కాస్త స్థలముంటే చాలా.. !

కాస్త స్థలముంటే చాలా.. !

వ్యవసాయానికి మనదేశంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. రైతన్నను అన్నదాతగా భావించి గౌరవించే సంస్కతి మనది. అయితే పట్టణీకరణ పెరిగిపోవడంతో అన్నదాతకు పల్లెల్లో ఆసరా లేకుండా పోతోంది. మార్కెట్లో పంటను అమ్ముకోవడానికి వస్తే ఆదరించే వారు కరువవుతున్నారు. చాలా వరకు పంట పొలాలు పచ్చదనానికి దూరమవుతున్నాయి. దేశానికి తిండి పెట్టే రైతన్న ప్రస్తుతం దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాడు.

హైడ్రోఫోనిక్స్‌

నాగరికతకు చేరువ అవుతున్నాం అనుకునే నగరవాసులకు వ్యవసాయాన్ని దగ్గర చేసేందుకు హైడ్రోఫోనిక్స్‌ విధానం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. గతంలో ఇంటి పెరట్లో కూరగాయలను పండించుకునే వారు, అయితే హైడ్రోఫోనిక్స్‌ పద్ధతిలో పెద్దగా స్థలం అవసరం ఉండదు. రైతన్నలాగా ఆరుగాలం శ్రమించాల్సిన కష్టం ఉండదు. ఇంటి బాల్కనీలోనో, కిటికీ వద్దనో చిన్న చిన్న మొక్కలను పెంచుకోవచ్చు. మనకు అవసరమైన కూరగాయలను కూడా పండించుకోవచ్చు. అందుకు అయ్యే ఖర్చు కూడా సాధారణ నేల పంట కంటే తక్కువే.

అవి ఎంతగానో ఉపయోగపడతాయి

ఒక దశాబ్ద కాలం క్రితం కూల్‌డ్రింక్‌ కొంటే పెట్‌ బాటిల్‌ ఉచితమని టీవీల్లో ప్రకటనలు వచ్చేవి. అయితే చాలా మంది ఆ బాటిళ్లను నీటిని నిల్వ చేసుకోవడానికి వినియోగించేవారు. మరికొంత మంది ఒక మూలన పడేసేవారు. హైడ్రోఫోనిక్స్‌ విధానంలో మొక్కలు పండించడానికి అవి ఎంతో ఉపయోగపడతాయని గుర్తించారు పుణెకు చెందిన రుద్రరూప్‌. చిన్నతనంలో తన తండ్రితో కలిసి హైడ్రోఫోనిక్స్‌ పద్ధతిలో పంటలు పండించే ప్రయోగాలు చేశారు.

అకుంఠిత దీక్ష

అప్పుడప్పుడే దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ విధానం పైన పరిశోధనలు జరుగుతున్నాయి. రుద్రరూప్‌ కూడా తన తండ్రితో కలిసి మట్టి కుండల్లో నీటి ద్వారా పంటను పండించేందుకు ప్రయోగాలు మొదలుపెట్టారు. అందులో వారు సఫలీకతం కూడా అయ్యారు.

అయితే చదువు కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన రుద్రరూప్‌ హైడ్రోఫోనిక్స్‌కు దూరమయ్యారు. తాను నేర్చుకున్న విద్యను మరచిపోయారు. చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడ్డారు. కాని మదిలో ఏదో తెలియని లోటు, ఏదో కోల్పోయాననే భావన ఆయన మదిని నిత్యం తడుతూ ఉండేది. గుండె లోతుల్లోకి ఒకసారి తరచి చూస్తే తన తండ్రి నుంచి వార సత్వంగా పొందిన వ్యవసాయం గుర్తొచ్చింది. ఎలాగైనా దానిని కొనసాగించాలనే సంకల్పం కలిగింది. కాని నగరంలో స్థలాభావం ఎక్కువ. వ్యవసాయానికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండదు. అయినా పట్టు వదలకుండా అకుంఠిత దీక్షతో ముందడుగు వేశారు. తాను నేర్చుకున్న హైడ్రోఫోనిక్స్‌ విధానాన్ని పునఃశ్చరణ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

ఈ ఏడాది తన సంకల్పానికి కార్య రూపాన్ని ఇచ్చారు. పుణె, ఇతర ప్రాంతాల్లో హైడ్రోఫోనిక్స్‌ పైన కార్యశాలలు ఎక్కడైనా జరుగుతున్నాయా ? అని వెతకడం ప్రారంభించారు. ఎక్కడా తనకు ఫలితం కనిపించలేదు. ఇక తానే ప్రయోగాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఒకవైపు ఉద్యోగం, మరో వైపు తనకు ఇష్టమైన వ్యవసాయం. అయినా సరే ఏమాత్రం నిరాశ చెందకుండా తన భార్య సహకారంతో ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఆమె కూడా ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ప్రయోగ సమయంలో చేదోడు-వాదోడుగా ఉంటూ తనవంతు సహాయం చేశారు.

రుద్రరూప్‌ తన భార్య, స్నేహితుల ప్రోత్సాహంతో తన ఇంటి బాల్కనీలోనే ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పెట్‌ బాటిళ్లను సేకరించి వాటిలో నీటి సహాయంతో మొక్కలను పెంచే ప్రయత్నం ప్రారంభించారు. తొలుత కాస్త ఇబ్బందులు తలెత్తినా, వైఫల్యాలు ఎదురైనా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. నీటిలో కలపడానికి కావలసిన లవణాలు, ఇతర పోషకాలను స్వతహాగా తయారు చేసుకోవడం ప్రారంభించారు. వాటి ద్వారా మంచి ఫలితాలను సాధించారు. తొలుత పచ్చిమిర్చి, టమాట, ఇతర కూరగాయాలను హైడ్రోఫోనిక్స్‌ విధానంలో విజయ వంతంగా పండించారు. దాంతో ఆయనలో కొంత ఆనందం నెలకొంది.

కాని ఆయన అంతటితో సంతప్తి చెందలేదు, తన విద్యను నలుగురితో పంచుకోవాలని, వ్యవసాయాన్ని నాగరికులకు కూడా పరిచయం చేయాలనే ఆలోచన తట్టింది. అన్నదాత పడే కష్టం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనుకున్నారు. అలా స్వతహాగా కార్యశాలను నిర్వహించడం ప్రారంభించారు.

మేకర్స్‌ క్లబ్‌

రెండున్నర సంవత్సరాల క్రితం ఆయన స్థాపించిన మేకర్స్‌ క్లబ్‌ను ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఔత్సాహికుల కోసం కార్యశాలను నిర్వహించ తలపెట్టారు. తొలిసారి హైడ్రోఫోనిక్స్‌ విధానంపై కార్యశాల నిర్వహించినప్పుడు ఎక్కువ మంది రాలేదు. అయితే ఆ తొలి ఔత్సాహికుల ప్రచారం కారణంగా మరోమారు నుంచి కార్యశాల నిర్వహించినప్పుడు అధిక స్పందన రావడం మొదలైంది.

పుణె లాంటి మహానగరంలో సైతం పంటలు పండించుకునే వీలుంది అంటే ఎవరైనా ఆ పద్ధతి గురించి తెలుసుకోకుండా ఉండాలని ఎందుకు అనుకుంటారు?

కార్యశాలకు వచ్చే వారందరికీ మొదట వ్యవసాయ ప్రాధాన్యం వివరిస్తారు రుద్రరూప్‌. ఆ తరువాత హైడ్రోఫోనిక్స్‌ పద్ధతిలో మొక్కలను పెంచడంపైన అవగాహన కల్పిస్తారు.

ఛ్యవన్‌ ప్రాష్‌ డబ్బాలు, టిఫిన్‌ డబ్బాలు, పెరుగు క్యాన్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లను మొక్కలను పెంపకానికి ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనే అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తారు.

తన ఇంటి బాల్కనీలో పెంచుతున్న మొక్కలను ఔత్సాహికులకు చూపించి మురిసిపోతుంటారు. ఆసక్తి కనబరచిన వారికి దగ్గరుండి తెలియజేయడమే కాకుండా వారు నేర్చుకునేందుకు కావలసిన సమాచారాన్ని అందిస్తారు. దేశ వారసత్వ సంపద అయిన వ్యవసాయాన్ని మనం మర్చిపోవద్దని గర్వంగా చెబుతారు.

హైడ్రోఫోనిక్స్‌ పద్ధతి అంటే ?

సాధారణంగా పంట పండించాలంటే నేలను దున్నాలి, నేల సారవంతమైనదో కాదో పరీక్షలు చేయించాలి. ఎరువులు వేసి సారవంతంగా చేయాలి. విత్తనాలు వేయాలి, నీరు పట్టాలి.. ఇలా పెద్ద విధానం ఉంటుంది.

అయితే లాభాలను ఆశించి చాలా మంది రైతులు నేడు రసాయనాలను వినియోగించి పంట పండిస్తున్నారు. రసాయనాల వల్ల పండిన పంటలు ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే పెద్ద ఎత్తున పంటను పండించడానికి ఇప్పట్లో వీలు లేకపోయినా.. హైడ్రోఫోనిక్స్‌ విధానంలో ఇంట్లోనే కూరగాయలను పండించుకోవచ్చని రుద్రరూప్‌ చెబుతున్నారు. ఇందుకు కావల్సిందల్లా ఇంట్లో బాల్కనీ, కిటికీ వద్ద కాస్త స్థలం ఉంటే చాలు. అక్కడ బాటిళ్లలో ఎంతో సరదాగా మొక్కలను పెంచుకోవచ్చు.

ఈ విధానంలో మొక్క వేర్లను మాత్రమే నీటిలో ఉంచుతారు. ఆ నీటిలో మొక్కకు కావలసిన పోషకాలను కలుపుతుంటారు. పోషకాలు నేరుగా నీటిలో కలవడం వల్ల మొక్కకు త్వరగా లవణాలు, ఖనిజాలు అందుతాయి. నేలలో పెరిగే మొక్కకంటే వేగంగా నీటిలోని మొక్క పెరుగుతుంది. అంతేకాకుండా త్వరగా ఫలాలను ఇస్తుంది.

ఇలా చిన్న మొత్తంలో ఇంటి అవసరాలకు కావలసిన మొక్కలను మన వరండాలోనో, అందు బాటులో ఉన్న ఖాళీ స్థలంలోనో పెంచుకోవచ్చు. అంతేకాకుండా రసాయనాలకు దూరంగా పండించి నవి కాబట్టి ఆరోగ్యకరంగా కూడా ఉంటాయి. పూర్థి స్థాయిలో కాకపోయినా కొంతమేర తాజా కూరగాయలను పొందుతాం. ఇలా నగరంలో చిన్న పంటలను వేసుకోవడానికి హైడ్రోఫోనిక్స్‌ విధానం ఎంతో దోహదపడుతుందని రుద్రరూప్‌ అభిప్రాయ పడుతున్నారు.

– సంతోషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *