కలిసుంటే కలదు సుఖం !

కలిసుంటే కలదు సుఖం !

రాము, రాజు ఇద్దరూ మంచి స్నేహితులు. మూడవ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇళ్లు ఒకే కాలనీలో ఉంటాయి. రోజూ బడికి కలిసే వెళతారు, కలిసే తిరిగొస్తారు.

అయితే ఒక రోజు సాయంత్రం రాము బడి నుంచి ఒంటరిగా రావడాన్ని గమనించిన రమ ‘ఏమైంది రాము ఈ రోజు నువ్వు స్కూల్‌ నుంచి ఒంటరిగా వచ్చావు. రాజు ఎక్కడికెళ్లాడు ?’ అని అడిగింది కొడుకుని.

‘ఈ రోజు నుండి నేను రాజుతో మాట్లాడను. వాడితో నా దోస్తీ కటీఫ్‌’ అన్నాడు రాము.

‘ఏమైంది రా ? ఎందులా అంటున్నావు ?’ అడిగింది రమ.

‘వాడు నా పెన్సిల్‌ విరగ్గొట్టాడు. పైగా విరగ్గొట్టలేదని అబద్ధం ఆడుతున్నాడు’ అని చెప్పాడు. రాము మాటలు విన్న రమ ‘నువ్వు వాణ్ణి ఏమీ అనకుండానే వాడు నీ పెన్సిల్‌ విరగ్గొట్టాడా ?’ అని అడిగింది.

‘అవును. నా తప్పు ఏం లేదు. నేను వాణ్ణి ఏం అనలేదు’ చెప్పాడు రాము.

‘అయితే నీ తప్పు ఏం లేదంటావ్‌ ?’ మళ్ళీ అడిగింది రమ.

‘లేదమ్మా’ ఈ సారి కాస్త తడబడుతూ చెప్పాడు రాము. రమకు విషయం అర్థమైంది. ఆ మరుసటి రోజు రాము బడికి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. కాని ఒంటరిగా వెళ్లాలంటే మనసొప్పడం లేదు.

‘ఏమైంది రాము ? ఎవరి కోసం ఎదురుచూస్తున్నావు ?’ అడిగింది తల్లి. ‘రాజు కోసం చూస్తున్నానమ్మా !’ సమాధానమిచ్చాడు రాము. ‘వాడితో నీ దోస్తీ కటీఫ్‌’ అన్నావు కదా ! మరి ఎలా వస్తాడనుకున్నావ్‌ ?’ అడిగింది రమ.

నిన్న జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉందమ్మా. నేనే ముందు వాడి పుస్తకం చింపాను. తర్వాత వాడు కోపంతో నా పెన్సిల్‌ విరగొట్టాడు. నేను నీకు అబద్దం చెప్పాను. నువ్వే ఎలాగైనా మా ఇద్దరిని కలపాలమ్మా!’ అంటూ తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు రాము.

‘చూశావా రాము ? అబద్దం చెప్పితే మనమే నష్టపోతాం. ఇంకెప్పుడు నువ్వు అబద్దం చెప్పొద్దు. తోటి స్నేహితులతో కలిసి, మెలిసి ఉండాలి. దీనికి నువ్వు సరే అంటేనే నేను మీ ఇద్దరిని కలుపుతాను’ చెప్పింది రమ. ‘సరే’ అన్నాడు రాము.

ఇంతలో రాజు బ్యాగ్‌ వేసుకొని రాము వాళ్ల ఇంటికి వచ్చాడు. రాము ఆశ్చర్యపోయాడు.’నేను నిన్ననే రాజు వాళ్ల ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పాను’ అంది రమ. రాము చాలా సంతోషించాడు.

రాము, రాజు ఇద్దరూ ఒకరి భుజాల మీద మరొకరు చేతులేసుకొని ఆనందంగా బడికి బయల్దేరారు.

– కె.వి.లక్ష్మణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *