వాళ్లకు మాత్రమే ఆ స్వేచ్ఛ

వాళ్లకు మాత్రమే ఆ స్వేచ్ఛ

‘కన్యాశుల్కం’ నాటకంలో కరటకుడు అనే మహా మేధావి కనిపిస్తాడు. ఆయన ఒక అసాధారణ సిద్ధాంతాన్ని ఈ లోకం మీదకి వదిలిపెట్టాడు. వేసేవి సంస్కృత నాటకాలే అయినా గిరీశం వంటివారి నీడ పడి, వ్యక్తీకరణకి ఆంగ్లాన్ని ఆశ్రయించడం నేర్చాడు. అర్థం కాకపోయినా పదాలు గంభీరంగా ఉంటాయి. దాంతో అవతలి వాళ్లని డంగైపోయేటట్టు చేయవచ్చు కదా! నాచ్‌ అనగా, వేశ్య. యాంటీ నాచ్‌ అనగా వేశ్యావృత్తిని నిర్మూలించాలని కంకణం కట్టుకోవడం. ఈ యాంటీ నాచ్‌ వ్రతం పాటిస్తున్న వారి వైవిధ్యం గురించి రమణీయంగా వర్గీకరించాడు కరటకశాస్త్రి. కొందరు పగలు యాంటీనాచ్‌. కొందరు రాత్రికి ప్రోనాచ్‌. అంటే పగటివేళ వేశ్యా సంపర్కాన్ని నిలువెల్లా ద్వేషిస్తారు. రాత్రయితే రహస్యంగా వాళ్లకోసం వెంపర్లాడతారు. కొందరు సొంతూర్లో యాంటీ నాచ్‌. పొరుగూరు వెళితే ప్రోనాచ్‌. చెప్పొచ్చేదేమిటంటే భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి మన వామపక్ష మేధావులు, కాంగ్రెస్‌ వారిని ఇలాగే వర్గీకరించవచ్చు.

రాముణ్ణి దూషిస్తే అది భావ ప్రకటనా స్వేచ్ఛ. సీతమ్మని నీచంగా చిత్రిస్తే అది కూడా భావ ప్రకటనా స్వేచ్ఛే. బీజేపీనీ, ఆర్‌ఎస్‌ఎస్‌నీ ఆడిపోసుకోవడం ఉత్తమ శ్రేణి భావప్రకటనా స్వేచ్ఛ. కసబ్‌నీ, మసూద్‌ అజర్‌ని విద్యాలయాలలో వేనోళ్ల కీర్తించడం భావ ప్రకటనా స్వేచ్ఛ. మోదీ ఈ దేశ ప్రధాని, ఆయనని కాల్చి పారేయ్యాలని వాగుతావా; తాగావా? అని అడిగితే, ప్రధాని అయితేనేం, నా భావ ప్రకటనా స్వేచ్ఛ నాది కాదా! అని అరుస్తారు ఇంకొందరు.

భారతదేశంలో కాంగ్రెస్‌, ఇక్కడే కొన్ని రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాలలో కొన్నిచోట్ల కమ్యూనిస్టులు అధికారంలో ఉంటే లేదా ఉన్నప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి వీళ్ల నిర్వచనం వేరుగా ఉంటుంది. అందుకు కొలబద్దలు ప్రత్యేకంగా ఉంటాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఒక రకం భావ ప్రకటనా స్వేచ్ఛ. అధికారంలో ఉన్నప్పుడు మరోరకం భావ ప్రకటనా స్వేచ్ఛ. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సినిమా తీసే దర్శకుడికి అరచి గీపెట్టినా భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండకూడదు. అలాగే ఎంత గగ్గోలు పెట్టినా మోదీకి అనుకూలంగా సినిమా తీసిన దర్శకుడికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండరాదు.

గుల్జార్‌ వంటి సృజనాత్మకత ఉన్న దర్శకుడు, కవి 1975లో ‘ఆంధీ’ (తుపాను) అనే సినిమా (హిందీ) తీశారు. ఇందులో సుచిత్రాసేన్‌, సంజయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది విడుదలైన కొద్దిరోజులకి నిలిపివేయించారు. ఇది ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని ఒక కారణం చూపించారు కాంగ్రెస్‌ వారు. రెండు- ఇది కాంగ్రెస్‌ ప్రతిష్టకు భంగం కలిగించే సినిమా. ఈ సినిమాలో సుచిత్రాసేన్‌, సంజయ్‌కుమార్‌ల పాత్రలు ఇందిర, ఆమె భర్త ఫిరోజ్‌ జీవితాలకు దగ్గరగా ఉంటాయి. కాబట్టి నిషేధించారు. ఇది అత్యవసర పరిస్థితి నేపథ్యంలో జరిగింది. ఆ కాలంలోనే కిస్సా కుర్సీకా అనే మరొక చిత్రం (హిందీ) వచ్చింది. అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర మీద వచ్చిన ఆరోపణలు అసాధారణమైనవి. ఆమె కుమారుడు సంజయ్‌ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా పేరు సంపాదించు కున్నాడు. ఈ ఇద్దరి నిర్వాకాలను వ్యంగ్యంగా చిత్రించినదే కిస్సా కుర్సీకా. అమృత్‌ నహతా దర్శకుడు. బద్రీప్రసాద్‌ జోషి నిర్మాత. ఈ చిత్రాన్ని నిషేధించి ప్రింట్లు జప్తు చేశారు. నెగిటివ్‌లను దగ్ధం చేశారు. కానీ మోదీ భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాశారని కాంగ్రెస్‌ వారు, కమ్యూనిస్టు మేధావులు కొన్నేళ్ల పాటు వీలు దొరికినప్పుడల్లా టీవీ చానళ్లలో ఊదరగొట్టారు. రష్యాలో, చైనాలో రచయితలకు ఆ ప్రభుత్వాలు ఎలాంటి గతి పట్టించాయో కూడా ప్రపంచానికి తెలుసు.

ఈ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు మేధావులు టీవీలో రామాయణ సీరియల్‌ వస్తే హిందూత్వ అజెండాను రుద్దుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు. చాణక్య సీరియల్‌లో కాషాయ పతాకాలు కనిపిస్తే అది కూడా బీజేపీకి మద్దతు అన్నారు. అంటే హిందూత్వకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి భావ ప్రకటనా స్వేచ్ఛ జన్మహక్కు. అనుకూలంగా మాట్లాడితే, అనుకూలమైన చిత్రం వస్తే దానిని నిషేధించేవరకు నిద్రపోరు.

ఇందుకు మంచి ఉదాహరణ ‘పిఎం నరేంద్రమోదీ : స్టోరీ ఆఫ్‌ ఏ బిలియన్‌ పీపుల్‌’. నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. ఉమంగ్‌ కుమార్‌ దర్శకుడు. ఆనంద్‌ పండిట్‌ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైన ఐదు రోజులలో దీనిని 18.8 మిలియన్ల మంది వీక్షించారు. దీనితో కాంగ్రెస్‌కు గుబులు రేగింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని కాంగ్రెస్‌ బృందం ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించింది. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్‌తో అంటకాగుతూ, రాహుల్‌ను భావి ప్రధానిగా ఆరాధిస్తున్న డీఎంకే కూడా ఎన్నికల కమిషన్‌కు ‘పీఎం నరేంద్రమోదీ’ సినిమాను నిషేధించాలని లేఖ రాసింది. ఈ సినిమా సంవత్సరం క్రితం వచ్చి ఉంటే కాంగ్రెస్‌, ఆ పార్టీ వంతలు భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవిస్తూ అడ్డంకులు సృష్టించకుండా ఉండేవారని అనుకోవడానికి వీలుందా? లేదు.

అస్సాంలోని గువాహతిలో ఆగస్టు 14, 2018న ఒక 32 నిమిషాల సినిమా ప్రదర్శించారు. శ్రీమంత శంకరదేవ కళాక్షేత్ర ఆడిటోరియంలో దీనిని ప్రదర్శించారు. పేరు, ‘చలో జీతే హై’. నరేంద్ర మోదీ బాల్యం ఆధారంగా తీసిన చిత్రమే. అసలు ఎన్నికల గొడవ ఏదీ లేనప్పుడు ఈ చిన్న సినిమా విడుదల చేస్తే, ఇది వచ్చే సంవత్సరం ఎన్నికల కోసం జరుగుతున్న ప్రోపగండా అంటూ ప్రచారం లేవదీసింది విపక్షం. పైగా దీనికి కొన్ని కళాశాలల విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాలని కామరూప మెట్రో జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేయడమేమిటని అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఆసు) విమర్శించింది. నిజానికి అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని తరువాత జిల్లా యంత్రాంగం వివరణ ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న భావ ప్రకటనా స్వేచ్ఛ రంగు రుచీ ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది.

అలాగే ఎన్‌టిఆర్‌ జీవితం ఆధారంగా బాలకృష్ణ రెండు సినిమాలు తీసి విడుదల చేయవచ్చు. కానీ రామ్‌గోపాల్‌ వర్మ బాలకృష్ణ సినిమాలు మరుగు పరిచిన విషయాలతో సినిమా తీస్తే దాని నోరు నొక్కారు. బాలకృష్ణకి ఒక రకం భావ ప్రకటనా స్వేచ్ఛ. ఆర్‌జీవీకి మరొకరకం భావ ప్రకటనా స్వేచ్ఛ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *