పాలీ హౌజ్‌.. ఫలితాలు భేష్‌..

పాలీ హౌజ్‌.. ఫలితాలు భేష్‌..

మహారాష్ట్రలోని పుణె జిల్లా ఇందపూర్‌ తాలూకా కద్బన్‌వాడీకి ఆదర్శ గ్రామంగా గుర్తింపు ఉంది. ఇందుకు భజన్‌దాస్‌ పవార్‌ అనే విశ్రాంత ఉపాధ్యాయుడి కృషి ఎంతగానో ఉంది.

రాష్ట్రంలోని మూడువందల కరవు గ్రామాల్లో ఒకప్పుడు కద్బన్‌వాడీ కూడా ఒకటి. త్రాగునీరు అనేది అక్కడ ఒక విలాస వస్తువు. కాని ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

భజన్‌దాస్‌ దృడ సంకల్పంతో వంద వ్యవసాయ బావులు, మూడు నీటి ట్యాంకులు, 27 సిమెంటు నీటి ఆనకట్టలు, 110 భూగర్భ జలవనరుల నిల్వలు ఏర్పాటు చేశారు. గ్రామం పట్ల అతనికున్న ప్రేమ, అభిమానం, ఆ గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేం దుకు దోహదపడ్డాయి. వాటినే భజన్‌దాస్‌ తన కుమారుడు విజయ్‌రావుకి వారసత్వంగా అందించారు.

విజయ్‌రావు తన తండ్రి చదివిన పాఠశాలలోనే చదువుకున్నాడు. పుణెలోని కాలేజ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ నుంచి 2010లో బీఎస్సీ అగ్రికల్చర్‌లో పట్టభద్రు లయ్యాడు. అనంతరం మహారాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దీంతో ఆయన తన తండ్రి ఇచ్చిన వ్యవసాయ వారసత్వానికి దూరమవుతూ వచ్చాడు. అలా రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. నిరాశకు లోనై గ్రామానికి తిరుగుబాట పట్టాడు. కొన్ని రోజులు పెట్రోల్‌ బంకులో పనిచేశాడు. అప్పుడే తనకు తాను చదివిన వ్యవసాయ డిగ్రీ వ్యర్థమవుతోందనే ఆలోచన కలిగింది. వ్యవసాయం చేయాలని నిర్ణయించు కున్నాడు. అయితే సంప్రదాయ వ్యవసాయం ఖర్చుతో కూడుకున్నది, కాని పాలీ ఫార్మింగ్‌ ద్వారా ఆ ఖర్చును చాలా తగ్గించవచ్చు. ఈ దిశగా ముందడుగు వేశాడు. వ్యవసాయ డిగ్రీ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ పాలీ ఫార్మింగ్‌లో ప్రయోగాలు చేయలేదు. పుస్తకాల్లో చదువుకున్న పాఠాల కంటే వాస్తవంలో పనిచేసి నప్పుడే యువ రైతులు విజయాలను సాధించగలరని బలంగా నిర్ణయించుకున్నాడు విజయ్‌.

పాలీ ఫార్మింగ్‌ పద్ధతినే ఎంచుకున్నాడు. ఈ విధానంలో ఒక నిర్ణీత ప్రదేశంలో నిర్ధారిత పరిక రాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు. కృత్రిమ వాతావరణం కల్పించడం ద్వారా పంటలు పండి స్తారు. ఈ నిర్మాణంలోకి వర్షపు నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, పువ్వుల పెంపకానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తుంటారు. అతి వేడి, చలి నుంచి పంటకు రక్షణ కల్పించి మంచి దిగుబడిని పొందేందుకు పాలీ పద్ధతి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

తొలుత దీని ఏర్పాటుకు ఎక్కువ వ్యయం అయినప్పటికీ ఈ విధానంలో పంట జీవనకాలం పెరుగుతుంది. ఈ పద్ధతి గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఉద్యాన పంటలపై పుణెలో వారం పాటు జరిగిన కార్యశాలలో విజయ్‌ పాల్గొన్నాడు. అనంతరం జాతీయ ఉద్యాన పథకం ద్వారా ముప్ఫై లక్షల రుణం పొంది షెల్గావోలో ఒక ఎకరం భూమిలో పాలీ హౌజ్‌ నిర్మించాడు. మరో పది లక్షలు వెచ్చించి డ్రిప్‌ ఇరిగేషన్‌, మట్టి, తాళ్లు.. తదితర వస్తువులను కొనుగోలు చేశాడు.

అనంతరం మార్కెట్‌ సర్వే నిర్వహించి రంగు రంగుల క్యాప్సికం పంటకు డిమాండ్‌ బాగా ఉన్నట్లు గుర్తించాడు. తొలుత పసుపు రంగు క్యాప్సికం పంట వేశాడు. ప్రారంభంలో పెద్దగా లాభాలు రాకపోయి నప్పటికీ వివిధ రంగుల క్యాప్సికం పంటల్ని పండించడం వల్ల ఫలితాలు రావడం మొదలైంది. నేడు కేవలం పుణెలోనే కాకుండా ముంబై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాలకు క్యాప్సికం ఎగుమతి చేస్తున్నాడు.

విజయ్‌ ప్రతిభ, పనితీరును గమనించిన ప్రభుత్వం తన పాలీ హౌజ్‌ను పరిశీలించింది. 18 లక్షల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. పాలీ హౌజ్‌ నిర్మాణం ఖరీదైనది అనిపించినప్పటికీ తరువాతి కాలంలో పెట్టుబడితో పాటు లాభాలను కూడా అందిస్తుంది. పాలీ హౌజ్‌లో ఒక్కసారి మొక్కలను నాటాక అందులో నుంచి 40 టన్నుల వరకు పంట ఉత్పత్తి లభిస్తుంది. విజయ్‌ పాలీ హౌజ్‌లో కేవలం పది నెలల్లో ముప్ఫై టన్నుల పంట దిగుబడి వచ్చింది.

అంతేకాకుండా పంట క్రిమి, కీటకాల బారిన పడి దెబ్బతినకుండా ఉండేందుకు రసాయన, సంప్రదాయ క్రిమిసంహారకాలను సమపాళ్లల్లో వినియోగించాడు. తద్వారా నేలసారం దెబ్బతిన కుండా చూసుకోవడంతోపాటు పంట రక్షణకు మార్గం ఏర్పడుతుందని ఆయన చెబుతున్నాడు.

‘తరచూ వాతావరణ మార్పుల కారణంగా పంట నష్టపోతుంటారు. అలాంటి నష్టాలను అధిగమించి మంచి దిగుబడిని సాధించేందుకు పాలీ హౌజ్‌ వ్యవసాయ విధానం ఎంతో సహకరిస్తుంది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటలు పండిస్తే లాభాలను పొందవచ్చు. మీ అనుభవాలకు నూతన ప్రయోగాలను జోడిస్తే ఎన్నో అద్భుత ఫలితాలను సాధించవచ్చు’ అంటూ విజయ్‌ యువ రైతుల్ని ప్రోత్సహిస్తున్నాడు.

– సంతోష లక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *