సామాన్య జీవితం – ఉన్నత వ్యక్తిత్వం

సామాన్య జీవితం – ఉన్నత వ్యక్తిత్వం

అది గోవా పనాజీ ప్రాంతం. ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర హెల్మెట్‌ పెట్టుకొని స్కూటర్‌పై గ్రీన్‌సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో వెనకనుంచి 25 సంవత్సరాల యువకుడు కారులో ఉండి పదే పదే హారన్‌ కొడుతున్నాడు పక్కకు తప్పకో అని. స్కూటర్‌పైనున్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు. వెంటనే కారులోని యువకుడు కిందకి దిగి కోపంగా ‘నేనెవరినో తెలుసా నీకు! ఈ ప్రాంత డిఎస్‌పి కొడుకుని! నాకే దారి ఇవ్వవా!’ అంటూ ఆ వ్యక్తితో వాదులాటకు దిగాడు. వెంటనే ఆ వ్యక్తి సున్నితంగా నవ్వుతూ ‘బాబూ.. నువ్వు డిఎస్‌పి కొడుకువైతే నేను ఈ రాష్ట్ర ముఖ్య మంత్రిని’ అని బదులిచ్చాడు. ఇక ఆ యువకుడి పరిస్థితి ఏమిటనేది అర్థమయ్యే ఉంటుంది. స్కూటర్‌పై ఉండి ‘నేను ముఖ్యమంత్రిని బాబూ’ అని చెప్పిన వ్యక్తి ఎవరో కాదు. అప్పటి గోవా ముఖ్యమంత్రి, మోదీ ప్రభుత్వంలో మూడేళ్లు దేశ రక్షణ మంత్రిగా ఉండి అనేక సాహస నిర్ణయాలు తీసుకుని అమలు చేసిన వ్యక్తి, తరువాత పార్టీ కోరిక మేరకు మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లిన మనోహర్‌ పారికర్‌.

2014 మే 26న మోదీ నేతృత్వంలో కేంద్రంలో భాజపా ప్రభుత్వం కొలువుతీరింది. నవంబర్‌ 9న మనోహర్‌ పారికర్‌ కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అంతకుముందు వరకు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్థితులలో వాడే ప్రత్యేకమైన బూట్లను ఒక్కొక్క జత రూ.25,000 చొప్పున మన ప్రభుత్వం గత ఎన్నో సంవత్సరాలుగా (అంతకుముందు పదేళ్లపాటు కాంగ్రెస్‌ అధికారంలో ఉంది) ఇజ్రాయిల్‌ నుండి దిగుమతి చేసుకునేది. మనోహర్‌ పారికర్‌ రక్షణశాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించారు. ఆ పరిశీలనలో బూట్ల జతను రూ.25,000 కు కొనుగోలు చేయడం చూసి ఆశ్చర్య పోయారు. వాటిని ఇజ్రాయిల్‌ నుండి దిగుమతి చేసుకోవడానికి బదులు భారత్‌లోనే తయారుచేయించాలని భావించారు.

వెంటనే పని ప్రారంభించారు. భారత్‌లో బూట్ల తయారీ గురించి వాకబు చేశారు. బిత్తరపొయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ రూ.25 వేలకు వస్తున్న బూట్లు తయారవుతున్నది భారత్‌లోని రాజస్థాన్‌లోనే. అవి ఇక్కడే తయారై, ఇజ్రయిల్‌ వెళుతున్నాయి. అక్కడి నుండి మనం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నామని తెలిసింది. ఆశ్చర్యపోయిన పారికర్‌ వెంటనే ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకు రమ్మని రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు.

అయితే ఇక్కడి ప్రభుత్వం సమయానికి డబ్బులు చెల్లించదని, బిల్లులు త్వరగా పాస్‌ కావని చెపుతూ, భారత రక్షణశాఖతో ఒప్పందానికి ఆ కంపెనీ యాజమాన్యం అంగీకరించలేదు. దాంతో పారికర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. తనే యాజమాన్యాన్ని కలుసుకుని మాట్లాడారు. డబ్బు చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యమైనా తనకు ఫోన్‌ చేయమని తన వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఇచ్చి ఒక్కొక్క జత బూట్లను రూ.2200 కే అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇజ్రాయిల్‌ నుండి రూ.25వేలకు దిగుమతి చేసుకుంటున్న బూట్లను కేవలం రూ.2200 కే అందించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. అలా ఆయన కేవలం రెండు సంవత్సరాలలో మన రక్షణ శాఖలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చారు. మనోహర్‌ పారికర్‌ పనితనం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇటువంటి వ్యక్తులను అందించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌.

మరెన్నో ఉదాహరణలు..

– మనోహర్‌ పారికర్‌ ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీకి స్కూటర్‌ మీద వెళతారు. ఆయనని కలవాలంటే ప్రోటోకాల్‌ పాటించనవసరం లేదు. పోలీస్‌ కేసులలో ఆయన జోక్యం ఉండదు.

– ట్రాఫిక్‌ జాం అయితే కారు దిగేసి స్కూటర్‌పై ఉన్నవారిని లిఫ్ట్‌ అడుగుతారు. బడ్డీకొట్టులో టీ తాగుతారు. ఫుట్‌పాత్‌పై ఉన్న బండిలో బజ్జీలు తింటారు. అదేమిటి అని అడిగితే ‘మన పాలన గురించి బడ్డీకొట్టులోనూ, బజ్జీల కొట్టులోనూ తెలిసినంత మరెక్కడా తెలీదు’ అని చిరునవ్వుతో సమాధానం ఇస్తారు.

– గోవా ముఖ్యమంత్రిగా ఉండగా పారికర్‌ ఒక గోష్టికి హాజరు కావాల్సి ఉంది. ఆయన ప్రయాణిస్తున్న కారు సమస్య వచ్చి ఆగిపోయింది. సమయం దగ్గరపడుతోంది. పారికర్‌ ఆలోచించ కుండా వెంటనే కారు దిగి ఒక చేత్తో బ్యాగ్‌, మరో చేత్తో ఫైల్స్‌ పట్టుకుని మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆయన సెక్యూరిటీకి ఆయనను అనుసరించటం కష్టమైంది. వాళ్లు కాస్త వెనకబడ్డారు. కాన్ఫరెన్స్‌ జరుగబోతున్న స్టార్‌ హోటల్‌ గేట్‌ వాచ్‌మన్‌ నడుచుకుంటూ వస్తున్న ఈ సామాన్య వ్యక్తిని లోపలికి రానివ్వలేదు. వెనక వచ్చిన సెక్యూరిటీ వ్యక్తులు ఈయన ముఖ్యమంత్రి పారికర్‌ అని చెపితే అవాక్కవటం వాచ్‌మన్‌ వంతు అయింది.

పారికర్‌ అత్యంత పేద కుటుంబంలో పుట్టారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా ఎదిగారు. చిన్నప్పటి నుండే కష్టపడే అలవాటు ఉండటంతో ఐఐటి పట్టా ఆయనను వరించింది. తరువాత భాజపాకు వెళ్లారు. అధిష్టానం తనకు అప్పచెప్పిన పనిలో 100 శాతం లీనమవుతారు. అద్భుత ఫలితాల కోసం ప్రయత్నిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *