సమర పతాకకు సలాం చేద్దాం !

సమర పతాకకు సలాం చేద్దాం !

నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో అజాద్‌ హింద్‌ ప్రవాస ప్రభుత్వం ఏర్పడి 75 సంవత్సరాలు గడిచాయని, ఈ చారిత్రక ఘట్టాన్ని దేశ ప్రజలు, ప్రధానంగా యువత స్మరించుకోవడం ఎంతో అవసరమని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌కార్యవాహ్‌ సురేశ్‌ జోషీ (భయ్యాజీ జోషీ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సంఘ్‌ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. గ్వాలియర్‌లో మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభలో ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు.

నేతాజీ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 21, 1943న భారత ప్రవాస ప్రభుత్వం ఏర్పడింది. దేశానికి స్వతంత్రం తేవడంలో ఇదొక కీలక ఘట్టం. బ్రిటిష్‌ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించే ముందు నేతాజీ లాంఛనంగా సింగపూర్‌ కేంద్రంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇదొక ముఖ్యమైన చర్య. అనతికాలంలోనే అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ బలపడడం, బ్రిటిష్‌ అధీనంలోని ఈశాన్య భారత ప్రాంతంలో ఫౌజ్‌ సాధించిన విజయాలు ఆనాటి పరిస్థితులలో ముఖ్య పరిణామాలుగా పేర్కొనవచ్చు. ఆగ్నేయాసియాలోని బ్రిటిష్‌ వలసలన్నింటిపైనా అజాద్‌ హింద్‌ ప్రభుత్వం తన ఆధిపత్యాన్ని ప్రకటించింది.

అజాద్‌ హింద్‌ ప్రభుత్వం తనదైన కరెన్సీనీ, న్యాయస్థానాలను, పౌరస్మృతిని ఏర్పాటు చేసింది. ఆఖరికి సుంకాల వ్యవస్థను సైతం రూపొందించుకుంది. అంటే సంప్రదాయబద్ధంగా ఒక ప్రభుత్వానికి ఉండవలసిన రాజ్యాంగం, మంత్రిమండలి, కరెన్సీ, న్యాయవ్యవస్థలను ఏర్పరుచుకుంది. జపాన్‌, జర్మనీ సహా తొమ్మిది దేశాలు ఈ ప్రభుత్వాన్ని గుర్తించాయి. జపాన్‌ నావికా దళం స్వాధీనం చేసుకున్న అండమాన్‌ నికోబార్‌ దీవులను ఆ దేశ ప్రభుత్వం ప్రవాసంలోని అజాద్‌ హింద్‌ ప్రభుత్వానికి అప్పగించింది. ఈ దీవులకే నేతాజీ షహీద్‌, స్వరాజ్‌ దీవులని నామకరణం చేసారు. డిసెంబర్‌ 30, 1943న ఆ దీవులలో జాతీయ పతాకం ఎగురవేసి స్వాతంత్య్రం వచ్చినట్టు వెల్లడించారు. ఈ వీరోచిత చర్యలన్నీ బ్రిటిష్‌ సైన్యంలో ఉన్న భారతీయులను, సాధారణ ప్రజలను కూడా విశేషంగా ఉత్తేజపరిచాయి. ఇది స్వరాజ్య పోరాటంలో మలుపు తిప్పిన ఘటన అయింది. ఆజాద్‌ హిందూ ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకొన్న చర్యలను భయ్యాజీ ప్రశంసించారు.

అజాద్‌ హింద్‌ ప్రభుత్వం 75 ఏళ్ల వేడుకల సందర్భంగా అందుకు సంబంధించిన ఘట్టాలను, అజాద్‌ హింద్‌ సర్కార్‌ చేసిన సేవలను, నేతాజీ సుభాశ్‌చంద్ర బోస్‌ త్యాగం గురించి, అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సభ్యుల రక్తతర్పణ లను, ఈ దేశ స్వాతంత్య్రం కోసం సర్వస్వం సమర్పించిన మిగిలిన ఎందరో మహనీయులను గురించి స్మరించుకోవాలి. నివాళి ఘటించాలి అని భయ్యాజీ జోషీ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *