అదరహో! ఖజురహో!!

అదరహో! ఖజురహో!!

భారతదేశంలో శిల్పకళా సంపదతో విలసిల్లు తున్న గుడులు, గోపురాలు, ఆరామాలు చాలా ఉన్నాయి. వాటిలో ‘ఖజురహో’ ఒకటి. ఇది మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌కి 27 మైళ్ల దూరంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఖర్జూర చెట్లు ఎక్కువగా ఉన్న కారణంగానే దీనికి ‘ఖజురహో’ అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతారు.

ఇది 950-1050 ప్రాంతంలో ‘చందేల’ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్ధిల్లింది. ‘చందేల’ సామ్రాజ్య స్థాపకుడైన చంద్రవర్మ ఇక్కడ 10వ శతాబ్దంలో ఆలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. అతని వారసులు ఆ నిర్మాణాలను కొనసాగించి పూర్తి చేశారు. చంద్రవర్మ తన తల్లి కోరిక మేరకే ఖజురహో దేవాలయాల నిర్మాణాన్ని ప్రారంభించినట్లుగా చరిత్ర చెబుతోంది.

మనదేశంలో ఖజురహోలోని ఆలయ నిర్మాణాలు అద్భుత సృష్టి అని చరిత్రకారులు పేర్కొన్నారు. ఈ అద్భుతాన్ని పూర్తి చేయడానికి ఇంచుమించు నూరేళ్లు పట్టిందని ఒక అంచనా! ఒకప్పుడు ఇక్కడ 85కి పైగా ఆలయాలుండేవి. ప్రస్తుతం 25 మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయాలు అద్భుతమైన శిల్పకళకు ప్రతీకలుగా నిలిచి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తు న్నాయి.

ఖజురహోలోని శిల్పాలకు ఒక ప్రత్యేకత ఉంది. పూర్వం గురుకుల నియమం ప్రకారం ప్రతి విద్యార్థికీ పెళ్లికి ముందు 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం తప్పనిసరి. నాటి విద్యార్థులు బ్రహ్మచర్యాన్ని పాటించే సమయంలో ఖజురహో శిల్పాలను తిలకించి, అధ్యయనం చేసి తద్వారా భవిష్యత్తులో గార్హస్థ్య జీవితంలో అవసరమైన జ్ఞానాన్ని పొందేవారు. ప్రాపంచిక సుఖాలలో అశాశ్వతత్వాన్ని సైతం ఈ శిల్పాల ద్వారా తెలుసుకునేవారు. ఈ విధంగా సంసార జీవితం తరువాత సత్యాన్వేషణ పథంలో అవసరమైన వైరాగ్యాన్ని వారు యుక్త వయసులో ఉండగానే తెలుసుకునేవారు. శారీరక వాంఛలు మనిషిని ఏ గమ్యానికీ చేర్చలేవని చెప్పడమే ఈ ఆలయాల నిర్మాణం వెనుక గల ప్రధానమైన ఉద్దేశం. అందుకు తగ్గట్లుగానే ఇక్కడి ప్రాకారాలపై పలు విధాలైన భంగిమలలో శిల్పాల్ని జీవం ఉట్టిపడే విధంగా మలిచారు.

ఈ ఆలయం అంతర్భాగంలో ఏ దేవుని విగ్రహం కనిపించదు. చందేల రాజుల కాలంలోనే హిందూ- జైన మతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ రాజపుత్రులు హిందువులే అయినప్పటికీ ప్రజల్లో అనేకమంది జైనమతస్థులు ఉండటంతో పరమత సహనాన్ని పాటించి హిందూ దేవాలయాలతో పాటు జైన ఆలయాలు కూడా నిర్మించారు. మొత్తం 85 దేవాలయాలను నిర్మించి శిల్పకళను పోషించారు. వాటిలో కొన్ని శిథిలమైపోగా, మరికొన్ని మనదేశ శిల్పకళా సంపద గొప్పదనాన్ని చాటేటట్లు నిలిచి ఉన్నాయి.

కందరీయ మహాదేవాలయం

ఖజురహో పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ‘కందరీయ మహాదేవాలయం’. దాదాపు 31 మీటర్ల ఎత్తులో ఉన్న గోపురంతో చందేల రాజుల దీన్ని నిర్మించారు. గుడి బయటా, లోపల కలిపి దాదాపు 800లకు పైగా అద్భుత శిల్పాలను మనం ఇక్కడ చూడొచ్చు. వాత్సాయన కామసూత్రాలకు సంబంధించిన పలు భంగిమలు ఈ ఆలయంపై కనిపిస్తాయి. దేవతల ప్రతిమలు, స్త్రీ, పురుషుల శిల్పాలు, సంగీత ఆలాపన చేస్తున్న వాద్యబృందం లాంటి మనోహర శిల్పాలెన్నో మనకు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి. ఇక్కడి ఖాండవ్యమహా దేవ లింగం 102 అడుగుల పొడవు, 66 అడుగుల వెడల్పు, 109 అడుగుల ఎత్తు ఉంటుంది.

లక్ష్మణాలయం

ఇక్కడి మరో గొప్ప నిర్మాణం ‘లక్ష్మణాలయం’. దీన్ని 930-950ల మధ్య నిర్మించారు. పురాణాలలోని గుర్రాలు, ఏనుగులు, వృక్షాలు, వీరాధివీరుల శిల్పాలు ఈ దేవాలయంపై అపురూపంగా చెక్కారు.. ఆలయ ప్రవేశ ద్వారంపై శంకరుడు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి విగ్రహాలు అద్భుతంగా రూపొందించారు. ఈ దేవాలయానికి సమీపంలోనే వరాహావతారాంలో ఉన్న శ్రీమహావిష్ణువుని దర్శించుకోవచ్చు.

కందరీయ ఆలయానికి దగ్గరలో ‘దేవీ జగదంబా’ ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని నల్లరంగుతో కాళీమాతగా రూపొందించారు.

‘చిత్రగుప్త’ ఆలయంలో ఏడు గుఱ్ఱాలపై అధిరోహించిన సూర్యభగవానుని విగ్రహం ప్రేక్షకులను నువిందు చేస్తుంది. దశావతారాలకు సంబంధించి పది తలల శ్రీమహావిష్ణువు విగ్రహం, నర్తకీమణుల నృత్యదృశ్యాలు, యుద్ధం, ఊరేగింపుల చిత్రాలు రమణీయంగా దర్శనమిస్తుంటాయి.

విశ్వనాథ నందీశ్వరాలయంలో శివుడు, ఆయన వాహనమైన నందీశ్వరుని విగ్రహాలను దర్శించవచ్చు. బ్రహ్మలోక దృశ్యాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. వరాహస్వామి భూమాతను రక్షిస్తున్న వైనం ‘మాతాంగేశ్వరాలయం’లో చూడవచ్చు. చిన్న చిన్న విగ్రహాలతో అతినిరాడంబరగా ఈ ఆలయం కనిపిస్తుంది.

ఖజురహోలోని ఆలయాల్లో ‘పార్శ్వ దేవాలయం’ అతిపెద్దది. ఇది జైన దేవాలయం. తొలుత ఆదినాథున్ని ఇక్కడ ప్రతిష్టించారు. అనంతరం ఆ విగ్రహాన్ని తొలగించి పార్శ్వనాథమూర్తిని ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ దాదాపు నాలుగున్నర అడుగుల ఆదిత్యనాథుని విగ్రహం ఉండేది. శ్రీమహావిష్ణువు అవతారమైన వామనుని కోసం దీన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇది జావరి ఆలయం కంటే పురాతనమైనది. ఈ ఆలయ గోడలపై వివిధ భంగిమల్లో అందాల భామల విన్యాసాలు శిల్పాల రూపంలో కనిపిస్తాయి. బ్రహ్మదేవునికి ఆలయం లేదని చెబుతుంటారు. కాని రాజస్థాన్‌లోని ‘పుష్కర్‌’లో బ్రహ్మకు ఆలయం ఉంది. అదేవిధంగా ఖజురహోలో కూడా చతుర్ముఖునికి ఆలయం ఉంది. దీన్ని నల్లరాయి, కారురాతితో కలిపి నిర్మించారు.

దీనికి సమీపంలోనే క్రీ.శ. 922లో నిర్మించిన ‘హనుమాన్‌’ దేవాలయం, 2.5 మీటర్ల ఎత్తులో ఉన్న పవన తనయుడి విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చు. ఖజురహో గ్రామానికి దక్షిణాన 4 కిలోమీటర్ల దూరంలో మరికొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ‘దూలదేవ్‌’ ఆలయం. దీని గోపురం గుండ్రని రాళ్లతో విచిత్రంగా నిర్మించారు. రతిభంగిమల్లో కనిపించే శృంగార శిల్పాలకు ఆలవాలంగా ఈ దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ ‘చతుర్భుజాలయం’లో మూడు మీటర్ల ఎత్తుగల విష్ణుమూర్తి విగ్రహం నాలుగు చేతులతో సుందరంగా దర్శనమిస్తుంది.

క్రీ.శ. 1808లో కెప్టెన్‌ టి.ఎస్‌.బర్ట్‌ ఈ అద్భుత దేవాలయ సముహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. భారత్‌లోని అన్ని దేవాలయాల వైభవ ప్రాభవం ఖజురహో దేవాలయ సముదాయంలో దర్శించవ్చని తన నివేదికలో పేర్కొని ఈ ప్రాంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఖజుర¬లో ప్రతి సంవత్సరం ‘జాతీయస్థాయి నృత్యోత్సవాలు’ నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా నృత్య కళాకారులు ఈ పోటీలలో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తుంటారు. పలు సంప్రదాయ నృత్య కళాకారులు ఈ పోటీలలో పాల్గొని మనదేశ సంప్రదాయ నృత్యాలను ప్రపంచానికి తెలియ జేస్తుంటారు.

శిల్పాలు, ఆలయాలే కాకుండా ఇంకా అనేక అపురూప కళాఖండాలను ఇక్కడి ‘ధుబేలా’ మ్యూజియంలో భద్రపరిచి యాత్రికుల సందర్శనార్థం ఉంచారు. ఉత్కృష్ఠమైన శిల్పకళతో భాసిల్లుతూ ‘అదరహో’ అనిపించే ఖజురహో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఈ ప్రాంతాన్ని ‘యునెస్కో’ ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సైతం చేర్చింది.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *