మన్నించు మహాశయా!

మన్నించు మహాశయా!

”ఈ పోరాటంలో నేను ఓడిపోయాను. నీవైనా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

గంగానది ప్రక్షాళనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 111 రోజుల పాటు నిరశన వ్రతం చేసిన జి.డి. అగర్వాల్‌ గొంతు నుంచి అంతిమ క్షణాలలో వెలువడిన మాటలివి. ఆ ఉద్యమంలో తన సహచరుడు, విద్యార్థి దశలో తన శిష్యుడు ఎస్‌.కె.గుప్తాతో ఎంతటి బాధాతప్త హృదయంతో ఈ మాటలు ఆయన అని ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. అంత సుదీర్ఘ నిరశన తరువాత ఆసుపత్రి మంచం మీద నుంచి ఆ గొంతు ఈ మాటలను ఎంత పీలగా పలికి ఉంటుందో అర్థం చేసుకోగలం కూడా. నిజానికి భారతదేశంలో గంగ ప్రక్షాళనకు సంబంధించిన నినాదం కూడా అంతే పీలగా వినిపిస్తోంది. దాని ఆచరణ కూడా అంతంత మాత్రమే. ఈ మాటలు చేదుగానే అనిపించినా, వాస్తవాలే. జి.డి. అగర్వాల్‌ లేదా స్వామి జ్ఞానస్వరూప సనంద గంగానదిని రక్షించడానికి ఆరంభించిన పవిత్రయుద్ధంలో నేలకొరిగారు. అక్టోబర్‌ 11న జరిగిన ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమైనది.

గంగానది భారతీయ ఆత్మ. పురాణాల నుంచి నేటి దాకా ఆ మహోన్నత జలనిధి ఔన్నత్యం గురించి ఏదో కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నాం. నిజమే, ఆ గంగ ఒక్కసారి శరీరాన్ని తాకినా ఆ అనుభూతి వేరు. కానీ దురదృష్టం – ఆ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలన్న నినాదం నినాదాలకే పరిమిత మవుతోంది. ఈ వాస్తవాన్ని 1905లోనే గమనించిన వారు పండిత మదన్‌మోహన్‌ మాలవీయ. ఆయనే ఆ జీవనది పవిత్రను కాపాడేందుకు ‘గంగా మహాసభ’ అనే స్వచ్ఛంద సంస్థను నెల కొల్పారు. దానిని కొనసాగిస్తూ, తనదైన ఆలోచనతో గంగ ప్రక్షాళనకు జీవితాంతం శ్రమించి, చివరికి ఆ కృషిలోనే అసువులు బాసిన మహనీయుడు జి.డి.అగర్వాల్‌.

అగర్వాల్‌ ఒక హిందూ సన్యాసి. అంతేనా! ఆయన విద్యావేత్త. పర్యావరణ ఉద్యమకారుడు. ఆచార్యుడు. సాంకేతిక శాస్త్ర నిధి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లా ఖండ్లలో ఒక సామాన్య రైతు కుటుంబంలో అగర్వాల్‌ 1932లో పుట్టారు. రూర్కీ విశ్వవిద్యాలయంలో (ఇప్పుడు ఐఐటీ రూర్కీ) సివిల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. మొదట ఆ రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేశారు. తరువాత అమెరికా వెళ్లి బర్కెలీలోని కాలిఫోర్నియా విశ్వ విద్యాలయంలో పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా పొందారు. 1979-80లో కేంద్ర కాలుష్య మండలిలో మొదటి సభ్య కార్యదర్శిగా పనిచేశారు. అప్పటికే ఆయన ఐఐటీ రూర్కీలో ఆచార్యుడు. ఐఐటీ కాన్పూర్‌లో సివిల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధిపతిగా కూడా ఆయన పనిచేశారు. అంటే స్వతంత్ర భాతరదేశంలో గంగానది క్షాళన గురించి ఆలోచించిన వారిలో మొదట చెప్పుకోదగిన వారు అగర్వాల్‌.

గంగకు భారతీయులు పట్టించిన దుస్థితిని చూస్తే కళ్లు చెమరుస్తాయి. సగం కాలిన మనుషుల శవాలను, జంతు కళేబరాలను, ఆహారం కోసం కోసిన జంతువుల వ్యర్థాలను, కర్మాగారాల వ్యర్థాలను, రసాయనిక వ్యర్థాలను, పొలాలలో నుంచి వచ్చే మురుగును అంతా ఈ పవిత్ర నదిలోకే వదిలి పెడుతున్నారు. అంటే తమ ఆత్మనే భారతీయులు ఇంత అశుభ్రంగా తయారుచేశారు. దీనిని చూస్తే ఎవరికైనా గుండె చెరువైపోతుంది. పశు కళేబరాలు, నగరాల నుంచి వెలువడే చెత్త అంతా ఆ నదిలోకే తరలించేటంత కుసంస్కారులుగా భారతీయులు తయారయ్యారు. ఈ నికృష్ట ధోరణి నుంచి ఆ నదిని కాపాడుకోవలసిందే. అగర్వాల్‌ మొదటిసారి 2006లో తన శిష్యుడు గుప్తాతో కలసి హిమాల యాలకు వెళ్లారు. గంగ జన్మస్థలమైన హిమాల యాలను ఆవరిస్తున్న కాలుష్యాన్ని చూసి చలించి పోయారు. అప్పుడే గంగ రక్షణకు జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. ఇంత ఉద్యమం చేస్తున్న అగర్వాల్‌ గొప్ప మృదుభాషి. 2008, 2009, 2010, 2012, 2013 సంవత్సరాలలో ఆయన గంగానది రక్షణ కోసం నిరాహార దీక్షలు చేశారు. ఇక ఇదే ఆఖరి దీక్ష అని జూన్‌ 22, 2018న అగర్వాల్‌ ఆమరణ నిరశన ఆరంభించారు. అక్టోబర్‌ 11న తుదిశ్వాస విడిచారు. ఆయన డిమాండ్లు ఏమిటి? అలకనంద, మందాకినిలపై (గంగ ఉప నదులు) నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను నిలిపి వేయాలి. ఆ నదులలో నీరు స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం ఉండాలి. ఆయన నేషనల్‌ గంగా రివర్‌ బేసిన్‌ అథారిటీలో కూడా సభ్యుడే. ఆ సంస్థ నిష్క్రియాత్వా నికి నిరసనగా కూడా ఆయన 75 రోజులు నిరాహార దీక్ష చేశారు. దీనితో అప్పుడు ప్రభుత్వం దిగి వచ్చి 18 మాసాల తరువాత సంస్థను సమావేశపరిచింది. భాగీరథి మీద జల విద్యుదుత్పాన ప్రాజెక్టు నిర్మించడాన్ని ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 2009లో లోహారీనాగ్‌ పాలా జలవిద్యు దుత్పాదన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన దీక్ష ఆరంభించారు. 36 రోజుల తరువాత ప్రభుత్వం దిగి వచ్చి డ్యామ్‌ నిర్మాణాన్ని నిలిపివేసింది. 2011లో ఆయన సన్యాసం స్వీకరించారు. అప్పుడే జ్ఞానస్వరూప సనంద అయ్యారు.

గంగానది క్షాళనకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అగర్వాల్‌ ప్రధాని మోదీకి లేఖరాశారు. తరువాత దీక్ష గురించి హెచ్చరించారు. అప్పటి నుంచి ఆగస్టు వరకు కూడా మోదీ ప్రతినిధులు ఆయనను కలుసు కుంటూనే ఉన్నారు. కానీ ఇదే తన ఆఖరి దీక్ష అని ఆయన సమాధానం ఇచ్చేవారు. చివరికి జూన్‌లో దీక్ష ఆరంభించారు. మొదట నీళ్లు, తేనె కలిపిన నిమ్మరసంతో దాదాపు 108 రోజులు ఉన్నారు. చివరన మంచి నీళ్లు కూడా ఆపేశారు. అప్పుడే ఆయనను హృషీకేశ్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన అంతిమ శ్వాస విడిచారు. పైగా ఆయన తన పార్థివ శరీరాన్ని వైద్య పరిశోధనల కోసం అప్పగించాలని ఆదేశించారు.

ఆధునిక ప్రపంచంలో నదుల అవసరాలు వేరు కావచ్చు. వాటిని ఉపయోగించుకుంటున్న తీరు భిన్నంగా ఉండవచ్చు. అయినంత మాత్రాన వాటిని కలుషితం చేసే హక్కు మనకు లేదు. ఆ అవసరాలకు వినియోగించుకుంటూనే నదుల పవిత్రతను కాపాడడంతో పాటు, కాలుష్యం నుంచి కూడా రక్షించాలి. ఇది భారతీయులకు కూడా గుర్తు చేయవలసి రావడమే దురదృష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *