చైనాకు గుణపాఠం చెపుదాం

చైనాకు గుణపాఠం చెపుదాం

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆం.ప్ర.సహప్రాంత ప్రచారక్‌ విజయాదిత్య


వేదికపై ఎడమ వైపు నుంచి ఆం.ప్ర. సహప్రాంత ప్రచారక్‌ విజయాదిత్య, వర్గాధికారి మాధవస్వామి, మాట్లాడుతూన్న వారు ముఖ్యఅతిథి కాట్రగడ్డ లక్ష్మినరసింహారావు, ప్రాంత సహసంఘచాలక్‌ భూపతి రాజు శ్రీనివాసరాజు.


చైనా మన పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నదని, మన ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా వారికి తగిన గుణపాఠం చెప్పాలని  రాష్ట్రీయస్వయంసేవక్‌ సంఘ్‌ ఆంధ్రప్రదేశ్‌ సహప్రాంత ప్రచారక్‌ విజయాదిత్య అన్నారు.

2017 మే 26 న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కిలోని శ్రీ విజ్ఞానవిహార పాఠశాల ఆవరణలో జరిగిన ప్రథమవర్ష శిక్షావర్గ (శిక్షణ శిబిరం) ముగింపు కార్యక్రమం (సార్వజనికోత్సవం) లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని ప్రసంగించారు.

శిక్షావర్గ యోగ శిబిరమే

విజయాదిత్య ఇంకా ప్రసంగిస్తూ – ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిర్వహించే శిక్షణ శిబిరాలు (శిక్షావర్గలు) ఒక విధంగా యోగ శిబిరాలేనని, అక్కడ నేర్చుకునేవి యోగ సాధన లాంటివే అని, సామాజిక పరంగా ఆలోచిస్తే ఈ శిక్షణ శిబిరాలు రిపేరింగ్‌ షెడ్‌లని అన్నారు. మనిషి తాను సృష్టించుకున్న దానికి తానే బానిసయ్యాడని, ఉదాహరణకు ఆధునికంగా వస్తున్న సాంకేతికత అంటూ ఈ రోజు మనిషి ఆధునిక సౌకర్యాలు లేకుండా జీవించలేకపోవడానికి కారణం నిగ్రహశక్తి లేకపోవటమేనని అన్నారు. ఎప్పుడూ మనిషి సాధన చేయాలని, సంతులనము, సాధన ఈ రెంటిని యోగం అంటారని, ఈ యోగ సాధన ద్వారా నిగ్రహశక్తి సాధించాలని అన్నారు.

యోగాను నేడు ప్రపంచమంతటా 170 దేశాలు స్వీకరించాయని అన్నారు. అమెరికాలో యోగాకు గొప్ప ఆదరణ ఉందని, ప్రతి ఏటా యోగాను ఆచరించే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. యోగ సాధన ద్వారా వ్యక్తిలో నిష్ఠ పెరుగుతోందని, ధ్యేయనిష్ట కలిగిన వ్యక్తి గుండెలో విశ్వాసం ఉంటుందని దీని ద్వారా అతడు ఎంతటి కార్యానైన్నా సాధించగలడని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌లో ఇదే విషయాలను సాధన చేస్తామని ఆదిత్య చెప్పారు.

నిగ్రహం అంటే ఏమిటి ?

నిగ్రహాన్ని కలిగి ఉండటం ఎలా సాధ్యం? అని ప్రశ్నిస్తూ ఆయన సియాచిన్‌లో మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలో మంచుకొండలపై కాపలా కాచే సైనికునికి గుండెల నిండా  దేశభక్తి ఉండటం మూలంగా చలిని కాసే నిగ్రహశక్తి వస్తుందని అన్నారు. ప్రతి గుండెలో ధ్యేయ శక్తిని అంటే ప్రతి వ్యక్తిలో భారతీయతను, ప్రతి గుండెలో భారత మాతను, ప్రతి వ్యక్తి కణకణంలో దేశభక్తిని నింపటమే ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న పని. దీని ద్వారా ప్రతి వ్యక్తి నిగ్రహాన్ని కలిగి సమాజ కళ్యాణం కోసం పనిచేస్తారని విజయాదిత్య పేర్కొన్నారు.

శక్తి నిర్మాణమే సంఘం పని

జపనీయుల గురించి ఉదాహరణ చెప్తూ జపనీ యులు తమ దేశానికి లాభం చేకూర్చే విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలను సైతం వదిలి తమ దేశం కోసం పాటుపడతారని కాని మన దేశంలో కేవలం మనుషులుగానే ఆలోచిస్తారని తమ వ్యక్తిగత స్వార్థప్రయోజనాలకే పెద్దపీట వేస్తారని, దేశం ప్రయోజనాల గురించి ఆలోచించరని కేవలం ఇక్కడ మనుషులు మాత్రమే తయారవుతున్నారని చెప్పారు. జాతీయ భావన కలిగిన వ్యక్తులను నిర్మాణం చేయటం కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ గత 9 దశాబ్దాలుగా పనిచేస్తోందని మనిషిని మనిషిగా కాకుండా జాతీయభావం కలిగిన వ్యక్తిగా తయారుచేయటం తద్వారా ఒక సంఘటిత శక్తిని నిర్మాణం చేయటం సంఘం పని అని ఆదిత్య వివరించారు.

ఐక్యత లేనందువల్లే..

ఎంతోమంది మహానీయులు జన్మించిన దేశం, అసమాన ప్రతిభా పాటవాలు  కలిగిన దేశం మనది. అయినప్పటికి 800 సంవత్సరాల కాలం మనం బానిసత్వంలో మ్రగ్గిపోయాం. అందుకు కారణం మనలో ఐక్యత, సంఘటిత శక్తి లేకపోవటమే అని ఆదిత్య తెలిపారు. 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ముస్లింలు, ఆ తరువాత బ్రిటిషువారు మనల్ని బానిసలను చేసి పరిపాలించారని ఈ సందర్భంగా ఆదిత్య గుర్తుచేశారు. 20వ శతాబ్దంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగిందని, విదేశాల్లో మనల్ని విడదీయటం కోసం అనేక కుతంత్రాలను రచించారని, ఇంకా రచిస్తున్నారని, ఈ విషయాన్ని ‘భారత్‌ను విచ్ఛినం చేసే శక్తులు’ అనే పుస్తకంలో విశదీకరించారని, అందరూ ఆపుస్తకాన్ని చదవాలని ఆయన కోరారు. సమాజం అంతా ఒక సంఘటిత శక్తిగా నిర్మాణం అయితే ఎటువంటి దేశ విచ్ఛినకర శక్తినైనా సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని ఆదిత్య అన్నారు.

సమరసత సాధించాలి

గోరక్షణ గురించి మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించడం వల్ల ఉపయోగం ఉండదని, గోవు పట్ల మనలో శ్రద్ధ కలిగినప్పుడు మాత్రమే గోరక్షణ వీలవుతుందని అన్నారు.

నేడు గ్లోబలైజేషన్‌ కారణంగా కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మన కుటుంబాలు విచ్ఛినం కాకుండా చూసుకునే బాధ్యత మనందరిది అని అన్నారు. దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెబుతున్న ప్రస్తుత రోజుల్లో కూడా ఇంకా అంటరానితనం, కుల అసమానతలు పోలేదని ఆయన అన్నారు. ఈరోజు మన మధ్యన ఉన్న అంటరానితనం, అసమానతల కారణంగా మన హిందూ బంధువులు క్రైస్తవ మతంలోకి మారిపోతు న్నారని కాబట్టి ధర్మజాగరణ చేయటం, సామాజిక సమరసతను కాపాడటం ద్వారా మన హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని అన్నారు. అదేవిధంగా గ్రామాలు వికాసం చెందాలని అన్నారు.

చైనా దుర్మార్గం

ఈ రోజు చైనా మన ప్రాంతాలను దురాక్రమణ చేయటం కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న మన భూభాగాలకు తమ పేర్లను పెడుతోందని దీనికి కారణం ఆ ప్రాంతాలను తమ భూభాగాలుగా చెప్పుకోవడానికి, తద్వారా ప్రపంచాన్ని నమ్మించడానికే అని ఆదిత్య అన్నారు.

చైనా మనపట్ల అనుసరిస్తున్న దుర్మార్గాలను ఆయన విశదీకరిస్తూ – భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం రాకుండా అడ్డుపడుతోందని, మన దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వాడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయకుండా కాపాడుతోందని అన్నారు.  చైనా గ్లోబలైజేషన్‌ పేరుతో మన దేశంలోకి 62 బిలియన్‌ డాలర్ల వస్తువులను చొప్పిస్తోందని, అవి చౌకగా ఉన్నాయని మన ప్రజలు వాటిని కొంటున్నారని, చైనా వస్తువులు కొనటం ద్వారా చైనాకు మనం ఇచ్చే ప్రతి పైసాను వారు మన సైనికులపైకి తూటాలుగా వినియోగిస్తున్నారని, కాబట్టి ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించాలని కోరారు. ప్రభుత్వాలకు అంతర్జాతీయ పరంగా ఇబ్బందులున్నప్పటికీ ప్రజలు వారి వస్తువులను బహిష్కరించడం ద్వారా చైనాకు తగిన గుణపాఠం చెప్పవచ్చని అంటూ ఆదిత్య ముగించారు.

విశ్వాసం అవసరం : ముఖ్య అతిథి

అంతకుముందు సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కాట్రగడ్డ లక్ష్మినరసింహారావు మాట్లాడుతూ జీవితంలో అందరికీ క్రమశిక్షణ అవసరమని అన్నారు. కార్యకర్తలకు క్రమశిక్షణతోపాటుగా మనం చేసే పనిమీద విశ్వాసం ఉండాలన్నారు.

వేదికపై ప్రాంత సహసంఘచాలక్‌ శ్రీభూపతి రాజు శ్రీనివాసరాజు, వర్గాధికారి మాధవస్వామి ఉన్నారు. సభాకార్యక్రమానికి ముందు 20 రోజులుగా శిక్షణలో భాగంగా నేర్చుకున్న అనేక శారీరిక, యోగ అంశాలను స్వయంసేవకులు ప్రదర్శించి, సందర్శకు లను అలరించారు.

ఈ ముగింపు కార్యక్రమంలో ప్రాంత ప్రచారక్‌ భరత్‌కుమార్‌తో పాటు ఇతర ప్రాంత స్థాయి కార్యకర్తలు, వివిధ జిల్లాల నుండి వచ్చిన స్వయం సేవకులు, పరివార క్షేత్రాలకు చెందిన రాష్ట్ర, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *