సుధాకర్‌ పైప్స్‌ అధినేత కన్నుమూత

సుధాకర్‌ పైప్స్‌ అధినేత కన్నుమూత

ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్‌ పీవీసీ పైప్స్‌ అధినేత, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మీలా సత్యనారాయణ (89) అనారోగ్యంతో కన్నుమూశారు. వద్ధాప్యం వల్ల ఉత్పన్నమైన అనారోగ్య సమస్యలతో పక్షం రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్‌ 25న తుదిశ్వాస విడిచారు. నిరుపేద కుటుంబంలో జన్మించి శ్రమనే నమ్మి నిరంతరం పరిశ్రమించి పారిశ్రామికవేత్తగా ఎదిగారు మీలా సత్యనారాయణ.

స్వాతంత్య్రం అనంతరం రెండు పర్యాయాలు మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసి వేతనంతోపాటు ఎలాంటి సదుపాయాలను వినియోగించుకోకుండా పనిచేసి నిస్వార్ధ నేతగా పేరుగడించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1931 జనవరి 31న సూర్యాపేట మండలం సోలిపేట గ్రామంలో మీలా రామయ్య, రామనర్సమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను గ్రామంలో పూర్తిచేసి ఆ తర్వాత సూర్యాపేట, హైదరాబాద్‌లో విద్యనభ్యసించారు.

1956లో సూర్యాపేటకు వచ్చి చిరు వ్యాపారాలు చేశారు. ఆ తర్వాత రైస్‌, ఆయిల్‌ మిల్లుల్లో భాగస్వాములుగా చేరారు. 1970 ఆగస్టు 15న రూ.28 వేల పెట్టుబడితో ముగ్గురు కార్మికులతో సుధాకర్‌ పీవీసీ పరిశ్రమను స్థాపించారు. రైతులకు నాణ్యమైన పైపులను అందిస్తూ అనతికాలంలోనే వినియోగదారుల మన్ననలు పొందారు. అలా నిరంతరం శ్రమిస్తూ అంచెలంచెలుగా పరిశ్రమను విస్తరించారు. నేడు ఈ పరిశ్రమ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, ఒడిషాలకు విస్తరించి పాతికవేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. 1988, 2006లలో సూర్యాపేట మున్సిపాల్టీ చైర్మన్‌గా రెండు పర్యాయాలు ఎన్నికయ్యారు. చైర్మన్‌గా వేతనం తీసుకోకుండా మున్సిపాలిటీ నుండి వాహనం తదితర ఎలాంటి బిల్లులను పొందకుండా తన సొంత ఖర్చులతోనే పనిచేసి అరుదైన గుర్తింపును పొందారు. సూర్యాపేటలో నెలకొన్న నీటి ఎద్దడి నివారణకు వాటర్‌ గ్రిడ్‌ను నిర్మించారు. ముక్కుసూటి మనస్తత్వంగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. సూర్యాపేటతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలకు భారీ ఎత్తున విరాళాలు అందించి సామాజిక సేవకుడిగా గుర్తింపు పొందారు. ఉత్తమ పారిశ్రామికవేత్తగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డుతోపాటు పలు అవార్డులు, సత్కారాలను పొందారు. అదేవిధంగా స్వాతంత్య్ర సమరయోధునిగా మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ చేతులమీదుగా సత్కారం పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *