నవ గోవా నిర్మాత పారికర్‌

నవ గోవా నిర్మాత పారికర్‌

2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని ప్రాధామ్యాలు నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశ భద్రత. యూపీఏ ప్రభుత్వంలో అంతగా పట్టించుకోని శాఖలలో ఒకటి రక్షణ శాఖ. కానీ మోదీ ఆ శాఖను బలోపేతం చేయవలసిన అవసరాన్ని వెంటనే గుర్తించారు. అందుకే గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పారికర్‌ (డిసెంబర్‌ 18, 1955-మార్చి 17, 2019) ను ఏరికోరి తెచ్చి ఆ పదవిలో ప్రతిష్టించారు. ఆయన మూడేళ్లు ఆ పదవిలో ఉన్నారు. మోదీ హయాంలో జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌లో మొదటిది పారికర్‌ రక్షణ మంత్రిగా ఉండగానే జరిగాయి. ‘పారికర్‌ నవ గోవా నిర్మాత, ఆయన సేవలు అసాధారణమైనవి. వచ్చే తరాలు కూడా వాటిని స్మరించుకుంటాయి. పారికర్‌ గొప్ప దేశభక్తుడు. అంతటి పాలనాదక్షుడు’ అని మోదీ వ్యాఖ్యానించడం సబబుగానే ఉంది.

పారికర్‌ సాధారణ రాజకీయవేత్త కాదు. ఐఐటి బొంబాయిలో మెటలర్జీ చదివిన విద్యావంతుడు. కొద్దికాలం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రచారక్‌గా కూడా పనిచేశారు. ఒకవైపు వ్యాపారం నిర్వహిస్తూనే మరొకవైపు గోవాలో ఆర్‌ఎస్‌ఎస్‌ను, బీజేపీని బలోపేతం చేశారు. రామజన్మభూమి ఉద్యమంలో ఆ ప్రాంతంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. 1994లో రాజకీయాలలో ప్రవేశించారు. పారికర్‌ నేపథ్యం ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ. కానీ ఆయన దేశ రాజకీయాలలో అజాతశత్రువుగా పేరుగాంచారు. రాజకీయాలను సృజనాత్మకంగా నడిపేవారన్న పేరుంది. గోవాలో బీజేపీని బలోపేతం చేయడంలో ఆయన అనుసరించిన వ్యూహం మహరాష్ట్రవాది గోమంతక్‌ పార్టీని నిరోధించడం. అయినా ఒకదశలో పారికర్‌ ముఖ్యమంత్రి అయితే తాము కూడా మద్దతు ఇస్తామని గోమంతక్‌ పార్టీ ముందుకు రావడం విశేషం. మోదీ ఆదేశం మేరకు గోవా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రక్షణమంత్రి బాధ్యతలు చేపట్టారాయన. హవాయి చెప్పులు, నలిగిన చొక్కాతో పార్లమెంటు ఆయన డి-బ్లాక్‌కు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. సాయుధ దళాలు చిరకాలంగా కోరుకుతున్న ‘వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌’ పారికర్‌ హయాంలోనే అమలులోకి వచ్చింది.

పారికర్‌ విమానాశ్రయానికి ఆటోలో వెళ్లేవారు. తన సామగ్రిని తనే మోసుకునేవారు. అంతేకాదు, స్కూటర్‌ మీద తిరిగే రాజకీయవేత్త అని మీడియా ఆయనను తరచూ పేర్కొనేది. అయితే కొంతకాలం ఆయన స్కూటర్‌కి దూరమయ్యారు. కారణం ఒక్కటే. తనను ఎప్పుడూ ఆలోచనలు వెంటాడుతూనే ఉంటాయని, ఆ క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి దూరంగా ఉంటున్నానని ఆయన చెప్పారు.

2013లో గోవాలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశాలలో పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును ముందు పారికర్‌ ప్రతిపాదించారు. తరువాత రాజ్‌నాథ్‌ సింగ్‌ మోదీ పేరును ముందుకు తెచ్చారు. పారికర్‌ రక్షణ మంత్రి కావడానికి ముందు మూడుసార్లు గోవా ముఖ్య మంత్రిగా పనిచేశారు. రక్షణమంత్రిగా మూడు సంవత్స రాలు పనిచేసిన తరువాత మళ్లీ గోవా ముఖ్య మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేళ్లు రక్షణ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. దేశ రాజకీయాలలో ఆ విధంగా ఆయన తనదైన ముద్రను వేశారు.

2017 అసెంబ్లీ ఎన్నికలలో గోవాలో పార్టీ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు పారికర్‌ సొంత రాష్ట్రానికి వచ్చి పరిస్థితులను సరిచేశారు. బీజేపీకి 13 స్థానాలు వచ్చాయి. కాంగ్రెసకు 17 స్థానాలు వచ్చాయి. గోవా అసెంబ్లీ మొత్తం స్థానాలు 40. రంగంలోకి దిగిన పారికర్‌ చిన్న చితకా పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.

పారికర్‌ గోవాలోనే మపూసా అనే పట్టణంలో పుట్టారు. బాల్యం నుంచి స్వయంసేవక్‌. 1978లో ప్రతిష్టాత్మక బొంబాయి ఐఐటిలో మెటలర్జీ చదివారు. ఐఐటిలో చదివి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కీర్తి తొలిసారిగా పారికర్‌కు దక్కింది. ఇటీవల కేన్సర్‌ డే సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం అద్బుత మైనది. ఎంతటి వ్యాధిని అయినా గుండెబలం అధిగమించగలుతుందని ఆ సందర్భంలో ఆయన ట్వీట్‌ చేశారు. జనవరి 21న పనాజీలో ఒక వంతెన ప్రారంభ కార్యక్రమానికి పారికర్‌ హాజరయ్యారు. జనవరి 30న స్వయంగా శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. తుది శ్వాస వరకు, శరీరం తుది కణం కూడా సహకరిస్తున్నంత వరకు ఆయన ప్రజాసేవలో గడిపారు. చివరిక్షణం వరకు కూడా ఆయన ప్రజలతో బంధం నిలబెట్టుకున్నారు. మార్చి 11న ఆయన ఆఖరి ట్వీట్‌ వెలువడింది. గోవా తొలి ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా ఇచ్చిన ట్వీట్‌ అది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దయానంద్‌ (బాబూసాహెబ్‌) బందోద్కర్‌ గోవా అభివృద్ధికి గొప్ప పునాదిని నిర్మించారని నివాళి ఘటించారు. పారికర్‌ ప్రజల ముఖ్యమంత్రి. భద్రతాదళాల రక్షణ మంత్రి.

– జాగృతి డెస్క్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *