జీవనస్రవంతి -13

జీవనస్రవంతి -13

ఆ యువతి తను కోరుకున్న వ్యక్తినే పెళ్ళాడింది. ఆ సంతోషంలో త్వరగానే గర్భవతి కూడా అయింది. కానీ అంతలోనే ఆ సంతోషం ఆవిరయ్యింది. ఒక ప్రమాదంలో భర్త చనిపోతాడు. జీవితాంతం కష్టాలు పడమని రాశాడేమో భగవంతుడు. గర్భవతిగా ఉండగానే భర్త చనిపోవటంతో చిన్న వయసులోనే అనంత శోకానికి గురైన ఆ యువతికి కొడుకు జన్మించటంతో శోకానికి కొంత విరామం లభించినట్లయింది. కొడుకు రూపంలో జీవన ఆశాదీపం మిణుకుమిణుకుమంటూ కనిపిస్తోంది. కొడుకును బతికించుకుంటూ తను బతుకుదాం అనుకుంది. కాని విధి ఆమె జీవితంలో మరో కష్టాన్ని రాసిపెట్టింది. అప్పటికే అత్తింటివారు పట్టించుకోవడం మానేయడం, పుట్టింట్లో వదిన ఆరళ్ళ రూపంలో ఆ కష్టం ఎదురయ్యింది. ఆ ఊరిలో ఇక బతకడం కష్టం అని నిర్ణయించుకున్న ఆ యువతి ఒక అర్ధరాత్రి తనను, తన కొడుకును బతికించుకోడానికి ఊరు దాటింది. అర్ధరాత్రి బయటకు వచ్చిన ఆ యువతి ఎటువెళ్ళింది ?

తన కొడుకును ఎలా బతికించుకుంది ? అనేక కష్టనష్టాలను భరిస్తూ, జీవితాన్ని ఎలా ముందుకు నడిపింది ? కొడుకు ఏమయ్యాడు ?

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే

‘జీవన స్రవంతి’ ధారావాహిక.

మహిళల కంట కన్నీరు తెప్పించి మనసులు కదిలించే ధారావాహిక.

జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా కుటుంబ ధర్మాన్ని పాలించడానికి అడుగు ముందుకే వెయ్యాలనుకునే ప్రతి వ్యక్తి చదవాల్సిన ధారావాహిక

‘జీవన స్రవంతి’.

ప్రతీవారం జాగృతిలో…

జరిగిన కథ

జీవన్‌ డిగ్రీ పాసై ఉద్యోగం వెతుకుతూ, ఖర్చుల కోసం పత్రికలకు కథలు రాస్తుంటాడు. జీవన్‌ తల్లి మీనాక్షి యాజులుగారింట్లో వంట పనిచేస్తూ కొడుకును చదివించింది. జీవన్‌ యాజులుగారి మనవళ్ళకు ప్రైవేట్లు చెపుతుంటాడు. యాజులుగారి మనవరాలు కోవిద జీవన్‌కి 143 చెపితే, జీవన్‌ నవ్వుతాడు. నవ్వినందుకు తల్లి మీనాక్షి జీవన్‌ని అనరాని మాటలతో తిడుతుంది. దాంతో అతను ఇల్లు విడిచి బయటికి వెళ్ళిపోయాడు. జీవన్‌ కోసం ఎదురుచూస్తూ మీనాక్షి తన గతంలోకి వెళ్ళింది.

తన మేనత్త కొడుకు శంకరాన్ని పెళ్ళాడింది మీనాక్షి. గర్భవతిగా ఉండగా భర్త చనిపోతాడు. కూతురి పరిస్థితి చూసి తల్లీ మరణించింది. మీనాక్షికి కొడుకు పుట్టాడు. అతనికి జీవన్‌ అనే నామం స్థిరపడింది. కొన్నాళ్లకి మీనాక్షి తండ్రీ కాలం చేయడంతో చివరికి మీనాక్షి అన్నా, వదినల దగ్గర ఉంటూ ఆ ఇంటి పనులన్నిటినీ చేస్తూండేది. వదిన పద్మ మీనాక్షిని, జీవన్‌ని నానా మాటలూ అంటూండేది. తక్కువగా చూసేది. అది నచ్చక మీనాక్షి జీవన్‌తో సహా ఆ ఇల్లు వదలి, యాజులుగారుంటున్న ఊరికి వచ్చి, వారింట్లో వంటలక్కగా పనికి కుదురుతుంది. అప్పటి నుండి మీనాక్షి యాజులుగారింట్లో వంటలక్కగా జీవనం సాగిస్తూ, కొడుకును పెంచుకుంటూ ఉంది.

అలా పెరిగిన కొడుకుని తను ఇప్పుడు అనరాని మాటలు అన్నందుకు ఎంతో బాధపడింది. ఇంతలో అర్థరాత్రి 2 గంటలకు తిరిగొచ్చిన జీవన్‌ని మనసారా ఆలింగనం చేసుకుని, తనను క్షమించమంటుంది మీనాక్షి. కోవిద ఢిల్లీ వెళ్ళిపోయేవరకు యాజులుగారింటికి రావద్దని జీవన్‌కి చెబుతుంది. తెల్లారి వంటకోసం యాజులుగారింటికి వెళ్ళిన మీనాక్షిని కోవిద కలిసి జీవన్‌ మాస్టారుని తాను ప్రేమించానని, అతనిని ఢిల్లీ రమ్మనమని, తన తల్లితండ్రులతో మాట్లాడి పెళ్ళి చేసుకుంటానని చెబుతుంది. అది తప్పు అని, ‘ఊహలకీ వాస్తవాలకీ మధ్య తేడా చాలా ఎక్కువ’ అని మీనాక్షి చెపుతుంది.

మరో రెండు రోజుల్లో కోవిద తన తల్లితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోతుంది. జీవన్‌కి మోక్షం కలిగినట్లయి తెల్లారి నుండి యాజులుగారింటికి వారి మనవళ్ళకు ట్యూషన్‌ చెప్పటానికి వెళుతుంటాడు. మీనాక్షి కూడా ఈ మధ్య జీవన్‌ని తిట్టకుండా మురిపెంగా చూసుకుంటోంది. రోజులు గడుస్తున్నాయి.

ఒకరోజు యాజులుగారు జీవన్‌ని పిలిచి ‘నీకు మించిన నమ్మకస్తుడు నాకు మరెవరూ లేరని, కాబట్టి నువ్వు ముఖ్యమైన పనిమీద మా ఊరువెళ్ళి రావాలని, అక్కడి నా మిత్రుడు నా పొలం అమ్మిన డబ్బు ఇస్తాడని, అది తేవాలని’ చెపుతారు. అందుకు జీవన్‌ ‘తప్పకుండా తాతయ్యా! ఒక సూట్‌కేసు ఇస్తే, మీ మిత్రుడు ఏమిస్తే అది దాంట్లో ఉంచి, మీకు జాగ్రత్తగా అప్పగించే పూచీ నాది’ అన్నాడు. ‘నువ్వు అసాధ్యుడవురా జీవా!’ అంటూ బొజ్జ అదిరేలా నవ్వసాగారు యాజులుగారు. తనన్న మాటలో అంత నవ్వొచ్చేదేముందో తెలియక జీవన్‌ బిత్తరపోయాడు.

ఇక చదవండి..

జీవన్‌ బిత్తరపోవటం చూసి, బలవంతంగా నవ్వు ఆపుకుని, తన నవ్వుకి కారణం ఏమిటో చెప్పసాగారు యాజులుగారు. ‘నువ్వు అసాధ్యుడవని ఎందుకన్నానో తెలుసా? నా మిత్రుడిచ్చినవన్నీ సూట్‌కేసులో సర్ది తెస్తానన్నావు చూడు – అందుకే నాకు నవ్వొచ్చింది. మా కామేశం నా మీద ప్రేమతో, ఒక పనసకాయో, ఒక గుమ్మడిపండో లేక ఒక చక్కెరకేళీ అరటిపళ్ళ గెలో ఇస్తే; లేదా ఒక్కొక్కప్పుడు ఆ మూడూ ఒకేసారి ఇచ్చినా ఇవ్వగలడు, తెలుసా? నువ్వు అవన్నీ కలిపి, సూట్‌కేసులో సర్దాలని చూస్తున్నట్లు నా కళ్ళకు కట్టడంతో నవ్వు ఆగింది కాదు! ఏంచెయ్యను చెప్పు’ అంటూ మళ్ళీ నవ్వసాగారు ఆయన.

‘భలేవాడివి తాతయ్యా’ అంటూ ఈ సారి తనుకూడా నవ్వడం మొదలుపెట్టాడు జీవన్‌. కొంతసేపు అలా నవ్వి, అన్నాడు, ‘డబ్బు మాత్రమే కాదు, వస్తువులు కూడా విలువైనవే కదా తాతయ్యా! కాని వేటి స్థానం వాటిది! ఎక్కడుంచదగినవాటిని అక్కడ ఉంచి పట్టుకొస్తాను, సరా! మీరు తమాషా చేసి, నన్ను ఆటపట్టించాలని చూస్తున్నారు, అది నాకు తెలుసు’ అన్నాడు నవ్వుతూ.

‘సరేరా, అబ్బాయీ! తమాషాలు చాలు. నువ్వింక ప్రయాణానికి తయారైపో. నేనొక సూటుకేసు ఇస్తా. అవసరాన్నిబట్టి ఒకటి రెండు రోజులు ఆగాల్సి వచ్చినా, లోటు ఉండకుండా కావలసినవన్నీ సర్దుకో. వారం ఆగాల్సివచ్చినా ఆగి, పని పూర్తి చేసుకుని మరీ రావాలి సుమీ! అక్కడున్నన్నినాళ్ళూ నీకేలోటూ రాకుండా, మా కామేశం కుటుంబం చూసుకుంటుంది. నీకు ఏ ఇబ్బందీ ఉండదు’ అన్నారు యాజులుగారు.

‘సరే తాతయ్యా! అన్నీ నువ్వు చెప్పినట్లే చేస్తా. ఇక ఉండనా మరి’

యాజులుగారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు జీవన్‌.

—— —– —–

యాజులుగారు పెట్టిన ముహూర్తానికే, చేతిలో సూట్‌కేసు పట్టుకుని, ఊరికి వెళ్ళే సన్నాహంలో రైలు స్టేషన్‌ చేరుకున్నాడు జీవన్‌. ముందుగానే టిక్కెట్‌ రిజర్వేషన్‌ అయిపోడం వల్ల తిన్నగా ప్లాట్‌ఫారం మీదికి వెళ్ళిపోయాడు. దారిలో కాలక్షేపంగా చదువు కునేందుకు ఒక వారపత్రిక కొనుక్కుని, తన కంపార్టుమెంటు చూసుకుని ఎక్కేశాడు. సకాలంలో బయలుదేరింది రైలుబండి. కింది బెర్తు కావడంతో కిటికీ వార సీటులో కూర్చుని, తను కొన్న పుస్తకం తెరిచాడు జీవన్‌. కాని పుస్తకం మీద దష్టి నిలవలేదు. తోటల్నీ, వాగుల్నీ, వంకల్నీ దాటుకుంటూ; కొండల్నీ, గుట్టల్నీ తప్పుకుంటూ తనదైన రైల్‌ ట్రాక్‌ మీదుగా దూసుకుపోతోంది రైలుబండి.

‘ప్రకతి అనే చిత్రకారుడు, కాలమనే కుంచె పట్టుకుని గీసిన, దారి పొడుగునా కనువిందుగా కనిపించే సుందర దశ్యాలను చూసి ఆనందించ కుండా ఈ చదువు పిచ్చేమిటి నాకు’ అన్న ఆలోచన వచ్చింది జీవన్‌కి. వెంటనే పుస్తకం మూసి సంచీలో పెట్టేసి, కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. ఎన్నో ఊళ్ళు దాటుకుంటూ, ఆగవలసిన స్టేషన్‌ వచ్చినప్పుడల్లా ఆగి, జనాన్ని దింపుతూ, ఎక్కించు కుంటూ గమ్యం వైపుగా సాగిపోతోంది ఆ ఎక్స్‌ప్రెస్‌ రైలుబండి.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి కనిపించే, క్షణక్షణానికీ మారిపోతున్న దశ్యాలను చూస్తుంటే పొద్దు తెలియకుండానే గడిచిపోతుంది ఎవరికైనా. చీకటి పడ్డాక, వెన్నెల రాగానే వేర్వేరు అందాలతో వింత వింతలుగా కనిపించింది జీవన్‌కి వేగంగా కదిలిపోతున్న ప్రకతి.

రాత్రి తొమ్మిదయ్యాక, ప్రయాణీకులు తెచ్చుకున్నదేదో తిని, నెమ్మదిగా బెర్తులు పరుచుకుని ఒక్కొక్కరు పడుకోడం మొదలుపెట్టారు. అందరితో పాటుగా, తల్లి సర్ది ఇచ్చిన భోజనం తిని, రిజర్వు చేసుకున్న బెర్తు మీద పడుకుని నిద్రపోయాడు జీవన్‌ కూడా.

తెల్లవారి, జీవన్‌ లేచి చూసేసరికి, పీఠభూమిని విడిచి రైలుబండి మైదానంలో ప్రవేశించిందనడానికి గుర్తుగా, ఎటు చూసినా పచ్చిక బయళ్ళు, పంట పొలాలు, పళ్ళతోటలూ కనిపించసాగాయి. పుట్టి బుద్ధి తెలిశాక అంత సమద్ధిగల పచ్చదనం చూసి ఎరుగని జీవన్‌, రైలు కిటికీలోంచి అటే చూస్తూ సర్వం మరిచిపోయాడు.

పరుగెత్తే రైలుని చూసి కేరింతలు కొట్టే కుర్రాళ్ళు, గడ్డి కోస్తూ కబుర్లు చెప్పుకునే పల్లె పడుచులు, పొలంలో పనిచేసుకునే పాలేళ్ళు, గోకుల కష్ణుణ్ణి తలపించేలా అలవోకగా వేణువు ఊదుతూ, పాడి పశువుల్ని మళ్ళేసే గోపాలకులు – ఇలా రకరకాలైన మనోహర దశ్యాలు, ఉదయారుణ శోభను రెండింతలుగా చేసేవి ఎన్నెన్నో అడు గడుగునా కనిపించసాగాయి కిటికీలోంచి. ఆ సజీవ దశ్యాలు భావుకుడైన జీవన్‌కి ఎంతో నచ్చాయి.

ఎన్నెన్నో ఊళ్లను దాటుకుంటూ ముందుకు సాగిపోతోరది రైలుబండి. ఎటు చూసినా ఒడ్డు లొరసుకునే నీటితో నిండి ప్రవహించే పంటకాలువలు, అడపా దడపా దర్శనమిచ్చే నిండా పూలతో ఉన్న కలువ, తామర కొలనులు, చిరుగాలికి కూడా వయ్యారంగా తలలూపే వరిపొలాలు చూస్తూ సాగే ఆ ప్రయాణం జీవన్‌కి చాలా ఆనందాన్ని చ్చింది. పొద్దు ఎలా గడిచిందో తెలియకుండానే గమ్యానికి చేరుకుంది ఆ పొగబండి. అది నరసాపురం స్టేషన్‌లో ఆగగానే బండిలో ఉన్న జనం మొత్తం అక్కడ దిగిపోయారు. బండి ఖాళీ అయిపోయింది.

నరసాపురం ఒక ‘టెర్మినల్‌ పాయింట్‌’ కావడంతో అక్కడకు చేరుకున్న ప్రతి రైలుబండి అక్కడ నుండే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. అందరితోపాటు జీవన్‌ కూడా దిగి, ఆటో ఎక్కి నేరుగా ¬టల్‌కి వెళ్ళిపోయాడు. యాజులుగారు ముందే ఆ ప్రయాణపు తీరు తెన్నులన్నీ చెప్పి ఉంచడంతో ¬టల్లో ఒక పూటకు రూం బుక్‌ చేసుకుని, ఆ రూంలో స్నానం, పానం వగైరాలన్నీ పూర్తిచేసుకుని, కొంతసేపు విశ్రాంతి తీసుకుని, మూడయ్యేసరికి బస్‌స్టేషన్‌కి చేరుకున్నాడు జీవన్‌. చించినాడ వద్ద వశిష్ట గోదావరీ పాయ పైన ఇటీవలే కట్టిన వంతెనమీదుగా కోనసీమలో మల్లెవాడ వైపుగా ప్రయాణమై వెళ్ళే బస్సు ఎక్కాడు జీవన్‌. గోదావరి పాయలైన వశిష్ట మొదలు వైనతేయ వరకూ ప్రయాణికులను తీసుకుని, వెళుతూ, వస్తూ ఉండే బస్సు అది.

—— —– —–

రాజోలు, అమలాపురం, కొత్తపేట తాలూకాలు మూడూ కలిపితే కోనసీమ ఔతుంది. ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి నది తూరుపు కనుమల్ని విడిచి మైదానాన్ని ప్రవేశించింది. ఆపై ఐదు పాయలుగా విడిపోయి, విడివిడిగా ప్రవహించి వెళ్ళి తూరుపు సముద్రం (బంగాళాఖాతం) లో కలియడంతో, ఈ ఐదు గోదావరి పాయలకు, సముద్రానికి మధ్యలో ఉన్న త్రికోణాకారపు భూభాగాలు ఈ మూడు తాలూకాలుగా ఏర్పడ్డాయి. ఇవి చుట్టూ నీరు ఆవరిరచిన త్రికోణాకారపు భూమి కావడంతో ఈ ప్రదేశానికి అప్పుడు ‘కోణసీమ’ అనే నామం ఏర్పడిందిట. దగ్గరలోనే ఉన్న సముద్రపు ఆటుపోటుల వల్ల చాలా దూరం వరకూ గోదావరి పాయలలోని నీరు, భూగర్భజలాలు కూడా ఉప్పగానో, చప్పగానో ఉండేవిట. దానివల్ల అప్పట్లో కోణసీమ వాసులు తాగునీటికి, సాగునీటికి కూడా తెగ ఇబ్బంది పడేవారుట!

అవి బ్రిటిష్‌ వాళ్ళు భారతావనిని పాలించే రోజులు. గోదావరి జిల్లాకి సర్వేయర్‌గా వచ్చిన, సివిల్‌ ఇంజనీర్‌ ఐన సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ అనే ఆంగ్లేయుడు కోణసీమ వాసుల దుస్థితిని చుశాడు. అక్కడ భూసారాన్ని గమనించాడు. సుక్షేత్రమైన ఒండలి భూమి ఉన్నా, నీరులేక అక్కడివారు సరైన పంటలు పండించలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అర్థం చేసుకున్నాడు. ఆయనకి అద్భుతమైన ఆలోచన వచ్చింది. ధవళేశ్వరం దగ్గర గోదావరి నదికి ఆనకట్ట కట్టి, కోనసీమకు నీరు కాలవలద్వారా అందించినట్లయితే అటు ప్రభుత్వానికీ, ఇటు ప్రజలకీ కూడా బ్రహ్మాండమైన కిట్టుబాటు ఉంటుందని అర్థం చేసుకున్నాడు. అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి, గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాడు. దాంతో కోణసీమ వాసుల సాగు, తాగునీటి ఇక్కట్లు తొలగిపోయాయి. కోణసీమ కోనసీమగా మారిపోయి, ఆంధ్రప్రదేశ్‌కే నందన వనమయ్యింది.

కోనసీమలో ప్రవేశించగానే యాజులు తాతయ్య, తన జన్మభూమిని గురించి చెప్పిన కథ గుర్తు వచ్చింది జీవన్‌కి. బస్సు నడుస్తుండగా సర్వ సమద్ధితో నిండివున్న పరిసరాలను చూస్తూ, కాటన్‌ పుణ్యమా అని, కోణసీమకూ కోనసీమకూ మధ్య వచ్చిన వ్యత్యాసాన్ని తలుచుకుని ఆశ్చర్యపోయాడు జీవన్‌. ఎటుచూసినా కొబ్బరి, మామిడి, అరటి తోటలు, వరి, చెరకు పొలాలు, ఇంకా ఎన్నో రకాలైన చెట్టు చేమలతో, ఎటుచూసినా కనిపించే హరిత సౌరదర్యమే కోనసీమ!

గోధూళి వేళ కావడంతో పశువుల కాపర్లు గడ్డిబీళ్ళకు తోలుకెళ్ళిన పాడి పశువుల్ని ఇళ్ళకు మళ్ళించారు. దారికి అడ్డుపడే పశువుల మందలవల్ల బస్సు వేగం తగ్గింది. అయినా జీవన్‌ దిగవలసిన చోటు వేగంగానే వచ్చేసింది. శివాలయం పక్కనున్న రావిచెట్టు దగ్గర ఆగింది బస్సు. దిగవలసిన చోటు వచ్చిందని కండక్టర్‌ హెచ్చరించడంతో జీవన్‌ బస్సు దిగాడు. ఆపై బస్సు వెళ్ళిపోయింది. ఇక అక్కడనుండి జీవన్‌ మల్లెవాడ వెళ్ళవలసి వుంది. ఎవరైనా కనిపిస్తే దారి అడగాలనుకున్నాడు. కాని, పక్కనే దేవాలయం కనిపించే సరికి దైవదర్శనం చేసుకుందామనిపించి గుడిలోకి నడిచాడు పెట్టె పట్టుకుని.

దేవాలయంలోని స్వామి మహాశివుడు! ప్రదోషవేళ కాబోతూండడంతో, పూజకు ఏర్పాట్లు చేసుకుంటూ పూజారి గుడిలోనే ఉన్నాడు. గుడిలోని పున్నాగ చెట్లక్రింద రాలిన పూలు ఏరుకుంటూ చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. బయట చెప్పులు విడిచి, నూతిదగ్గర కాళ్ళుకడుక్కువచ్చి, నొసట విభూతి పెట్టుకుని, గర్భగుడికి ఎదురుగా ఉన్న గంట కొడుతున్న జీవన్‌ని, ఊరికి కొత్తగా వచ్చిన మనిషిగా గుర్తించి పలకరించాడు పూజారి.

‘ఊరికి కొత్తా? ఏ ఊరు బాబూ మనది’ అని.

ఆయనకి వినయంగా నమస్కరించి, ‘ఔనండీ, కొత్తే! ఇప్పుడే బస్సు దిగాను’ అంటూ తన ఊరూ పేరూ చెప్పి, తను మల్లెవాడ వెళ్ళవలసి ఉందని కూడా చెప్పి దారి అడిగాడు జీవన్‌.

పూజారికి చాలా ఆనందమయ్యింది. ఒక పట్నం కుర్రాడు తనతో ఇంత వినయంగా మాట్లాడుతాడనీ, తనకు నమస్కరిస్తాడనీ అసలు అనుకోలేదు ఆయన. జీవన్‌ మీద ఆయనకు సదభిప్రాయం ఏర్పడింది. వెంటనే, ‘దీర్ఘాయుష్మాన్‌ భవ! ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు’ అని మనసారా దీవించాడు ఆ పూజారి. అంతేకాదు, అతనికి మల్లెవాడ వెళ్ళే సులువైన దారికూడా చెప్పాడు.

‘ఇదిగో బాబూ! మల్లెవాడ ఇక్కడనుండి వెళ్ళాలంటే రెండు దారులున్నాయి. ఒకటి చుట్టుదారి. బండెక్కి, మీరు వచ్చిన రోడ్డు వెంట కొంతదూరం వెనక్కివెళ్ళి, ఆపై పక్కకి తిరిగి వేరే రోడ్డుమీదుగా వెళ్ళాలి. ఇకపోతే రెండవది దగ్గరదారి. కాలవ గట్లవెంట, పొలాలలో నుండి వెళితే మూడుమైళ్ళు సుమారుగా ఉండొచ్చు. కాని నడవాలి మరి. నువ్వు పెట్టెపట్టుకుని నడవగల్గితే చెప్పు, ఆ ఊరి ఆసామి ఒకాయన కొడుక్కి సుస్తీ చేస్తే ఆ అబ్బాయికి నయం కావాలని పూజ చేయించడానికి ఇక్కడకు వచ్చాడు. నువ్వు, ‘సరే!’ అంటే, అతన్ని జతచేసి పంపిస్తాను. పూజా సామగ్రి తేడానికి వెళ్ళాడు, కాసేపట్లో వచ్చేస్తాడు’ అన్నాడు.

ఆ మాట వినగానే, ‘నడిచి వెళ్లడం వల్ల ఆ ప్రాంతపు నైసర్గిక స్వరూపం చక్కగా చూడవచ్చు. పెట్టెలో మూడు జతల బట్టలు, ఒక తువ్వాలు తప్ప మరేమీ లేవు. మూడుమైళ్ళైతే నేను తేలిగ్గా నడవగలను, ఆపాటి దూరం రోజూ నేను ఆరోగ్యం కోసమని నడుస్తూనే ఉంటా కదా’ అనుకున్న జీవన్‌కి చాలా సంతోషమయ్యింది. వెంటనే నడిచి వెళ్ళడానికి ఒప్పేసుకున్నాడు.

‘ఇంతకీ ఆ ఊరు ఏం పనిమీద వెడుతున్నావు బాబూ? బంధువుల ఇంటికా?’

‘నాకని బంధువులెవరూ లేరండి అక్కడ. తెలిసినవారి పనిమీద అక్కడకి వెళ్ళాల్సి వచ్చింది. నాకు తెలిసిన వాళ్ళకి తెలిసినవాళ్ల ఇంటికి వెడుతున్నా. ఎప్పుడూ నేనీవైపుకి వచ్చినవాడిని కాను, అంతా కొత్తగా ఉంది’ అన్నాడు జీవన్‌.

పూజారి గుడి పనులు చేసుకుంటూనే మాటాడుతుండగా, మండపంలో స్తంభానికి ఆనుకుని కూర్చుని విశ్రాంతి తీసుకుంటూనే పూజారితో కబుర్లు చెపుతున్నాడు జీవన్‌. అంతలో పూజాసామాగ్రి తీసుకుని మల్లెవాడ ఆసామి రానే వచ్చాడు. అతని పేరు రామారావు.

(ఇంకా ఉంది)

 – వెంపటి హేమ (కలికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *