తొలి పర్వదినం

తొలి పర్వదినం

సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మికతతో పాటు ఆరోగ్య రహస్యం కూడా తప్పకుండా ఉంటుంది. మన పండుగలన్నీ తిథుల ప్రకారమే ఉంటాయి. ప్రతి తిథిలో ఏదో ఒక పండుగ ఉంటుంది. అలాగే మనం కూడా ఏ పనిచేసినా తిథుల ప్రకారమే చేస్తాం. అదేవిధంగా ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి హిందువులకు పర్వదినం. దీనికి ఎంతో విశిష్టత ఉంది.

మన పంచాంగం ప్రకారం నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు(24) ఏకాదశులు వస్తాయి. చాంద్ర మానం ప్రకారం మూడు సంవత్సరాల కొకసారి అధిక మాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి. అన్నిటిలోకి ముఖ్యంగా తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి ఎక్కువగా జరుపుకుంటాం. తొలి ఏకాదశినే శయన ఏకాదశి లేదా హరివాసరం అనే పేర్లతో పిలుస్తాం. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశుల్లో వచ్చే మొదటి ఏకాదశి ఇది. ఆ సంవత్సరంలోని పండుగలన్నీ ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. అందుకే దీన్ని తొలి పర్వదినంగా పేర్కొంటారు. క్షీరసాగరంలో శేషపాన్పుపై ఈ రోజునుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని పురాణ ప్రతీతి. అందువల్ల ఈ తొలిఏకాదశిని శయన ఏకాదశి అని, విష్ణుమూర్తి మేలుకునే కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పేర్కొంటారు. అంతేకాదు ఈ రోజున గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

పురాణగాథ ప్రకారం-యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య, గోపద్మ వ్రతాలు ఆచరించనివారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు, ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించాడు. అలా ఆనాటి నుంచి స్త్రీలందరూ గోపద్మ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. తొలిఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించడం ఎంతో ప్రాశస్త్యం. అది వీలుపడని వారు కనీసం గోవుకు పదకొండు ప్రదక్షిణాలు చేసి, బ్రాహ్మణుడికి మోయన, దక్షిణ ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవాలి.

కృతయుగంలో తాళఝంగుడు అనే రాక్షసుడి కుమారుడైన మురాసురుడు బ్రహ్మ ఇచ్చిన వరంతో అహంకారం పెరిగి దేవతలను, నరులను హింసిస్తుం టాడు. అతడితో యుద్ధం చేసి అలసిపోయిన శ్రీమహావిష్ణువు సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన శరీరం నుంచి ఒక కన్య ఉద్భవించి మురాసురుడిని సంహరిస్తుంది. ఇందుకామెను వరం కోరుకొమ్మని మహావిష్ణువు అడగగా తాను ఏకాదశి తిధిగా, విష్ణుప్రియగా ఆరాధింపబడాలని కోరుకుంది.

తొలిఏకాదశి నాడు ఆచరించాల్సిన వ్రతాన్ని సైతం శాస్త్రం పేర్కొంది. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంధ పురాణాలు తెలియజేస్తున్నాయి.

పూర్వకాలంలో హరిభక్తి పరాయణుడైన అంబరీషుడు ఈ ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే సతీ సక్కుబాయి తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వర్తించి, మహావిష్ణువులో ఐక్యం చెందిందట. దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రు డయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరి సంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించ గలిగాడు. అదే విధంగా ‘రుక్మాంగదుడు’ స్వయంగా తాను ఏకాదశి వ్రతం ఆచరిస్తూనే, రాజ్యంలోని ప్రజలం దరితోనూ చేయించాలని సంకల్పించాడు. దీని వల్ల యమలోకానికి చేరే పాపుల సంఖ్య తగ్గిపోతుందన్న ఆందోళనతో- వ్రతభంగం చేసి రమ్మని యముడు రంభను పంపాడు. ఆమె మోహిని రూపంలో వెళ్లి రుక్మాంగదుణ్ని ఆకర్షించింది. అదే పుణ్యదినాన అతణ్ని కోరిన రంభను, మరేదైనా అడగమన్నాడు రుక్మాంగదుడు. ‘నీ పుత్రుణ్ని వధించు’ అని రంభ పరీక్షపెడితే, అందుకు సిద్ధపడ్డాడట. విష్ణువు ప్రత్యక్షమై, రుక్మాంగదుడి వ్రతదీక్షను ప్రశంసించి, మోక్షం ప్రసాదించాడు అని పురాణాల్లో ఉంది.

చాతుర్మాస్య దీక్షారంభం

తొలిఏకాదశి ప్రకృతి మార్పులకు సంకేతం అని చెప్పుకోవచ్చు. ఈరోజు నుంచి సూర్యుడు ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు మరలుతాడు, ఇది దక్షిణాయనాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా నేటి నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమై నాలుగునెలలు కొనసాగుతుంది. పూర్వం ప్రతి ఒక్కరూ ఈ చాతుర్మాస్య దీక్షను ఆచరించేవారు. అయితే ప్రస్తుతం కేవలం పీఠాధిపతులు, మఠాధిపతులు మాత్రమే దీనిని పాటిస్తున్నారు. ఈ దీక్ష సమయంలో వర్షరుతువు ఆరంభంలో మానవ శరీరానికి సరిపడని ఆహారాన్ని త్యజించి కొన్ని విధాల శాకాహారాన్ని మాత్రమే భుజిస్తారు. దీంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఉపవాసం వల్ల శరీరంలో పాడైన కణాలను శరీరం ఉపయోగించుకుంటుంది. దీంతో క్షీణించిన కణాలు పోగుపడకుండా ఉండ టంతో కేన్సర్‌ వంటి రోగాలు రాకుండా నిరోధించ వచ్చని రుజువయింది. ఉపవాసంపై పరిశోధన చేసిన జపాన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ యోషినోరి ఒహుసుమికి నోబెల్‌ బహుమతి లభించింది. సైన్సు పరంగా తీసుకుంటే ”లంఖణం పరమౌషధం” అని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఉపవాసం వల్ల జీర్ణకోశాలు పరిశుద్ధమౌతాయి. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. మనస్సునీ, శరీరాన్నీ పరిశుద్ధం చేస్తుంది. ఓపికలేని వారు వారి వారి వయసును బట్టి పళ్లు, ఫలహారాలు తీసుకోవచ్చు. ఈ విధంగా సైన్సు పరంగానూ, పౌరాణికంగానూ ఉపవాసం అనేక ఫలితాల నిస్తుందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

అన్నింటిపైనా నియంత్రణ

ఏకాదశి అంటే పదకొండు సంఖ్య. మనలో ఉన్న అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు ఇవన్నీ పదకొండు కదా…అంటే వీటన్నింటి పైనా నియంత్రణ కలిగి ఉండి ఆ భగవంతుడిని ఆరాధించి మోక్షాన్ని పొందాలన్నది ఈ పండుగ సందేశం.

త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం!

విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్‌!!

ఈ ఏకాదశీ వ్రతం మూడు రోజులు చేయాలి. అంటే రోజూ శేషశాయిని అర్చించడం, ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి పారాయణ, త్రయోదశి నాడు గీత నృత్యాదులతో అర్చన చేయాలి. ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం, ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే – అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.

రైతుల పండుగ

గ్రామాల్లో తొలిఏకాదశిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుం టారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీ త్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్లు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసు కుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలప్పిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. ఈ రోజు నుంచి పగలు కంటే రాత్రిళ్లు ఎక్కువసేపు ఉంటాయి. చలి పెరుగుతుంది. వాతావరణంలో వచ్చే ఈ మార్పుల వల్ల రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందుకే ఈ రోజు పేలాలపిండిని తప్పకుండా తినమని చెబు తారు. పేలాలపిండి వల్ల జలుబులాంటి సమస్యలు దూరమైపోతాయి. దీన్ని బెల్లం, యాలుకలతో కలిపి తినడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. ఇలా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికతను, ముక్తిని కూడా కలిగిస్తుంది తొలిఏకాదశి పర్వదినం.

– విజేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *