పెద్దమనసు మనుషులు

పెద్దమనసు మనుషులు

పున్నమ్మది ఒంటరి బతుకు. డెబ్భై ఏళ్ల వయసు. భర్త చనిపోయి పాతికేళ్లయింది. అటూ ఇటూ నా అన్నవాళ్లు లేరు. మూడు ఎకరాల పొలం, 40 సెంట్ల ఖాళీస్థలం, తొమ్మిదింబాతిక మిద్దె ఇచ్చి పోయాడు భర్త.

‘పున్నమ్మ తోట’ అంటే ఊళ్లో అందరికీ ఉత్సాహమే. తోటంతా చెట్లే. రెండు వేప, రెండు మద్ది, అవిగాక సపోటా, జామ, సీమచింత, సీతాఫలం.. ఓ పక్కగా పూలమొక్కలు; బావి చప్టా పక్కన అరటి, నిమ్మ. ప్రహరీ వారగా పెద్దములగా, ఒక అవిశే.

తోటని సత్తార్‌ వాళ్లావిడ కాశింబీ చూస్తున్నారు. ప్రహరీకి ఆనుకుని నైరుతిలో చిన్న షెడ్డులో కాపురం. ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్లిద్దరికీ వినికిడి, మాటా లేవు. ఈ కారణం వల్ల కాశింబీ సత్తార్‌ పట్ల పున్నమ్మకి మరీ ఎక్కువ జాలీ, సానుభూతి. సత్తార్‌ ఎక్కడో కార్ల కంపెనీలో డ్రైవర్‌. ఎప్పుడో పున్నమ్మ భర్త ఉన్నప్పుడే ఇక్కడ చేరారు వాళ్లు.

పొలాన్ని ప్రకాశం, అతని భార్య సుగుణమ్మ కౌలుకి చేస్తున్నారు. వాళ్లు ఇచ్చిందేమో తీసుకుంటుంది ఫలసాయంగా. ‘మీ అవస్థలు నాకు తెలుసు లేవయ్యా. కరెంట్‌ ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటే ఎరువులు ఉండవు. సేద్యం అంతా లాటరీ గదా’ అని వాళ్లని ఊరడిస్తుంది. తోటలో పూలూ, పళ్లూ ఊరివారంతా ఉమ్మడి సంపద లాగానే అనుభవించటానికి అలవాటు పడ్డారు. భర్త సుందరం ఆ కాలంలో ఈ మాటంటే ‘అవన్నీ మనమే తిని హారాయించుకోలేము గదయ్యా’ అన్నది పున్నమ్మ. భార్య మంచి మనసుకు ఆయనా మురిసిపోయేవాడు.

అయితే, ఇప్పుడొచ్చిన సమస్య వేరు.

ఉదయం పది గంటలయింది. పూజ పూర్తి చేసుకుని లేచింది పున్నమ్మ. ఇంక వంట మొదలెట్టాలి.

పెరట్లోంచి కోసుకొచ్చిన వంకాయల్ని, మెంతికూరని, పచ్చిమిరపకాయలనీ, టేబుల్‌ మీద పోసిపోయింది కాశింబీ. ‘ఈ పూటకి ఇది కూర, ఇది పప్పు, ఇంత చారు పెట్టుకుంటే సరిపోతుంది’ అనుకుంటూ టేబుల్‌ దగ్గరే స్టూలు మీద కూర్చుంది. వంకాయల్ని నీళ్ల బేసిన్లో వేసి, మెంతికూరని సరిచేయ సాగింది.

సరిగ్గా అప్పుడే ‘టాప్‌’ మని ముందు వసారా రేకుల మీద రాయి పడిన చప్పుడైంది.

ఉలిక్కి పడింది పున్నమ్మ. ‘ఛ… ఛ… చంపుకు తింటున్నారు పిల్లలు. జులాయి మంద. ఎన్నిసార్లు చెప్పినా, చెప్పించినా బుద్ధిలేదు’ అని విసుక్కుంటూ లేచి ‘ఎవర్రా అది… వస్తున్నానుండు… కాళ్లు చేతులు విరగ్గొడతా’ అంటూ గబగబా వంటగదీ, మధ్యగదీ, ముందుగదీ దాటుకుని వసారాలో కొచ్చింది. అప్పటికే అలుపొచ్చింది. కీళ్ల నొప్పి. ఎంత గబగబా నడవాలన్నా అడుగు వేగంగా సాగదు. రొప్పుకుంటూ, వసారాలో నుంచీ బయటికి వచ్చింది. చుట్టూ కలయచూసింది. అక్కడెవరుంటారు?

‘ఎప్పుడో జారుకున్నారు…’ అనుకుంటూ ప్రహరీ గోడ తలుపు తీసుకొని రోడ్డుమీదికొచ్చింది. పారజూసింది. పిల్లల జాడలేదు. పెద్దలెవరూ కూడా లేరు. ‘పోకిరి గుంపు. ప్రాణాలు తోడేస్తున్నారు’ అని వేష్టపడి, తలుపు వేసి లోపలికి నడిచింది.

‘ఛీ..ఛీ. అసలీ మావిడి చెట్టుండటమే నా చావుకొస్తోంది’ అనుకుంటూ నిదానంగా ఇంట్లోకి చేరింది. ఆయాసంగా ఉంది. వంటింట్లోకి పోకుండా మధ్యగదిలో మంచంమీద నడుం వాల్చింది. కళ్లు మూసుకుంది. కళ్లముందు పాత సంఘటనలు మెదిలాయి.

ఆ ఏడాది అనావృష్టి. ఊళ్లో అటువైపు వేణుగోపాలస్వామి గుడి, ఇటు శివాలయం ఉన్నాయి. పూజలూ, అభిషేకాలూ, భజనలూ, హరికథలూ, విరాటపర్వం ప్రవచనాలూ – చాలా జరిపేరు. మేఘుడు కరుణించలేదు.

‘రామాలయం లేని ఊరేం ఊరు? అందుకనే ఈ అనావృష్టి’ అని ఎక్కడి వాడో వచ్చి ఇక్కడి పదిమందిలోనూ అనేశాడు. నలుగురూ కూడేరు. మంచీచెడూ చర్చలూ బాగానే జరిగాయి. స్థలం ప్రశ్న వచ్చింది.

సుందరం స్థలంలో ఇరవై గజాల చదరాన్ని ఇమ్మని అడిగారు. ‘ఏమే, ఏమంటావ్‌!’ అని భార్యని అడిగాడు సుందరం. ‘మందిరం కడతామంటే మంచిదేగా ఇద్దాం!’ అన్నది పున్నమ్మ. ఊరంతా సంతోషించింది.

పెద్ద హంగులేం లేకపోయినా – సుందరంగానే వెలసింది రామమందిరం. ఆచారి కొడుకునే ఈ మందిరంలోనూ ధూపదీప నైవేద్యాలని చూడమన్నారు. గడపకో బస్తా ధాన్యం ఎక్కి తక్కీ అనుకున్నారు పెద్దమనుషులు.

విగ్రహ ప్రతిష్ఠ రోజున జడివాన కురిసింది. రామమందిరం సందడి సందడిగా కళకళలాడ సాగింది.

ఆ కార్తీకంలో, శూలనొప్పితో మంచమెక్కాడు సుందరం. అన్ని రకాల వైద్యాలూ చేయించింది పున్నమ్మ. గుణం కనిపించలేదు. ఆచారీ, మునసబూ, కరణం, అవధానీ హైదరాబాద్‌ తీసుకుపొమ్మని సలహా ఇచ్చారు. మొగడూ పెళ్లాం మల్లగుల్లాలు పడుతుండగానే, ఒకరోజు రాత్రి ఉలికిపాటున నిద్రలో నుంచి లేచాడు సుందరం. భార్యని లేపాడు. ‘సాధువెవరో కలలో కనిపించాడే ‘ఇంత తోటా, దొడ్డీ, చెట్లూ అన్ని ఉన్నాయి. మరి మావిడేదిరా వెర్రోడా?’ అని గద్దించాడే!’ అని భయం భయంగా చెప్పాడు.

మర్నాడు ఊరి పెద్దలతో మాట్లాడింది పున్నమ్మ. ‘మంచిదేగా ఓ మొక్క నాటితే సరి’ అన్నారు వాళ్లు.

తానే స్వయంగా జాగర్లమూడి వెళ్లి మావిడిమొక్కని పట్టుకొచ్చింది పున్నమ్మ. మందిరం హద్దుకి పదడుగుల దూరంలో తమ స్థలంలో మొక్కని నాటారు దంపతులు.

అదీ ఘటన. మావిడిచెట్టు పుట్టుక!

క్రమంగా సుందరం కోలుకున్నాడు. చెట్టు ఇంతింతై, అంతంతై పూతకొచ్చింది. ఆ ఏడాది పిందెలు పెరిగి పట్టెడు పట్టెడు కాయల్ని ఇచ్చింది. వాటిని ఊరంతా పంచింది పున్నమ్మ.

ఆ వైశాఖంలోనే- హఠాత్తుగా గుండెనొప్పితో మరణించాడు సుందరం. పున్నమ్మ ఒంటరిదైపోయింది.

అప్పట్నుంచీ మావిడిచెట్టు పిల్లల రాళ్లదెబ్బల్ని తింటూనే ఉన్నది. కాయపడితే సంబరంగా తీసుకొని పరిగెత్తుకుపోవటం, పడకపోతే విసుగెత్తి, తిట్టుకుంటూ పారిపోవటం…

సత్తార్‌, కాశింబీ ఎంత జాగ్రత్తగా కాపలా కాసినా, కాసిన చెట్టుకి దెబ్బలు తప్పటం లేదు. ఆ రాళ్ల దెబ్బలే- పున్నమ్మ పాలిట పెద్ద సమస్యగా తయారైనై.

‘ఏం అమ్మా! పడుకున్నారేం?’ అంటూ వచ్చింది కాశింబీ. పున్నమ్మ ఆలోచనల మాల తెగింది.

‘ఆఁ ఏం చెప్పేదే. రోజూ ఉన్నదే. వసారా మీద రాళ్లవాన! నా గుండెల్లో దడ! చచ్చీచెడి బయటికి పరిగెత్తుకొస్తే, ఒక్క వెధవా కనబడడు.’

‘అప్పటికీ, నేనూ అటొచ్చీ ఇటొచ్చీ చూసిపోతూనే ఉంటానమ్మా. అయినా వాళ్లని ఆపలేకపోతున్నాం’ అని, ‘పొద్దెక్కింది మరి. వంట సంగతేఁవిటీ?’ అన్నది.

‘ఏమోనే. ఓపిక లేదు..’ అంటూ ‘పోయి అవధాని భార్య దుర్గాంబని నాలుగు మెతుకులు పంపమను. పెరుగుంది. తిన్నాననిపిస్తాను’ అన్నది.

‘ఉత్త అన్నమైతే పోనీ నేనే తెస్తాను. కానీ, మీ కూరలు చెయ్యటం నాకు రాదుగదా’ అంది నొచ్చుకుంటూ.

‘సర్లే, అన్నమొక్కటే అయితే ఇస్తూనే ఉన్నావ్‌గా’ అని ‘ఈ పూటకి ఆవిడకి చెప్పిరా…’ అన్నది.

సరేనంటూ వెళ్లింది కాశింబీ.

దీర్ఘంగా నిట్టూర్చి కళ్లు మూసుకుంది పున్నమ్మ.

—— —–

తెలతెలవారుతోంది.

రామమందిరం దగ్గర కలకలం! కరణం నరసింహారావు కొడుకు హరీ, వడ్రంగి సుబ్బనాచారి కొడుకు సత్యమూ మందిరం పిట్టగోడ ఎక్కి, కొమ్మ నందుకుని మావిడికాయ కోయబోతుంటే, వాళ్ల కాళ్లని గట్టిగా పట్టేసుకుని కదిలిస్తూ- ఓ కుర్రాడు! కిందికి చూస్తే కిచకిచా నవ్వుతూ, వెర్రివెంగళప్పలా, ‘హ..హ..హ.. అదంతే’ అంటూ ‘కాయల్ని కొయ్యనియ్యను’ అని కళ్లూ చేతూలు ఆడిస్తున్నాడు. భయపడి వాళ్లిద్దరూ, కాళ్లు విదిలించుకొని గోడ దూకి పారిపోయారు.

వాళ్లతోపాటు, గాలికూడా ఊర్లోకి మోసుకెళ్లిందీ వార్తని.

చిన్నా పెద్దా, ఆడా మగా అంతా మందిరం దగ్గర చేరారు. సత్తార్‌, కాశింబీ వచ్చారు. పున్నమ్మా వచ్చింది.

అదురూ బెదురూ లేకుండా ఆ కుర్రాడట్టాగే మందిరం స్తంభానికి ఆనుకుని కూచునున్నాడు.

అందరూ వింతగానే చూశారు. పన్నెండు పదమూడేళ్ల వాడు. మాసిన అరచేతుల చొక్కా. మోకాళ్ల దిగువకు చిరిగిన నిక్కరు. భుజాన్నో కండువా! కళ్లల్లో ఏకాగ్రంగా దూసుకొస్తున్న బాణపు చూపు!

కరణం నెమ్మదిగా వివరాలడిగితే, మునసబు గద్దించి మరీ అడిగాడు. ‘ఊరేది, పేరేది?’ అని. ‘ఊరు తెలీదు. పేరు స్వామి. మద్రాసులో రైలెక్కాను. ఎక్కడెక్కడో… ఎక్కే రైలూ.. దిగే రైలూ… పంపుల్లో నీళ్లు, గుళ్లలో ప్రసాదం’ గంగ దాకా పోయొచ్చా నన్నాడు.మంచుకొండల్నీ చూశానన్నాడు. చివరికి ‘ఈ రాములోరు పిలిచారు, వచ్చా’ నన్నాడు. కిచకిచలాడుతూ!

స్వామి ముందు దీపకళికలా నిబ్బరంగా నిలిచి చెప్పేడు సమాధానాలన్నీ.

‘నేనీడనే ఉంటా. ప్రసాదం పెట్టించండి చాలు’ అన్నాడు. పలుకుల్లో తడి ఎదుటివారి గుండెల్ని తాకింది.

పెద్దమనుషులంతా ఒకర్నొకరు చూసుకున్నారు.

‘ఏ అమ్మ కన్నబిడ్డో-వచ్చాడుగా. ఉండనియ్యండన్నా’ అని ముందు కొచ్చింది పున్నమ్మ. ఆపైన ‘నాకాడుంటాడులే. కాస్త మాటసాయం, చేతిసాయం. ఒక్క పొట్టకి ఎంతకావాలి, పాపం? నేజూసుకుంటాలే’ అనీ అన్నది.

‘సరి… సరి..’ ‘సరేలే’ అనుకున్నారు నలుగురూ. వీళ్లిద్దరూ ఇటు ఇంట్లోకి నడిచారు.

దొడ్లో బావి పక్కన అరటిబోదెల్ని సరిచేస్తూ, పిల్లకాలవల్ని కాలితో లోతు చేస్తూ సంబరంగా స్నానం కానిచ్చాడు స్వామి. ఇంట్లోకొచ్చే సరికీ, కావిడి పెట్టే లోంచి పాత పంచె, బనీనూ తీసిచ్చింది పున్నమ్మ.

అన్నం పెట్టి, వాడి ముందు కూచుంది. పండుమిరప కారంతో ఓ వాయి కలిపేడు. చారెడు నెయ్యి వేసింది. తింటున్నాడు. ‘నిజంగా అమ్మ గుర్తు లేదురా?’ అడిగింది.

స్వామి నోట్లో ముద్దనీ, గుండె గొంతుకలో మాటనీ సర్దుకున్నాడు. మాట పెకల్చుకుని ‘ఎందుకు గుర్తులేదూ- ఆమె పేరు అన్నమ్మ’ అని చిత్రంగా నవ్వుతూ, ‘అమ్మ పేరు అన్నమ్మ, ఎదురుగా ఉన్న ఈ అమ్మ పేరు పున్నమ్మ. భలే… భలే..’ అంటూ కళ్లు చికిలించాడు.

పున్నమ్మకు మనసు ఆర్ద్రమైంది.

‘అయినా, నేన్నీకు అమ్మనెట్టా ఔతాన్రా?’

‘అమ్మ కాకపోతే, పిన్నమ్మ! హాయ్‌, హాయ్‌..’ అని ‘బాగుంది, బాగుంది.. అన్నమ్మ- పున్నమ్మ- పిన్నమ్మ’ అంటూ మాటలతో ఆడుకున్నాడు. అంతలోనే మళ్లీ ఆమె కళ్లల్లోకి చూస్తూ ‘ఏమైనా, నేన్నిన్ను అమ్మ అనే పిలుస్తా’ అన్నాడు.

పున్నమ్మకి మనసు మనసంతా గాలిలో తేలినట్లయింది!

అన్నం తినేసి చెంగున పోయి మందిరంలో కూచున్నాడు స్వామి. పున్నమ్మకి తన వ్యాపకంలో తానున్నా, స్వామి మాటల పులకలే! అంతే-

అప్పట్నుంచీ ఇక మందిరానికీ, పున్నమ్మ తోటకీ, మావిడిచెట్టుకీ మేలు కాపరి అయిపోయాడు స్వామి.

చెట్టుమీద రాయి పడబోతుంటే – ఎట్లా తెలుస్తుందో ఏమో- ఆ పిల్లగాణ్ణి పట్టేస్తాడు. ‘రాయి కొట్టావో, నీ కళ్లు పోతాయి’ అనో, ‘నువ్వు రాయి కొట్టినా కాయ రాలదు’ అనో వాళ్లని అదరగొడతాడు. తత్వాలూ, పాటాలూ పాడతాడు.

నెమ్మదిగా ఊళ్లో వ్యాపించిందీ మాట.

ఓ రోజు – కనిచీకటి వేళ- స్వామి తోటలో ఏదో పనిలో ఉంటే, బయట – సుబ్బూ, చంద్రం ప్రహారీ గోడ ఎక్కి చెరో మామిడికాయ కోసేశారు. అప్పుడు చూశాడు స్వామి. అతను పరిగెత్తుకొచ్చే లోపే, వాళ్లిద్దరూ ‘పోరా.. వెర్రోడా..’ అంటూ ఏవో ఎగతాళి మాటలంటూ పరుగు లంకించుకున్నారు. రోడ్డు మీదికొచ్చి వెనక నుంచి అరిచాడు స్వామి, ‘సరే, పొండిరా రొరేయ్‌.. అవి తిన్నారో మీకు బేదులే’ అని! వాళ్లిద్దరూ మొహాలతో, చేతుల్తో వెక్కిరించి పారిపోయారు.

స్వామి మాట ఊరికేపోలేదు. ఆ రాత్రి వాళ్లు కాయలు తిన్నారు. బేదుల పాలైనారు. మందులతో, మాకులతో రెండ్రోజులకి చచ్చి బతికారు. సుబ్బు తండ్రి నాయుడుగారూ, చంద్రం తండ్రి అయ్యప్పా -స్వామిని కోప్పడి, కొట్టబోయేరు. కానీ, పున్నమ్మ అడ్డుకుంది. ‘వాడి మొహం, వాడనంగానే జరిగింది టయ్యా. ఆ కాయల్ని మీ పిల్లలు హరాయించుకోలేక పోయారు అంతే’ అని సర్ది చెప్పి పంపించింది.

అయినా, ఈ ఘటనతో ‘స్వామి మాటంటే తిరుగులేదు.వాడితో జాగ్రత్తగా ఉండాలి’ అని ఊళ్లో అందరూ ఒకరికొరు హెచ్చరికలు చెప్పుకున్నారు.

‘ఏదో – కొందరు సిద్ధపురుషులుంటారంటారు’ అన్నారు అవధానిగారు.

మావిడి చెట్టుకి మాత్రం రాళ్లదెబ్బలు నుంచి విముక్తి కలిగింది!

—— —–

ఏళ్లు గడిచాయి. స్వామి పున్నమ్మ అనుబంధం గాఢమైంది. ఊరి వారికీ తలలో నాలుకయ్యాడు స్వామి.

ఆ వేళ – వాకిట్లో మందారచెట్టు దగ్గర పూలు కోస్తూ కోస్తూ విరుచుకు పడిపోయింది పున్నమ్మ. స్వామే చూశాడు. పరిగెత్తుకొచ్చి ఆమెని ఇంట్లోకి మంచం మీద చేర్చి, కాశింబీని పిలిచాడు. మాత్ర ఏదో వేశాడు. వారికీ విరికీ తెలిసింది. నలుగూరూ చేరారు.

ఆందోళనతో ‘అమ్మా… అమ్మా..’ అంటూ పున్నమ్మ పక్కన స్వామి. స్వామి కళ్లల్లో జారీజారని నీరు! అతని బుజం తట్టి ‘పర్వాలేదు లేరా.. మెదడులో రక్తం నాళాల సమస్య. అందుకే ఆ ఎడమ చెయ్యి కాలు పడిపోయినై’ అని ‘నోరు కూడా కొంచెం…’ అంటూ ‘చూద్దాం’ అన్నాడు ఆచారిగారు. చాలా సేపు వసారాలో నిలబడి – కరణం గారూ, అవధానిగారూ, ఆచారిగారూ- మాట్లాడుకున్నారు. వాళ్ల మాటలు విన్నాడు స్వామి. తడి కళ్లల్లో బాధ సుడి తిరిగింది.

‘నాకు తెలుసు… నాకు తెలుసు’ అని గొణుక్కున్నాడు స్వామి.

ఆచారి విన్నాడు. ‘ఏమిట్రా నీకు తెలిసింది’ అడిగారు. చెప్పలేదు. అవధానిగారూ గద్దించాడు. ‘ఏం లేదు, ఏమీ లేదు’ అంటూ ఏడుస్తూ ‘ఇంకో వారమే… అంతే వారమే’ అన్నాడు. ఈ మాటలు విన్న నలుగురూ అవాక్కయి, ఒకరి మొహాలొకరు చూసుకున్నారు!

—— —–

నాలుగు రోజులు గడిచాయి. పున్నమ్మకి అతి నీరసంగా ఉంది. ఆమెని అన్నివిధాలా స్వామే కనిపెట్టుకుని చూస్తున్నాడు. సత్తార్‌, కాశింబీ కూడా ఆమె దగ్గరే ఉంటున్నారు. ప్రకాశం, సుగుణమ్మ రోజూ వచ్చి చూసి వెళుతున్నారు.

ఆ రోజు రాత్రి-

స్వామిని అడిగింది పున్నమ్మ, ‘ఇవ్వాళే వారంరా’ అని. ‘గురువారం’ చెప్పాడు. ‘అయితే ఇంకా నాలుగు రోజులన్నమాట…’ అంటూ వాడి కళ్లల్లోకి చూసింది. తన మాటలు విన్నదని అర్థమైంది. ఆమె నోటికి అడ్డంగా చెయ్యి పెడుతూ, భోరున ఏడ్చేశాడు స్వామి. ‘అదేం కాదమ్మా… ఊరికే అన్నా’ అని వెక్కులు పెట్టాడు. స్వామిని తదేకంగా చూస్తూ ‘వీడికి పిచ్చేమిటి? వెర్రేమిటి?’ అనుకుంది పున్నమ్మ.

ఆ మర్నాడు వీలునామా రాయించింది పున్నమ్మ. కరణంగారే రాశాడు. ఇతర పెద్దల్నీ పిలిపించింది.

చదవమంది. ఆయన చదివాడు. విషయాలు తెలిశాయి.

పొలాన్ని ప్రకాశంకీ, సుగుణమ్మకీ జాయింట్‌గా రాయించింది. మిద్దెని సరిహద్దు చేసి వెనుకనున్న తోట స్థలమంతా సత్తార్‌కీ, కాశింబీకి ఇచ్చింది. మిద్దెనీ, దాని పక్కనా ముందూ మిగిలే స్థలాన్ని స్వామి పేరున రాయించింది. మావిడిచెట్టు ఈ స్థలంలోకే వస్తుంది.

అందరూ చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞత తెలిపారు. స్వామి ఏడుస్తూనే ఆమె మంచం పక్కన కూచున్నాడు.

అందరికీ మాటలు కట్టువడినై!

—— —–

ఆదివారం రాత్రికి పున్నమ్మ పరిస్థితి విషమించింది. స్వామీ, కాశింబీ, సత్తార్‌, ఆచారీ ఉన్నారు. ‘పోనీ పట్నం తీసుకుపోదామా’ అని మల్లగుల్లాలు పడుతున్నారు.

ఉన్నట్టుండి – భారంగా ఆయాసపడుతూ ఊపిరి తీసుకుంది పున్నమ్మ. పెద్దగా మూలిగింది. ఆ మూలుగులోనే ఆమె హంస ఎగిరిపోయింది. స్వామి మాట ప్రకారం జరిగింది. పున్నమ్మ మరణం! ఆచారిగారు ఆశ్చర్యంగానూ, విచారంగానూ స్వామి కళ్లల్లోకి చూస్తూ నిశ్చేష్టుడైనాడు. స్వామి రోదిస్తూనే ఉన్నాడు.

—— —–

నెల రోజుల తర్వాత- ఆ వేళ,

పెద్దలందర్నీ మందిరం దగ్గరికి పిలిచాడు స్వామి.

‘అమ్మ చేయదలచుకున్నదేదో సంతృప్తిగా చేసి పోయింది. మిద్దెనీ, మందిరాన్నీ కలిపేసి గుడిని పెద్దదిగా చేయించండి. భక్తులకి కావల్సిన సౌకర్యాలకీ వీలుగా ఉంటుంది’.

స్వామి ఈ మాటలు అనటంతో ఊరి వారంతా చాలా సంతోషించారు. క్షణాల తర్వాత మళ్లీ తానే చెప్పాడు స్వామి, ‘ఇహ ఈ మామిడిచెట్టుని ఇవ్వాళ్టి నుంచీ రాములోరి చెట్టుగా మార్చుకుందాం. కాయలన్నీ శ్రీరామనవమి నాటికి కోయించి ఉత్సవానికి ఊరంతా పంచుకోండి. ఈలోగా ఎవ్వరూ చెట్టు జోలికి రాకూడదు అదంతే.’ చేతులు, కాళ్లు తిప్పుతూ హెచ్చరించాడు.

క్షణం సేపు తెల్లబోయి నిల్చుండిపోయినా, ఆ తర్వాత తెప్పరిల్లి ”బాగుంది.. బాగుంది” అన్నారందరూ. ”స్వామి మాటంటే మాటే, చెట్టుని రాములోరికి మీదు కట్టాడు. జాగ్రత్తగా ఉండాలి’ అని అనుకున్నారు.

మంచి మనసుతో పున్నమ్మ తన ఆస్తికి వారసుల్ని నియమిస్తే, అంతకంటే మంచి మనసుతో తన భాగాన్ని ఊరికే వారసత్వంగా ఇచ్చాడు స్వామి!

ఆ తర్వాత స్వామి ఆ ఊళ్లో కనిపించలేదు.

ఏళ్లు గడుస్తున్నై.

ఇప్పుడు రాములోరి గుడి, స్వాములోరి చెట్టూ పెద్ద క్షేత్రంగా మారేయి. చిత్రంగా మావిడిచెట్టు మాత్రం శ్రీరామనవమి నాటికే కాయల్ని కాస్తున్నది. పూత ఎప్పుడు వస్తున్నదో, పిందె ఎప్పుడు పడుతున్నదో ఎవరికీ తెలియటం లేదు! సామాన్యులు స్వామి మహత్యం అనుకుంటుంటే, కొందరు అసామాన్యులు పరిశోధనలు చేస్తున్నారు!

కాశింబీ మాత్రం ‘మేఫ్లవర్‌ సంగతేంది? ఇదీ అంతే’ అంటోంది! ఊర్లో మాత్రం ఉత్సాహంగా ప్రతి ఏడూ తిరునాళ్లు జరుగుతోంది! ఎందరికో భుక్తీ, రక్తీ!! భక్తి సరే సరి!!

–  విహారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *