్లలంతా గోల గోల చేసేస్తున్నారు. ఆదిత్య, నికుంజ్‌ని కొడు తున్నాడు. నన్ను చూసి గప్‌ చుప్‌ అయిపోయారంతా.

‘ఏం జరిగింది? నికుంజ్‌ని ఎందుకు కొడుతున్నావ్‌?’ ఆదిత్యను గదిమాను.

‘నికుంజ్‌, ఈషా టిఫిన్‌ తినేసాడు, టీచర్‌!’ అన్నాడు ఆదిత్య.

‘ఔను, టీచర్‌! నికుంజ్‌ రోజూ నా టిఫిన్‌ లాక్కుని తినేస్తాడు. వద్దంటే నన్ను కొడతాడు’ చక్రాల్లాంటి కళ్లను త్రిప్పుతూ చెప్పింది ఈషా. తెల్లగా, బార్బీ బొమ్మలా ముద్దుగా ఉంటుంది.

‘నిజమేనా?’ నికుంజ్‌ని అడిగాను. ‘రోజూ నువ్వు ఇంటి నుండి టిఫిన్‌ తెచ్చుకోవడంలేదా!?’

‘తెచ్చుకుంటున్నాను కానీ అది నాకు నచ్చడంలేదు. ఈషా తెచ్చే టిఫిన్‌ బాగుంటుంది, టీచర్‌!’ అన్నాడు వాడు ఏమాత్రం బెదరకుండా.

నవ్వు వచ్చింది నాకు. ఆపుకుని, ‘తప్పుకదూ? తన టిఫిన్‌ నువ్వు తినేస్తే, పాపం ఈషా ఆకలితో ఉండదూ?’ అన్నాను. మాట్లాడలేదు వాడు.

‘ఆదిత్యా! నికుంజ్‌ టిఫిన్‌ లాక్కుంటే నాతో చెప్పాలి కాని, అలా కొట్టేయడమేనా?’ అంటూ ఆదిత్యను మందలించాను.

‘మరి.. మీరు లేకపోతేనో, టీచర్‌?’ అమాయ కంగా అడిగింది ఈషా.

‘నేను వచ్చాక చెప్పాలి. మీలో మీరే కొట్టుకో కూడదు’ అన్నాను.

‘ఓకే, టీచర్‌!’ అంది బుద్ధిగా.

యు.కె.జి. క్లాస్‌ అది. అంతా ఐదేళ్ల వయసు వాళ్లే. పైకి ఎంత అమాయకంగా కనిపిస్తారో, అంతగానూ అల్లరి చేస్తారు. చిచ్చర పిడుగులు. ఒక క్షణం నేను క్లాసులో లేకపోతే అది కిష్కిందే అవుతుంది.

ఆ పసివాళ్లను చూస్తే, ‘దేవుని తోటలోని సుమబాలల్లా’ అనిపిస్తారు నాకు. స్కూల్‌ యూని ఫామ్‌లో ముద్దుగా ఉంటారు. వాళ్లు మాట్లాడుతూంటే ముచ్చటగొలుపుతుంది. ‘అల్లరి మా వయసు హక్కు!’ అన్నట్టు, ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు. ఆ పసివాళ్లను చూస్తే నా బాల్యం గుర్తుకు వస్తూంటుంది.

చిన్నప్పట్నుంచీ బాగా చదువుకుని తరగతులన్నీ మంచి మార్కులతో పాసయేదాన్ని నేను. పదవ తరగతిలో తొంభై ఏడుశాతం మార్కులు వచ్చాయి. నేను డాక్టర్నో, ఇంజనీరునో కావాలన్నది నా తల్లిదండ్రుల ఆకాంక్ష. ఎమ్సెట్‌ పరీక్ష రాయమన్నారు. కానీ, ఉపాధ్యాయురాలిని కావాలన్నది నా ఆశయం. చిన్నప్పుడు బడినుండి రాగానే చంకలో బ్యాగ్‌ తగిలించుకుని, చేతిలో పుస్తకాలు పట్టుకుని ‘టీచర్‌’లా హాలంతా తిరిగేదాన్నట. బొమ్మలన్నిటినీ వరుసగా పెట్టి, వాటికి పాఠాలు చెబుతూ ‘టీచర్‌ ఆట’ ఆడేదాన్నట. అప్పుడదంతా మురిపెంగా చూసినవారే, ఇప్పుడు నేను టీచర్ని అవుతానంటే వ్యతిరేకించారు.

అమ్మ-నాన్నలే కాదు, హితులు, సన్నిహితులు, ఎందరో నా మనసు మార్చడానికి ప్రయత్నించారు. అంతమంచి మార్కులు తెచ్చుకున్నందుకు ప్రొఫెషనల్‌ కోర్స్‌ చేయమని. ససేమిరా అన్నాను. ఇంటర్‌ చదివి బి.ఇడి. చేసాను. తరువాత పి.జి. చేసి, మాంటె స్సరీలో స్పెషల్‌ కోర్స్‌ చేసాను. టీచింగ్‌ మాత్రమే కాదు, చిన్నపిల్లలన్నా అమిత ఇష్టం నాకు. అందుకే ప్రాథమిక తరగతులకు బోధించేందుకు ఆప్ట్‌ చేసాను.

చాలా రోజులుగా ఆ చిన్నారుల చేత ఏదైనా ప్రోజెక్ట్‌ చేయించాలనీ, అల్లరి నుండి వారి దష్టిని మళ్లించాలనీ ఆలోచన ఉంది నాకు. ఆటలు, పాటలు, డ్యాన్సులూ, డ్రాయింగులూ, పెయింటిం గులూ మామూలే. వాటిని మించి ప్రత్యేకమైనది ఏదైనా చేయాలన్నది నా తపన. వారి వయసులకు తగినవీ, వారికి ఆసక్తికరంగా ఉండేవీ ఏమున్నాయా అని ఆలోచించసాగాను.

ఓ రోజున దినపత్రికలో ‘లడఖ్‌లో సరిహద్దులలో కాపలా కాసే భారత సైనికుల సాధకబాధకాలను’ గూర్చిన ఆర్టికల్‌ చదువుతూంటే, వినూత్నపు టాలోచన ఒకటి నా బుర్రలో మెరిసింది. సైనికులు దేశంకోసం అయినవారందరికీ దూరంగా, దేశపు సరిహద్దులలో ఉద్యోగపు బాధ్యతలను నిర్వహి స్తూంటారు. ఎల్లలలో విపత్కర పరిస్థితులలో, ప్రతికూల వాతావరణంలో ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో తమ ప్రాణాలను పణంగా పెట్టి పహరా కాయడం వల్లనే, దేశప్రజలు ప్రశాంతంగా నిదురించ గలుగుతున్నారు. అట్టి నిస్వార్థ సైనికుడి పట్ల చిన్నారులకు అవగాహన కల్పించి, కుటుంబాలకు దూరంగా ఒంటరి జీవితాలను గడిపే వారి బోర్‌డమ్‌ని పోగొట్టి ఉత్తేజితులను చేయడానికి ఏదైనా చేయాలి. ఆ ఆలోచన నుండి ఉద్భవించినదే ‘ఎడాప్టింగ్‌ ఎ సోల్జర్‌’, ‘సైనికుణ్ణి దత్తత తీసుకోవడం’! చిన్నారుల చేత సరిహద్దులలోని సైనికులకు లేఖలు వ్రాయించడం. యు.కె.జి. పిల్లలు. వాళ్లకింకా ఉత్తరాలు రాయడం రాదు. వాళ్ల బదులు నేనే రాసిపెట్టాలనుకున్నాను.

ఓ రోజున – సైనికుడి ప్రాముఖ్యత, దేశానికి అతను చేసే నిస్వార్థ సేవ, శత్రువుల బారి నుండి దేశాన్ని రక్షించేందుకు నిరంతరం అతను పడే శ్రమ, కష్టనిష్ఠురాలను గూర్చి పిల్లలకు వివరించాను. భారతీయ సైనికుడి ‘బహదురీ’,- సాహసం- గూర్చి కథలుగా చెప్పాను. ప్రతి పౌరుడూ భరతమాతకోసం చేయవలసిన త్యాగం గురించి చెప్పాను. ఆ వయసులో నేను చెప్పింది వాళ్లకు ఎంతవరకు అర్థమయిందో తెలియదుగాని, ఆసక్తిగా ఆలకించా రంతా. చెప్పడం పూర్తయ్యాక, ‘శత్రువులను తరిమి కొట్టడానికి మేము వెళతాం అంటే మేము వెళతాం’ అంటూ ఒక్కొక్కరే చేతులు ఎత్తుతూంటే, ఒళ్లు పులకించిపోయింది నాకు.

అందుకు ఇంకా బోలెడు సమయం ఉందనీ, శ్రద్ధగా చదువుకుని బుద్ధిమంతులుగా ఎదగడమే వారి ప్రస్తుత ధ్యేయమనీ చెప్పాను. ఆ తరువాత దేశానికి సేవ చేసే అవకాశం ప్రతి ఒక్కరికీ లభిస్తుందన్నాను. వారి చేత సైనికులకు ఉత్తరాలు రాయిస్తానని చెప్పడంతో, ఆనందంతో గెంతులు వేసారంతా.

ముందుగా సరిహద్దులలో డ్యూటీ చేస్తూన్న సైనికుల పేర్లు, చిరునామాలూ సేకరించాలి. ఊళ్లోని సైనిక సమాచార్‌ కేంద్రానికి వెళ్లాను. సైనికుల సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని చెప్పేసారు. నేను పర్పస్‌ని వివరిస్తే నవ్వేరు. అక్కణ్ణుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాను. అక్కడా చుక్కెదురే అయింది. అవన్నీ సైనిక రహస్యాలనీ, ఎవరికీ ఇవ్వరాదనీ అన్నారు. అంతటితో ఊరుకోదలచుకోలేదు నేను. రాష్ట్ర సైనిక సమాచార కార్యాలయానికి వెళ్లాను. ‘ఎడాప్ట్‌ ఎ సోల్జర్‌’ అన్న నా ప్రాజెక్ట్‌ గురించి వివరించి, కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా అభ్యర్థించాను. నా ప్రతిపాదనను హర్షించినా, ఆయా వ్యక్తుల అనుమతి లేకుండా వారి వివరాలు ఇవ్వడం కుదరదని స్పష్టంచేసారు. నాలోని ఉత్సాహమంతా ఆవిరయిపోయింది.

అంతలో నా స్నేహితురాలు భువన అమెరికా నుండి వచ్చింది, కాలేజ్‌ ఫ్రెండ్స్‌మి మేము. డిగ్రీ పూర్తి అవగానే అది పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి పోయింది. దాదాపు మూడేళ్ల తరువాత కలుసు కుంటున్నాము మేము. పాత కబుర్లు, విశేషాలూ ముచ్చటించుకుంటూంటే కాలమే తెలియలేదు మాకు.

నా క్లాసు గురించీ, అందులోని చిన్నారుల గురించీ, వారి కోసం నేను తలపెట్టిన ప్రాజెక్ట్‌ గురించీ చెప్పుకొచ్చాను. నా విఫలప్రయత్నాల గురించీ చెప్పాను. ‘ఒక్కో చిన్నారి ఒక్కో సైనికుణ్ణి ‘ఎడాప్ట్‌’ చేసుకుంటే, అటు సైనికులకు, ఇటు చిన్నారులకూ కూడా మేలు జరుగుతుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. కానీ, నా ఆలోచనకు ఆదిలోనే హంసపాదు పడడం దురదష్టకరం’ అన్నాను దిగులుగా.

‘నీ ఆలోచన వినూత్నమైనదే కాక, ఉన్నతమైనది కూడానే, మౌనికా! నువ్వింతగా నిరుత్సాహ పడనవసరంలేదు కానీ, చీర్‌ అప్‌! నా కజిన్‌ ఒకరు ఆర్మీలో ఉన్నాడు’ అంది భువన.

అతని పేరు హర్ష. ఇంచుమించు నా వయసే ఉంటుంది. అయిదేళ్ల క్రితం ఆర్మీలో జవానుగా చేరాడు. ఇప్పుడు హవిల్దార్‌ ర్యాంక్‌కి వచ్చాడు. ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌లో డ్యూటీ.

ముందుగా నన్ను పరిచయం చేస్తూ హర్షకు ఉత్తరం రాస్తానంది భువన. అతని నుండి జవాబు వచ్చాక నన్ను రాయమంది. అతని వివరాలు ఇచ్చింది నాకు. దేశ సరిహద్దులలో పనిచేసే సైనికుల పోస్టల్‌ చిరునామా – ’56 ఎపివో’ అట. అది ఆర్మీ పోస్టాఫీసు అనీ, అక్కడ నుండి వివిధ ప్రాంతాలలోని సంబంధిత వ్యక్తులకు ఉత్తరాలు బట్వాడా అవుతాయనీ వివరించింది.

భువన అమెరికా తిరిగివెళ్లిన కొద్ది రోజులకు దాని దగ్గరనుండి మెయిల్‌ వచ్చింది. హర్షకు తాను రాసిన ఉత్తరానికి జవాబు వచ్చిందనీ, స్కూల్‌ పిల్లలతో కలం స్నేహానికి కుతూహలం చూపు తున్నాడనీను. ఏనుగు అంబారీ ఎక్కినంత సంబర మయిపోయింది నాకు. వెంటనే ఉత్తరం రాసాను అతనికి ‘కేరాఫ్‌ 56 ఎపివొ’ కి.

రెండు వారాల తరువాత హర్ష నుండి జవాబు వచ్చింది. నా ఆలోచనను హర్షించడమేకాక, నాకు అభినందనలు కూడా తెలిపాడు. నా కోరికను మన్నించి, తన కొలీగ్స్‌ కొందరి పేర్లు, వివరాలు కూడా ఇచ్చాడు. ఒక్కో చిన్నారికి ఒక్కో సైనికుణ్ణి కేటాయించాను నేను. వారి తరపున నేనే లేఖలు రాసి, వారిచేత సంతకాలు పెట్టించాను. ఆ ఉత్తరా లన్నిటినీ కవర్లలో పెట్టి ’56 ఎపివో’ కి స్వయంగా పోస్ట్‌ చేసాను.

‘అంకుల్‌! దేశంకోసం పోరాడుతూ త్యాగాలు చేసే మీరు మా అందరికీ ఆదర్శం. సాధకబాధకాలకు ఓర్చి మీరు సరిహద్దులలో పహరా కాస్తూంటే, ఇక్కడ మేమంతా సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఏం చేస్తే మేం మీ రుణం తీర్చుకోగలం!?…మన భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చే శత్రు ముష్కరులను తునుమాడే వేళ మమ్మల్ని గుర్తు చేసుకోండి. మేమంతా మీ వెనుకే ఉన్నామనీ, మా ఆలోచనలు మీ వెంటే ఉంటాయనీ మరచి పోకండి’ ఇంచుమించు ఇలాగే సాగాయి ఉత్తరాలన్నీ. ఉత్తరం రాసిన చిన్నారి పేరు, వయసు, తరగతి, బడి, ఊరు వగైరాలను అందులో పేర్కొనడం జరిగింది. ఆ ఉత్తరాలతో పాటు ఒక్కో గులాబీ పూవును కూడా కవరులో పెట్టడం జరిగింది.

హర్ష పంపిన సైనికుల పట్టీలో తెలుగువారే కాక ఇతర భాషలవారు కూడా ఉండడం విశేషం. తెలుగువారికి తెలుగులోను, హిందీవారికి హిందీ లోను, ఇతరులకు ఆంగ్లంలోనూ రాయడం జరిగింది.

ముందుగా హర్ష నుండి జవాబు వచ్చింది – ఈషాకి. అతను ఆ చిన్నారి కలం స్నేహితుడు. పాపకు ఆశీస్సులు తెలుపుతూ, ఆమె చదువు గురించీ, హాబీల గురించీ తెలుసుకోవాలన్న కుతూహలం వ్యక్తంచేసాడతను. మిలిటరీ జవానుల దైనందిన జీవనవిధానం గురించి కొన్ని విశేషాలను రాసాడు. ఆ లేఖను అందుకున్న ఈషా సంతోషానికి మేరలేదు. ఉత్తరాన్ని నాచేత పదే పదే చదివించుకుని, పదిలంగా దాచుకుంది.

కొద్దిరోజుల తేడాలో మిగతా చిన్నారులు అందరికీ కూడా జవాబులు వచ్చాయి. వారితో స్నేహానికి సైనికులు కనపరుస్తూన్న ఉత్సుకత వాటిలో సుస్పష్టంగా కనిపించింది. పిల్లలు మళ్లీ వాటికి బదులు రాసారు. ఈసారి నేను ఆ పసివాళ్ల ఒక్కొక్కరి భావాలనూ, ఆలోచనలనూ అడిగి తెలుసుకునిమరీ రాయడం జరిగింది. ఉత్తరాలే కాకుండా తాము గీసిన బొమ్మలు, వేసిన పెయింటింగ్సూ, గ్రీటింగ్సూ, రాఖీలు, బహుమతులూ పంపించేవారు. నెలకో ఉత్తరమైనా ఎక్స్ఛేంజ్‌ అయ్యేది వారి మధ్య.

చిన్నారుల లేఖలు, పెయింటింగ్సు, బహు మతులూ, స్కూలు, స్నేహితులను గూర్చిన విశేషాలూ.. తమలో నూతనోత్సాహాన్ని నింపు తున్నట్టూ, ఇంటికి దూరంగా ఉన్నామన్న భావనను మరుగునపడేస్తున్నట్టూ సైనికమిత్రులు రాస్తూంటే ఆనందంగా ఉండేది నాకు. తమ చిన్నారి స్నేహితు లను ఎప్పుడెప్పుడు చూద్దామా అని తహతహ లాడుతున్నట్టూ, సెలవులో వచ్చినప్పుడు స్కూలుకు వచ్చి అందరినీ కలవాలని ఉవ్విళ్లూరుతున్నట్టూ రాసేవారు.

ఇప్పుడు ఆ చిన్నారులలో గణనీయమైన మార్పు వచ్చింది. అల్లరి తగ్గిపోయింది. చదువులో, ఆటలలో చురుకుదనం హెచ్చింది. స్నేహం విలువ, దేశంపట్ల ప్రేమ, భక్తిగౌరవాలూ ఆ పిన్న వయసులోనే మదికి ఎక్కించుకున్నారు. సైనికులను ఉన్నతంగా ఊహించు కోనారంభించారు. తమ చిన్నారుల ‘ఎడాప్ట్‌ ఎ సోల్జర్‌’ ప్రాజెక్ట్‌ గురించి తెలుసుకున్న వారి తల్లిదండ్రులు నన్ను అభినందించారు. మా ప్రిన్సిపాల్‌ మేడమ్‌ కూడా ఎంతో సంతోషించి ప్రోత్సహించారు.

ఓసారి హర్ష నుండి చాలా ఆలస్యంగా వచ్చింది నాకు ఉత్తరం. ఈషాతో పాటు నేనూ అతనితో కలంస్నేహం చేస్తున్నాను. ఉత్తరం చదువుతూంటే తెలియకుండానే నా కన్నులు వర్షించాయి. ‘రెండు వారాల క్రితం హర్ష ఉన్న సెక్టార్‌లో అర్థరాత్రి వేళ శత్రుసైనికులు మెరుపుదాడి చేసారు. మన సైనికులు వారిని విజయవంతంగా తరిమికొట్టారు కానీ, దురదష్టవశాత్తూ ఆ ఎన్‌కౌంటర్లో జవాన్‌ పరమేశ్వరన్‌ అమరుడయ్యాడు.’

పరమేశ్వరన్‌ తమిళనాడులోని తిరుచికి చెందినవాడు. చిన్నారి అఖిల ‘దత్తత’కు తీసుకున్న కలంస్నేహితుడు!…పరమేశ్వరన్‌ ఇకలేడన్న నిజాన్ని ఆ చిన్నారి తట్టుకోలేదనీ, ఆమెకు చెప్పవద్దనీ, ఇకపైన అతని పేరుతో తానే ఉత్తరాలు రాస్తాననీ సూచించిన హర్ష మనోపరిపక్వతను, సున్నితమనసునూ హర్షించకుండా ఉండలేకపోయాను నేను.

నాకు రాసే ఉత్తరాలలో హర్ష వెలిబుచ్చే భావాలు, భావోద్వేగాలు నన్ను ఆకట్టుకోవడంతో.. మా ఆలోచనలు కలవడంతో, మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. నాకు తెలియకుండానే నా ఆలోచనలు అతని చుట్టూ పరిభ్రమించేవి.

నన్ను కలవాలని వుందని రాసాడు హర్ష ఓసారి. త్వరలో మా ‘స్కూల్‌ డే’ రాబోతోంది. దానికి నా క్లాస్‌ చిన్నారులు కొందరికి డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌కి తర్ఫీదు ఇస్తున్నాను. ఆ సమయానికి వస్తే ఆ చిన్నారుల నత్యప్రదర్శనను తిలకించవచ్చునని రాసాను. వెంటనే సెలవుకు అప్లయ్‌ చేసినట్టు రాసాడు ఎక్సైటింగ్‌గా.

అతని రాక నా మదిలో అస్పష్టంగా కదలాడు తూన్న ఊహలకు ఓ రూపం కల్పించనారంభించింది. అంతకుమునుపు హర్ష గురించి భువన చెప్పిన సంగతులు కూడా నన్ను ప్రభావితంచేసాయని చెప్పాలి. అతని మనసేమిటో అతని లేఖలలో తెల్లమవుతూవున్నా, తీరా నేను బైటపడితే ఎలా స్పందిస్తాడోనన్న భయం. ఒకవేళ అతను సుముఖంగా ఉన్నా, నా అభీష్టం ఎంతవరకు నెరవేరు తుందన్న సంశయమూ నన్ను వెంటాడుతోంది. చదువు, ఉద్యోగాల విషయంలో అమ్మ-నాన్నల మాటను చెల్లనివ్వలేదు నేను. ఇప్పుడు వాళ్లు నా మనోభీష్టానికి విలువ ఇస్తారా అన్నది పెద్ద ప్రశ్నార్థకమయింది.

సెలవు మంజూరయిందనీ, నెల్లాళ్ల సెలువులో వస్తున్నాననీ హర్ష దగ్గర నుండి ఉత్తరం రావడంతో చిన్నారులలో హుషారు కలిగింది. అతనికి ఇవ్వడం కోసమని డ్రాయింగులు, పెయింటింగులూ వేయడానికి ఉపక్రమించారు. వేస్ట్‌ మెటీరియల్‌ తో బొమ్మలవీ చేయడం నేర్పించాను. కొందరు ఆవిధంగా అతనికోసం వివిధ వస్తువులను తయారుచేయడానికి పూనుకున్నారు. హర్ష రాక క్లాసులో గొప్ప చైతన్యాన్ని, ఉత్సాహాన్నీ నింపింది.

‘డి-డే’ సమీపిస్తూంటే నా గుండె అలజడి హెచ్చింది. హర్ష విషయం అమ్మ-నాన్నలకు ఎలా చెప్పాలో తెలియడంలేదు. ఎంత విశాలదక్పథం కలవారైనా, ఓ సైనికుడి చేతిలో తన కూతుర్ని పెట్టాడానికి ఎంతమంది తల్లిదండ్రులు ముందుకు వస్తారో తెలియదు. నా డైలమా గురించి భువనతో ఫోన్లో మాట్లాడాను. హర్షను నేను ఇష్టపడు తున్నందుకు హర్షం వెలిబుచ్చింది. నాది సరైన నిర్ణయమేనంటూ నన్ను అభినందించింది. హర్ష వచ్చాక అతన్ని మా వాళ్లకు పరిచయం చేసి, నా మనసులోని మాటను చెప్పాలని నిర్ణయించుకున్నాను.

వారం రోజులలో హర్ష వస్తున్నాడు. మొదట గుంటూరు వెళ్లి తల్లిదండ్రులను కలిసి, ‘స్కూల్‌ డే’ నాటికి మా ఊరు వస్తున్నట్టు రాసాడు. ఇంటికి రాగానే నాకు ఫోన్‌ చేస్తానన్నాడు. అతని స్వరం వినాలని నా మనసు తహతహలాడింది.

అంతలోనే అందింది అశనిపాతంలాంటి ఆ వార్త!…’హర్ష సెలవులో బయల్దేరుతూన్న రోజు తెల్లవారుఝామున పూంచ్‌ సెక్టార్లో భారత సైనిక శిబిరంపైన నలుగురు ఉగ్రవాదులు గ్రెనేడ్స్‌తో మెరుపుదాడి చేసారు. ఎదురుకాల్పులలో భారత జవాన్లు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చగలిగినా, మిగిలిన ఇద్దరూ బాలికల సాంఘిక సంక్షేమ గహంలో తలదాచుకున్నారు. ఆ గహాన్ని చుట్టుముట్టిన సైనిక, ప్రాంతీయ పోలీసు బలగాలపైన కాల్పులు జరుపనారంభించారు. లోపల ఉన్న బాలికల రక్షణ దష్ట్యా బలగాలు సంయమనం పాటించవలసివచ్చింది. ఆ సంఘటనతో తన ప్రయాణాన్ని వాయిదావేసుకున్న హర్ష, ధైర్య సాహసాలతో ఒంటరిగా ఆ గహంలో ప్రవేశించాడు. ఉగ్రవాదులపైకి లంఘించాడు. వారి నడుమ జరిగిన తీవ్రఘర్షణలో ఉగ్రవాదులు హతమారినా, హర్షకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలాడు!…’

గొప్ప షాక్‌కి గురయ్యాను నేను. ఆ వార్త నా నవనాడులనూ కంగదీసింది. నా మెదడు మొద్దుబారిపోయింది. కంటివెంట చుక్క నీరు కూడా రాలేదు.

రెండు రోజులలో హర్ష భౌతికకాయం అతని ఇంటికి చేరుకుంటుందని తెలిసి గుంటూరు వెళ్లాను. బంధుమిత్రుల అశ్రునివాళుల మధ్య మిలిటరీ లాంఛనాలతో హర్ష అంత్యక్రియలు జరుగు తున్నాయి. అతన్ని ఆ విధంగా కలుసుకుంటానని కలనైనా ఊహించలేదు నేను. అతని ధైర్యసాహసాలు, దేశభక్తి నా మదిని గర్వంతో ఉప్పొంగిస్తున్నాయి. తెల్లచీరలో చెదిరిన బొట్టుతో అతని పార్థివదేహాన్ని చూస్తూ ఉండిపోయాను, నిస్తేజంగా, నిస్పహగా.

ఒకరినొకరం చూసుకోకుండానే మనసులు పెనవేసుకున్న బంధం మాది. హర్ష భౌతికంగా దూరమయి వుండవచ్చును. కానీ, నా మనసులో అతని స్థానం సుస్థిరంగా ఉంటుంది. దాన్ని వేరెవరూ ఆక్రమించుకోలేరు. ఆ అమరస్నేహితుడి స్మతులతో, అతను రాసిన ఉత్తరాలతో, సహజీవనం చేయడం మినహా ఏం చేయగలను నేను!?

– తిరుమలశ్రీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *