అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి

అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నంద్యాల నుండి 42 కి.మీ. దూరంలో అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంది. 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి తిరుమల.., రెండు అహోబిలం..

నరసింహ క్షేత్రాల్లో అతి విశిష్టమైన ఈ అహోబిలం క్షేత్రం నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అనగా 9 నారసింహ రూపాలు ఒకే చోట ఉంటాయి. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వామి స్వయంభువుగా గుహలో వెలిసాడు కావున అది అహోబిలం అయ్యింది. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 28 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది.

దిగువ అహోబిలంలో వెలసిన ప్రహ్లాద వరదుని సన్నిధానం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు, కార్యకలాపాలకు కేంద్రం. ఈ క్షేత్రం ఎల్లప్పుడూ వేద ఘోషలతో, దివ్య ప్రబంధ సూక్తులతో, అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది.

తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలం క్షేత్ర అభివృద్ధికి నాడు ఎందరో రాజులు సేవలందించారు. వారిలో పల్లవులు, చోళులు, విద్యానగర రాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డిరాజులు మొదలైనవారున్నారు.

ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్‌ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద్ద అహోబిలం, భార్గవ తీర్థం, నవ నారసింహ క్షేత్రం అనే పేర్లున్నాయని పురాణాలు చెబుతున్నాయి.

దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుని దర్శించుకొని ఇక్కడికి 8 కి.మీ. దూరంలో ఉన్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగంలో వెలసిన నరసింహుని దర్శించుకొని, భవనాశి జలాలతో సేద తీరి ఆ తర్వాత నవ నారసింహ క్షేత్రాలను దర్శించు కొని ప్రహ్లాద బడిలో బండ మీద నుంచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది, ఉగ్ర స్థంభ ప్రదక్షిణ లతో పునీతులై ఈ తీర్థయాత్రను ఫలవంతం చేసుకోవచ్చు.

ఎగువ అహోబిలంలో ఉన్న మూలవిరాట్‌ను ఉగ్ర నరసింహస్వామి, అహోబిలం నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతాల మధ్య ఈ ఆలయముంది.

నవ నారసింహ ఆలయాలు:

భార్గవ నారసింహుడు : దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరంలో గల భార్గవ తీర్థం వద్ద ఈ స్వామి కొలువై ఉన్నాడు. భార్గవ రాముడు ఈ ప్రాంతంలో తపస్సు చేశాడు కనుక ఇక్కడ వెలసిన స్వామిని భార్గవ రామునిగా పిలుస్తారని ప్రతీతి.

యోగానంద నారసింహుడు : దిగువ అ¬బిలానికి ఆగ్నేయంగా 2 కి.మీ. దూరంలో యోగానంద నారసింహస్వామి గుడి ఉంది.

ఛత్రవీటి నారసింహుడు : మర్రిచెట్టు నీడలో గర్భాలయ ముఖ మండపాలతో నిర్మించిన ఈ ఆలయం దిగువ అహోబిలానికి 4 కి.మీ. దూరంలో ఉంది.

మాలోల నారసింహుడు : ఎగువ అహోబిలంలోని ప్రధాన ఆలయానికి 2 కి.మీ. దూరంలో ఈ స్వామివారి ఆలయం ఉంది. మాలోలుడంటే లక్ష్మీలోలుడని అర్థం.

వరాహ నారసింహుడు : ఈ స్వామిని క్రోడా నారసింహుడని కూడా పిలుస్తారు. ఎగువ అ¬బిలానికి 1 కి.మీ. దూరంలో కాలక్షేప మండపం దగ్గర గల గుహలో ఈ స్వామి కొలువుదీరాడు. ఇక్కడ స్వామివారి తల వరాహ రూపంలో, శరీరం మానవ రూపంలో, తోక సింహం తోక వలె ఉండి రెండు చేతులు కలిగి ఉంటాడు.

కారంజ నారసింహుడు : ఎగువ అహోబిలానికి 2 కి.మీ. దూరంలో కారంజ వృక్ష నీడలో ఈ ఆలయం కలదు.

పావన నారసింహుడు : ఎగువ అహోబిలంలోని గుడికి దక్షిణ దిశగా 6 కి.మీ. దూరంలో పావనీ నదీ తీరంలో ఈ స్వామి కొలువుదీరాడు.

ఉగ్ర(జ్వాలా) నారసింహుడు : మాలోల నారసింహుని గుడికి 2 కి.మీ. దూరంలో అచల ఛాయ మేరు పర్వతం మీద దుర్గమ అరణ్యంలోని పర్వతం మీద స్వామి ఉగ్రుడై హిరణ్య కశ్యపుని పొట్టను చీల్చినట్లు ప్రతీతి. ఇక్కడ భవనాశి నది ప్రవహిస్తోంది.

ఈ విధంగా అహోబిలం నారసింహస్వామితో కలిపి మొత్తం తొమ్మిది నారసింహ ఆలయాలు ఒకే దగ్గర కొలువుదీరాయి. అందుకే ఈ క్షేత్రానికి చాలా ప్రాధాన్యం ఉంది.

ప్రహ్లాద బడి

ఇదో చిన్న గుహ. దీనినే ప్రహ్లాద బడి అంటారు. ఈ గుహకు ఎదురుగా కొండపై నీరు పడుతుంది. ఈ ప్రాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుహ లోనికి ఒకసారి కేవలం 7 గురు మాత్రమే వెళ్లొచ్చు.

ఉగ్ర స్థంభం

ఇది అహోబిలంలోని ఎత్తైన కొండ. దీనిని దూరం నుంచి చూస్తే ఒకరాతి స్థంభం మాదిరి కనిపిస్తుంది. అయితే దీని దగ్గరికి చేరుకోవడం చాలా కష్టం. కాని ధైర్యం చేసి అక్కడికి వెళితే భక్తులకు ఒక నూతన అనుభూతి కలుగుతుంది. ఈ కొండ మీద ఒక కాషాయ జెండా, నరసింహస్వామి పాదాలు ఉంటాయి. ఈ కొండ నుంచే నరసింహస్వామి ఉద్భవించాడని ప్రతీతి. అయితే ఇక్కడికి ఒంటరిగా వెళ్ళలేం.

అహోబిలం మఠం చాలా ప్రసిద్ధి చెందింది. ఇది వైష్ణవ మత వ్యాప్తిలో ప్రముఖమైన పాత్ర పోషించింది. సంకీర్తనాచార్యుడు అన్నమయ్య ఇక్కడే దీక్ష పొంది మంత్రోపదేశం పొందాడని ప్రతీతి. ఇది దిగువ అహోబిలంలో కలదు.

అహోబిలం క్షేత్రంలో ప్రధాన నరసింహస్వామి ఆలయం చాలా అందంగా శిల్పకళతో విరాజిల్లుతూ ఉంటుంది. మఠంలోను నరసింహస్వామి విగ్రహాలు కనిపిస్తాయి.

‘చెంచు లక్ష్మి’ కథ అహోబిలంలోనే పుట్టింది. ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని చెంచులు అధిక సంఖ్యలో దర్శిస్తుంటారు. నల్లమల కొండలు శేషుని అవతారమని.. శేషుని శిరస్సుపై తిరుమల, నడుమ అహోబిలం, తోక చివరన శ్రీశైలం ఉన్నాయని ప్రతీతి. ప్రతాపరుద్ర చక్రవర్తి ఈ ఆలయానికి బంగారంతో ఉత్సవ విగ్రహాన్ని చేయించి ఇచ్చాడని పురాణోక్తి.

ఎలా వెళ్లాలి ?

హైదరాబాద్‌ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలున్నాయి. అక్కడి నుంచి నంద్యాలకు బస్సుల్లో వెళ్లొచ్చు. నంద్యాల నుంచి ప్రైవేట్‌ వాహనాల్లో గాని, ఆర్‌టిసి బస్సుల్లో గాని అహోబిలం చేరుకోవచ్చు.

– ఎస్‌.వి.ఎస్‌.భగవానులు, 9441010622

– రచయిత విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి. ట్రాన్స్‌కో, ఒంగోలురి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *