రాకెట్ల నుండి రక్షణకై గగనతలంలో ఉక్కు కవచం

రాకెట్ల నుండి రక్షణకై  గగనతలంలో ఉక్కు కవచం

అనతికాలంలోనే అమెరికన్‌ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ నుండి తిరోగమిస్తాయి. తాలిబాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వంలో భాగస్వామి కాబోతోంది. జిహాద్‌ చేస్తున్న తాలిబాన్‌ ఆత్మాహుతి దళాలు తమ యుద్ధ శక్తిని మరోదేశంలో చూపిస్తాయి. ఆ మూకలు పాకిస్తాన్‌ సహాయ సహకారంతో కాశ్మీర్‌పై విరుచుకుపడతాయి. ఇంతవరకూ పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు భౌతికంగా కాశ్మీర్‌లో చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇకముందు, పూర్వంలాకాక పాకిస్తాన్‌ ఆక్రమిత, విస్ఫోటకాలను పంపి, ధన, ప్రాణ నష్టం కలిగించబోతున్నారు. క్షిపణి వాహక విస్ఫోటకాల నుండి మన ఆవాసాలనూ, సైనిక తదితర సశస్త్ర బలాలనూ ఎలా రక్షించుకుంటాం? దీనికి సమాధానం ఇజ్రాయెల్‌ దేశ శాస్త్ర-సాంకేతికాధారిత ప్రతిరక్షా వ్యవస్థ.

ఇజ్రాయెల్‌ దేశాన్ని సమూలంగా విచ్ఛిన్నం జేసి ఆ భూభాగాన్ని అరబీయం జేయటం హమాస్‌, హిజ్బుల్లా అనే పాలస్తీనీయ సంస్థల లక్ష్యం. వారి గెరిల్లా సైన్యాలు సిరియా, ఇరాన్‌ల సహాయంతో కొన్ని దశాబ్దాల నుండి ఇజ్రాయెల్‌పై దాడులు జరుపుతున్నాయి. ఈ లక్ష్యం కోసం ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన వారిని (భౌతిక చొరబాటు) ఇజ్రాయెల్‌ పసిగట్టి చంపించింది. ఇక భౌతిక చొరబాటు కుదరదని భావించిన హమాస్‌, హిజ్‌బుల్లా సంస్థలు దానికి ప్రత్యామ్నాయంగా దక్షిణాన గాజా నుంచి, ఉత్తరాన లెబనాన్‌లలో గల తమ స్థావరాల నుండి రాకెట్‌లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించటం ప్రారంభించాయి. ఈ రాకెట్ల ద్వారా ఇజ్రాయెల్‌లోని ప్రముఖ పట్టణాలపై బాంబుల వర్షం కురిపించసాగాయి. ఇటువంటి ప్రక్రియకు ఆద్యుడు ఇరాక్‌ను ఏలిన సద్దాం హుసేన్‌.

1980 దశకంలో ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న సమయంలో సద్దాం హుసేన్‌ ఇరాన్‌పై స్కడ్‌ (Kassam) రాకెట్లను ప్రయోగించాడు. 1991లో మొదటి గల్ఫ్‌ యుద్ధంలో అమెరికాతో తలబడ్డ ఇరాక్‌, ఆ యుద్ధంలో ఇజ్రాయెల్‌ భాగస్వామి కాకపోయినా దానిపై 39 స్కడ్‌ రాకెట్‌లను కురిపించాడు హుసేన్‌. అదేవిధంగా గాజాలో తిష్టవేసిన హమాస్‌ మూలు ఇజ్రాయెల్‌పై, ఇరాన్‌ ప్రసాదించిన సాంకేతికతతో తయారు చేసుకున్న కస్సాం (ఖaరఝఎ) రాకెట్‌లను వర్షించింది. 2001లో ఒక మైలు, 2005లో 10 మైళ్లు, 2006లో 26, 2012లో 40 మైళ్లు దూరాన ఉన్న లక్ష్యాల మీద బాంబులు వేయగల సామర్ధ్యాన్ని హమాస్‌ సాధించింది. 14 సంవత్సరాలలో హమాస్‌ గాజా నుంచి ఇజ్రాయెల్‌పై 12,000 రాకెట్లను సంధించింది. లెబనాన్‌ నుంచి హిజ్బుల్లా 2006లో 34 రోజుల్లో 4300 (సగటు రోజుకు 120) రాకెట్లను ఇజ్రాయెల్‌పై వర్షించింది. వేల సంఖ్యలో వస్తున్న రాకెట్ల భీభత్సాన్ని ఎలా భగ్నం జేయాలి? ఇది ఇజ్రాయెల్‌కు వచ్చిన అతి గంభీర ప్రశ్న.

దానికి సమాధానమే ఇజ్రాయెల్‌ భీష్మ ప్రతిజ్ఞ, ఆ దేశపు శాస్త్ర-సాంకేతి శాస్త్రవేత్తల దేశభక్తి, సామ్యరహిత మేధోశక్తి. పై ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి ఆ దేశ శాస్త్రవేత్తలు దీక్షగా ప్రయోగాలు చేశారు. ఉక్కు సంకల్పంతో ప్రయోగాలలో నిమగ్నమయ్యారు. ఎట్టకేలకు వారి కృషి ఫలించింది. ఫలితంగా తయారైనదే స్వదేశీ నిర్మిత ‘గగనతల ఉక్కుకవచం’ ‘Iron Dome of Israel’. సమాధానం కనుగొన్నారు కాని, ఆ వ్యవస్థ గల ఉక్కు కవచాన్ని ఉత్పత్తి చేయాలి కదా !

అమెరికాలో కూడా సోవియట్‌ రష్యా రాకెట్లను ఎదుర్కొనటానికి క్షిపణి భేదక క్షిపణి వ్యవస్థకై ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా ఆలోచన ఇజ్రాయెల్‌కు కలిసివచ్చింది. ఇజ్రాయెల్‌కు మేధోసంపత్తి ఉంది, కాని కావలసిన సంపద (ద్రవ్యం) లేదు. అందుకే వారు అమెరికాతో మంతనాలు జరిపారు. ‘మా వద్ద నిమిషానికి 4000 గుళ్లు పేల్చే Vulcan Phalanx అనే (శతఘ్నులు) తుపాకులున్నాయి. వాటిని ఉపయోగించి శత్రు క్షిపణులను ధ్వంసం చేయగూడదా?’ అన్నారు అమెరికన్లు. అంతేకాదు ‘మా వద్ద లేసర్‌ సిస్టంతో పనిచేసే నాటిలిస్‌ (Nautilus) అనే క్షిపణి భేది ఉంది. వాటిని కొనుక్కోండి’ అన్నారు. ఒక్కొక్క భేది ఖరీదు రూ.50 వేల నుండి రూ. లక్ష వరకూ ఉంటుంది. అంత ఖరీదున్న పరికరాలను కొని వేల సంఖ్యల్లో వస్తున్న హమాస్‌, హిజ్బుల్లా రాకెట్లను ఎదుర్కొనాలంటే ఇజ్రాయెల్‌ ఆర్థికంగా ధ్వంసమౌతుంది. ఇజ్రాయెల్‌ అభ్యర్థనను మన్నించి అమెరికా కొంత ధన సహాయం చేసింది. ఇజ్రాయెల్‌లోని రాఫెల్‌ (Rafael) అనే కంపెనీ దేశీయ పరిజ్ఞానంతో అమెరికా సహాయంతో ‘ఐరన్‌ డోమ్‌’ అంటే ‘ఉక్కు కప్పు’ అనే వ్యవస్థను ఉత్పత్తి చేసి, ఇజ్రాయెల్‌ గగన తలాన్ని దుర్భేద్యంగా, సురక్షితంగా చేసింది.

ఐరన్‌ డోమ్‌ అంగాలు మూడు. మొదటిది శత్రుక్షిపణులతో తలపడి, వాటిని ముక్కలు చేసే పరికరం. రెండవది శత్రు భూమిలో రాకెట్‌ను ప్రయోగించిన స్థలాన్ని గుర్తించే అతిశక్తివంతమైన రాడార్‌ (Rador), మూడవది అతిముఖ్యమైనది – పోరు నడిపే అత్యాధునిక ఆల్గొరిథం (algorithms) లను ఉపయోగించి, శత్రుక్షిపణి ఉనికిని, గమన పథాన్ని (Trajectory), నిర్దేశిత లక్ష్య స్థలాన్ని సెకన్లలో కనుక్కోగల యుద్ధ వ్యూహ ప్రబంధ వ్యవస్థ (Battle Management System). రాఫెల్‌ కంపెనీ ఇజ్రాయెల్‌లో అత్యాధునిక ఉత్పత్తి చేసిన Air to Air missiles (AAMS) పైలట్‌ ఫైటర్లు చూపులేకుండానే శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయగలవు.

ఐరన్‌ డోమ్‌ అనే రక్షణ కవచాన్ని కార్యాన్వితం (Deployment) చేయాలంటే అమెరికాకు 7 సంవత్సరాలు పడుతుంది. దానిని ఇజ్రాయెల్‌ 3 సంవత్సరాల్లో సాధించింది. మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టాన్ని విజయవంతంగా వాస్తవ యుద్ధంలో ఉపయో గించింది ఇజ్రాయెల్‌ మాత్రమే! శత్రువు తమ విమాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను కురిపిస్తున్నా సరే, వాటిలో 25 శాతాన్ని, గగన తలం లోనే శత్రుదేశంలోనే ధ్వంసం చేసి యుద్ధం చేయగల శక్తిని ఇజ్రాయెల్‌ సంతరించుకుంది. అలా ఇజ్రాయెల్‌లో దేశభక్తి, మేధోశక్తి, సంగ్రామ యుక్తి కలగలిశాయి.

ప్రస్తుతం మన గగనతల రక్షణకై రష్యా నుంచి మిస్సెల్‌ డిఫెన్స్‌ సిస్టంను కొనబోతున్నాం. కానీ అమెరికా తన సిస్టంను కొనమంటోంది. ఇజ్రాయెల్‌లా మనమే డిజైన్‌ చేసి, ఉత్పత్తి జేసి కార్యాన్వితం చేయలేమా? Make In India అంటున్నాం. అది కేవలం నినాదమేనా? సాకారం చేయలేమా? అలాగే 4G, 5G సెల్‌ఫోన్‌ వ్యవస్థలూ దిగుమతులతోనేనా? అవి కూడా చైనా (huawei) నుండేనా? మనకు ఇజ్రాయెల్‌ పాటి మేధస్సు లేదా ?

–  డా. త్రిపురనేని హనుమాన్ చౌదరి, సాంకేతిక నిపుణులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ సాంకేతిక సలహాదారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *