ఓటుహక్కు గురుతర బాధ్యత

ఓటుహక్కు గురుతర బాధ్యత

ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి ప్రత్యేకం

ప్రపంచ రాజకీయ, సామాజిక గమనంలో, అన్వేషణలో ఒక గొప్ప మజిలీ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామిక వ్యవస్థ ఉన్నదని చెప్పుకోవడం ఈనాడు ఎన్నో దేశాలు సగర్వంగా భావిస్తున్నాయి. ప్రజాస్వామ్య స్థాపన దిశగా ఉద్యమిస్తున్నాయి. వ్యవస్థ సమగ్రాభివృద్ధికి, వికాసానికి ప్రజాస్వామ్యం ఒక తిరుగులేని ఆయుధంగా ప్రపంచ దేశాలు విశ్వ సిస్తున్నాయి.

భారతదేశం స్వరాజ్యం సంపాదించిన కాలానికి ప్రజాస్వామ్యం ఒక విజయవంతమైన రాజకీయ సిద్ధాంతంగా ఆవిర్భవించడం, దానినే మనం నెలకొల్పుకోవడం జరిగిపోయాయి. కాని, మన ప్రజా స్వామిక వ్యవస్థ ఏర్పాటు వెనుక కృషిని, దార్శనికతని ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నప్పుడు అగ్రభాగాన కనిపించే ఒక మహావ్యక్తి ఉంటారు. ఆయనే – భారతరత్న, డాక్టర్‌ భీమ్‌రావ్‌ రాంజీ అంబేడ్కర్‌.

దేశానికి స్వరాజ్యం లభించినపుడు వలస రాజ్యాలు, రాజరికాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉండడం, ప్రజాస్వామ్యం దేదీప్యమానంగా కనిపించడం భారత్‌కు దక్కిన గొప్ప అవకాశం. ఆ సమయంలో ప్రజాస్వామ్యాన్ని భారత్‌ వంటి బహుళ సంస్కృతుల సమాజానికి దానిని అన్వయించి, వ్యాఖ్యా నించగల అంబేడ్కర్‌ వంటి దార్శనికుడు ఉండడం అదృష్టం కూడా. స్వతంత్ర భారతావనికి ప్రజా స్వామ్యాన్ని అందివ్వాలని స్వాతంత్రోద్యమం ఆశించింది. దానికి అంబేడ్కర్‌ మేధస్సు ఆకృతిని ఇచ్చింది.

దేశంలో అంతవరకు ఏ రాజకీయ చింతనా పరుడు చూడని ఓ కోణాన్ని ఆయన ముందుకు తెచ్చారు. ఒక సమగ్ర రాజకీయ వ్యవస్థగా, బలమైన వ్యవస్థగా భారత్‌ ఆవిర్భవించాలంటే జాతి అంతరాలు మరచిపోవాలి. అంతరాలు అంటే, ప్రపంచమంతటా ఉన్న వర్ణ వివక్ష, పేద, ధనిక వ్యత్యాసాలతో పాటు భారత్‌లో అదనంగా ఉన్న అస్పృశ్యతను కూడా బహిష్కరించాలి. అలా భారత ప్రజాస్వామిక వ్యవస్థ పటిష్టతకు ఏది కీలకమో సరైన సమయంలో గుర్తించిన వ్యక్తి అంబేడ్కర్‌. భారత ప్రజాస్వామిక వ్యవస్థకు, సిద్ధాంతానికి రూపకల్పన చేసిన అంబేడ్కర్‌ ఓటు హక్కు, ఫెడరల్‌ వ్యవస్థ, గవర్నర్‌ వ్యవస్థ, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి, పంచాయితీ, మానవ హక్కులు, స్త్రీ విద్య వంటి అంశాలను విస్తృతంగా ఆలోచించారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రాజ్యాంగ పరిషత్‌ సభలలోను అంబేడ్కర్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అంతిమంగా మన ప్రజాస్వామ్యానికి, అది సుసంపన్నం కావడానికి దోహదం చేశాయి.

‘నేనే కనుక ఓటు హక్కును అర్థం చేసుకోవా లనుకుంటే, సమాజంలో జీవితంతో ముడిపడి ఉన్న అనేక విషయాలను క్రమబద్ధం చేసే హక్కుగా అర్థం చేసుకుంటాను. ఇదే ఓటు హక్కులోని సారం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఓటు హక్కు ఇస్తున్నామూ అంటే, సమాజంలోని ఇతర వ్యక్తులు అతడి జీవన సంబంధాలను క్రమబద్ధం చేసే హక్కును అతనికిస్తు న్నామన్నమాట’ అంటారు. అంబేడ్కర్‌ (రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, 1930). అంబేడ్కర్‌ దృష్టిలో ఓటు హక్కు కేవలం హక్కు కాదు. అదో గురుతర బాధ్యత. ప్రజల ప్రాణ, ధన, మానాలను కాపాడటానికి అవసరమైన చట్టాలను చేసే చట్టసభను సృష్టించుకునే అధికారం కూడా. కాబట్టే ఓటు హక్కు సమాజంలో కొన్ని వర్గాలకే పరిమితం కారాదు. అందుకే వయోజన ఓటింగ్‌ అనివార్యం. ఓటుహక్కు వయోజన ఓటింగ్‌ కానప్పుడు ఏర్పడేది ఒక మైనారిటీ ప్రభుత్వం మాత్రమే. అది అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించలేదు. వహించదు. ఆ ప్రభుత్వం అన్ని వర్గాలను శాసించనూలేదు. అందుకే ఓటు హక్కుకు విద్యార్హతను నిర్ణయించాలన్న ఆలోచనలో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆయన బహిర్గతం చేయగలిగారు. అలాగే స్త్రీల ఓటు హక్కును కూడా ఆయన గట్టిగా సమర్థించారు. ప్రజాస్వామ్యం గురించి, అందులో పౌరుల స్థితిని గురించి అంబేడ్కర్‌ ఉత్కృష్టమైన భావనను కల్పించారు.

ప్రజాస్వామ్యం మూలాలను సామాజిక సంబం ధాలతో చూడగలగాలన్నది ఆయన నిశ్చితాభి ప్రాయం. ప్రజాస్వామ్యం అంటే ఒక సంఘటిత జీవన విధానం అంటారాయన. పంచాయితీలలో దళితులకు స్థానం కల్పించాలని, వారు ఎన్నిక కాలేకపోతే నామినేట్‌ చేయించాలని కూడా ఆయన వాదించారు. దళితుల సామాజిక స్థాయిని పెంచడానికి ఈ నియామకం దోహదం చేస్తుందని ఆయన విశ్వసించారు. పంచాయితీలలో ఒక్క దళిత సభ్యుడయినా ఉంటే మిగిలిన వర్గాలు వారిని తమతో సమానంగా చూడడం ప్రారంభిస్తాయని ఆయన వాదన. సామాజిక పోరాటాల ద్వారా, విద్య ద్వారా దళితులు ఆత్మగౌరవాన్ని తెచ్చుకోవాలని భావించారు. ఆ బాటలో ఉద్యమం నిర్మించారు. అంబేడ్కర్‌కు ముందు ఇలాంటి వర్గాలకు అండగా నిలిచినవారు లేకపోలేదు. కానీ రాజకీయ హక్కులకు రూపం ఇస్తున్నప్పుడు అందులో దళితుల స్థానం గురించి చారిత్రకంగానే కాదు, చట్టాల నేపథ్యంతో కూడా చెప్పగల నేత అవసరం ఉంటుంది. అలాంటి నిర్మాణాత్మక పాత్రను నిర్వహించినవారు అంబేడ్కర్‌.

ఒక సమస్య తీవ్రతను ఇతరులకు తెలియ చేయడానికి వ్యక్తుల స్వీయ అనుభవం తోడ్పడిన స్థాయిలో మరొకటేది ఉపకరించదు. దళితులకు సామాజిక న్యాయం అందించడంలో అంబేడ్కర్‌ దార్శనికత, అనుభవం అలాంటి పాత్రను నిర్వ హించింది. ఇలాంటివి ఎన్ని చెప్పుకున్నా, సామాజిక న్యాయాన్ని కాపాడగలిగేది మాత్రం రాజ్యాంగబద్ధత. ఆ సత్యాన్ని గుర్తించడమే కాదు, తన వర్గానికి సాధించి పెట్టినవారు అంబేడ్కర్‌.

అంబేడ్కర్‌ సంస్కర్త. ఆర్థికవేత్త. న్యాయ నిపుణుడు. ఉద్యమకారుడు. గొప్ప విద్యావేత్త. ప్రజాప్రతినిధి. ఇవన్నీ కూడా ఆయనను స్వతంత్ర భారత రాజ్యాంగ రచనా సారథ్యం దగ్గరకు నడిపించిన దశలుగానే కనిపిస్తాయి. అంబేడ్కర్‌ జీవితంలో సంఘ సంస్కరణోద్యమం ఒకవైపు, దళితుల సంఘటన ఒకవైపు, పరిపాలన మరొకవైపు కనిపిస్తాయి. 1942లో అంబేడ్కర్‌ వైస్రాయ్‌ కౌన్సిల్లో కార్మిక వ్యవహారాలు చూశారు. ఎనిమిది గంటల పని ఆయన చలవే. భవిష్య నిధి, దినసరి భత్యం కూడా ఆయన ఆలోచనే. ఎంప్లాయిమెంట్‌ ఎక్చ్సేంజ్‌, ప్రసూతి సెలవు కూడా అంబేడ్కర్‌ చొరవతోనే రూపు దాల్చాయి. నేటి తరం పాలకులు దేశాన్ని ప్రజాస్వామ్య పథంలో నడిపించి, అంబేడ్కర్‌ ఆశయ సాధన దిశగా కృషిచేయడమే భారతావని ఆయనకిచ్చే నిజమైన గౌరవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *