ఏ దేశంలో నివసిస్తే ఆ దేశపు చట్టాలనే అనుసరించాలి

ఏ దేశంలో నివసిస్తే ఆ దేశపు చట్టాలనే అనుసరించాలి

ఇమామ్‌ షేక్‌ మహమ్మద్‌ తావిదితో ఇంటర్వ్యూ…

ఇస్లాంలో సంస్కరణలు తీసుకురావాలని ఆశిస్తున్న ఇమామ్‌ షేక్‌ మహమ్మద్‌ తావిది ఇరాన్‌లో జన్మించారు. ఆస్ట్రేలియా పౌరసత్వం తీసుకున్నారు. ఆయన విద్యావేత్త, మేధావి, చక్కని వక్త. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాంలో సంస్కరణల కోసం శ్రమిస్తున్న వారిలో తావిది ఒకరు. ముఖ్యంగా తీవ్రవాదం నశించాలని, ప్రపంచంలో శాంతి నెలకొనాలని కృషి చేస్తున్నారు. ప్రస్తుతం తావిది వాషింగ్టన్‌ డి.సి. కేంద్రంగా పని చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఇస్లాం సమావేశాలు జరిగినా ఇస్లాం సమాజం తరఫున ప్రతినిధిగా పాల్గొనేందుకు ఇస్లాంలోని అనేకమంది అయాతుల్లాలు, ఇస్లాం సంస్థల అధికారులు ఇమామ్‌ షేక్‌ మహమ్మద్‌ తావిదికి అనుమతినిచ్చారు.

ఇటీవల తావిది తన ట్విటర్‌ ఖాతాలో నమోదు చేసిన పోస్టులో తాను ‘ది ట్రాజెడి ఆఫ్‌ ఇస్లాం’ అనే పుస్తకం రాశానని, ఇది రాయడానికి 4028 గంటల సమయం పట్టిందని, ఈ పుస్తక రచన కారణంగా తాను హత్యకు కూడా గురి కావచ్చని రాశారు. తావిది ఐఎస్‌ఐఎస్‌కి వ్యతిరేకంగా ‘ఫత్వా’ జారీ చేశారు. ఇస్లాం పేరుతో జరుగుతున్న తీవ్రవాదానికి, సున్నీ-వహాబీల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటారు.

తావిదికి భారతదేశం పట్లకల ప్రేమాభిమానాలు అందరికీ తెలిసినవే. ఫిబ్రవరి 7న ఢిల్లీలో జరిగిన ఒక సాంస్కృతిక సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన షేక్‌ మహమ్మద్‌ తావిది ఆర్గనైజర్‌ ఆంగ్ల వారపత్రిక ప్రతినిధులు డా||ప్రమోద్‌ కుమార్‌, నిషాంత్‌ ఆజాద్‌లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తావిది భారతీయ ముస్లింలకు సంబంధించిన అనేక అంశాలపైనా, ప్రపంచవ్యాప్తంగా ఇస్లాంలో జరగాల్సిన సంస్కరణల గురించి, ఇస్లామిక్‌ తీవ్రవాదం పట్ల మేధావుల స్పందన, తనకు భారత్‌ పట్ల కల అభిమానం, ప్రధాని మోదీ అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాల గురించి తన విలువైన అభిప్రాయాలను తెలిపారు. ఆ వివరాలు ఇక్కడ ఇస్తున్నాము.

భారతదేశానికి వచ్చిన మీకు సాదర స్వాగతం. ఈ దేశానికి మొదటిసారి వస్తున్నారా?

కృతజ్ఞతలు. అవును నేను భారతదేశానికి అధికారికంగా మొదటిసారి వచ్చాను.

ఇక్కడ దిగగానే ఎటువంటి భావనలకు లోనయ్యారు?

ఈ దేశ అతిథి మర్యాదలు, ఇక్కడి ప్రజల దేశభక్తి, నన్ను ఆహ్వానించిన తీరు నన్ను మంత్ర ముగ్ధుణ్ణి చేశాయి. ఇదే నా చివరి పర్యటన కాదని చెప్పగలను. నేను మరల మరల భారతదేశ పర్యటనకు రావచ్చు.

మీరు సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టుల ద్వారా మీకు భారతదేశం పట్ల ఉన్న ఆదరాభిమానాలు తెలుస్తున్నాయి. భారతదేశంతో మీకున్న సంబంధాన్ని ఏవిధంగా చూస్తారు?

ప్రపంచంలో భారత్‌ ఒక ముఖ్యమైన దేశం. భారతదేశం పట్ల, ఇక్కడి సంస్కృతి, కళలు, ప్రజలు, ఇక్కడి సఫల రాజకీయాలు అన్నింటి పట్ల నాకు అపారమైన ప్రేమ. రాజకీయం అంటే నా ఉద్దేశం ప్రధానమంత్రి మోదీ అని. మానవత్వం వికసింప చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు భారత దేశానికి ఉన్నాయని నా నమ్మకం. అదే సమయంలో భారతదేశంతో స్నేహసంబంధాలు నెరపే ప్రతిదేశం కూడా భారత్‌ లాగే బాగుపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతేకాదు ఆయా దేశాల లోని ప్రజలు మంచివారుగా కూడా మారుతారు. ఈ దేశ ప్రజలలో కల మానవత్వం గురించి నేను మాట్లాడుతున్నాను.

మీరు ఇమామ్‌గా జీవనం ప్రారంభించారు. ఇప్పుడు భారత్‌ అభిమానిగా మారారు. ఈ వ్యవధిలో మీకు లభించిన అనుభవాలను తెలియజేస్తారా?

వాస్తవానికి నేను మూడవ తరానికి చెందిన ముస్లిం ఇమామ్‌ని. నేను ఇతర మతాల నుండి ముస్లిం మతానికి మారినవాడిని కాను. 2010లో నన్ను ఇరాన్‌లో ఇమామ్‌గా నియమించారు. నా జీవితంలో అధిక సమయం ఇమామ్‌గానే గడిపాను. నేను ప్రంచమంతా పర్యటించాను. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో పాల్గొన్నాను. ఇటీవల యూరోపియన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించాను.

ఇటీవల మీరు రచించిన పుస్తకం ‘ది ట్రాజెడి ఆఫ్‌ ఇస్లాం – అడ్మిషన్స్‌ ఆఫ్‌ ఏ ముస్లిం ఇమామ్‌’ విడుదల చేశారు. ఆ సందర్భంగా మీరు మాట్లాడుతూ ఈ పుస్తకం విడుదల తరువాత నేను హత్యకు గురికావచ్చని అన్నారు. మీరు రచించిన ఆ పుస్తకంలో ఉన్న విషయమేంటి? మీరు అలా ఎందుకు అన్నారు?

ఆ పుస్తకంలో ముఖ్యంగా నా జీవితం గురించే ఉంటుంది. నా జీవితంలో సాంఘికంగా, మతపరంగా, సామాజికంగా జరిగిన అనుభవాలే అందులో క్రోడీక రించాను. మనుషుల ద్వారా ఏర్పాటయిన భావనల వల్ల మా మతంలో ఉన్న కష్టాలను అందులో పేర్కొన్నాను. ఈ విషయం మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. మా మతం పేరుతో నడుస్తున్న తీవ్రవాదాన్ని నేను విమర్శించాను. మా మతంలో సాంఘిక సంస్కరణలు రావాలని కోరుకున్నాను. ఇవి తీవ్రవాదులపై ప్రభావం చూపాయి. ఫలితంగా నామీద దాడులు జరిగాయి. నేటికీ నా మొహంపై ఆ దాడుల గుర్తులు చూడవచ్చు. వారు చేసే దుశ్చర్యలను నేను చాలా మటుకు బయటపెట్టాను. ఫలితంగా నా మీద దాడులు చేసే అవకాశాలు అధికమయ్యాయి.

మీరెప్పుడూ సంస్కరణల గురించి చెపుతుంటారు, రాస్తుంటారు. మీ మతంలో ఎలాంటి సంస్కరణలు రావాలని కోరుకుంటున్నారు? ఆ సంస్కరణలు అవసరమని మీరెందునుకుంటున్నారు ?

నా అభిప్రాయంలో ఇస్లాం అబ్రహమిక్‌ మతం. మతాలన్నీ సంస్కరించవలసినవే. అందుకే ఇస్లాం లోనూ మంచి సంస్కరణలు తేవాలని నా ప్రయత్నం. సమాజ సంస్కరణే కాకుండా ఒక ముస్లిం మనస్సును మార్చే ప్రయత్నం చేస్తున్నాను. మతానికి సంబంధించిన పుస్తకాలలోని విషయాన్ని మార్చినంత మాత్రాన సమాజంలో మార్పు రాదు. మనుషుల ఆలోచనలలో మంచి మార్పులు రావాలి. ఇప్పటివరకైతే నా పనిలో అభివృద్ధి కనిపిస్తోంది. అందులో విజయం సాధించగలననే నమ్మకం నాకుంది.

మీరు తేవాలనుకున్న సంస్కరణల పనిలో ఏవైనా అడ్డంకులు ఎదురౌతున్నాయా?

సంస్కరణలు ఫలించడానికి కొన్ని విషయాలు అవసరమవుతాయి. అందులో మొదటిది వనరులు. ముఖ్యంగా డబ్బు, ప్రసార మాధ్యమాలు, మాట్లాడ టానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, సంక్షేమం, భద్రత ఉన్నప్పుడే బోధనలు అందరికీ చేరుతాయి. మరో విషయం ఏమిటంటే తీవ్రవాదులు, వామపక్ష భావజాలురు అంటే ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు, మీడియా వంటివి మా గొంతును అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంటాయి.

ఆ మధ్య మీరొక ఇంటర్వ్యులో మాట్లాడుతూ మీపై ‘నకిలీ షేక్‌’ అనే ముద్ర వేశారని అన్నారు. అలా ఎందుకు ?

తీవ్రవాదాన్ని ఎవరు వ్యతిరేకించినా వారిపై ‘నకిలీ’ అనే ముద్ర వేయడం ఇప్పుడు పరిపాట యింది. ఇటువంటి స్థితిని ఎవరికి వారు వారి స్వంత మతంలోనే ఎదుర్కొంటున్నారు. ఒక చర్చి ఫాదర్‌ క్రైస్తవ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అతడిపై ‘నకిలీ ఫాదర్‌’ అని ముద్ర వేస్తారు. హిందుత్వంలోనూ ఇలాగే జరుగుతుంది. అతివాదులకు వ్యతిరేకంగా మాట్లాడేవారంతా నకిలీలని ముద్రపడుతున్నవారే. నా విషయంలో నేను చెపుతున్నవాటికి ఆధారాలు దృఢంగా ఉన్నాయి. తామే ‘అసలు’ అనుకుంటున్న వారి గుర్తింపు, అనుమతి నాకు అవసరం లేదు. వారు నన్ను ఒప్పుకోకపోవడమే నాకు ఆనందం. వారు నాకు మద్దతిస్తేనే భయం.

భారతీయ ముస్లిములలో ట్రిపుల్‌ తలాక్‌, హలాల్‌, బహుభార్యత్వం వంటి సమస్యలున్నాయి. మీ అభిప్రాయం ?

నా జవాబు సూటిగా చెప్తాను. ముస్లిములు ఏ దేశంలో నివసిస్తే ఆ దేశపు చట్టాలను అనుస రించాలి. అంతేకాని వారి స్వంత చట్టాలు కాదు. వారి మసీదులో ఇమామ్‌ ఉంటే ఉండవచ్చు. కాని దేశంలో ఉన్న అన్ని మతాలకన్నా ఆ దేశపు చట్టాలు గొప్పవి. ఏ దేశంలోని మతాలు ఆ దేశపు చట్టాలను అనుసరించాలి. ఈ చిన్న సూచన పాటిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.

షరియా చట్టం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

షరియా అనేది మిగతా చట్టాల వంటిదే. ప్రభుత్వ అధికారంలో మత పెద్దలు పాలుపంచుకుంటున్న దేశాలలో అంటే సౌదీ అరేబియా, ఇరాన్‌, పాకిస్తాన్‌ మొదలగు దేశాలకు ఈ చట్టం వర్తిస్తుంది. కాని భారతదేశం సెక్యులర్‌ దేశం. ఈ దేశంలో షరియా వర్తించదు. షరియా చట్టం అమలు చేయాలని కోరే వారు, వద్దు అనే వారి సంఖ్యలో చాలా అంతరం ఉంది. ఉదాహరణకు పాకిస్తాన్‌లో మెజారిటీ ప్రజలు షరియా చట్టం కావాలని కోరుకుంటున్నారు. అక్కడి మైనారిటీలు షరియా చట్టం వద్దని అంటున్నారు. కాని పాకిస్థాన్‌లో మెజారిటీ ప్రజలు షరియాకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అక్కడి ప్రభుత్వం కూడా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నది. పాకిస్తాన్‌లో ఎలాగైతే మెజారిటీ ప్రజల అభిష్టాన్ని అమలు చేస్తారో అదేవిధంగా భారత్‌లో కూడా మెజారిటీ ప్రజల కోరికను మన్నించి తీరాలి.

ఐసిస్‌ టెర్రరిస్టులు ఖురాన్‌ పేరు మీద తాము చేస్తున్న తీవ్రవాద కార్యకలాపాలను సమర్థించుకుంటారు. అమాయకులైన ప్రజలను అంతమొందించడానికి మద్ధతుగా ఖురాన్‌లోని కొన్ని పంక్తులను పేర్కొంటారు. దీనిపై మీ అభిప్రాయం?

ఖురాన్‌ను నేరుగా చదివితే అర్థం కాదు. దాని వ్యాఖ్యానాలు చదవాలి. ఇస్లాంలో ప్రపంచవ్యాప్తంగా రెండు ప్రధాన వర్గాలు, వాటిలో 72 గ్రూపులు, అనేక ఆలోచనా విధానాలున్నాయి. ముస్లిములందరు సమానం కాదు, అందరూ ఒకే పద్ధతిని విశ్వసించరు. మహమ్మద్‌ ప్రవక్తను ముస్లిములందరు ఒకేలా విశ్వసించరు. వారు ఆలోచించేదానిని బట్టి చూస్తే ముస్లిములను ఆధునికవాదులు, తీవ్రవాదులు అని రెండుగా విభజించవచ్చు. తీవ్రవాదులు ఇస్లాం గురించి తమకు అనుకూలంగా వ్యాఖ్యానిస్తుంటారు. ఇక పాకిస్తాన్‌, ఐసిఎస్‌ చేస్తున్న హింస గురించి మాట్లాడితే అది వారి రాజకీయ హక్కు అంటారు. ఇలా ప్రతి ప్రభుత్వం తాను చేస్తున్న హింసకు మతాన్ని అడ్డుపెట్టుకుంటుంది. ఇక ఐసిస్‌ అనేది ఒక మత సంస్థ కాదు, వారు మతాధికారులూ కాదు. ఐసిస్‌ కేవలం ఒక సైన్యం. తమను వ్యతిరేకించిన వారిని హతమార్చడమే వారి పని. వారు చేసే హింసను సమర్థించుకోవడానికి మతాన్ని వాడుకుంటారు. మతాన్ని వాడుకుని యువకులను ఐసిస్‌లో చేర్చుకుంటున్నారు. నేను ఐసిస్‌కు కాని, వారు ఇస్లాం గురించి చేస్తున్న వ్యాఖ్యానాలకు కాని అభిమానిని కాను. పూర్తి వ్యతిరేకిని.

ఇస్లామిక్‌ ఛాందసవాదులే కాదు, ఉదారవాదులు కూడా మీ అభిప్రాయాలను వ్యతిరేకిస్తారు, మీరు ఇస్లాం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని అంటున్నారు. దీనికి మీ సమాధానం?

ప్రజలకు తమ అభిప్రాయాలను తెలియజేసే స్వాతంత్య్రం ఉంటుంది. వారు నా గురించి ఏమను కుంటున్నారో నాకు తెలియదు. నేను మొదటినుండి ఒకేమాట చెబుతున్నాను. నేను మా దేవుడిని, మతాన్ని ఎన్నడూ విమర్శించలేదు. కేవలం తీవ్రవాదాన్ని, తీవ్రవాదులను వ్యతిరేకిస్తాను. ఒకవేళ వారు ఉదారవాదులైతే మైనారిటీల హక్కులను కాపాడడానికి కృషిచేయాలి. కాని అలా చేయడం లేదు. నేను మైనారిటీకి చెందిన వాడిని. మరి నాకు నా భావాలను ప్రకటించే స్వేచ్ఛ ఎందుకు ఇవ్వరు? ఎందుకు నాకు మద్దతు ఇవ్వరు?

మీరు భారత్‌కు వచ్చారు కాబట్టి, ఇక్కడి ప్రధాని మోదీ గురించి మీ అభిప్రాయాలను వినాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

నేను మోదీకి సంపూర్ణంగా మద్దతిస్తాను. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ రోజు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను. కొంతమంది మోదీ విషయంలో తప్పుపట్టే విధంగా ప్రశ్నించారు. కాని నేను నా సమాధానం మార్చుకోలేదు. మోదీ గొప్ప నాయకుడు, సమర్థుడైన పాలకుడు. ఆయనొక గొప్ప దేశభక్తుడు, తన దేశం విలువ తెలుసు. ఆయన ఇప్పటి తరం రాజకీయ నాయకుడు మాత్రం కాదు. ఇప్పటి రాజకీయ నాయకులు అబద్దాలు చెబుతారు, మోసం చేస్తారు, ప్రజలను దగా చేస్తారు. ఇవేవి మోదీ చేయరు కాబట్టి మోదీని రాజకీయ నాయకుడిగా నేను భావించను. ముందుచూపుగల మేధావి ఆయన. చూడండి నేను ఇరాక్‌ దేశానికి చెందినవాడిని. ఒకవేళ ఇరాక్‌కు మోదీలాంటి ప్రధానమంత్రి ఉంటే ఇరాక్‌లో ఐసిస్‌ ఉండేది కాదు. ఇరాక్‌ ఇన్ని సమస్యలు ఎదుర్కొనేది కాదు. దేశ ప్రధాన సమస్యలైన జాతీయభద్రత, ఆర్థికపరమైన, విదేశీ సంబంధాలపైన స్పష్టమైన అవగాహన కలిగిన ప్రధాని మాకు కావాలి. ఉండాలి. పై మూడు విషయాలలో మోదీ నిష్ణాతుడు. ఆయన వామపక్షీయులపై ఆధారపడడు. ఆయనకు ఎవరి అనుమతి అవసరం లేదు. మోదీ స్ఫురద్రూపి. ఒక విజన్‌ ఉంది, ఆయన తను చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉంటారు. అందుకే నాకు ఆయనంటే గౌరవం. నేను భారతీయుడిని కాను, నేనిక్కడ ఓటు వేయడం లేదు. మోదీ అయినా రాహుల్‌ అయినా నాకు ఒకటే. మోదీ విషయంలో నా అభిప్రాయం చెప్పాను.

ముస్లిం మహిళల వినతుల మేరకు మోదీ ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించింది. దీనిపై మీ అభిప్రాయం?

ఇంతకు ముందు నేను చెప్పిన విషయం ఇక్కడ వర్తిస్తుంది. మనం ఏ దేశంలో నివసిస్తున్నామో ఆ దేశ చట్టాలను పాటించాలి.

ఈ రోజుల్లో స్వేచ్ఛావాదులు, సెక్యులర్‌ వాదులు హిందూ దేవీదేవతలను, కించపరచడం, విమర్శిం చడం పరిపాటి అయింది. వారు బహిరంగంగా హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు. కాని ముస్లిం, క్రైస్తవుల గురించి పల్లెత్తు కూడా మాట్లాడరు ఎందుచేత?

నేను మీకు రెండు సమాధానాలు చెబుతాను. రెండూ భిన్నంగా ఉంటాయి. ఒక జవాబు పశ్చిమ దేశాలలో చదువుకున్న వారు చెప్పినట్టుగా ఉంటుంది. దాన్నే ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అంటారు. ఇక రెండవ జవాబు భిన్నంగా ఉంటుంది. హిందూ దేవీ దేవతలను అవమానించే వారిని అనుమతించే వారు మహమ్మద్‌ ప్రవక్తను అవమానించడానికి ఎందుకు అనుమతించరు. అక్కడ వారికి ‘నో’ అంటారు. మరి హిందూ దేవీ దేవతలను అవమాన పరచడానికి ఎందుకు అనుమతిస్తారు? ముఖ్యంగా అలాంటి వారందరు వామపక్షీయులే. సెక్యుల రిస్టులని చెప్పుకునే వారు మహమ్మద్‌ ప్రవక్తను, క్రీస్తును అవమానపరచే రాతలకు అనుమతించ గలరా? ఆ పని చేయలేరు. ఇది వారి ద్వంద్వనీతి. మీరు సమంగా వ్యవహరించండి. ఒకరి పట్ల ప్రేమ, మరొకరి పట్ల ద్వేషం చూపకండి. ఈ సమస్యపై ఇదీ నా అభిప్రాయం.

భారతదేశానికి పొరుగు దేశం పాకిస్తాన్‌. భారత్‌, పాకిస్తాన్‌ల సంబంధాలు మీకు తెలిసినవే. పాకిస్తాన్‌పై మీ అభిప్రాయం?

పాకిస్తాన్‌ పట్ల నా అభిప్రాయం వివాదాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే నేను పాకిస్తాన్‌ను ఒక దేశంగా గుర్తించను. కొన్ని దేశాలు ఇతర దేశాలను గుర్తించవు. వాటికి ఆ దేశాలలో దౌత్య కార్యాలయాలు ఉండవు. నేను రాజకీయాలలో లేను, ఒక వేళ నేను మా దేశం ఇరాక్‌కు ప్రధానమంత్రిని అయి ఉంటే అక్కడ పాకిస్తాన్‌ విదేశీ రాయబార కార్యాలయాన్ని అనుమతించేవాడిని కాదు. ఎందుకంటే పాకిస్తాన్‌ను నేను ఒక దేశంగా అంగీకరించను. అసలు పాకిస్తాన్‌లో ఉన్నది ప్రభుత్వం కానేకాదు. అది ఒక గ్యాంగు. ప్రజలు మంచివారే కాని ఈ ‘గ్యాంగు’ సరైనవారు కారు. పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం. చక్రం తిప్పేది సైన్యమే. అదొక విఫలమైన దేశం. టెర్రరిస్టుల స్వర్గధామం. అందుకే నేను పాకిస్తాన్‌ను ఒక దేశంగా గుర్తించను. ఇది నా అభిప్రాయం. ఇటువంటి అభిప్రాయం కారణంగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయినా సరే నేను పాకిస్తాన్‌ను దేశంగా గుర్తించను.

పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు, యూదులు, క్రైస్తవుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం?

తమ దేశంలో మైనారిటీల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం పాకిస్తాన్‌ ప్రభుత్వానికి తెలుసు. అది అన్యాయమని తెలుసు. కాని ప్రభుత్వం వారి గురించి ఆలోచించదు. దీనిపై అమెరికా, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకంటే పాకిస్తాన్‌లో ప్రభుత్వమే మైనారిటీలకు వ్యతిరేకం. పాకిస్తాన్‌లో తాలిబాన్‌ టెర్రరిస్టులు స్వేచ్ఛగా తిరుగుతారు. కాని మైనారిటీలు తిరగలేరు. పాకిస్తాన్‌ చెప్పేవన్నీ అబద్ధాలే, చేసేవన్నీ వంచనలే. అందుకే ట్రంప్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయాన్ని నిలిపివేసింది.

కశ్మీర్‌లో టెర్రరిజానికి పాకిస్తాన్‌ మద్దతు ఇస్తోంది. పాలస్తీనా సమస్యను సమాంతరంగా ఈ సమస్యను తెరపైకి తెస్తోంది. దీనిపై మీ అభిప్రాయం?

కశ్మీర్‌ భారత్‌కు చెందినది. మరి పాకిస్తాన్‌ కశ్మీర్‌లో టెర్రరిజాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్థం కావడం లేదు. నిజానికి పాకిస్తాన్‌ కూడా హిందూభూమే. 70 ఏళ్ల క్రితంవరకు పాకిస్తాన్‌ భారత్‌లో అంతర్భాగమే. వాళ్లే స్వాతంత్య్రం కావాలని విడిపోయారు. కాబట్టి భారత్‌లోని ఇతర ప్రదేశాలలో జోక్యం చేసుకునే అధికారం వారికి లేనేలేదు. ఇదే నా అభిప్రాయం.

అయోధ్యలో రామమందిరంపై మీ అభిప్రాయం?

ఈ విషయంపై చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు. కాని నా అభిప్రాయం ఏమంటే, ఇస్లాంలో ఒక చట్టం ఉంది. నేనొకవేళ నీ స్థలంలో నమాజ్‌ చేయాలంటే నాకు నీ అనుమతి కావాలి. ఒకవేళ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అనుమతిస్తే తప్ప మీ ఇంటిలో నేను నమాజు చేయలేను. అయోధ్యలో నిర్మించిన బాబ్రీ మసీదు ఆక్రమణ చేసి కట్టింది. ఒకవేళ మొదటి నుండి మసీదు ఉన్నా దాని యజమాని అనుమతి లేనిదే అక్కడ నమాజు చేయరాదు. అలా అనుమతి లేకుండా నమాజు చేస్తే అది ఫలితమివ్వదు అని ఇస్లామిక్‌ న్యాయం చెపుతుంది. అయోధ్య విషయంలో ఆర్కియలాజికల్‌ సాక్ష్యం అవసరం లేదు. అక్కడ ఉన్న కట్టడాన్ని కూల్చి ఖలీపాలు మసీదు నిర్మించారని కట్టడాల ద్వారా స్పష్టంగా తెలియ వస్తోంది. పాలస్తీనాలో కూడా అలా చేసారు. సోలోమాన్‌ గుడి సమస్య అలాంటిదే.

భారతదేశ ఎన్నికలలో ముస్లిం కార్డును ప్రతి రాజకీయ పార్టీ ఉపయోగిస్తున్నది. ఎన్నికలలో సంస్కరణ వాదులైన ముస్లిం నాయకులు తమ గొంతును వినిపించలేకపోతున్నారు?

ముస్లిములలో కొంతమంది సంస్కరణ వాదులున్నారు. వారు నన్ను ట్విట్టర్‌లో అనుసరిస్తారు. ముస్లిములలో సంస్కరణలు తేవాలని వారు అభిలషిస్తారు. కాని వారి మాటలను ఎవరు వింటారు? మీడియా కూడా వారిని అనుమతించదు. ఈ కారణంగా సంస్కరణ వాదులు ముందుకు రాలేకపోతున్నారు.

భారత్‌లో ముస్లిములు వెనకబడి ఉన్నారని అంటున్నారు. దీనికి కారణమేమిటి?

ముస్లిములు వెనకబడి ఉన్నారంటే నేను ఒప్పుకోను. వివిధ రంగాలలో ఎందరో ముస్లిములు అగ్రగాములుగా ఉన్నారు. తీవ్రవాద ముస్లిములే వెనకబడి ఉన్నారని నా అభిప్రాయం.

ముస్లిములు ఆధునిక విద్యకన్నా మతపరమైన విద్యకే మొగ్గు చూపుతారు ఎందుచేత?

నిజమే! ఇదొక పెద్ద సమస్య. మలేషియా ప్రధానమంత్రి తమ దేశ ప్రజలను ఆధునిక చదువులు చదవమని విజ్ఞప్తి చేశారు. మతపరమైన విద్య బదులు ఆంగ్లభాష నేర్చుకోమని, అప్పుడే భవిష్యత్తు బాగుపడుతుందని అన్నారు.

మీరు ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా ఇస్లాంలో సంస్కరణల గురించి పోరాడుతున్నారు. మీ బలం ఏమిటి?

నా జీవితానుభవమే నా శక్తి. నా కుటుంబ సభ్యుల ఇరాక్‌లో చంపేశారు. నా బాబాయిని సజీవ దహనం చేశారు. మమ్ములను ఒకచోట నిలువనీయ లేదు. అయినా నేను నా పోరాటాన్ని ఆపలేదు. నేను ఓడిపోదలచుకోలేదు.

ఆధునిక ముస్లిములకు మీరిచ్చే సందేశమేమిటి?

ఆధునిక ముస్లిములు ప్రజల మద్దతు పొంది సంస్కరణలు తెచ్చే ప్రయత్నం చేయాలి. అవకాశం దొరికినప్పుడు అభిప్రాయాలను వెల్లడించండి. అందరూ ఏకమై సంస్థలు ప్రారంభించండి. సమాజ సమస్యలు పరిష్కరించండి.

మోదీ అధికారంలో ఉన్న ఈ సమయమే భారతీయ ముస్లిములు మంచి మార్పు వైపు మరలడానికి ఒక అవకాశం. పాకిస్తానీ చొరబాటు దారులు, పాకిస్తాన్‌ శైలి ఇస్లాం నుండి దూరం కండి. వారిని తిరస్కరించండి. అప్పుడు మార్పు వస్తుంది.

ముస్లిములలో కొందరు మాతృభూమి కల్పనకు వ్యతిరేకంగా ఉంటారు? మీ అభిప్రాయం?

అందరూ మాతృభూమిని గౌరవించవలసిందే. నేను ఆస్ట్రేలియాను గౌరవిస్తాను. భారతీయ ముస్లిములు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు.

భారతీయ ముస్లిములకు మీ సందేశం?

పాకిస్తానీ శైలి ఇస్లాం ప్రభావం నుండి మీరు తప్పుకోండి. లంచగొండులను దూరంగా పెట్టండి. మోదీ దేశాన్ని ప్రేమిస్తారు. మీ అందరిని శ్రద్ధంగా చూస్తారు కాబట్టి మీరు మారండి. దేశ అభివృద్ధికి తోడ్పడండి.

(ఆర్గనైజర్‌ సౌజన్యంతో)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *